
అన్నా అజారే చేపట్టిన అవినీతి రహిత భారతదేశం నినాదాన్నే తన పార్టీ సిద్ధాంతంగా మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా… మొదట ఢిల్లీలో అధికారం, తర్వాత పంజాబ్ ను కైవసం చేసుకోవడం ద్వారా దేశ స్థాయిలో తన పేరు మారుమోగేలా చేశారు. తాజా ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఆప్ ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ పరిస్థితికి కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే కారణం. కేజ్రీ పతనానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
ఒకటి… కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీతో కేజ్రీవాల్ స్నేహం ఆయన కొంప ముంచిందనే చెప్పాలి. కేసీఆర్ కుమార్తె కవితతో కేజ్రీ అండ్ కో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు ఆయన పతనానికి పునాదులు వేశాయి. ఏ అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారో దానికి తూట్లు పొడిచింది లిక్కర్ స్కాం. ఆప్ కు అప్పటి వరకు ఉన్న క్లీన్ ఇమేజ్ ను లిక్కర్ స్కాం ఆరోపణలు ఊడ్చిపారేశాయి. అవినీతికి కేజ్రీవాల్ అతీతుడు కాదు అన్న అభిప్రాయం ప్రజల్లో కలగడానికి కేసీఆర్ ఫ్యామిలీ కారణమైంది. రెండు దఫాలు ఢిల్లీని ఏలిన కేజ్రీ పాలనలో లిక్కర్ స్కాం తప్ప మరో అవినీతి ఆరోపణ లేదు. కవిత లిక్కర్ వ్యాపార కాంక్ష కేజ్రీ పార్టీ సిద్ధాంతానికే తూట్లు పొడిచింది. దేశ స్థాయిలో కేజ్రీ ఇమేజ్ ను ఈ స్కాం పైకి కనిపించనంత కుళ్లబొడిచిందనే చెప్పాలి.
ఇక రెండో అంశం… కాంగ్రెస్ పార్టీని శత్రువుగా పరిగణించడం తాజా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీ పతనానికి మరో కారణం. కాంగ్రెస్ తో పొత్తు వద్దు అన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. కాంగ్రెస్ తో కటీఫ్ నిర్ణయంలో హేతుబద్ధత లేదు. కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలి కాషాయ పార్టీకి మేలు జరుగుతుందన్న చిన్న లాజిక్ ను కేజ్రీవాల్ తెలిసి మిస్సయ్యారా… లేక “అవగాహన”తో చేశారా అన్నది అర్థం కాని విషయం.
కవిత లిక్కర్ స్కాంతో పార్టీ కోర్ ఐడియాలజీనే దెబ్బతీసుకున్న కేజ్రీవాల్… కాంగ్రెస్ ను దూరం పెట్టి అధికారాన్ని కూడా కోల్పోయారని చెప్పక తప్పదు.
మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు,
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.