
ఆమ్ ఆద్మీ పార్టీని ధ్వంసం చేయలేని బిజెపి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటుబ్యాంకును ధ్వంసం చేసింది.
దేశమంతా మోడీ కనుసన్నల్లో నలుగుతోంది. మెలుగుతోంది. యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తాను ఎవరికి ఎంత సాయం చేయాలనుకుంటారో అంతా సాయం అందిస్తారు. దాని కోసం ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు. ఇదేమిటి అని నిలదీసేవారు కూడా లేరు. అటువంటి సర్వశక్తివంతుడైన ప్రధాని మోడీ పొద్దున్నే లేచి ఢీల్లీలో తన కోట పక్కనే తనను సవాలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా ఓడించాలా అని తల పట్టుకుంటారు.
2001 నాటికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ అనామకుడు. కానీ తన రాజకీయ కౌటిల్యం, కుటిలత్వంతో నేడు దేశంలో తిరుగులేని నాయకుడయ్యారు. అటువంటి వ్యక్తి తన పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ, దాని నేత కేజ్రీవాల్ నుండే ముప్పు ఉంటుందని గ్రహించారు.
అలా భయపడటానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ అంత పెద్ద పార్టీ అని కాదు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు అని కాదు. కానీ కేజ్రీవాల్ గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీలోని పేదలకు ఆప్తుడయ్యాడు. బహుశా కులం, మతం, ప్రాంతం గురించిన చర్చలు లేకుండా ప్రభుత్వ పథకాలు, ఫలితాలూ ప్రజలవద్దకు చేరుస్తున్నారు. పేదల ఆదాయాలు పెరిగాయి. సంపన్నులు కూడా తమ తమ ఉత్పత్తులు, అమ్మకాలూ పెంచుకోగలిగారు.
ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన పార్టీలు వ్యవహరించిన తీరుకంటే ఇది పూర్తి భిన్నమైనది. ఈ సార్వత్రిక రాజకీయ లక్షణానికి ఎక్కడో ఒక చోట స్థానిక స్థాయిల్లో చిన్న చిన్న మినహాయింపులుంటే ఉండవచ్చు. కానీ స్థూలంగా దేశ రాజకీయ చిత్రం ఇది. ఈ స్థూల చిత్రాకినికి భిన్నమైన రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ పని చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు తమకు వెన్నుదన్నుగా ఉన్న వాళ్లకు ప్రయోజనం కలిగించటానికి తమ రాజకీయ అధికారాన్ని వాడుతుంటారు. ఆ తర్వాత మిగిలింది కిందనున్న జనాలకు పంచుతుంటారు.
ఈ తరహా అభివృద్ధి నమూనా పేదల్లో ఆందోళనకు అసంతృప్తికి దారి తీసింది. ప్రధానంగా యువతలో నైరాశ్యం నిండుకుపోయింది. ఇదంతా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వల్లనేననీ, ప్రణాళికాబద్ధమైన విధానాల వల్లనేనన్న అపోహలు వ్యాపించాయి. 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు మొదలైన తర్వాత 2011 వరకూ పరిస్థితుల్లో ఎంతో కొంత పురోగతి కనిపించింది. యువత నైరాశ్యం నుండి కాస్తో కూస్తో బయటపడింది. వారికి బతుకులపై, భవిష్యత్తుపై నమ్మకం వచ్చింది.అయితే 2010 తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వాలు వడ్డీ రేట్లు పెంచటంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉపాధి అవకాశాల కోసం, జీవితాన్ని మరో మెట్టు పైకి ఎక్కించుకోవడం కోసం ఎదురు చూస్తున్న యువత ఆశలు అడియాశలయ్యాయి.
ఈ నేపథ్యంలో 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని, చంద్రమండలాన్ని చేతిలో చూపిస్తూ మోడీ అధికారానికి వచ్చారు. 2010 నుండి వరుసగా మూడేళ్ల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవటంతో దేశీ ఆర్థికాభివృద్ధి స్తబ్దతకు లోనైంది. ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో దేశంలో దాదాపు సగం మందిగా ఉన్న యువత మోడీ మాటలు నమ్మింది.
యువతలో ఉన్న నైరాశ్యం ఉత్తరాది రాష్ట్రాల్లోని ఓటింగ్ సరళి ప్రతిబింబించింది. ఉత్తరప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో కేవలం 17 శాతానికి పరిమితమైన బిజెపి ఓటింగ్ 2014 నాటికి 42 శాతానికి పెరిగింది. 2019 నాటికి 49 శాతానికి చేరింది. రాజస్థాన్‌లో సైతం 2009లో 36 శాతం మంది బిజెపి వైపు మొగ్గితే 2014 నాటికి 49 శాతం, 2019 నాటికి 59 శాతం మంది బిజెపి వైపు మొగ్గారు. మధ్యప్రదేశ్‌లో కూడా 2009 నాటికి 43 శాతంగా ఉన్న బిజెపి ఓటింగ్ 2019 నాటికి 59 శాతానికి పెరిగింది.
కానీ పదేళ్ల మోడీ ఏలుబడిలో పరిస్థితులు పెద్దగా మారిందేమీ లేదు. నిరుద్యోగ యువత పరిస్థితి పెనం మీద నుండి పోయ్యిలో పడినటల్లయ్యింది. దాంతో మోడీ సామర్థ్యం మీద, బిజెపి వాగ్ధానాల మీద విశ్వాసం సడలటం మొదలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఓట్ల శాతం 8.2 శాతం తగ్గిపోతే రాజస్థాన్‌లో 9 శాతం పడిపోయింది. మధ్యప్రదేశ్‌లో మాత్రమే బిజెపి ఓటింగ్ శాతం పెరిగింది. అయితే అది బిజెపి ప్రతిభ కాదు. జ్యోతిరాదిత్య సింధియా తన కుటుంబానికున్న పలుకుబడి, ఫాలోయింగ్‌తో సహా 2020లో బిజెపి తీర్థం పుచ్చుకోవటం వలన ఆ రాష్ట్రంలో బిజెపి ఓటింగ్ శాతం పెరిగింది.
పదేళ్లు నిరాఘాటంగా అధికారంలో ఉన్నా బిజెపి వాగ్ధానాలను అమలు చేయలేని స్థితికి చేరటంతో యువత క్రమంగా ఆ పార్టీ మీద పెట్టుకున్న భ్రమలను వదులుకోసాగింది.
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర బీహార్‌లో ప్రవేశించినప్పుడు ఆ యాత్రలో భాగస్వామి కావాలన్న నితిష్ ప్రయత్నాలను కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించి ఉండకపోతే 2024లో బిజెపి ఓటమి పాలయ్యేదన్న వాస్తవం మోడీకి బాగా తెలుసు. నితిష్ ప్రయత్నం నెరవేరితే బిజెపికి పెద్దగా జరిగే నష్టం ఉండదు కానీ జెడియూ, ఆర్జేడీల ఓటుబ్యాంకు కాంగ్రెస్‌వైపు మొగ్గేది.
నితిష్ కుమార్ ప్రతిపాదనలను కాంగ్రెస్ ఒప్పుకుంటే బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలకు గాను 35 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుని ఉండేది. ఇప్పుడు ఢీల్లీలో చక్రం తిప్పుతూ ఉండేది.
తన వైఫల్యాల వల్లనే బిజెపికి అధికారాన్ని పువ్వులో పెట్టి మరీ అందించిన కాంగ్రెస్ తన వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి సిద్ధంకావటం లేదు. కానీ మోడీ మాత్రం ఈ పాఠాలు బాగా నేర్చుకున్నాడు. గుజరాత్లో తన అధికారానికి సవాలుగా నిలుస్తున్న వారినుండి వచ్చే ప్రమాదాన్ని అధిగమించటంలో ఎంతో నైపుణ్యం సాధించిన మోడీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గురించి భయపడటం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌కు దిశానిర్దేశం లేదని తెలుసు. కానీ దేశవ్యాప్తంగా పేదల్లో ఆదరణ పొందిన కేజ్రీవాల్ గురించే ఆందోళనపడుతున్నాడు.
ఇందులో భాగంగానే మద్యం కుంభకోణం గురించి నాలుగేళ్లపాటు నిరంతరాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి దుష్ప్రచారం చేయటం ద్వారా ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఓ మోస్తరు వ్యతిరేకతను తీసుకురాగలిగారు. నాలుగేళ్ల పోరాటం తర్వాత కూడా వీసమెత్తు సాక్ష్యం సంపాదించలేని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రజలు పెద్దగా చర్చించుకోవటం లేదు. అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా అధికారానికి వచ్చిన కేజ్రీవాల్‌కు కూడా అవినీతి మకిలి అంటుకుందట అన్న విషయాన్నే ఎక్కువగా చర్చించుకున్నారు. అలా చేయటంలో బిజెపి వ్యూహాత్మక విజయం సాధించింది. ప్రచార హోరులో బిజెపి ఆమ్ ఆద్మీ పార్టీపై సాధించిన విజయం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ విజయానికి పునాదులు వేసింది.
ఈ ప్రయత్నంలో మోడీ చేసిన మొదటి పని ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయటం.
దురదృష్టవశాత్తూ ఆమ్ ఆద్మీ పార్టీపై దాడి చేయటంలో కాంగ్రెస్ కూడా బిజెపికి వంత పాడినట్లయ్యింది.
ఈ క్రమంలోనే మోడీ, మోడీకి అంతరాత్మగా ఉన్న అమిత్‌షాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన పునాది సూత్రాలను పాతాళానికి తొక్కేశారు. నిరూపణకు అవకాశమే లేని ఆరోపణలతో ఎన్నికైన ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర సీనియర్ నాయకులనూ అరెస్టు చేసి ఏళ్ల తరబడి జైల్లో కూర్చోబెట్టారు. దోషిగా నిరూపణ అయ్యే వరకూ స్వేఛ్చగా ఉండటానికి అవకాశం ఇచ్చే హెబియస్ కార్పస్ హక్కును ఛిద్రం చేశారు. దీన్ని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా గుర్తించి స్పందించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నోరుమెదపకపోగే ఆమ్ ఆద్మీ పార్టీపైనే ఎదురుదాడికి దిగింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో రాస్తున్న ఈ వ్యాసంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దించటానికి మోడీ ఎందుకు సర్వశక్తులూ ఒడ్డారన్న విషయంపై కాస్త ఆలోచించటానికి సమయం దొరికింది.
పేదల అవసరాలు తీర్చటం, పేదలకు భరోసా కల్పించడంలో ఆమ్ఆద్మీ చూపించిన విలక్షణత గుత్తాధిపత్యానికి కొమ్ము కాసే కాంగ్రెస్, బిజెపిల బండారాన్ని ఎండగట్టింది. ఇందులో ఒకరు గాంధీత్వ లౌకికవాదం ముసుగులో దాక్కుంటే మరొకరు హిందూత్వ ముసుగువేసుకుని కూర్చున్నారు.
ఈ రెండిటిలో ప్రజా సంక్షేమానికి తావు లేదు
ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించే ప్రయత్నంలో మోడీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. పార్టీ నాయకత్వం ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని చెదరగొట్టడానికి సామదానభేద దండోపాయాలు ప్రయోగించింది బిజెపి. అయినా గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54 శాతం ఓట్లు వచ్చాయి.
దాంతో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచేందుకు పథక రచన సాగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ మధ్యనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటుబ్యాంకు కరగటం మొదలైంది.
నా ఈ వివరణ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ముందుకు తెస్తోందని తెలుసు. కానీ పదేపదే అసెంబ్లీలో తన బలాన్ని, ఓటుబ్యాంకును నిలబెట్టుకుంటూ వస్తున్న ఆమ్ ఆద్మీ లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు నిలబెట్టుకోలేకపోతోందన్నది పరిశీలకులందరికీ అంతుచిక్కని ప్రశ్నే.
2015, 2020ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యాభైశాతం పైగానే ఓట్లు తెచ్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎన్నికల్లో ఆ స్థాయి ఆధిపత్యం సంపాదించటం ఓ రికార్డే. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి, 2024లో జరిగిన ఎన్నికల్లో 24 శాతానికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ పడిపోయింది. ఈ స్థాయి పతనం కూడా ప్రపంచ ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్య చరిత్రలో నమోదు కావల్సిన ఘట్టాలే. పార్లమెంట్‌కూ, శాసనసభలకూ వెంటవెంటనే ఎన్నికలు జరిగినప్పుడు పోలైన ఓట్ల వ్యత్యాసం ఈ స్థాయిలో ఉండటం కూడా ఇదే మొదటిసారి.
1971 తర్వాత లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేర్వేరుగా 14 సార్లు జరిగాయి. 1971 వరకూ లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు కలిసే జరిగేవి. ఆయినా ఈ రెండు చట్టసభలకు జరిగే పోలింగ్‌లో ఏ రాష్ట్రంలోనూ పోలింగ్‌లో ఇంతటి స్థాయి భారీ తేడాలు నమోదు కాలేదు. ఉదాహరణకు 2012, 2017, 2022లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజెపికి పోలైన ఓట్లకూ 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బిజెపికి పోలైన ఓట్లకూ మధ్య ఉన్న తేడా కేవలం 2.2 శాతం, 2.5 శాతం, 8 శాతం మాత్రమే.
లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొన్ని నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హర్యానాలో సైతం కాంగ్రెస్ దక్కించుకున్న ఓట్ల శాతంలో వ్యత్యాసం కుడిఎడంగా ఐదు శాతం మాత్రమే. మధ్యప్రదేశ్‌లో కూడా ఈ తేడాల్లో పెద్దగా మార్పేమీ లేదు. చెప్పుకోదగ్గ పతనాలు లేవు. రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాలుగేళ్లకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకులో వచ్చిన తేడా 2009లో 9.4 శాతం, 2014లో 15.5 శాతం, 2019లో 17 శాతం. పశ్చిమబెంగాల్లో తృణమూల్ పార్టీకి 2009, 2014, 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతానికి, తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతానికి మధ్య తేడా ఐదు నుండి ఏడుశాతం లోపే.
ఈ ఐదు రాష్ట్రాల పోలింగ్ సరళికంటే భిన్నమైనది ఆమ్ ఆద్మీ పోలింగ్ సరళి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 54.3 శాతం ఓట్లు వస్తే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 18 శాతానికి పడిపోయాయి.2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 53.6 శాతం వస్తే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలి 23 శాతం మాత్రమే సంపాదించగలిగింది.
ఇంత పెద్ద తేడాకు నాకు అర్థమవుతున్న కారణం ఒక్కటే. అసెంబ్లీ ఎన్నికల కోసం జరిగిన ఓటర్లు నమోదులో ఢిల్లీలో నివశించేవారందరినీ చేరిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఓటర్ల నమోదులో కేవలం ఢిల్లీలో శాశ్వతనివాసంగా ఉన్న వారినే చేర్చారు. సాధారణంగా ఢిల్లీ వలస వచ్చే వారికి స్థిరనివాసాలు ఉండటం అసాధ్యం. కాబట్టి అటువంటివారినందరినీ ఓటర్ల లిస్టు నుండి తొలగించారు.
ప్రపంచంలోని నగరాల కంటే భిన్నంగా వేగంగా అభివృద్ధి చెందిన ఢిల్లీలో మూడోవంతు ప్రజలు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వలస వచ్చినవారే. వీళ్లందరికీ ఓటు హక్కు రద్దు చేయటం ద్వారా మాత్రమే పోలింగ్‌లో ఇంతటి వ్యత్యాసాలను చూడగలం. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేసి బిజెపి చేతిలో పనిముట్టుగా మార్చుకోవటం ద్వారానే ఇది సాధ్యం. ఈ కసరత్తు గురించి పలువురు ఇప్పటికే వివరంగా విశ్లేషించారు. తాజాగా బ్రిటన్ నుండి వెలువడే ది ఇండిపెండెంట్ పత్రిక కూడా అటువంటి కథనాన్ని వెలువరించింది. నేడు వెలువడే ఎన్నికల ఫలితాలను బట్టి లోక్‌సభలో ఇంతవరకూ ఎన్నికల సంఘం అమలు చేస్తూ వచ్చిన వ్యూహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేసిందా, వలసకార్మికుల ఓట్లను తొలగించిందా అన్నది లోతుగా పరిశోధించాల్సిన అంశం.
– ప్రేమ్ శంకర్ ఝా
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.