
ఏ దేశమైనా తన ప్రజలు ఆరోగ్యంగా, నైపుణ్యం కలిగి, సాధికారత పొందేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోకుండా స్థిరమైన అభివృద్ధిని సాధించలేదు.
ప్రధాన స్రవంతి పత్రికలలో కనిపించిన హెడ్ లైన్లకు ఆవల ఉన్న బడ్జెట్ అంకెలను నిశితంగా పరిశీలించినట్లయితే కీలకమైన అంశాలు మన దృష్టికి వస్తాయి. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో రక్షణ రంగం కోసం రూ. 6.8 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. ఇది గత దశాబ్దంలోనే భారతదేశ రక్షణ బడ్జెట్ కు కేటాయించిన దానికి రెట్టింపు కంటే ఎక్కువ.
ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికి, సాయుధ దళాలు సంతృప్తి చెందలేదు. కొనుగోలు చేసిన ఆయుధాలు ఆలస్యంగా వస్తాయి, కీలకమైన ఆధునీకరణ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతాయి. రక్షణ బడ్జెట్లో దాదాపు పావు వంతు పెన్షన్ల ద్వారా మింగేస్తున్నారు. రికార్డు స్థాయిలో అధిక వ్యయం ఉన్నప్పటికీ, సైన్యానికి అత్యవసరమైన మందుగుండు సామగ్రి ఇంకా కొరతగానే ఉంది.
విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలకమైన రంగాలకు కేటాయించాల్సిన బడ్జెట్ ను రక్షణ రంగానికి మళ్ళిస్తున్నారు. ఈ రంగాలను ఇప్పటికే చిన్న చూపు చూస్తూ పక్కన పెట్టేసారు.
దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు నిధులు తక్కువగా ఉన్నాయి. చాలా వాటికి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా లేవు. విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఇప్పుడు రైతుల ఆత్మహత్య రేటును మించిపోయి, తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఇది విద్యా రంగంలో పోటీ వలన తలెత్తే ఒత్తిడి మరియు నిర్లక్ష్యం యొక్క భయంకరమైన ప్రతిబింబం.
భారతదేశంలో 2.4 మిలియన్ల ఆసుపత్రి పడకల కొరత , లక్షలాది మందికి సరైన వైద్య చికిత్స అందుబాటులో లేకుండా పోవడం వంటి అంశాలు మనదేశంలో ఆరోగ్య సంరక్షణ ఎంత భయంకరమైన స్థితిలో ఉందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.
భారతదేశ ప్రభుత్వం దేశ సరిహద్దులను బలోపేతం చేసుకోవాలనే ఆత్రుతలో, తన అత్యంత విలువైన ఆస్తి అయిన ప్రజలను అంటే మానవ వనరులను పట్టించుకోనట్లు కనిపిస్తోంది.
భారతదేశంలో విద్యా సంక్షోభం:
వ్యవస్థలో సత్వర సంస్కరణల ఆవశ్యకత
భారతదేశ భవిష్యత్తుకు పునాది విద్య అని చాలా కాలంగా ప్రచారం అయితే చేస్తున్నారు, కానీ బడ్జెట్ కేటాయింపులు, వ్యవస్థాగతమైన అసమర్ధత పరిశీలిస్తే అసలు కథ వేరుగా ఉంది.
విద్యపై ప్రభుత్వ వ్యయం 2024 జిడిపి లో 2.9% ఉంది. ఇది కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన 6% లక్ష్యం కంటే చాలా తక్కువ. 2015-16 నుండి నిధులు పెరిగినప్పటికీ, ఈ రంగం తీవ్రమైన మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. అందులో అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత అత్యంత తీవ్రమైనది.
దేశవ్యాప్తంగా 1.2 మిలియన్లకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, దీనివల్ల అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 50:1 కంటే ఎక్కువగా ఉంది.
ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులలో దాదాపు 40% మందికి సరైన అర్హతలు లేకపోవడం వల్ల ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నాసిరకం మౌలిక సదుపాయాలు, కాలం చెల్లిన పాఠ్యాంశాలు మరియు డిజిటల్ అంతరాల వల్ల మరింత తీవ్రంగా ఉన్నాయి.
ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు. ఈ వ్యవస్థలోని లోపాలు అనేక విషాదకర కోణాల్లో వ్యక్తమవుతున్నాయి.
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువత ఆత్మహత్య రేటు కలిగిన దేశాలలో ఒకటి. 2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్యలు మరిన్ని భయంకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. 2020 సంవత్సరంలో 11,396 విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం చదువు ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, ఆందోళన కారణంగా జరిగాయి. అయినప్పటికీ, పాఠశాలల్లో మానసిక ఆరోగ్యానికి సంబంధించి సరైన మద్దతు వ్యవస్థ (సపోర్ట్ సిస్టం) లేదు.
ఇటీవలి బడ్జెట్లో ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు మరియు డిజిటల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్‌ల వంటి కార్యక్రమాలతో కృషి పెంచడానికి ప్రయత్నించినప్పటికీ, విద్యను ఆధునీకరించడానికి ఈ ప్రయత్నాలు మరియు వాటి ప్రభావం పరిమితంగా ఉంటుంది.
తగినంత పెట్టుబడి, ఉపాధ్యాయ శిక్షణ లేకపోవడం మరియు మానసిక ఆరోగ్యం పైన నిర్లక్ష్యం మొదలైన ప్రాథమిక సమస్య లను పరిష్కరించకుండా ఇది సాధ్యం కాదు.
ఈ ప్రభుత్వానికి విద్య ప్రాధాన్యత కాదనే విషయాన్ని బడ్జెట్ కేటాయింపుల్లోని అసమానత స్పష్టం చేస్తుంది. ప్రతి సంవత్సరం రక్షణ వ్యయం స్థిరంగా పెరుగుతుండగా, విద్య కి మాత్రం తగ్గిపోతోంది. క్రింద ఇవ్వబడిన గ్రాఫ్ ఈ స్పష్టమైన వాస్తవికతను ప్రతిబింబిస్తుంది:
పైగా, భారతదేశ రక్షణ బడ్జెట్‌ను మనం నిశితంగా చూసినట్లయితే గత దశాబ్దంలో 152% పెరిగింది. 2015-16లో రూ. 2.46 లక్షల కోట్ల నుండి 2025-26లో రూ. 6.8 లక్షల కోట్లకు పెరిగింది. భారతదేశంలో క్రమంగా పెరుగుతున్న భద్రతా ఆందోళనలు, ఆధునీకరణ ప్రయత్నాలు మరియు భారీ సైన్యం యొక్క ఆర్థిక ఒత్తిడిని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుంది.
అయితే, సంఖ్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ పెరుగుదలలో నిర్మాణాత్మక సవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 2020-21లో, రక్షణ కోసం కేటాయించిన రూ. 3.37 లక్షల కోట్లలో, దాదాపు రూ. 1.34 లక్షల కోట్లు (29%) పెన్షన్ల కోసం కేటాయించబడ్డాయి. దీని అర్థం బడ్జెట్లో గణనీయమైన భాగం ఆధునీకరణ, సేకరణ లేదా మౌలిక సదుపాయాలకు నేరుగా దోహదపడటం లేదు.
ఈ ధోరణి వల్ల ఆరోగ్య సంరక్షణ పెద్దగా ప్రభావితం కాలేదు. చూడటానికి భారతదేశ ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ మెరుగుపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇది పాక్షికంగా నిజమే అయినప్పటికీ, కేటాయింపు 2015-16లో రూ. 33,152 కోట్ల నుండి 2025-26లో రూ. 95,957 కోట్లకు పెరిగింది. ఇది 100% కంటే ఎక్కువ పెరుగుదలను చూపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే , వాస్తవం భిన్నంగా ఉంది.
ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, భారతదేశంలో ఆసుపత్రులలో పడకల లభ్యత చాలా తక్కువగా ఉంది. ప్రతి వెయ్యి మందికి కేవలం 1.4 పడకలు మాత్రమే ఉన్నాయి.
ఇది WHO సిఫార్సు చేసిన వెయ్యి మందికి 3.5 కంటే చాలా తక్కువ. ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత అధ్వాన్నమైన, ఆందోళనకరమైన నిష్పత్తి ఉంది. ప్రతి వెయ్యి మందికి 0.79 పడకలు మాత్రమే ఉన్నాయి. అంటే దేశంలో 2.4 మిలియన్ పడకలు తక్కువగా ఉన్నాయి. డాక్టరు రోగి నిష్పత్తి 1:1511 గా ఉంది. అంతే WHO సిఫార్సు చేసిన 1:1000ను చేరుకోవడంలో విఫలమైంది.
గ్రామీణ-పట్టణ విభజన వ్యవస్థలోని డొల్లతనాన్ని మరింతగా బట్టబయలు చేసింది. 70% భారతీయులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయినప్పటికీ వారికి 40% ఆసుపత్రి పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నర్సు-రోగి నిష్పత్తి సిఫార్సు లు 1:300 ఉండగా వాస్తవ అమలు 1:670 ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు సంఖ్యల భారీగా ఉంటుంది. నిధులు తక్కువగా ఉన్నప్పటికీ, వారు తమ శక్తికి మించి సేవలు అందిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన సౌకర్యాలతో ఉన్నప్పటికీ, అధిక ఖర్చుల కారణంగా లక్షలాది మందికి అందుబాటులో లేవు.
క్రింద ఇచ్చిన గ్రాఫ్ లో అంకెలు మనకు అసలు కథను వివరిస్తాయి. ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధులు తక్కువగా కేటాయించబడటమే కాక, కేటాయించిన దానిని కూడా ప్రభుత్వం పూర్తిగా వినియోగించట్లేదు. గ్రాఫ్‌లో చూపినట్లుగా, ఎక్కువ సందర్భాలలో వాస్తవ వ్యయం బడ్జెట్ అంచనాల కంటే తక్కువగా ఉంటుంది. ఇది వ్యవస్థలో ఉన్న తీవ్ర అంతరాలను ఎత్తిచూపుతుంది.
అధికారుల అసమర్థత, ప్రాజెక్టు అమలులో జాప్యం లేదా దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం, ఏ కారణాలవల్లనైనా సరే నిధులను ఖర్చు చేయటంలో విధానాలు మరియు అమలు మధ్య గ్యాప్ కనిపిస్తుంది. కాగితల మీద నిధులు కేటాయించి, వాటిని సరిగ్గా వినియోగించకపోవడంలో అర్ధం లేదు. ఇదొక పెద్దగా ప్రశ్నగా మిగులుతుంది.
భారతదేశం యొక్క మొత్తం ఆరోగ్య సంరక్షణ ఖర్చులో 62.6%, ప్రజలు తమ స్వంత జేబు నుండి చెల్లిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతదేశంలో పేదరికానికి వైద్య బిల్లులు ఒక ప్రధాన కారణం. అయినప్పటికీ ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు. బహుశా అత్యంత వినాశకరమైన విషయం కావచ్చు.
ఒక్క 2025-26 సంవత్సరం లోనే మూలధన వ్యయం కోసం రూ. 1.80 లక్షల కోట్లు కేటాయించడంతో రక్షణ బడ్జెట్ స్థిరంగా పెరుగుతుండగా, ఆరోగ్య సంరక్షణకు మాత్రం సుదీర్ఘకాలంగా తక్కువ నిధులు కేటాయించబడుతున్నాయి. మిలిటరీలో ఆధునీకరణ అవసరమని భావిస్తారు, కానీ ఆసుపత్రుల ఆధునీకరణ సంగతేంటి?
వైద్య రంగంలో కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయతంలో ప్రభుత్వానికి తొందర ఎందుకు లేదు?
బలమైన మరియు సంపన్న భారతదేశానికి కీలకం
మన భవిష్యత్తుపై పొంచి ఉన్న ఉచ్చుల నుండి, మధ్యతరగతి ఆదాయ ఉచ్చు నుండి అకాలంగా పారిశ్రామికీకరణ ను తగ్గించటం వరకు లేదా ఉత్పత్తి రహిత వృద్ధి నుండి ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ చెప్పిన “స్తంభిస్తున్న ఆర్థిక వ్యవస్థ” గా మారే ప్రమాదం వరకు, వీటన్నిటి నుండి మనం నిజంగా తప్పించుకోవాలనుకుంటే, జాతి శక్తి కేవలం రక్షణ బడ్జెట్లు మరియు స్థుల జాతీయ ఉత్పత్తి మొదలైన లెక్కల లోనే కొలవబడదని మనం గ్రహించాలి. ఒకదేశ శక్తీ దాని ప్రజల సామర్థ్యాలలో కొలవబడుతుంది.
దేశ యువ జనాభాతో, జనాభాపరంగా ప్రయోజనాలను పొందేందుకు మనకు ఎంతో అవకాశం ఉంది. కానీ విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు బలమైన పెట్టుబడులు లేకుండా, ఆ అనుకూలతే విపత్తుగా మారే అవకాశం కూడా ఉంది. తగినంత మానవ మూలధన పెట్టుబడుల కొరత వల్ల దేశం పూర్తిగా అభివృద్ధి చెందకముందే ఆర్థిక పురోగతి నిలిచిపోతుందని చెపుతూ భారతదేశం “ధనవంతులు కావడానికి ముందే వృద్ధాప్యం” లోకి జారిపోయే ప్రమాదం ఉందని మెకిన్సే నివేదిక హెచ్చరించింది.
ఏ దేశమైనా తన ప్రజలు ఆరోగ్యంగా, నైపుణ్యం కలిగి, సాధికారత పొందేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోకుండా స్థిరమైన అభివృద్ధిని సాధించలేదు. జాతీయ బలాన్ని నిలబెట్టే పునాదిని విస్మరించి, సైనిక విస్తరణకు వనరులను అందించడం ఇక ముందు కూడా కొనసాగవచ్చు. కానీ నిజంగా సురక్షితమైన భారతదేశం అంటే ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండే ప్రదేశం అని, ఏ కుటుంబమూ వైద్య ఖర్చుల కోసం దివాళా తీస్తామని భయపడని ప్రదేశం అని, సైనిక శక్తి మాత్రమే కాకుండా మానవ సామర్థ్యం కూడా మన పురోగతిని నిర్వచించే ప్రదేశం అని మనం గుర్తించాలి.
దీపాంశు మోహన్ మరియు అంకుర్ సింగ్
అనువాదం : పద్మశ్రీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.