
ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరామని ఒప్పుకోలేరు. బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోలేరు. ఓవైపు సుప్రీంకోర్టు సుత్తి పట్టుకొని తరుముతుండగా.. మరోవైపు మీరు ఏ పార్టీ టికెట్ పై గెలిచారు? ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి? అని ప్రతిపక్ష టిఆర్ఎస్ నేతలు బెత్తం పట్టుకొని వెంటాడుతున్నారు. దీంతో వారి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలా మారింది. ఈ నేపథ్యంలో ఎటు పోవాలో, ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతోపాటు ఏడవ గ్యారెంటీ కూడా ఇచ్చింది. వారంటీ లేని ఏడో గ్యారెంటీ ఏమిటంటే.. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ. ఎమ్మెల్యేలు, ఎంపీల ఫిరాయింపులను ప్రోత్సహించబోమని కాంగ్రెస్ నేతలు మాట ఇచ్చారు. కనీసం వార్డు మెంబర్ని కూడా పార్టీలోకి తీసుకోబోమని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఇచ్చిన మాటను మూటగట్టి మూసిలో ముంచేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నదుల్లో నిమజ్జనం చేసేశారు. రాజ్యాంగ రక్షణను రచ్చకెక్కించి, ప్రజాస్వామ్య పరిరక్షణను పరిహాసం చేస్తూ పదిమంది ఎమ్మెల్యేలకు మూడు రంగుల జెండాతో ముక్కుతాడు వేసి గాంధీభవన్ ముంగిట కట్టేసుకున్నారు. ఓవైపు రాజ్యాంగాన్ని చేత పట్టుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీతులు వల్లె వేస్తుండడం, మరోవైపు అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుండటంపై బీఆర్ఎస్ శివాలెత్తింది. ఇదేనా రాహుల్ గాంధీ చెప్పిన రాజ్యాంగ రక్షణ? అని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమే ప్రజాస్వామ్య పరిరక్షణా? అనే నిలదీసింది. అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మొట్టికాయలు వేయించింది. హైకోర్టు ఆదేశించినా స్పీకర్ స్పందించకపోవడంతో సరాసరి దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కి, రేవంత్ ప్రభుత్వం, ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో దడ పుట్టిస్తున్నది.
అనుకున్నదొకటి అయిందొకటి కావడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అండగా ఉంటారనుకున్న రేవంత్ రెడ్డి నడిసంద్రంలో వదిలేయడంతో దారితప్పిన నావలా తయారైంది వారి పరిస్థితి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు ఇవ్వడంతో తమ పుట్టి మునగడం ఖాయమని ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోక అంతర్మథనం చెందుతున్నారు.
రేవంత్ రెడ్డిని నమ్ముకుని పార్టీ ఫిరయించిన ఎమ్మెల్యేల పరిస్థితి మొదటి నుంచి దారుణంగా ఉన్నది. గతంలోనూ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు నిర్వహించినా ఎవరికి దుస్థితి పట్టలేదు. పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ ముగియడంతో రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఆ సెగ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా గట్టిగానే తగులుతున్నది. ఓవైపు కోర్టు కేసులు, మరోవైపు ప్రజావ్యతిరేకత నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునేందుకు కూడా వారు వెనుకాడుతున్నారు. తమకు ఉనికి లేకుండా పోతున్నదని, రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతున్నదని వారు కుమిలిపోతున్నారు. అందుకే మళ్లీ ప్రజానేత కేసిఆర్ పేరు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్లో చేరిన నెల రోజులకే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీ పక్కన నాకు కొంచెం చోటు ఇవ్వాలని కేటీఆర్ ను ప్రాధేయపడగా.. తాజాగా మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్ తన ఇండ్లలో కెసిఆర్ ఫోటో ఉంటే తప్పెంటని చెప్పుకొచ్చారు. కెసిఆర్ పేరు చెప్పుకొని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలన్నది వారి ప్లాన్.
మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇలాఖాలో అసలు కాంగ్రెస్, కొసరు కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు నడుస్తున్నది. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా పోరు తెలిసిందే. జగిత్యాలలో సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి రచ్చకెక్కారు. అందరూ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇలాకాలో ఇదే పరిస్థితి. ఈ నేపద్యంలో వారికి పార్టీ జెండా, క్యాడర్ అండ లేకుండా పోయింది. కనీసం వేసుకునేందుకు కండువా, చెప్పుకునేందుకు పార్టీ పేరు లేకుండా పోయాయి. దీంతో తాము కాంగ్రెస్లో చేరలేదని, ఆ పార్టీ కండువా వేసుకోలేదని వారు చెబుతున్నారు. ఏ దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు అన్నట్టు.. ఏ కండువా లేని ఆ ఎమ్మెల్యేలకు చివరికి జాతీయ జెండానే దిక్కయింది.
– కాసర్ల నాగేందర్ రెడ్డి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.