
దేశంలో పెట్రేగుతున్న మతోన్మాద ప్రచారం కేవలం మీడియా కే పరిమితం కాలేదు. ఎక్కడికక్కడ క్రియాశీలకంగా ఉండే వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృంగా వ్యాపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిర్దిష్ట సామాజిక తరగతులు, వర్గాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారం, దాని ప్రభావం గురించి లోతైన విశ్లేషణ చేయాల్సిన సందర్భం ఇది.
నాకు తెలిసిన మిత్రులొకరు కోవిడ్ సమయంలో ఇల్లు మారారు. యూనివర్శిటీలో బోధన, ఇంటిదగ్గర చిన్న కూతురుని సముదాయించటం వంటి పనుల ఒత్తిడిలో ఇంకా కొత్త ఇల్లు ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో పెద్దగా ఎవరినీ పరిచయం చేసుకోలేదు. ఈ విషయాన్ని తను మనసులోనే పెట్టుకుంది. ఇంతలో ఓ సంఘటన జరిగింది. పొరుగునున్న ఓకావిడ ఫ్రొఫెసర్‌ను పరిచయం చేసుకుని రెసిడెన్షియల్ కమ్యూనిటీలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తున్నారనీ, తప్పక రావాలని ఆహ్వానించి వెళ్లింది. కొత్తగా వచ్చిన ఇరుగుపొరుగును ఇంటికి కాఫీకో అల్పాహారానికో ఆహ్వానించకుండా రాజకీయ ప్రచారం కోసం తీసిన సినిమా చూడటానికి ఆహ్వానించటం ఏమిటబ్బా అని తలపట్టుకుంది మా మిత్రురాలు.
చిన్నగా ఆరా తీస్తే ఓ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి సినిమా ప్రచారానికి ఉపయోగిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయింది. అందరూ కలిసి చూడటం ఓ బాధ్యత అని ప్రచారం చేస్తున్నారని తెలిసి మరీ విస్తుపోయింది.
ఈ విషయాన్ని విన్న తర్వాత మతోన్మాద రాజకీయ ప్రచారం సాంప్రదాయక మీడియా, సోషల్ మీడియా పరిధులు దాటి మన ఇళ్లల్లోకి, ఇరుగుపొరుగు వద్దకూ ఎలా ప్రవేశిస్తుందో పరిశీలించేందుకు ప్రయత్నం చేశాను.
ఇరుగుపొరుగుతో పరిచయం పెంచుకునేందుకో, పాతమిత్రులంతా పలకరింపులు కోసమో ఏర్పాటు చేసుకున్న వాట్సప్ గ్రూపులు ఇప్పుడు నిర్దిష్ట రాజకీయ ఎజెండా ప్రచారానికి వేదికలువునత్నాయి. ఆ గ్రూపుల్లో ఎవరో ఒకరు ఏమీ తెలియనుట్లు ఓ మెస్సేజి పోస్టు చేయటం, దానిపై ఎవరైనా ప్రశ్న వేస్తే ఆసక్తికరమైన కథనాలతో చర్చలకు దిగటం… ఇది పైకి చూస్తే యథాలాపంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నా తరచి చూస్తే దీని వెనక లోతైన వ్యూహం, ప్రయత్నం, తాము కోరుకున్న భావజాలాన్ని పంచదారలో ముంచిన విషగుళికల్లాగా నోటికందించే లక్ష్యం కనిపిస్తాయి.
ప్రజాభిప్రాయాన్ని నిర్మించటంలో, నిర్దిష్ట రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మల్చటంలో సోషల్ మీడియా గ్రూపులు వాహకంగా, సాధనంగా మారాయి.
ఈ క్రమంలో ఓ అభిప్రాయానికి క్షేత్రస్థాయిలో ఎంతో మద్దతు ఉందని చూపించే ప్రయత్నం కూడా ఇమిడి ఉంది. దీన్నే సాంకేతిక పరిభాషలో ఆస్ట్రోటర్ఫింగ్ అంటారు. ప్రభుత్వ వ్యతిరేకులను వెంటాడి వేధించటంలోనూ, మహిళాసామాజిక కార్యకర్తలను వేధించటంలోనూ, సినిమా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వంటి సందర్భాల్లోనూ, నచ్చని వాళ్లని, నచ్చని అభిప్రాయాలనూ ట్రోల్ చేయటం రూపంలోనూ వ్యక్తమవుతుంది.
ఈ క్రమంలో మితవాద శక్తులు నిర్దిష్టమైన వ్యూహంతో మన ఆలోచనలను, స్పందనలను ప్రభావితం చేయటానికి ఓ ఆర్గనైజుడ్ పద్ధతుల్లో ఎలా పని చేస్తున్నారో తెలియచెప్పుందుకు ఈ వ్యాసంలో ప్రయత్నిస్తాను.
ఈ ప్రచారంలో ఓ స్పష్టమైన వ్యూహం, నిర్దిష్టత ఉన్నాయి.
రోజువారీ వార్తా ఛానళ్ల మొదలు వ్యక్తిగతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వరకూ రాజకీయ సైద్ధాంతిక ప్రచార వేదికలుగా మారాయి. దీనికోసం క్షేత్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకూ ఓ సమన్యయంతో కూడిన వ్యవస్థ నడుస్తోంది.నడిపించబడుతోంది.
ఈ ప్రచారాలను ఉద్దేశ్యపూర్వకంగా విస్తృత స్థాయిలో వ్యాపింపచేసేందుకు అదేపనిగా పని చేసే శక్తులు, వ్యక్తులూ, సంస్థలూ, స్వతంత్ర ఐటి సంస్థలూ, కంటెంట్ పుష్ చేసే చిరువ్యాపారులు ఉన్నారు. వీరందరికీ ఏ రోజు ఏమి ప్రచారంలో పెట్టాలో నిర్ణయించే అనుభవం గల రాజకీయ వ్యూహకర్తల బృందం ఎక్కడో ఉండి పని చేస్తుంది. గతంలో వార్తల్లోకి వచ్చిన తర్వాత జనం మధ్య విషయాలు చర్చకు వచ్చేవి. కానీ ప్రస్తుతం కొన్ని వ్యూహాత్మక ప్రచార అంశాలు ముందు ఈ సోషల్ మీడియా హాండిల్స్ ద్వారా జనంలో నలిగిన తర్వాత వార్తా ఛానళ్లల్లో కథనాలవుతున్నాయి. తిరిగి మళ్లీ ప్రధాన వార్తా సంస్థల్లో స్థానం దక్కించుకున్న కథనాలు సోషల్ మీడియా హాండిల్స్ ద్వారా మనముందుకొస్తున్నాయి. ఇదంతా తిరిగి తిరిగి ఓ రాజకీయ ప్రచార విషవలయంగా మారుతోంది. ఆ వలయంలో మన చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా గిరగిరా తిరుగుతుంటాయి.
కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకార్ ఫైల్స్ వంటి సినిమాల ప్రచారం ముసుగులో ముస్లిం విద్వేషాన్ని హిందువుల మనోఫలకంపై ఎలా ముద్ర వేస్తుందో మనం చూశాము. బాలీవుడ్లో పేరుకుపోతున్న సమస్యలు, వేధింపుల గురించిన చర్చను పక్కదోవ పట్టించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను మీడియా ఎంతగా వికృతీకరించిందో కూడా చూశాము.
తాము ఎంచుకున్న జాతీయ సమస్యలను స్థానిక నివాస సముదాయాల్లో చర్చనీయాంశాలుగా చేయటంలో ఈ ప్రచార వ్యూహకర్తలది అందె వేసిన చేయి. అదేసమయలో పైన ప్రస్తావించినట్లు ఇంత పెద్దదేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన జరిగితే దాన్ని సార్వత్రిక రాజకీయ ప్రచారం అనే దండలో పూసగా ఎలా మల్చుకోవాలో వీరికి బాగా తెలుసు. కర్ణాటకలో ఒక ప్రైవేటు బడిలో (అదీ ఆరెస్సెస్ అభిమాని నడుపుతున్నది) మొదలైన హిజబ్ వివాదం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే వరకూ సాగుతూనే ఉంది. ఈ ప్రయత్నంలో న్యాయస్థానాలు కూడా తమవంతు తోడ్పాటు తాము అందించాయి. (దేశంలో మతోన్మాద ఎజెండాపై చర్చల్లో న్యాయస్థానాలు పోషించిన పాత్ర గురించి ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అపూర్వానంద్ విశ్లేషణను ఇక్కడ చూడొచ్చు.
మితవాద రాజకీయ ప్రచార బృందాలు క్షేత్రస్థాయిలో నిర్దిష్ట ప్రయోజనాలాశించి తదనుగుణంగా నిర్దిష్ట సమాచారాన్ని (సోషల్ మీడియా భాషలో కంటెంట్ అంటాము) రూపొందించటం, దాన్ని చాకచక్యంగా సాధారణ ప్రజాభిప్రాయంగా ఎక్కడికక్కడ చొప్చించటంలో దిట్టలు. సెన్గోల్, ఆర్టికల్ 370 గురించిన చర్చలు, వాటిపై వచ్చిన సినిమాలు ఆధారంగా వాట్సప్ గ్రూపుల్లో సాగిన కంటెంట్ షేరింగ్ ను ఓ కేస్ స్టడీగా పరిశీలించవచ్చు. ఉమ్మడి పౌర స్మృతి మొదలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనా సమయాల్లో మోగే మైకుల వరకూ అనేక అంశాలపై సాగే చర్చలన్నింటి సారాంశం ఆరెస్సెస్, బిజెపి రాజకీయ అవగాహనలను సాధారణ ప్రజానీకం మెదళ్లలోకి ఎక్కించటమే. వాళ్లతో అవును కదా అని అనిపించటమే.
ఎవరికీ తెలియని సెన్గోల్ లాంటి చిన్న చిన్న అంశాలను కూడా ఆసక్తికరమైన చరిత్రగా మార్చి, ఆ క్రమంలో చరిత్ర ముసుగులో తమతమ రాజకీయ సైద్ధాంతిక అవగాహనకు తగిన విధంగా చొప్పించి జోడించి ప్రచారంలోకి తెచ్చారు. (చరిత్రను మతోన్మాద వ్యాప్తికి ఆయుధంగా ఎలా వాడుతున్నారో జనవహర్ లాల్ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్లు చేసిన విశ్లేషణ ఇక్కడ చూడొచ్చు.
అలాంటి వార్తల ప్రచారం మొదట ఎక్కడో ఓ చిన్న యూట్యూబ్ కథనం, ఫేస్బుక్ పేజీలో కామెంట్‌తో మొదలువుతుంది. తర్వాత చిలువలు పలువులుగా మారుకుంటూ బహుభాషా అస్తిత్వాన్ని సంతరించుకుంటుంది. ప్రైమ్ టైమ్ చర్చలకు సందర్భం అవుతుంది. పనిలో పనిగా నెహ్రూ, గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారి గురించి ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు సమాచారం చలామణిలోకి వస్తుంది.
ఇటువంటి చర్చలన్నీ వర్తమాన భారతాన్ని వేధించే కీలక సమస్యలూ, వాటి పరిష్కార మార్గాల గురించి అర్థవంతమైన చర్చకు అవకాశం లేకుండా చేస్తాయి. పార్లమెంట్ ప్రారంభానికి సేన్గోల్ పట్టుకుని అధీనం పీఠాధిపతులు హాజరు కావటం కరెక్టేనా కాదా అన్న చర్చల్తో రోజు ముగుస్తుంది. కథ కంచికి మనం ఇంటికి అన్న చందంగా.
ఇటువంటి వక్రీకరణలకు జాతీయ అంతర్జాతీయ స్థాయి కల్పించటంలో ట్విట్టర్ ప్రధాన వేదికగా పని చేస్తుంది. డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందూత్వ సెమినార్‌ను అడ్డుకున్న ఆకతాయిల గురించిన వార్తలు ట్వైర విహారం (ట్విటర్లో స్వైర విహారం) చేస్తాయి. అసలు ఆ సెమినార్ నిర్వాహకుల గోడు వినేందుకు ఏ మీడియా సంస్థ సిద్ధం కాదు. అల్లరి, అలజడిని అంతర్జాతీయం చేయటంలోనే ట్విట్టర్ మునిగితేలుతుంది. దాని బిజినెస్ మోడల్ కూడా అదే. ట్విట్టర్లో వచ్చిన పోస్టులే తర్వాత పేరుగాంచిన అంతర్జాతీయ పత్రికల్లో విశ్లేణలు అవుతాయి. తద్వారా మితవాద రాజకీయాలపై మొగ్గు చూపేలా అంతర్జాతీయ పాత్ర పోషిస్తోంది.
కోబ్రాపోస్ట్ వెల్లడించిన విధంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి (సోషల్ మీడియాలో విస్తృతమైన ఫాలోయింగ్ ఉన్నవారు) పెద్దఎత్తున నిధులు సరఫరా చేసి మరీ తమకు కావల్సిన విషయాలను వాళ్ల నోటితో చెప్పించటం కొత్త తరహా ప్రచారపద్ధతి. ఫలితంగా నమ్మినా నమ్మకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మితవాద భావోన్మాదానికి వాహకాలుగా ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓ వైపున సొమ్ముచేసుకోవటం మరోవైపున డబ్బిచ్చేవారు ప్రాతినిధ్యం వహించే భావాలను ప్రజలకు చేర్చటం గత పదేళ్లుగా ఓ క్రతువుగా మారింది.
ఇటువంటి కంటెంట్ సృష్టించటంలో ప్రచారం చేయటంలో వీక్షకులకు చేరవేయటంలో యూట్యూబ్ కీలక సాధనంగా పని చేస్తోంది.
హిందువుల భావోద్వేగాలను, నమ్మకాలను రకరకాల మార్గాల్లో పద్ధతుల్లో ప్రచారంలోకి వస్తోంది. చివరకు చట్టం అనుమతించని రీతిలో కార్యకలాపాలకు పాల్పడే బజరంగ్ దళ్, దుర్గావాహిని వంటి సంస్థలు రూపొందించే కంటెంట్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇది సోషల్ మీడియా ప్రమాణాలు, నైతికత, చట్టపరమైన పరిమితులు అన్నిటికీ వ్యతిరేకం. ఇక్కడ కొన్ని పోస్టర్లు పెడుతున్నాను. ఇవన్నీ బజరంగ్ దళ్, దుర్గా వాహిని వాట్సప్, ఫేస్బుక్ పేజీల నుండి సేకరించినవి. ఈ సంఘాలు, సంస్థలూ హిందూ రాజుల సైనిక విజయాలను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఈ పోస్టులన్నీ తాటికాయంత అక్షరాలతో ఒక్కచూపులోనే అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. విషయాన్ని సూటిగా చేరవేయటంలో సోషల్ మీడియా వేదికలు పాటించే పద్ధతుల్లో ఇదొకటి.
మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో నాయికి దేవి, రాణా సంఘ, శివాజీ వంటి వారి వీరోచిత గాధల గురించిన కథలు, కథనాలూ, అపోహలూ, అభూతకల్పనలూ, వాస్తవాతీతవిషయాలూ ఆయా ప్రాంతాల్లో పాపులర్‌గా ఉన్న సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్‌గా సృష్టించబడుతూ ఉంటాయి. ముస్లింలు దుండగులు, దాడి చేసే స్వభావం కలిగిన వారు కాబట్టి వారి నుండి తమను తాము కాపాడుకోవడానికి సాయుధులు కావాలన్న సందేశాన్ని చెప్పకనే చెప్పటం ఈ పోస్టులన్నిటి సారాంశం.
హిందువులు పాటించే శాంతియుత విధానాల వలన వారి భూమి, సంస్కృతి ముప్పు ఎదుర్కొనాల్సి ఉంటుందన్న సందేశాన్ని వ్యాపింపచేయటమే కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాల లక్ష్యం. రాముడు, పాండవులు, పరశురాముడు వంటి చారిత్రక పాత్రలు తాము అజ్ఞాతంలో ఉన్నప్పుడు నిరంతరం సాయుధులై ఉండటాన్ని చూపిస్తూ హిందువులు నిరంతరం సాంస్కృతిక యోధులై అప్రమత్తంగా ఉండాలన్న సందేశాన్ని అందిస్తుంటాయి.
మనోషి సిన్హా రావల్ అనే అతను కాషాయపు కరవాలాలు పేరుతో 52 మంది హిందూ ధీరుల సంక్షిప్త జీవిత చరిత్రలు ఒక పుస్తకంగా రాశారు. వీళ్లందరూ ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్రలో పాత్రధారులు. ఇంతకంటే మితవాద మనువాదులకు ఏమి అవకాశం కావాలి? వాడేసుకుంటున్నారు. వీరి జీవితాలను ప్రత్యేకించి ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ల జీవితాలను ముందుకు తెచ్చి వాళ్ల ప్రత్యర్ధులు చారిత్రకంగా ముస్లింలు అయినందున ఆ భావనలు మనసులో పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న ముస్లింల పట్ల శతృత్వం, ద్వేషభావాన్ని ఎల్లవేళలా కొనసాగించాలన్నదే ఈ పోస్టుల సారాంశం. ఈ పుస్తకంలో ఉన్న వాదనంతా ఒక్కటే. ముస్లింలు దుండగులు. దేశం మీద దాడులు చేసేవారనీ, మారణహోమం చేసేవారనీ, దేవాలయాలు దోపిడీ చేసేవారనీ ఈ పుస్తకాల ద్వారా ప్రచారం సాగేది.వర్తమానంలో జాతీయ సంపదను దోచుకుంటున్నారన్న ప్రచారం సాగుతుంది.
ఈ వాదనలు ఆరెస్సెస్ వాదనలను పోలి ఉంటాయి. కానీ ఆరెస్సెస్ వాదనలు అని చెప్పరు ఎవ్వరూ. కానీ ఇవన్నీ
ముస్లింలు దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారనీ, కాబట్టి ఈ దేశపు వనరులపై వాళ్లకు హక్కులూ, అవకాశాలూ ఉండకూదన్నది ఆరెస్సెస్ అవగాహన. ఈ పోస్టులన్నింటినీలో తరచి చూస్తే కనిపించే ప్రచార వ్యూహం. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ అమలు ఈ వ్యూహంలో భాగమని వ్యాఖ్యానించవచ్చు.
హిజబ్ నిషేధం అన్న పేరుతో ట్విట్టర్ వేదికగా సాగిన ఓ ప్రచారోద్యమం గురించి మిచిగాన్ విశ్వవిద్యాలయం సాగించిన ఓ అధ్యయనంలో హిజబ్ నిషేధాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా సమర్ధించేవారి వాదనలు కూడా బలమైనవే ఉన్నాయి.
ఈ విషయాలు ఏమి చెప్తున్నాయి? నోళ్లు చిన్నవైనా చర్చ పెడుతూ, పెంచుతూనే ఉంటాయి, ఉన్నాయి. ఈ వాదనలు వ్యక్తం చేసినవాళ్లంతా మితవాద, మతోన్మోద భావోద్వేగాలే వాస్తవాలని నమ్మినవాళ్లు, నమ్మకాన్ని వ్యాప్తి చేసేవాళ్లూ మాత్రమే. క్షేత్రస్థాయి మొదలు జాతీయ స్తాయి వరకూ ఈ వాదనలు, భావాలు, ఉన్మాదాలు ప్రచారంలో పెట్టగలిగిన ఉన్మత్తత. దీన్ని తట్టుకునేందుకు, అడ్డుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలు, వ్యూహాలు, కర్తవ్యాలు రూపొందించాల్సింది ఎవరు? ఎలా? అన్న ప్రశ్నకు సమాధానాలు కావాలంటే మతోన్మాదుల వ్యూహరచనను అర్థం చేసుకోవటం ప్రాధమిక కర్తవ్యం. అవసరం. మతోన్మాదుల, విద్వేషుల ప్రచార వ్యూహం పద్మవ్యూహం లాంటిది. ఇంటిదారి తో పాటు బయటి దారి కూడా తెలుసుకుంటేనే మనం అభిమన్యులుగా కాక అర్జునులుగా మిగులుతాము.
మతోన్మాదుల ప్రచార వ్యూహాలను, కంటెంట్‌ను అర్థం చేసుకుని అందులోని వాస్తవాస్తవాలు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నం చేయకుండా ఇటువంటి ముష్కర వ్యూహాలను, వాదనలను ఓడించటం సాధ్యం కాదు. అందుకోసం సమాజంలో ప్రజాతంత్ర చైతన్యాన్ని పెంపొందించాలి.
పై వివ్లేషణ నేపథ్యంలో రాజ్యాంగ పద్ధతులు, ప్రమాణాలు, స్పూర్తి కాపాడాలనుకునేవారి ముందున్న కర్తవ్యం ఏమిటి? రాజ్యాంగ విలువలను సార్వత్రిక విలువలుగా మార్చేందుకు వీలుగా సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకోవాలి. దానికంటే ముందు సైద్ధాంతిక ప్రత్యర్ధుల లక్ష్యాలూ, ప్రచార వ్యూహాలు, ఎత్తుగడలూ అర్థం చేసుకోవాలి. దీనికి గాను ఎంతో మంది ప్రజాతంత్రవాదులు, ప్రచారకులూ, వ్యూహకర్తలూ, భాష్యకారులూ ఉమ్మడిగా ఓ వేదిక మీదికి రావాలి. ఈ లౌకికశక్తులన్నీ సర్వమాన సౌభ్రాతృత్వం సూత్రంగా, వేదికగా ప్రజలను చేరుకోవాలి. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా కృషి చేసే సమాచార, ప్రసార వ్యూహాల కోసం పని చేసేవారంతా సమన్వయంతో పని చేయాలి. అందుకు తగిన సామాజిక మాధ్యమాలు, రూపొందించుకోవాలి. సమాజ హితం కోసం వార్త కథనాలు నడిపించాలి. భిన్న సామాజిక సమూహాల మద్య సంఫీుభావాన్ని నిర్మించాలి. క్షేత్రస్థాయి సామాజిక మాధ్యమాలను దండలో పూసల్లాగా నిర్మించాలి. నడిపించాలి.
వెంకటేశ్ శ్రీనివాసన్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.