
ఒక సంస్థగా న్యాయవ్యవస్థ తన కంటే చాలా పాతదని, తనలాంటి వ్యక్తులను దాటి అది కొనసాగుతుందని జస్టిస్ చంద్రచూడ్ తెలుసుకోవాలి.
బాబ్రీ మసీదు కేసును పరిష్కరించే మార్గాన్ని కనుగొనే క్రమంలో మన న్యాయమూర్తులు న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయినప్పుడు, దేవుడు వారిని రక్షించి వారికి దగ్గరిదారి చూపించినట్లు వార్తలు వచ్చాయి.
ఇదే విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ప్రపంచానికి వెల్లడిరచారు. ‘‘(తీర్పు కోసం) మా ముందుకు చాలా కేసులు వస్తాయి. కానీ మేము పరిష్కారానికి రాలేము’’ అని ఆయన మహారాష్ట్రలో ఒక సభలో అన్నారు. అంతేకాదు : ‘‘అయోధ్య (రామజన్మభూమి-బాబ్రీ మసీదు) వివాదం సమయంలో ఇలాంటిదే జరిగింది. ఈ వివాదం నాముందు మూడు నెలలు ఉంది. నేను దేవుని ముందు కూర్చుని, ఒక పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉందని చెప్పాను’’ అని కూడా శెలవిచ్చారు.
అతను తన దేవుడి ముందు చేతులు జోడిరచి కూర్చొని, వాటికి పరిష్కారం చెప్పమని కోరిన ద్రుశ్యాన్ని మనం ఊహించవచ్చు. అంటే జస్టిస్ చంద్రచూడ్, అతని తోటి న్యాయమూర్తులు (బాబరీ మసీదు వివాదంలో) ఇచ్చిన తీర్పు వారిది కాదని, ఈ తీర్పును దేవుడే వారి ద్వారా తెలియజేశాడని అర్థం. ఈ రోజు వరకు ప్రజలు సంతకం చేయని తీర్పు రచయిత గురించి మాత్రమే ఊహించారు. అది దేవుడిచే నిర్దేశించబడిరదని ఇప్పుడు మనకు తెలుస్తోంది. న్యాయమూర్తులు కేవలం ఒక మాధ్యమంగా మాత్రమే ఉన్నారు.
జస్టిస్ చంద్రచూడ్ తన దేవుడిని ఒక పరిష్కారాన్ని కనుగొనగలిగే శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వమని అడగలేదని, తనకు పరిష్కారం కనుగొనమని మాత్రమే కోరాడని మనం గమనించాలి. అలా దైవికంగా నిర్ణయించబడిన పరిష్కారాన్ని అతను, అతని తోటి న్యాయమూర్తులు కేవలం మానవ భాషలో వ్రాయటం జరిగిందని అతను చెబుతున్నాడు.
ప్రధాన న్యాయమూర్తి ‘బహిర్గతం’ చేసిన విషయం చాలా మంది నిజమైన భక్తుల విశ్వాసాన్ని ఛిద్రం చేసిందని నేను భావిస్తున్నాను. 2019 నాటి సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును ఘోర అపరాధమని లక్షలాది మంది హిందువులు నమ్ముతున్నారు. ఇతరుల మతపరమైన స్థలాన్ని ధ్వంసం చేసి, ఆ నేరం జరిగిన స్థలంలో ఆలయాన్ని నిర్మించడం పాపం. తమ ఆరాధ్య దైవం పేరుతో ఈ అన్యాయం జరిగిందని పలువురు రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్‌ను రాముడి ‘తదుపరి స్నేహితుడు’ లేదా సంరక్షకుడిగా అంగీకరించడం, రాముడు తన ప్రయోజనాలను చూసుకోలేని శాశ్వతమైన మైనర్‌గా పరిగణించబడడం, విశ్వహిందూ పరిషత్ వంటి సంరక్షకుడు అవసరమని భావించడం వారిని బాధించింది.
తాను జీవితాంతం ధార్మిక భావాలు కలిగిన వ్యక్తిగానే ఉన్నానని జస్టిస్ చంద్రచూడ్ అన్నాడు. ఈ మధ్యనే దీనికి సాక్ష్యం కూడా చూశాము. ప్రధాని సమక్షంలో ఆయన వినాయకుడికి పూజలు చేశారు. కానీ ఆ వీడియో లో కనపడిన ద్రుశ్యం ఏమిటంటే, పూజ అందించే ప్రధాన వ్యక్తి ప్రధానమంత్రి అయితే, ప్రధాన న్యాయమూర్తి, అతని భార్య మోడీతో పాటు పాడటం, గంట కొట్టడం ద్వారా సహాయక పాత్రలు పోషించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన వినాయకుడి పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపాల్గంటున్న దృశ్యం.
అంతకు ముందు గుజరాత్ పర్యటనలో తన మతతత్వానికి సంబంధించిన రుజువును ఇచ్చాడు. అతను తన భార్యతో కలిసి ద్వారకాధీష్, సోమనాథ్ ఆలయాలను సందర్శించాడు. అతని పర్యటన రికార్డ్ చేయబడటమే కాకుండా విస్త్రుతంగా ప్రసారం చేయబడింది. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా తన ‘వ్యక్తిగత’ సందర్శన వార్త శీర్షికగా ఉండదని, తద్వారా బహిరంగ చర్చనీయాంశంగా మారదని మాకు తెలుసు.
ఆయన గుజరాత్ పర్యటన సందర్భంగా దేవాలయాల పైభాగంలో రెపరెపలాడుతున్న మత జెండాలను చూసి స్ఫూర్తిని పొందారు. ద్వారకాధీష్పై ఉన్న ధ్వజాన్ని చూడగానే జగన్నాథ్ పూరి పతాకం గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు: ‘‘మన దేశ సంప్రదాయం సార్వత్రికతను చూడండి, అది మనందరినీ ఐక్యం చేస్తుంది. ఈ పతాకం మనందరికీ ఓ బోధ చేస్తోంది కూడా. మనందరినీ మించి (న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులు) ఓ సమైక్యతా శక్తి ఉంది. అది చట్టబద్దమైన పాలన. భారత రాజ్యాంగం. కలిపివుంచే ఏకీకౄత శక్తి చట్ట పాలనకు, భారత రాజ్యాంగానికి ఉంది’’.
జస్టిస్ చంద్రచూడ్ వంటి కొందరికి ద్వారకాధీష్ దేవాలయం పైన ఉన్న ధ్వజాన్ని చూడగానే పూరీ ధ్వజం గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఈ దేశాన్ని సమైక్యంగావుంచే సంప్రదాయమా? మనందరి పైనగల ఈ శక్తి ఏమిటి? ఆ శక్తికి ప్రతీకగా ఒక మతానికి చెందిన పతాకం వుండవచ్చా?
ప్రధానమంత్రి తన ఓటర్ల ముందు తరచూ తన మతతత్వ ధోరణిని ప్రదర్శించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ న్యాయమూర్తులు ఇలా చేయడం ప్రారంభిస్తే, వారి నిర్ణయాలకు మూలం లేదా ప్రేరణ తమ మతం లేదా దేవుడని ప్రకటించడం మొదలిడితే అందరికీ కోర్టులపై నమ్మకం పోతుంది.
బాబ్రీ మసీదు కేసును పరిష్కరించే బాధ్యతను మన న్యాయమూర్తులు తీసుకుని తప్పు చేశారు. అది వారి సామర్థ్యానికి మించినది. బాబ్రీ మసీదు భూమిపై యాజమాన్యం ఎవరిదనే విషయాన్ని నిర్ణయించడం వారి ముందున్న సమస్య. శతాబ్దాలుగా ఆ భూమిపైన మసీదు నిలిచి ఉందని వారే అంగీకరించారు. ఇది సజీవ మసీదు. అందులో 400 సంవత్సరాలుగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆలయాన్ని కూల్చివేసి నిర్మించినట్లు ఆధారాలు లేవని కోర్టు కూడా అంగీకరించింది. వారు దానిని కూడా ప్రాసంగిత ఉన్నదానిగా పరిగణించలేదు. 1949లో మసీదులో రాత్రి చీకటిలో హిందూ దేవతా విగ్రహాలను రహస్యంగా స్మగ్లింగ్ చేశారని కూడా అంగీకరించారు. న్యాయమూర్తుల ప్రకారం ఇది నేరం. అదేవిధంగా 1992 డిసెంబర్ 6న మసీదు కూల్చివేత చర్య కూడా నేరపూరిత చర్య. ఇదంతా తీర్పులోనే ఉంది. కానీ వీటన్నింటిని అంగీకరించిన తర్వాత, మసీదు భూమిని రామ్ సంరక్షకుడికి లేదా స్నేహితుడికి ఇవ్వాలని వారు నిర్ధారించారు. అంటే, కోర్టు భాషలో చెప్పాలంటే, ఎవరైతే 1949లో ఒకసారి, ఆపై 1992లో మరోసారి నేరాలు చేశారో వారికే ఆ భూమిని అప్పగించారు. బాబ్రీ మసీదులో పదే పదే చేస్తున్న అల్లర్లు, నేరాలు చేయటం ద్వారా కొందరు ఆ భూమిపై హక్కు పొందబూనుకున్నారన్నది వారి వాదన. వారు నిరంతరం దానిపై తమకు హక్కు ఉందని వాదిస్తున్నారు. ఇటువంటి వాదనను ఎలా తిరస్కరించాలి? ఈ రకమైన న్యాయ విన్యాసాల ద్వారా కోర్టు దృష్టిలో రెండు నేరాలకు పాల్పడిన వారికే బాబ్రీ మసిదు భూమిపై యాజమాన్యం బదిలీ చేయబడినది.
రాముడు లేదా శివుడు లేదా కృష్ణుడు దేవుడు ఎవరైనా మన ప్రధాన న్యాయమూర్తికి ఈ విధమైన న్యాయపరమైన కుటిలత్వంలో భాగస్వామి అవమని చెప్పారా? ఐదుగురు న్యాయమూర్తులు న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారని ఖచ్చితంగా సామాన్య ప్రజలు కూడా గ్రహించగలిగిన విషయాన్ని సర్వజ్ఞుడైన దేవుడి దృష్టిలోపడకుండా దాచటం సాధ్యమా?
పిటిషనర్ల ఉత్సుకతను తీర్చడం అవసరమని జ్ఞానవాపి మసీదు సర్వేను అనుమతించినప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఆ అన్యాయాన్ని కొనసాగించారు. ఆ అర్భకులైన కక్షిదారులు మసీదు లోపల ఏముందో తెలుసుకోవాలనుకున్నారు! ఇప్పుడు మసీదు నేలమాళిగలో పూజలు జరుగుతున్నాయి. ముస్లింలు దానిలో కొంత భాగంపై దాదాపుగా యాజమాన్యాన్ని కోల్పోయారు. ఈ నిర్ణయం కూడా దేవుడి ప్రేరణతోనేనా?
గ్రామ సభకు అధిపతి అయిన పంచ్‌లో దేవుడు నివసిస్తాడనే లోకప్రియమైన నమ్మకాన్ని తన కధ పంచ్ పరమేశ్వర్ లో ప్రేమ్‌చంద్ కల్పిత గాధగా మలిచాడు. అతను ప్రాపంచిక ప్రేమ, దురాశ, వ్యక్తిగత ప్రయోజనంతో సంబంధం లేకుండా న్యాయం చేస్తాడు. కానీ జస్టిస్ చంద్రచూడ్, అతని తోటి న్యాయమూర్తుల ప్రవర్తనలో ఈ నిస్పాక్షికత కనిపించదు. వారు ఇహలోకపు విషయాలలో లోతుగా చిక్కుకుపోయారు. భారతదేశంలోని ప్రస్తుత పాలకులకు బాబ్రీ మసీదు భూమిని బహుమతిగా ఇచ్చిన వెంటనే వారిలో ఒకరు రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. ఒకరికి గవర్నర్ పదవి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి క్రమంగా తన మతపరమైన ధోరణిని బహిర్గతం చేయడం వెనుకగల కారణాన్ని ప్రజలు ఊహించడంలో తప్పుందా?
బాబ్రీ మసీదు భూమిలో రామమందిర నిర్మాణానికి దారితీసిన తన నిర్ణయం గురించి మాట్లాడేందుకు (మహారాష్ట్రలో) ఎన్నికల తరుణాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎంచుకున్నారని న్యాయవ్యవస్థపై ఇప్పటికీ తమ విశ్వాసాన్ని నిలుపుకోవాలనుకునే కొందరు కలవరపడుతున్నారు. ఈ తీర్పు తమ ప్రతిభవల్లనే వచ్చిందని బీజేపీ వాదిస్తోంది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దానిని దేవుడికే ఆపాదించారు. ఆయన ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న.
ఒక సంస్థగా న్యాయవ్యవస్థ తన కంటే చాలా పాతదని, తనలాంటి వ్యక్తుల తరువాత కూడా అది కొనసాగుతుందని జస్టిస్ చంద్రచూడ్ తెలుసుకోవాలి. తన తండ్రి చేసిన అన్యాయాన్ని చరిత్రలో నమోదు చేసినట్లే, అతని స్వంత నైతిక బలహీనతను, అనేకమంది అతని తోటి న్యాయమూర్తుల నైతిక బలహీనతలను గుర్తించే సమయం ఖచ్చితంగా వస్తుంది. భారతీయ లౌకికవాదం అనే గొప్ప భవనాన్ని కూల్చివేస్తున్నప్పుడు, దానిని ధ్వంసం చేసే ప్రక్రియలో చాలా మంది న్యాయమూర్తులు పాలుపంచుకున్నారని చరిత్ర నమోదు చేయబడుతుంది. దానిలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ఉంటుందా? చరిత్ర తనని ఎలా స్మరించుకుంటుందోనని ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఆందోళన కలిగించేది ఇదేనా?
రచయిత : అపూర్వానంద్
అనువాదం : నెల్లూరు నర్సింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.