కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక స్మ్రుతులు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో కార్మికుల హక్కులను తీవ్రంగా కుదించాయి . యజమానులకు అనుకూలంగా రూపొందించ బడ్డాయి.
ఈ మార్పుల ప్రభావం ముఖ్యంగా మహిళా కార్మికులపై తీవ్రంగా పడుతోంది.
మహిళలపై ఇది కొత్త దాడి
Shram Shakti Niti–2025:
“వర్కర్”, “ఎంప్లాయీ” నిర్వచనాలు లోపభూయిష్టం హోమ్ వర్కర్స్, ఫారం వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్ వీధి విక్రేతలు వీరందరూ వర్కర్స్ నిర్వచనం కిందకే రారు. లింగ సమాన వేతనం లేదు POSH, కనీస హక్కులు విస్మరించబడ్డాయి.
వీటిని కొద్ది గా పరిశీలిస్తే..
మెజారిటీ మహిళలను ను ఈ కొత్త స్మృతులు‘కార్మికులు’ గానే గుర్తించడం లేదు. గృహ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఎంఎన్ ఆర్ఈజీఏ, గిగ్ వర్కర్లు, ఇంటి నుంచే పనిచేసే మహిళలు – వీరందరూ కొత్త స్మృతుల ప్రకారం కార్మికులు కాదు. వీరోచితంగా పోరాడుతున్న స్కీం వర్కర్ల కు ఏ హక్కులు లేకుండా పోయాయి. ఇది మహిళలను గేలి చేయడమే!

పని గంటల పెంపు :
ఈ కొత్త స్మ్రుతులు మహిళను కార్యేషు దాసి గా సంకెళ్లు బిగించాయి.మహిళలపై రెండింతల భారం పెరగనుంది.
మహిళల పని – కనిపించని శ్రమ గా ఉంది.
మహిళలు పని చేయడం లేదన్నది ఓ అందమైన అబద్ధం.వారు పని చేస్తున్నారు .కానీ అది గుర్తింపు లేకుండా, వేతనం లేకుండా జరుగుతోంది.
రోజుకు 8 గంటల పని స్థానంలో 12–16 గంటల వరకు పని చేయించే అవకాశం ఈ స్మ్రుతులు యజమానులకు ఇచ్చాయి.ఫలితం శ్రమ పెరగడం తో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గనున్నాయి.మహిళలపై ఉచిత గృహ, సంరక్షణ, పని భారం ఎలాగు ఉన్నది. అది మరింత పెరుగుతుంది.
తక్కువ వేతనాలు – వేతనమే లేని పని:
కొత్త స్మృతుల లో కనీస వేతనాల్లో లింగ వివక్ష త చూపారు.మహిళను పురుషుడి కంటే తక్కువ వినియోగ యూనిట్ గా లెక్కించడం ద్వారా మహిళల శ్రమ విలువను తక్కువగా చూపారు. ఒంటరి మహిళలు, మహిళా నేతృత్వ కుటుంబాలు, వృద్ధులు – ఎవరికీ గుర్తింపు ఈ స్మ్రుతుల లో లేదు. కనీస వేతన లెక్కింపులో ఇవి కాన రావు. తక్కువ వేతనంతో లేదా వేతనం లేకుండా పనిచేసే మహిళల వాస్తవ పరిస్థితి
NSSO (2019, 2024) అధ్యయనాలు చెబుతున్న నిజం ఇది
ఒక మహిళ రోజుకు 8 గంటలు ఇంటి పని చేసుకొని 2-3 గం.లు ఉపాధి కోసం చేస్తే ఆ 2-3 గం.లాకే వేతనం లభిస్తుంది. అది కూడా పురుషుడితో సమానంగా రాదు. ఇంటి పని 08.00 గం.లకు ఆమెకు ఎలాంటి వేతనం రాదు.
పురుషులు రోజుకు 7–8 గంటలు పని చేస్తారు.
అందులో 6 గంటలకు పైగా వేతనంతో పని ఉంటుంది.
అంటే,మహిళల పని లో రెండు మూడొంతులు వేతనం లేని పని పురుషుల పని లో 90% వేతనంతో కూడిన పని . ఈ అసమాన తే మహిళల ఆర్థిక దోపిడీకి పునాది. మహిళలకు సమానత్వం ఆకల్పించాలంటే ఆమె చేసే మొత్తం పనిని లెక్కించాలి. ఆ పనికి వేతనం చెల్లించాలి. కొత్త శ్రమ స్మ్రుతుల లో సమానత్వ సాధన లక్ష్యాన్ని అటకెక్కించారు ( కోల్డ్ స్టోరేజ్ లో కి నెట్టారు.)
శ్రామిక సైన్యం (లేబర్ ఫోర్స్)నుంచి మహిళలను నెట్టివేయడం:
2018–2024 మధ్య మహిళా శ్రామికులు -జనాభా నిష్పత్తి 33%-35% పెరిగినట్టు చూపిస్తున్నారు.నిరుద్యోగం మహిళల్లో 4% మాత్రమే అని చెబుతున్నారు. కానీ నిజం అందుకు భిన్నమైనది. 60% మహిళలు శ్రామిక సైన్యం (డిమాండ్)లోనే లేరు (NILF) పురుషులలో ఇది కేవలం 23–25%. ప్రభుత్వమూ ,ఉదారవాద విధానాల పండితులు దీన్ని “సాంస్కృతిక, సామాజిక కారణాలు” అంటారు.కానీ వాస్తవం మాత్రం వేరే!
అసంఘటిత రంగంలో ఉద్యోగాల కొరత ఉంది. స్థిరమైన వేతన ఉద్యోగాలు లేకపోవడం కారణంగా మహిళలను శ్రామిక సైన్యం (డిమాండ్)నుంచి బయటకు నెట్టి వేస్తుంది. పని లేక తక్కువ వేతనాలకు వెళ్ళవలసిన స్తితి లో అసలు పని కావాలనే ఆసక్తి ని వ్వక్తం చేయడమే జరగదు. లేదా చెప్పరు. చెప్పే అవకాశం కూడా ఉండదు.
2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మహిళలపై వేతనం లేని ఇంటి పని భారం మరింత పెరిగింది. 2020–2024 మధ్య 62 లక్షల మహిళలు “కుటుంబ పనులే చేస్తున్నవారు”గా చేరారు. ఎందుకని? సంక్షేమ చర్యలు విద్యా, వైద్యం,పిల్లల,పెద్దల సంరక్షణ ప్రభుత్వ కేటాయింపులు తగ్గుతున్న కొద్దీ ఆ పనులు భారం స్త్రీ ల పై పడి ఇతర పనులకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. లేదా పార్ట్ టైమ్ పనులకు ,నామమాత్రమైన పనులకు వెళ్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న మహిళా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు కానందున అదనపు భారాన్ని మోయాడాన్ని ,పని హక్కు నుండి నెట్టి వేయబడటాన్ని ఈ స్మ్రుతులు బల పరుస్తున్నాయి..
*మోసపూరిత మోడీ ప్రభుత్వ విధానాలు –* లక్పతి, దీదీ వగైరా పేర్లతో మహిళలకు ఉద్యోగాలు , స్వయం ఉపాధి ప్రచారం భారీగా సాగుతుంది.మోడీ ప్రభుత్వం స్థిరమైన వేతన ఉద్యోగాలను తగ్గించింది. స్వయం ఉపాధి, గిగ్ వర్క్ ను ప్రోత్సహిస్తోంది.ముద్రా, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా ప్రచారం భారీగా సాగుతుంది.
(“హమ్ నౌక్రీ లేతే నహీ, దేతే హై” ) అనే నినాదం వెనుక నిజం ఏమిటి? పై పధకాల ద్వారా మహిళలకు రుణాలు మాత్రమే ఇస్తారు .ఇవి స్వీయ ఉపాధిగా లెక్కిస్తున్నారు.
కానీ వాస్తవంలో కుటుంబంలోని వేతనం చెల్లించని పని మీదే ఆధారపడిన కిరాణా,తోపుడు బళ్ళు, పాలు వగైరా వ్యాపారాలు ఇవి. వీటి ద్వారా అప్పులు పెరుగుతాయి. ఆదాయం మాత్రం నమ్మకం లేదు. ఈ పేరుతో శ్రామికులు గా ఉన్న ఈ మహిళలను శ్రామికులు గా గుర్తించకుండా వారి శ్రమను మల్టీ నేషనల్స్ కు దోపిడీ చేసే రాంచీ మార్గాన్ని రూపొందించారు.

భద్రత, గౌరవం అనే అంశాలు పక్కకు
లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కార్మిక స్మ్రుతుల పరిధిలోకి తేవడం లేదు. రాత్రి పని అనుమతి స్తూనే సురక్షిత రవాణా బాధ్యత యజమానిపై పెట్ట లేదు.
ఇది మహిళల భద్రతను ప్రమాదంలోకి నెట్టుతుంది.
ప్లాట్‌ఫారమ్ & గిగ్ వర్క్ – అవకాశమా? లేక కొత్త రక మైన దోపిడీనా?
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (ఫుడ్ డెలివరీ, బ్యూటీ సర్వీసులు, డొమెస్టిక్ వర్క్):
2019లో మహిళలు ఈ పనిలో 20 లక్షలు ఉన్నారు.
2020–21 తర్వాత 50 లక్షలు అయ్యారు. అయినా,
మొత్తం ప్లాట్‌ఫారమ్ వర్క్‌లో మహిళల వాటా 8–12%.
వీటిలో సంరక్షణ,గుమస్తాలుగా తక్కువ వేతన కంప్యూటర్ ఆధారిత పనులే ఎక్కువ! నాయకత్వం స్థానం లో,అధిక వేతన ఉద్యోగాల్లో మహిళలు పెద్ద గా లేరు.
గిగ్ వర్క్ ర్ల సమస్యలు:
ఎక్కువ పని గంటలు.
తక్కువ వేతనం.
ఫోన్, ఇంటర్నెట్, రవాణా ఖర్చులు మహిళలే భరించాలి.
భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నారు.మహిళలకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటు ఉండదు.
ILO అంతర్జాతీయ కార్మిక సంస్థ వీటిపై హెచ్చరిక చేసింది.
AI వల్ల 28% మహిళలు, 21% పురుషులు క్లరికల్/సపోర్ట్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని. గిగ్ వర్కర్ల ను ఈ స్మ్రుతులు ఆదుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహిళలు–చట్టాలు – చరిత్రాత్మక పోరాటాలు:
స్వాతంత్రోద్యమ కాలం మహిళ ల సమాన హక్కులను గుర్తించి అవకాశాల కోసం పోరాడిన కాలం. శ్రామిక పోరాటాల్లో 1930 ల నుంచే మహిళలను “వర్కర్స్”గా గుర్తించాలనే డిమాండ్ లేవనెత్త బడింది. 1974 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమానత్వం వైపుగా నివేదిక ను ప్రకటించింది.అందులో మాతృత్వ హక్కులు, సదుపాయాలు, క్రెచ్‌లు, భద్రత అవసరం గురించి నొక్కి చెప్పారు.
శ్రామిక మహిళల సంక్షేమం కోసం క్రృషి చేసిన ఇలా భట్, స్వయం ఉపాధి లో ఉన్న మహిళలకు గుర్తింపు కావాలని నివేదిక ఇచ్చారు.అర్జున్ సేన్‌గుప్తా కమిటీ 2007 లో అసంఘటిత రంగమే ఎక్కువని వారందరికీ హక్కులు విస్తరించాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు – వాస్తవం
ఉపాధి హామీ చట్టం కింద పని పొందినది 58% మహిళలే! నిధుల కోత, బయోమెట్రిక్ హాజరు వల్ల వేతనాలు తగ్గిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రు 290/- కనీస వేతనం ఉన్నప్పటికీ రు 200-215 మాత్రమే వేతనంగా పొందారు. పాదుపు గ్రూపుల, మహిళల పొదుపులు కార్పొరేట్ రుణాలుగా మారాయి. మహిళలు అప్పుల్లో మునుగు తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అప్పుల భారం లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వారికి లక్ష రూపాయలు రుణంగా ఇస్తామని టార్గెట్లు పెట్టి బలవంతంగా వ్వాపార వేత్తలు గా ప్రకటిస్తున్నారు.
అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం
2019 -23 మద్య అట్టడుగున ఉన్న 50% పేదలు నెలవారీ ఆదాయం 3,500-11000 మద్య ఉండగా 22-23 నాటికి రు 4242-13961 మద్య మాత్రమే పెరిగాయి.అదే కాలంలో నెలవారీ ఖర్చులు 22-23 లో రు 5693-15470 గా ఉన్నాయి. అంటే కుటుంబ ఖర్చులు ఆదాయాన్ని మించాయి.అప్పులతో బతకాల్సిన స్తితి.వ్వవసాయ వేతనాల్లో కూడా మహిళల వేతనాలు 20-30% తక్కువ ఉండటం అందరికీ తెలిసిందే!
కేరళ,తమిళ నాడు రాష్ట్రాలు పట్టణ ఉపాధి హామీ చట్టాలు చేశాయి. కానీ వీటికి కేంద్ర మద్దతు లేదు.
ఫార్మలైజేషన్ ఒక మోసం!
20 కంటే అదనంగా కార్మికులు ఉన్న చోట మాత్రమే కార్మిక స్మ్రుతుల అమలు ఉద్యోగ భద్రత ,నియామక పత్రాలు తదితరాలు ఉంటాయి. మహిళలు అలాంటి చోట పని పొందగలరని ఆశించడం అత్యాశే! ఈ -శ్రమ పోర్టల్ లో
31 కోట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయి . కానీ కేవలం 5.67% మాత్రమే సామాజిక రక్షణ పధకాలు పొందుతున్నారు.
క్రెచ్ వసతులు కుదింపు:
‘50 మంది ఉద్యోగులు’ అన్న నిబంధనను ‘50 మహిళా ఉద్యోగులు’గా మార్చడం వల్ల అనేక సంస్థలు క్రెచ్ ఏర్పాటు బాధ్యత నుంచి తప్పించుకుంటాయి. ఇది పని చేసే తల్లులపై తీవ్రమైన దెబ్బ.
సామాజిక భద్రత మాటల్లోనే!
దేశ కార్మికుల్లో కేవలం 6% మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారు. మిగిలిన మహిళా కార్మికులకు మాతృత్వం, ఆరోగ్యం, పెన్షన్ వంటి హక్కులు హామీగా లేవు.
యూనియన్ హక్కులపై దాడి !
సమ్మెలు, సంఘటిత పోరాటాలపై ఆంక్షలు పెరిగాయి.
ఇప్పటికే సంఘటితం కావడంలో ఇబ్బంది పడుతున్న మహిళలకు ఇది మరింత అడ్డంకి.
దేశ యువత భవిత:
యువ మహిళల పరిస్థితి మరింత దారుణం గా ఉంది.
15–24 వయసు మహిళల నిరుద్యోగం పురుషుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. NEET ( నో ఎంప్లాయ్ మెంట్,నో ఎడ్యుకేషన్,నో ట్రైనింగ్-ఉద్యోగం లేదు, చదువు లేదు, శిక్షణ లేదు) యువతలో మహిళలు 14% ఎక్కువ.
మొత్తం 5.3 కోట్ల NEET యువతలో 3.4 కోట్లు మహిళలే!
అంటే ప్రతి 10 మంది యువత లో 6.4 మంది మహిళలు.
ఈ పరిస్థితి గత దశాబ్దంగా మారలేదు.
మోసపూరిత కార్మిక స్మ్రుతులు:
మహిళలను కార్మికులుగా గుర్తించకుండా చేస్తున్నాయి.
లింగ అసమానతలను పెంచుతున్నాయి.
పితృస్వామ్య విధానాలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐద్వా ,ఇతర మహిళా శ్రామిక సంఘాలు ఈ క్రింది చర్యల తీసుకోవాలని కోరుతుంది.
- మహిళా కార్మికులందరికీ చట్టబద్ధ గుర్తింపు
- పని గంటల నియంత్రణ
- క్రెచ్, భద్రత, మాతృత్వ హక్కుల హామీ
- సమాన వేతనం, సామాజిక భద్రత
- కార్మిక సంఘాల హక్కుల పునరుద్ధరణ కావాలి.
మహిళల ఐక్య పోరాటం ద్వారానే ఈ కార్మిక వ్యతిరేక, మహిళా వ్యతిరేక స్మృతులను వెనక్కి నెట్టగలం.
ఏం జరగాలి?
మహిళా వ్వతిరేక , శ్రామిక వ్వతిరేక శ్రమ స్మ్రుతులు & శ్రమ శక్తి నీతి 2025 రద్దు కావాలి. మహిళలందరినీ “వర్కర్స్”గా గుర్తించే విధానం రూపొందించాలి. రేగా చట్టాన్ని పునరుద్ధరించాలి. పట్టణ ఉపాధి హామీ చట్టం చేయాలి.
అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది మహిళల కోసం అంతర్జాతీయ కార్మిక సమావేశాల నిర్ణయాలను ఆమోదించి అన్ని సంక్షేమ చర్యలను (ఉందా:మాత్రృత్వ సెలవులు)అమలు
చేయాలి.
సమాన వేతనాల చట్టాన్ని పునరుద్దరించి కనీస వేతనం ₹26,000 అమలు చేయాలి.స్కీం వర్కర్లను ఉద్యోగులు గా గుర్తించాలి.
స్వయం సహాయక మహిళలు సొంత వ్యాపారం నిర్వహించుకుంటున్న మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలి.
ఇంటిలో పని, వ్యవసాయ పనుల ప్రదేశాలను పనులను పని ప్రదేశాలుగా గా గుర్తించాలి. రాత్రి పని కి అన్ని రకాల భద్రతా చర్యలు యూనియన్ సమ్మతి ఉండాలి. POSH Act ను అన్ని చోట్లా అమలు చేయాలి. క్రెష్ లు, సామూహిక భోజన శాలలు, ఇరుగుపొరుగు సేవలు
ఏర్పాట్లు జరగాలి.
ముగింపు
మహిళలు,మహిళా కార్మికులు ఈ వ్యవస్థలో అత్యంత దోపిడీకి గురవుతున్న వర్గం. వారి శ్రమను గుర్తించకుండా
సమానత్వం, అభివృద్ధి, గౌరవ జీవితం మహిళా సాధికారత ఆర్థిక , సామాజిక అభివృద్ధి సాధ్యం కాదు.
మహిళల శ్రమ హక్కుల సాధన కోసం ఫిబ్రవరి 12 న సమ్మె కోసం ఇప్పటికే వివిధ సంస్తల లో సంఘటితమైన మహిళలు ఇంటి ఇంటికి వెళ్తూ పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు.
ఇది మహిళా హక్కులను నిలబెట్టుకునే ఓ బ్రృహత్తర ప్రయత్నం. ఐద్వా ,ఇతర మహిళా కార్మిక, సంఘాలతో కలిసి ఈ క్రృషి లో ఇప్పటికే భాగమయింది. ఫిబ్రవరి 12 సమ్మెను జయప్రదం చేయడంలో మహిళ లందరు ముందుండాలి.
డి.రమాదేవి, జాతీయ నాయకులు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
