
దేశంలో నిజమైన సంపదను, ఉద్యోగాలను ఎవరు సృష్టిస్తారు? అనే విషయాన్ని తెలుసుకోవడానికి 30 సంవత్సరాలకు పైగా సరళీకృత ఆర్థిక వ్యవస్థ తర్వాత ఆత్మపరిశీలన అవసరం.
ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, జనాభాలో 6.6% మంది 2020-21లో పన్ను రిటర్న్ లను దాఖలు చేశారు. కానీ జనాభాలో కేవలం 0.68% మంది మాత్రమే గణనీయమైన ఆదాయపు పన్ను చెల్లించిన సమర్థవంతమైన పన్ను చెల్లింపుదారులు. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రకటించే ధనికులు, జనాభాలో 0.016% మాత్రమే. వారు మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో 38.6%గా ప్రకటించారు.
ఓలా ఎలక్ట్రిక్‌కి చెందిన కునాల్ కమ్రా మరియు భవిష్ అగర్వాల్ మధ్య ఇటీవల తలెత్తిన వివాదం నేపథ్యంలో ప్రజలు స్పష్టంగా ఇరువైపులా చీలిపోయారు. ఓలా ఎలెక్ట్రిక్ తో అసంత్రుప్తి చెందిన కస్టమర్లు ఓలా స్కూటర్లను తగులబెట్టి, వారి ఫిర్యాదులు మరియు వీడియోలతో ఎక్స్ (ట్విట్టర్)ని ముంచెత్తారు. అయితే దేశంలోని ‘సంపద సృష్టికర్తలు’ మరియు ‘ఉద్యోగ సృష్టికర్తలు’ గురించి విమర్శలు సరికాదని పేర్కొంటూ కొందరు అగర్వాల్ కు మద్దతుగా నిలిచారు.
ఎఎన్ఐ వార్తా సంస్థకు చెందిన స్మితా ప్రకాష్ ‘‘దేశంలో సంపద సృష్టికర్తలకు వ్యతిరేకంగా ఉద్యమించే వారంతా జయచంద్లే. బాధ్యత కలిగిన పౌరుల్లాగా ఈ చెదపురుగుల గోలకు విలువనిస్తారా లేక ఉపాధి కల్పిస్తున్న వారి పక్షాన నిలుస్తారా అన్నది మీరే నిర్ణయించుకోండి. మీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించండి’’ అని కూడా పిలుపునిచ్చారు.
ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో ‘మాటల యుద్ధం’ ఎలా ఉన్నా, మరుసటి రోజు ఉదయం, ఓలా షేర్లు 8.31% పడిపోయాయి.
ఈ రోజు కార్పొరేట్ భారతదేశం పనితీరులో ఒక చిన్న లోపాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తే చాలు, అది జాతి పరువుకు సంబంధించిన సమస్యగా మారుతుంది. మీరు కంపెనీలు జనం మీదకు వదులుతున్న నాశిరకం ఉత్పత్తులను, సేవలను లేదా పని పరిస్థితులను ఎత్తి చూపలేరు. ‘ ఈ నాశిరకం సరుకు భారతదేశంలోనే తయారయ్యింది’ంఅంటూ మీరు చప్పట్లు కొట్టాలి.
అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్‌కు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించినప్పుడు, అదే జాతి పరువు వాదనతో కొట్టిపారేశారు. ‘సోరోస్ గ్యాంగ్’పై ఆరోపణలు చేయడం, సమస్యను అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నించిన వారిని దూషించడం కనిపించింది. అదానీ కంపెనీ హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సమాధానంగా విడుదల చేసిన 413 పేజీల ప్రతిస్పందన సారాశం: ‘ఇది దేశంపై దాడి’.30 సంవత్సరాలకు పైగా సరళీకృత ఆర్థిక విధానాలు అమలు జరిపిన తర్వాత దేశంలో నిజమైన సంపదను, ఉద్యోగాలను ఎవరు సృష్టిస్తున్నారు అనే ప్రశ్నపై ఆత్మపరిశీలన అవసరం.
ఉద్యోగ సృష్టి అనే కట్టుకథ
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంతో ప్రారంభిద్దాం. ఈ కంపెనీ టర్నోవర్ దాదాపు రూ.5,000 కోట్లు. 1,000కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తోంది. గతేడాది 3,733 మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది జూన్‌లో 400 నుంచి 500 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సమాచారం. గత ఏడాది లోనే ఓలా ఎలక్ట్రిక్‌పై 10,000 మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ కంపెనీకి నోటీసులు జారీ చేసింది.
అదానీ ఎదుగుదలతో నిజంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందా? ఒకవేళ ఆర్థిక వ్యవస్థ అదానీ రేంజిలో అభివృద్ధి అయితే దేశం విశ్వగురువు నుండి బ్రహ్మాండగురు (ప్రపంచ నాయకుడు నుండి విశ్వ నాయకుడు) స్థాయికి ఎదిగి ఉండేది.
దేశంలో ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారో ఊహించండి. ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నది రక్షణ మంత్రిత్వ శాఖ. రక్షణ శాఖలో దాదాపు 29 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన సంస్థగా మారింది. ఆ తర్వాత భారతీయ రైల్వే శాఖలో 12 లక్షల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు పని చేస్తున్నారు.
ప్రైవేటు రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న కంపెనీలుగా నమోదయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఆరు లక్షల మంది పని చేస్తుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో షుమారు నాలుగు లక్షల మంది వరకూ పని చేస్తున్నారు.
ఇక అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం, ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 46,000 మంది పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ కేవలం 1,047 కొత్త ఉద్యోగులను మాత్రమే నియమించుకుంది. అదానీ కంపెనీల్లో ఉపాధి కల్పన రేటు కేవలం మూడు శాతం వృద్ధిరేటుతో పురోగమిస్తుంటే గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద వార్షికంగా 123% పెరుగుతోందని గుర్తుంచుకోవడం మంచిది.
ఇప్పుడు కూడా మీరు ‘ఈ ప్రైవేట్ కార్పొరేట్లు కాకపోతే మాకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు’ అని ఆలోచిస్తున్నట్లయితే మరో ఉదాహరణ చూద్దాం.
కర్ణాటకలో మొత్తం ఐటి, ఐటి ఆధారిత సేవల రంగం సుమారు 20 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఓ భారత రైల్వే షుమారు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అంటే కర్ణాటకలో ఐటి, ఐటి ఆధారిత సేవల రంగంలో పని చేస్తున్న వారిలో సగం కంటె కాస్తంత ఎక్కువ. రైల్వేలో మూడు లక్షల నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న విషయాన్ని కూడా గమనించాలి!
‘టాటా, రిలయన్స్, అదానీ: కార్పొరేట్ ఇండియా టాప్ 6 కంపెనీల లాభాలు అధికం, ఇస్తున్న ఉద్యోగాలు స్వల్పం’ అనే శీర్షికతో గత నెలలో ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్‌లో వచ్చిన ఈ కథనం ఉద్యోగ కల్పన పట్ల ఉన్న అపోహను తొలగించింది.
అగ్రశ్రేణి ఆరు కార్పొరేట్ గ్రూపులు తగినంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఈ టాప్ ఆరు గ్రూపుల స్వాధీనంలో ఉన్న అన్ని ఆస్థులకు మార్కెట్ విలువ కడితే అటువంటి విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో ఊహాతీత స్ధాయిలో 43.8% పెరగగా, ఆదాయం 7.3%, లాభాలు 22.3% పెరిగాయి.
మరి ఉద్యోగ కల్పన రేటో ? 0.2%. తిరోగమన దిశలో ఉంది. లాభాల్లో వృద్ధి ఉన్నప్పటికీ, ఉద్యోగాలు పెరగకపోగా తరిగి పోతున్నాయి! ఈ ఆరు గ్రూపుల కింద 69 కంపెనీలు లిస్టయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు అన్నింటిలో కలిపి 17 లక్షల 40 వేలమందది పని చేస్తుంటే 2024లో వీరి సంఖ్య పదివేలు తగ్గిపోయిందది. అంటే 2024లో ఈ ఆరు కంపెనీల్లో కలిపి 17 లక్షల 30 వేల మందది మాత్రమే పని చేస్తున్నారు.
పన్ను వాదన
మీరు ఆ స్థాయిలో సంపాదిస్తున్నపుడు అంతే స్థాయిలో పన్నులు కూడా చెల్లించాలి కదా! కార్పొరేట్లు పన్నులు చెల్లించడం దేశానికి గొప్ప సేవ కాదు. అది వారి బాధ్యత. నిజానికి అది వారి బాకీ. అయితే ఈ ఏడాది ఇక్కడ కూడా విఫలమయ్యారు.
గత సంవత్సరం నుండి టాప్ టెన్ కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల జాబితాను చూద్దాం. క్షమించండి, అదానీ గ్రూప్ ఇక్కడ కూడా కనిపించడం లేదు.
20,713 కోట్ల పన్ను చెల్లించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. 17,649 కోట్ల పన్ను చెల్లించిన దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ రెండో స్థానంలో ఉంది. 15,350 కోట్ల విలువైన పన్ను చెల్లించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు మూడో స్థానం దక్కింది.
అయితే ఈ సంవత్సరం ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కంపెనీలు పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నామని భావిస్తున్నప్పటికీ దేశంలోని మధ్యతరగతి కంటే కార్పొరేట్ ఇండియా వెనకంజలోనే ఉంది. అమృత్ కాల్లో తొలిసారిగా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కంటే సాధారణ పన్ను చెల్లింపుదారుల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2023-24 సంవత్సరంలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల ద్వారా రూ.9,22,000 కోట్లు ఆర్జించగా, ప్రజలు కట్టే ఆదాయపు పన్ను ద్వారా రూ.10,22,000 కోట్లు ఆర్జించింది!
2019లో కార్పొరేట్ పన్ను తగ్గించినందున ప్రభుత్వం ఏటా రూ. 1.44 లక్షల కోట్లు నష్టపోయిందని కొందరు అంచనావేస్తున్నారు.
ఉద్యోగాల తొలగింపు మరియు కాంట్రాక్టీకరణ
ప్రభుత్వం ముఖ్యంగా గత దశాబ్దంలో కార్పొరేట్ కంపకనీల డిమాండ్లను నెరవేర్చడానికి తన పరిధిని దాటి సిద్దపడింది. వారి కోసం రాయితీతో కూడిన భూమిని ఇవ్వడం, పన్ను మినహాయింపులు, కార్మిక చట్టాలను సడలించడం వంటి పనులు చేసింది. ఇవన్నీ చేస్తేనే భారత కార్పొరేట్ రంగం ఎక్కువమందికి ఉపాధి కల్పించగలుగుతుంది అని మనల్ని నమ్మింపచూసింది ప్రభుత్వం, కానీ ఇన్ని రాయితీలు పొందిన తర్వాత కూడా సదరు కార్పొరేట్ రంగం కల్పిస్తున్న ఉపాధి ఎక్కడా కనిపించలేదు.
ఉద్యోగ కల్పనకు బదులుగా, తొలగింపులు పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఐటీ రంగాన్నే తీసుకోండి. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1.4 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బాహాటంగానే ప్రకటించాయి. ఉద్యోగం చేస్తున్నవారు ఎక్కువ గంటలు, అధిక పని మరియు ఒత్తిడితో పోరాడుతున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్న మరో ట్రెండ్. అమానవీయ పని గంటలు, బొటాబొటీ కనీస వేతనం చెల్లిస్తే సరిపోతుందన్న వాదనలు వినపడుతున్నాయి. ఉద్యోగ విపణి స్వభావం మారుతోందని లేదా అనువైన వ్యాపార నమూనాను మార్కెట్ కోరుతుందని రిక్రూట్మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవన్నీ స్థిరమైన ఉపాధి తగ్గుతున్నాయని, సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారతాయని వారు ఆశించడం లేదనే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి మాత్రమేనని తెలుసుకోవాలి.
పైన పేర్కొన్న ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనంలోని చివరి పంక్తి స్పష్టంగా ఇలా పేర్కొంది: ‘‘శాశ్వత ఉద్యోగాలకు కాలం చెల్లింది’’
ఉద్యోగాల వేటలో అలసిపోతున్న లక్షలాది మంది యువతీ యువకులకు ఇది భారీ ద్రోహం. వారి ఆశలను వమ్ము చేయటమే.ఇదీ సంఘటిత రంగం పరిస్థితి. 90% మంది శ్రామికశక్తిని కలిగి ఉన్న, ఎటువంటి సామాజిక భద్రతకు హామీ ఇవ్వని అసంఘటిత రంగం గురించి ఏమిటి?
సంపద పోగేసుకునేవారు
మీరు శ్రద్ధ చూస్తే దేశంలోని చాలా ప్రైవేట్ కంపెనీలు ఎటువంటి సంపదనూ సృష్టించడం లేదని గమనించవచ్చు. వాస్తవానికి అవి ఇప్పటికే ప్రభుత్వం సృష్టించిన సంపదను సొంతం చేసుకుంటున్నాయి.
విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలు, చమురు మరియు గ్యాస్ కాంట్రాక్టులకు సంబంధించిన ఇటీవలి ఒప్పందాల గురించి ఆలోచించండి. ఇది దేశానికి చెందిన సంపద కాదా? అనేక ప్రైవేట్ గుత్త కంపెనీలు ముఠాలుగా ఏర్పడి కాలక్రమేణా సహజ మరియు జాతి వనరులను దోపిడీ చేయడం ద్వారా పాతుకుపోతున్నారు. అలాంటప్పుడు వారిని సంపద స్రుష్టికర్తలు అని ఎందుకు పిలవాలి?
ఇంకో అంశం ఏమిటంటే, సామాన్య ప్రజానీకం ప్రతిఫలంగా ఏమి పొందుతారు?
రైల్వేలో ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఆర్థిక వ్యవస్థలో ఐదు రూపాయల ఆదాయం సమకూరుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, రైల్వేలు దేశంలోని అత్యంత సుదూరంగా నివసించే – కొన్నిసార్లు అత్యంత పేద – ప్రజలను ఆర్థిక వ్యవస్థతో కలుపుతాయి.
అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయాన్నే తీసుకోండి. భారతీయ స్టేట్ బ్యాంకు ప్రతక్ష్యంగా కేవలం 2.3 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఉండొచ్చు. కానీ పరోక్షంగా 50 కోట్ల మంది కస్టమర్లకు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.
ఎల్ఐసీ తన లాభంలో 90% పాలసీదారులతో పంచుకుంటుంది. ఇది దేశంలోని ప్రైవేట్ కంపెనీలతో సహా దాదాపు అన్ని పెద్ద సంస్థలలో పెట్టుబడి పెడుతుంది. వాస్తవానికి ఎల్ఐసీ గత ఏడాది ప్రారంభం నాటికి ఐదు అదానీ కంపెనీల్లో రూ.722 బిలియన్ల పెట్టుబడిని కలిగి ఉంది.
అయినా ప్రభుత్వ రంగాన్ని సవతి బిడ్డలా చూస్తున్నారు.
బహుశా మనం వేరే ప్రశ్న అడగాలి. దేశంలో సంపదను ఎవరు సృష్టిస్తారు అని అడగడానికి బదులుగా దేశంలో (ప్రజల) బాగోగులు ఎవరు పట్టించుకుంటారు, ఎవరి చేతుల్లో దేశం (ఆర్థిక వ్యవస్థ) క్షేమంగా ఉంటుందిన అన్న ప్రశ్న వేసుకోవాలి.
మీరు ఉద్యోగాల కోసం ఎవరి వైపు చూస్తున్నారు? సరసమైన ధరలకు మంచి ఉత్పత్తి లేదా సేవలను ఎవరు అందిస్తారు? మీ సమస్యలను ఎవరు వింటారు? మీ ఫిర్యాదులను పరిష్కరిస్తారు? దేశంలో సరసమైన ఆరోగ్య సంరక్షణను ఎవరు అందిస్తున్నారు? మీ పిల్లల చదువుల గురించి ఎవరు పట్టించుకుంటారు? స్కూళ్లు, కాలేజీలు ఎవరు తెరుస్తున్నారు?
ఎవరూ లేరా ?
అలాంటప్పుడు మీ శ్రేయస్సుకు ఉపయోగపడని కొంతమంది సంపద సృష్టికర్తలను సృష్టించడం ఎందుకు?
కవితా కబీర్ రచయిత్రి మరియు వ్యంగ్య రచయిత్రి.
అనువాదం : నెల్లూరు సర్సింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.