Reading Time: 3 minutes
మన దేశంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించడంపైన ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి ప్రధాన కారణం తగినంత నైపుణ్యాలు లేకపోవడమేనని చాలామంది నింద వేస్తున్నారు, ఇది నిజం కాదు. అప్రెంటిస్‌షిప్‌లు, ఇంటెర్న్షిప్లు వంటి పథకాల ద్వారా నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాల మీద విధానపరమైన ఒక్కాణింపు వున్నది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ సమస్యలో నైపుణ్యాల పాత్ర గురించిన అవగాహనను అట్లా వుంచితే ప్రాథమిక స్కూలు విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై, అక్షరాస్యత, గణిత శాస్త్ర నైపుణ్యాలను అందరికీ అందించడంపై ఒక ఏకాభిప్రాయం వుంటుంది. నైపుణ్యాల శిక్షణకు సంబంధించిన ఎజెండాలో ఈ ప్రాథమిక నైపుణ్యాల హోదా గురించిన ఆలోచన కూడా వుండాలి. దీనికి సంబంధించి ఎన్.ఎస్.ఎస్ ఈ మధ్య విడుదల చేసిన ఒక నివేదికలో` సమగ్ర వార్షిక మాడ్యులార్ సర్వే, 2022`2023` ఆసక్తికరమైన గణాంకాలు వున్నాయి.
భారతదేశపు యువత అక్షరాస్యత గలిగిన జనాభా. 15 నుండి 29 వయసు సంవత్సరాల కలిగిన వాళ్ళలో 96% మంది, ‘‘తమ నిత్య జీవితంలో చిన్న చిన్న సాధారణమైన వాక్యాలను అర్థం చేసుకుని రాయగలగడం, చదవగలగడం చేస్తున్నారు. చిన్న చిన్న గణిత సంబంధమైన లెక్కలను కూడా చేయగలుగుతున్నారు’’ (97.4% పురుషులు, 94.4% మహిళలు) ఇదే అంశంలో 15 సంవత్సరాల పైబడిన వాళ్ళను తీసుకుంటే ఆ సంఖ్య కేవలం 81.2% మాత్రమే (87.9% పురుషులు, 74.2% మహిళలు) అంటే ప్రాథమిక అక్షరాస్యత విషయంలోనూ, లింగపరమైన వ్యత్యాసాన్ని తగ్గించడంలోనూ గణనీయమైన పురోభివృద్ధి వున్నది. 6 నుండి 18 సంవత్సరాల వయసుగల వాళ్ళలో కేవలం 2%మంది మాత్రమే ఎన్నడూ నియత విద్యాబోధన పాఠశాలలో చేరలేదు. విద్యానాణ్యతను పెంచడంపై మన దృష్టిని కేంద్రీకరిస్తూనే, విద్యాహక్కు చట్టం, 2009 విజయవంతం కావడాన్నీ, పిల్లలను బడులకు తీసుకురావడానికి ఉద్దేశించిన ఇతర చొరవలను మనం గుర్తించాలి.
ఈ నివేదికలో మనలను ఆందోళన పెట్టే అంశం ఒకటున్నది. 6 నుండి 10 సంవత్సరాల వయసుగల పిల్లలలో కేవలం 90%మంది మాత్రమే ప్రస్తుతం పాఠశాలలో చేరారు. 10%మంది పాఠశాల వెలుపల వుండిపోయారు. మొదటి నుండి మన దేశంలో చదువుకోవల్సిన వయసులో పిల్లలందర్నీ బడులకు తీసుకురావడం లక్ష్యం. విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించి 15సంవత్సరాలు గడిచిపోయాయి (ఈ చట్టం 6 నుండి 14 సంవత్సరాల వయసుగల పిల్లలకు విద్యను ఉచితం, తప్పనిసరి చేసింది). అయినప్పటికీ ఇంకా అంతమంది పిల్లలు స్కూలు బయట వుండిపోవడం మనల్ని ఆందోళన పెట్టే విషయం. ఈ పిల్లలు ‘‘ఎన్నడూ పాఠశాలలో చేరలేదా’’ లేక ‘‘చేరి బడి వదిలేశారా?’’ అనే వాద వివాదాలలోకి పోవడం అనవసరం. విషయం ఏమిటంటే ప్రస్తుతం వాళ్ళు బడిలో లేరు. ఇది వాళ్ళకున్న విద్యాహక్కుకు ఉల్లంఘన.
పాఠశాల విద్యను పూర్తిచేసే విషయంలో కూడా కొన్ని ఖాళీలు అలానే వుండిపోయాయి. 15, ఆ పైబడిన వయసుగల పిల్లలలో సగటు పాఠశాల విద్యాకాలం 8.4 సంవత్సరాలు. 25 అంతకు పైబడిన వయసలు గల పిల్లలకు సంబంధించి ఇది 7.5 సంవత్సరాలు (పాఠశాల పూర్వ విద్యాకాలం కూడా ఇందులో కలిసింది). 25ఏళ్ళు పైబడిన వాళ్ళలో కేవలం 38.6% మాత్రమే (వీళ్ళలో 46.2% పురుషులు, 31.0% స్త్రీలు) సెకండరీ విద్య నేర్చుకున్నారు (10వ తరగతిగాని అంతకంటే ఎక్కువగాని). మరోవైపు 21 నుండి 35 సంవత్సరాలు వయసుగల పట్టభద్రులందరిలోనూ 37.8%మంది సైన్స్ మరియు టెక్నాలజీ కోర్సులు చదివినవారు (వీరిలో 42% పురుషులు, 32.5% మహిళలు).
ఈ సర్వేకి ముందు 12 నెలల కాలంలో 15 నుండి 24సంవత్సరాల వయసుగల యువతలో సగంమంది` ఇది పెద్ద సంఖ్యనే` ఏదో ఒకరకమైన నియత లేదా అనియత విద్యను పొందారు. (వీరిలో 50.8% పురుషులు, 47.1%మహిళలు). అయితే యువతీ యువకులలో దాదాపు నాలుగో భాగం (23.3%మంది చదువులోగానీ, ఉద్యోగంలోగానీ, శిక్షణలోగానీ లేరు. ఈ విషయంలో స్త్రీ పురుష వ్యత్యాసం చాలా ఎక్కువ వున్నది. స్త్రీలు 38.2%కాగా, పురుషులు 9.9%మాత్రమే. రవాణా సౌకర్యాలు, ప్రయాణం, రక్షణ, ఇతర ఆంక్షలు వంటివి ఈ వయసులో వున్న స్త్రీలకు ఎక్కువగా వుండడమే దీనికి కారణం. అంతేకాక వీళ్ళలో చాలామంది వివాహితులు కావడం మూలంగా వాళ్ళకు ఇంటిపని, పిల్లల పెంపకం పెద్ద బరువుగా మారింది. గణాంకాల ప్రకారం 21 సంవత్సరాల వయసుగల మహిళలలో 61.4%, 25 సంవత్సరాల వయసుగల మహిళలలో 83%మంది వివాహితలు. (ఈ గణాంకాలు భారత ప్రభుత్వానికి యూత్ ఇన్ ఇండియా 2022లో సమర్పించిన నివేదికలో వున్నాయి).
ఆశ్చర్యకరంగా మొబైల్, ఇంటర్నెట్, ప్రాథమిక ఇన్ఫరమేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ నైపుణ్యాలు యువతీ యువకులలో చాలా ఎక్కువ స్థాయిలో వున్నాయి. 15 నుండి 29 సంవత్సరాల వయసుగల వాళ్ళలో 96.4%మంది స్మార్ట్ఫోన్లతో సహా మొబైల్ ఫోన్లను ఉపయోగించగలరు. గత మూడు నెలలోనూ 94.2%మంది యాక్టివ్ సిమ్‌కార్డుతో మొబైల్ఫోన్లు ఉపయోగించుకున్నారు. (వీళ్ళలో 96.4%మంది పురుషులు, 91.8% మహిళలు) 84.2%మంది ఇంటర్నెట్ వాడగలరు. (89.2% పురుషులు, 78.8% మహిళలు). ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్, మెసేజింగ్ సర్వీసుల ద్వారా సందేశాలు పంపించగల నైపుణ్యం 77.7% మందికి వుంది. డాక్యుమెంట్లు, వీడియోలను కూడా జతపరిచి ఫైల్స్ పంపగల సామర్ధ్యం వీరికి వున్నది. (83.8%మంది మగవాళ్ళు, 71.1%మంది మహిళలు). తక్కువే అయినా గణనీయమైన సంఖ్యలో ఈ వయసుకు చెందినవారు వారికి గణాంకాలను, సమాచారాన్ని, డాక్యుమెంట్లను కాపీ`పేస్ట్ సాధనాలను ఉపయోగించి పంపించగల నైపుణ్యం వున్నట్లు తెలిసింది. ఈ నైపుణ్యం 15 నుండి 29 సంవత్సరాల వయసు గలిగిన వాళ్ళలో 70.2%మందికి వుంది. (76.8% పురుషులు, 63% మహిళలు). వీళ్ళలో దాదాపు 2/3వ వంతు మంది ఇంటర్నెట్లో సమాచారాన్ని శోధించగలిగిన సామర్థ్యం కలిగివున్నారు. సగం మంది ఈమెయిల్స్ పంపగలరు, అందుకోగలరు.
ఈ సూచికలలో పురుషులకు మహిళలకు మధ్య వ్యత్యాసం అయితే వున్నది. అంతేగాక గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య కూడా వ్యత్యాసం వుంది. కొన్ని సర్వేలు చూపించినట్లుగా నేర్చుకునే నైపుణ్యంలో కూడా తేడాలు ఒక సమస్యగా వుంది. మార్కెట్‌కు తగినట్లుగా వుండే నైపుణ్యాలను పొందడంలో ` అంటే ఇంగ్లీషులో మాట్లాడడం, డిజిటల్ అక్షరాస్యతను కలగివుండటం` యువత ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవసరమైన లైబ్రరీలు, రిసోర్స్ కేంద్రాలు వాళ్ళకు పెద్దగా అందుబాటులో లేవు. వాళ్ళు విద్యను అయితే కష్టపడి నేర్చుకున్నారుగాని, అక్కడ కూడా తరగతి గదులు, పాఠ్యపుస్తకాలు, అధ్యాపకుల కొరత పెద్ద ఎత్తున వున్నది.
ఎన్ని అవరోధాలు ఎదురైనా లభించిన అవకాశాలను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడానికి యువత ప్రయత్నిస్తోందని పైన పేర్కొన్న గణాంకాలు తెలియచేస్తున్నాయి. వీళ్ళలో చాలామంది తొలితరం అక్షరాస్యులు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి, ఉన్నత విద్య నేర్చుకోవడానికి అపారమైన త్యాగాలు చేస్తున్నారు. తమ పిల్లలను` ఆడపిల్లలైనా మగపిల్లలైనా` చదివించడానికి, చదువులో పోటీ పడడానికి వీలుగా తాము కనీసపాటి సౌకర్యాలను కూడా పొందకుండా పేద తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తున్న అనేక ఉదాహరణలు దేశవ్యాప్తంగా క్షేత్ర అనుభవంలో తెలిసింది. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, తమలాంటి జీవితం గడపకూడదని తల్లిదండ్రులు అనడం తరచూ వినపడుతోంది. అయితే ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ తల్లిదండ్రులకు మిగిలింది అప్పుల భారం, యువతకు నిరుద్యోగంతో పోరాటం. ఇవి దురదృష్టకరం.
దేశంలో విలువైన మానవ వనరు వున్నా దాన్ని ఉపయోగించుకోలేకపోవడానికి కారణాలు, వాళ్ళు స్వంతకాళ్ళమీద నిలబడానికి అవసరమైన ఉద్యోగాలను పొందడానికి, తద్వారా ఉత్పాదకను పెంచి ఆర్థిక వ్యవస్థను సంపన్నం చేయడానికి అవసరమైన పరిస్థితులను కల్పించడంలో ప్రభుత్వం, సమాజం కూడా విఫలం కావడం. యువతను ఒక బరువుగా భావించడానికి బదులు మనం వాళ్ళ శక్తిని గుర్తించి దానిమీద సమాజం నిర్మాణం జరపాలి. ఈ వనరుని ఎంత సమర్ధవంతంగా వినియోగించి అటు యువతకు, ఇటు దేశానికి ఎంత న్యాయం చేయగలమని విధానాలకు, రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం.
– దీపా సిన్హా , అభివృద్ధి ఆర్థిక శాస్త్రవేత్త
అనువాదం : సి.యస్.ఆర్. ప్రసాద్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.