గత కొంతకాలంగా ఓ కొత్త వ్యాఖ్యానం వినిపిస్తోంది. భారత తొలి ప్రధాని నెహ్రూ గురించి. పైపైకి వలసవాద వ్యతిరేక పోరాట యోధుడుగానూ, లౌకిక ప్రజాతంత్రవాదిగానూ కనిపించే నెహ్రూ అసలు సిసలైన ఓబిసి వ్యతిరేకి అనీ, రిజర్వేషన్ల వ్యతిరేకి అనీ, దళితులు, ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకి అన్నదే ఈ కొత్త వాదన.
జాతీయోద్యమ కాలంలోనే వివిధ రాష్ట్రాల్లో ఓబిసి సమస్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొల్హాపూర్, ట్రావెన్కూర్, మైసూర్ సంస్థానాల్లో అధికారం నుండి ఆస్థానం వరకూ అన్నిచోట్లా వ్యాపించియున్న బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ముందు రెండు సమస్యలు తలెత్తాయి.
సమస్య వెనకబడిన కులాలను ఎలా నిర్వచించాలన్నది మొదటి సమస్య.
ఎంత రిజర్వేషన్లు కేటాయించాలన్నది రెండో సమస్య.
అప్పటికే కులగణన వివరాలు అందుబాటులోకి రావటంతో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కుల సంఘాలు పుట్టుకొచ్చాయి. తొలినాళ్లలో ఇంగ్లీషు మాతృభాషగా లేని వారిని సైతం ఓబిసి కేటగిరీగా పరిగణించేవారు. ఇంతటితో కుల సమస్యపై చర్చ ఆగిపోలేదు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా వంటి శిఖరాయమాన నాయకులు కుల సమస్య గురించి తమవైన సిద్ధాంతాలు, సూత్రీకరణలు ప్రతిపాదిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో వలస పాలకులు కులవ్యవస్థను ధర్మ శాస్త్రాలు ఆమోదించాయని తమదైన ఏడు సూత్రాల పథకాన్ని దేశం ముందుంచారు. అయితే ముస్లిం, జైన, పార్శీ వంటి మతాల్లో సైతం కులాలున్నాయని వలసపాలకులు తీర్మానించుకున్నారు. నిజానికి ఇస్లాం కానీ, ఇతర సెమెటిక్ మతాలు కానీ కులాలను గుర్తించవు. ఆ భావనకు ఆయా మతాల్లో తావు లేదు. నెహ్రూ అంటే ఏ మాత్రమమూ గిట్టని రామ్ మనోహర్ లోహియా సైతం వెనకబడిన తరగతుల అభ్యున్నతికి భూసంస్కరణలు, రిజర్వేషన్లు వంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో గట్టిగా సమర్థించారు.
ఈ సంవాదంలో నెహ్రూ స్థానం ఏమిటి? ఆయన వాదనలేమిటి? కుల వ్యవస్థ గురించి నెహ్రూ ఏమైనా కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారా? భారతదేశపు సామాజిక నిర్మాణం పట్ల నెహ్రూ అభిప్రాయాలేమిటి? నెహ్రూ అభిప్రాయంలో కులం, వర్గం ఒకదానితో ఒకటి కలగాపులగంగా ఉన్నాయా?
బహుళ అస్తిత్వాలు, ఉన్నత నాగరికుడు అయినప్పటికీ తాను ఎంచుకున్న రాజకీయ కార్యాచరణ కారణంగా నెహ్రూ దేశంలో అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు వారితో మమేకం కాగలిగారు. అదే సామర్ధ్యంతో అంతర్జాతీయ నేతల సరసనా నడిచారు. తద్వారానే ప్రజాస్వామ్యాన్ని విస్తరించగలమని ఆయన నమ్మారు. ముస్సోలినితో చేతులు కలిపేందుకూ, హిట్లర్‌తో ముచ్చటించేందుకు అవకాశం, సందర్భాలూ వచ్చినా నెహ్రూ అందుకు సిద్ధపడలేదు. 1920 దశకంలో ఉత్తరప్రదేశ్‌లో రైతాంగాన్ని పీడిస్తున్న కౌలు, వెట్టి, వడ్డీదోపిడీ, భూస్వామ్య దోపిడీ, అణచివేత వంటి సమస్యలపై పని చేస్తూ రైతాంగానికి దగ్గరయ్యారు. రైతాంగం సమస్యలను ఆకళింపు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే 1930లో రాయబరేలిలో నెహ్రూ చేసిన ప్రసంగం తొలిసారిగా దేశంలో రైతాంగం సంఘటితమయ్యేందుకు ప్రేరేపించిందంటే ఆశ్చర్యపడనవసరంలేదు.
వలసపాలనలో నెహ్రూకు కుల సమస్య ఎదురుకావటంతో పాటు కులం గురించిన పడికట్టు అవగాహనకు భిన్నంగా ఆలోచించారు. 1944`1945 మధ్యకాలంలో అహ్మదాబాద్‌లో జైలు జీవితం అనుభవిస్తూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశపు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఆయనకున్న లోతైన అవగాహన ఏమిటన్నది అర్థమవుతుంది.
భారతదేశపు సామాజిక నిర్మాణాలు కొన్ని అప్పటికే మారుతూ ఉన్నప్పటికీ ఈ మార్పులు కూడా ముఖ్యంగా మూడు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. స్వయంప్రతిపత్తి కలిగిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలూ, ఉమ్మడి కుటుంబాలు, కుల వ్యవస్థలే ఆ మూడు అంశాలు. ఇండో ఆర్యన్లు దేశీయ తెగలను బానిసలుగా మార్చుకున్నందువల్లనో లేక మూకుమ్మడి సంహారం వల్లనే కుల వ్యవస్థ పునాదులేసుకుందన్న సూత్రీకరణ స్థానంలో నెహ్రూ తనదైన విశ్లేషణతో స్వతంత్ర అంచనాలకు వచ్చాడు. కులాలన్నీ నిర్దిష్ట సేవలు, పనులు ఆధారంగా ఘనీభవించాయన్నది ఆయన అవగాహన. గ్రామీణ జీవితంలో ఆయా సామాజిక సమూహాలు అందించే వస్తు సేవలు, పోషించే ఇతరత్రా పాత్రల గురించి ఈ కోణంలో పరిశీలించటం పట్ల అప్పటి వరకూ పెద్దగా శ్రద్ధపెట్టినట్లు కనిపించదు.
ఇండో ఆర్యన్ సాంప్రదాయాన్ని అనుసరించి దేశంలోని వివిధ సామాజిక సమూహాలు తమ ఆచార వ్యవహారాలకు సంబంధించినంత వరకూ తమతమ ప్రత్యేకతలు కాపాడుకుంటూ కొనసాగేందుకు, కొత్తకొత్త సమూహాలను ఇముడ్చుకునేందుకు కావల్సినంత వెసులుబాటును కలిగి ఉన్నాయని ఆయన భావించాడు. ఈ వెసులుబాటు కారణంగానే వ్యక్తులు తాము ఏ కులంలో పుట్టినా తాము ప్రదర్శించే మేధో సామర్ధ్యాన్ని బట్టి ఉన్నత కులాల్లో భాగమయ్యే అవకాశం ఉందని కూడా నమ్మాడు. ఇదిలా ఉండగా ఇండో ఆర్యన్ తెగల సంతతి మాత్రం తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నత కులాలుగానే మిగిలిపోయాయి.
తన గ్రంథంలో ఆయన ఈ పదాన్ని వాడకపోయినా నెహ్రూ ప్రతిపాదించిన ఆ ప్రత్యేకతలే కుల వ్యవస్థ ఆవిర్భావ సిద్ధాంత వ్యాఖ్యానాల్లో అంతర్భాగంగా మారింది. ఎన్నో ఉపకులాల పుట్టుకను అర్థం చేసుకోవడానికి ఉపకరించింది. అల్బెరూని లాగానో, చాణక్యలాగానో నెహ్రూ కూడా సాంప్రదాయక చాతుర్వర్ణ వ్యవస్థను గుర్తించాడు. చివరి మెట్టుమీద ఉన్న అంటరానివాళ్లను కూడా ఓ కులంగా గుర్తించాడు. కాకపోతే ఈ కులాలుకూడా ఆ చాతుర్వర్ణంలో భాగంగానే ఉన్నాయి తప్ప కులేతర కేటగిరిగా లేవు. ఇక్కడే నెహ్రూ వ్యాఖ్యానంలో కొత్త దనం మనకు కనిపిస్తోంది : నెహ్రూ సోషల్ ఆంథ్రొపొలజిస్ట్లకు మాదిరిగానే సాంస్కృతిక రంగంలో స్వచ్చత, మాలిన్యం భావనలను, కులాంతర వివాహాలు, స్వకులచట్రంలో వివాహాలు వంటి భావనల పట్ల సమ్మతి వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
మను స్మృతి పట్ల నెహ్రూకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. ఆ గ్రంధంలో సామాజిక జీవితంలో వివిధ పార్శ్వాలకు సంబంధించిన విధి విధానాలు, ప్రమాణాలు పద్ధతులు పౌరుల బాధ్యతలు అన్నీ వివరంగా చర్చించిన గ్రంథంలో పౌరులకు ఉండే హక్కుల గురించి మాత్రం ప్రస్తావించకపోవడమే ఆ గ్రంధం పట్ల ఆయన అభ్యంతరాలకు కారణం. దాంతోపాటు వర్తమాన సమాజంలో అమల్లో ఉన్న కుల వ్యవస్థ విధి విధానాలు మారుతున్న సామాజిక అవసరాలకు తగిట్లుగా లేవన్నది నెహ్రూ నిర్ధారణ. అంతేకాదు. ఈ కులకట్టుబాట్లు, నిర్మాణాలు అభివృద్ధి నిరోధకాలుగా ఉన్నాయని, మితవాద ధోరుణలతో కూడుకుని ఉన్నాయని కూడా నెహ్రూ అంచనాకు వచ్చాడు. దాంతోపాటు బౌద్ధం, జైనాలను కూడా నెహ్రూ అధ్యయనం చేశాడు. బౌద్ధం, జైనాలు కులవ్యవస్థ పట్ల కొన్ని మినహాయింపులు ఇచ్చాయి. అందుకే ఎన్ని దాడులు జరిగినా తట్టుకోగలిగాయి. బౌద్ధం సాంప్రదాయపు పరిమితులను, వేదాంత తత్వాన్ని, సామాజిక నిర్మాణాలను అధిగమించి ఎదిగింది. నిలిచింది. చివరికి పుట్టిన దేశం నుండే పారిపోవల్సి వచ్చింది.
ఈ గడ్డమీదకు దాదాపు వెయ్యేళ్ల తర్వాత వచ్చిన క్రైస్తవం కూడా కులవ్యవస్థ చట్రంలో ఇమిడిపోవటం పట్ల ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తాడు. భారతదేశంలో ఇస్లాం విషయంలో కూడా ఇదే జరిగింది. చరిత్రలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలను అధ్యయనం చేస్తూ నెహ్రూ కాలక్రమంలో కుల వ్యవస్థను ప్రతిఘటిస్తూ మొదలైన వాళ్లు కూడా ఏదో ఒక కులంగా మారిపోవాల్సి వచ్చిందని నిర్ధారణకు వస్తాడు. హిందూ అన్న పదం ఎలా వచ్చిందన్న దానిపై నెహ్రూ అంచనాలు గురించి పెద్దగా చర్చ జరగలేదు. హిందూ అన్న పదం అరబిక్ మూలాలున్న పదం అన్న విషయంలో నెహ్రూకు ఎటువంటి సందేహమూ లేదు. మాక్స్ ముల్లర్ వాదనలను స్వీకరిస్తూ ఈ పదానికి మూలాలను జెండ్ అవెస్తాలో వెతకతానికి కూడా నెహ్రూ ప్రయత్నం చేశాడు.
రిజర్వేషన్లు ` ఒబిసిలు
1951లో కులాధారిత జనగణను నెహ్రూ వ్యతిరేకించాడా? ఒబిసిలను వర్గీకరించడానికి, రిజర్వేషన్లకూ నెహ్రూ వ్యతిరేకమా? అన్న సందేహాలకు మనం సమాధనాలు తెలుసుకోవాలి. నిజానికి రాజ్యాంగ పరిషత్‌లోనే దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్ల కేటాయింపుపైనా, ఓబిసి నిర్వచనంపైనా పెద్దఎత్తున చర్చోపచర్చలు జరిగాయి.
ఈ అంశాలపై నెహ్రూ వైఖరి సుస్పష్టమే. రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన ప్రతి చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. కానీ గాంధీ, అంబేద్కర్ల తరహాలోనే ప్రతి చర్చనూ ఆయన ప్రభావితం చేసిన మాట వాస్తవం. అంటరానితనం నిర్మూలనకు ఓటు వేశాడు. ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు సమర్ధించాడు. మైనారిటీలకు రిజర్వేషన్ల రద్దు ప్రతిపాదనలను వ్యతిరేకించలేదు.
శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్ వంటి తనకు సైద్ధాంతికంగా బద్ద వ్యతిరేకులుగా ఉన్నవారికి సైతం ఆయన మంత్రివర్గంలో అవకాశం ఇచ్చాడు. 1951లో సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన సవరణలపై జరిగిన చర్చల్లో ఆయన తీసుకున్న వైఖరి చూస్తే రిజర్వేషన్ల గురించి నెహ్రూ అభిప్రాయం ఏమిటన్నది అర్థమవుతుంది. కులాధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తొలి సవరణ అవసరం అయ్యింది. కోర్టు తీర్పును స్వాగతిస్తూనే ఈ తీర్పు బాహాటంగా కానీ, లోపాయికారీగా కానీ ఉన్న రాజ్యాంగ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉన్నదని స్పష్టం చేశాడు. దేశంలో 80 శాతం జనాభా సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాలపరంగా కూడా వెనకబాటుతనంతో ఉన్నారని గుర్తించాడు. ఈ దేశాన్ని సమసమాజంగా మల్చుకోవాలంటే భారతీయ సమాజంలో అడ్డంగా నిలువుగా చీలిపోయి ఉన్న ప్రజల మధ్య శాశ్వతమైన ఐక్యతను సాధించటమే తప్ప మరో మార్గం లేదని, దానికోసం దేశ పౌరులంతా కృషి చేయాలని నెహ్రూ గుర్తించాడు. ఈ సవరణ ద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతులకు ప్రత్యేక అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం జరిగింది.
వెనకబడిన తరగతుల సర్వతోముఖాభివృద్ధి ప్రత్యేకించి సామాజిక ఆర్థిక విద్యావిషయక, ఉపాధి రంగాల్లో వారి అభివృద్ధి మనమంతా తిరస్కరించలేని బాధ్యత అన్నాడు నెహ్రూ.
ఓబిసిలు, కుల అస్త్తిత్వ సమస్యల పట్ల నెహ్రూకు ఉన్న నిబద్ధత కాకా కలేల్కర్ కమిటీ నియామకంలో కనిపిస్తుంది. ఈ కమిటీ కారణంగానే అప్పటికి దేశంలో ఉన్న 2399 కులాలకు ప్రత్యేకమైన అస్తిత్వం దక్కింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వలస ప్రభుత్వం 1871లో మొదలు పెట్టి 1931లో పూర్తి చేసిన కుల గణన ఆధారంగానే తొలి బిసి కమిషన్ పని చేయాల్సి వచిచంది.
కలేల్కర్ కమిషన్ పని ప్రారంభించే నాటికి రెండు మౌలిక సమస్యలు దేశం ముందున్నాయి. మొదటిది వెనకబడిన తరగతులు అన్న పదబంధాన్ని నెహ్రూ వ్యతిరేకించటంతో తలెత్తిన సమస్య. నెహ్రూ వాదనేమిటంటే దేశంలో అత్యధిక భాగం వెనకడే ఉన్నారు కనుక కేవలం నిర్దిష్ట కులాలను మాత్రమే ఉద్దేశించి ఈ వర్గీకరణ చేయటం అంటే ఆయా కులాలపట్ల అన్యాయంగా వ్యవహరించటమేనన్నది నెహ్రూ వాదన. రెండోది కులగణన. నెహ్రూ కంటే ఎక్కువగా పటేల్ కుల గణను వ్యతిరేకంచాడు. కుల గణన జరిగితే దేశం కులాల కుళ్లుతో నిండి ఉన్నదన్న వాస్తవం లోకానికి తెలిసిపోతుందన్నది పటేల్ వ్యతిరేకతకు కారణం. స్వాతంత్య్రానంతరం తొలి రెండు దశాబ్దాల్లో మైసూర్, తమిళనాడు, బీహార్, కేరళ వంటి రాష్ట్రాలు బిసి కమిషన్లను నియమించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న బిసి కులాలను గుర్తించటానికి చేస్తున్న కృషిని నెహ్రూ వ్యతిరేకించకపోవటం గమనించాల్సిన విషయం. కాకపోతే 1961లో ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో మాత్రం ఆయా వెనకబడిన కులాలను విద్యావంతులను చేయటం ద్వారా సాధికారవంతులను చేయాలే తప్ప ఆయా కులాలకు గుర్తింపు ఇవ్వటం ద్వారా కాదని చెప్పారు. జాతీయ సామాజిక జీవనంలో వేళ్లూనుకున్న కులాధిపత్యం, వర్గ దోపిడీలను నియంత్రించే లక్ష్యంతోనే జమీందారీ రద్దు చట్టాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
నెహ్రూ వ్యక్తపర్చిన గందరగోళాన్ని మనం రెండు కోణాల్లో చూడాలి. కుల వ్యవస్థ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయటానికి దోహదం చేసిందని గుర్తిస్తూనే నెహ్రూ చోళుల కాలంలో జరిగిన కృషిని, అనుభవ మండప నిర్మాణ కౌశలాన్ని, సాంస్కృతిక సమ్మేళనత్వాన్ని గుర్తించనిరాకరించాడు. కేవలం బౌద్ధాన్ని మాత్రమే ఆయన గుర్తించాడు. నెహ్రూ దృష్టిలో కులం అన్నది ఓ వర్గీకరణ మాత్రమే తప్ప నిర్దిష్ట లక్షాణాలున్న అస్తిత్వం కాదు. ఆయన దృష్టిలో కులం అన్నది ఆర్య ద్రవిడ సాంస్కృతిక ఘర్షణల్లో పుట్టుకొచ్చింది. దేశం ఎంచుకున్న అబివృద్ధి మార్గంలో పురోగమిస్తే కులపరమైన అస్తిత్వాల అవసరమే తలెత్తదని నమ్మాడు.
హ్యూయాన్ సాంగ్ నుండి ప్లాటో వరకూ, వేదాల నుండి ఉపనిషత్తుల వరకూ అధ్యయనం చేసిన నెహ్రూ లాంటి పండితునికి దేశంలో ఉన్న వైరుధ్యాలు కనిపించకపోవటం ఏమిటి?
బహుశా దీనికి ఏకైక కారణం ఆయన వర్గం, గాంధీ ప్రభావం, వలసవాద సిద్ధాంతాలు, ఆధునిక భారత నిర్మాణం గురించి తానుగన్న కలలు, వర్గదృక్ఫధంపై వక్కాణింపు మధ్య ఆయనుకున్న ఊగిసలాటే. దురదృష్టవశాత్తూ ఆయన ఊహించిన కులపరమైన వర్గీకరణ వెనకపట్టు పట్టింది. ఆయన ఆశించిన ఆధునిక భారత నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
రచన: ముజఫర్ ఆసది
అనువాదం : కొండూరి వీరయ్య
(ముజఫర్ అస్సది మైసూర్ విశ్వవిద్యాలయంలో డీన్‌గా పనిచేశారు)