
ఈ సంవత్సరం ఏప్రిల్30వ తేదీనాడు, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాబోయే జాతీయ జనాభా గణనలో కులగణనను అంతర్భాగం చేస్తామని ప్రకటించింది. జనగణన ఇప్పటికే నాలుగు సంవత్సరాలు ఆలస్యం అయింది. లోక్సభలోను, బయటా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మద్దతు ఉన్న బీజేపీ పైన, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైన నిరంతరం ఒత్తిడి పెంచిన ఫలితంగానే కులగణన ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించి, ఎగతాళి చేసిన బీజేపీ అనూహ్యంగా కులగణనకు అనుకూల నిర్ణయం తీసుకుంది.
రాహుల్ గాంధీ “జిత్నీ అబాది ఉత్నా హక్”(జనాభాలో నిష్పత్తి ప్రకారం హక్కు) నినాదం వెనుకబడిన వర్గాలలో ఒక ఉద్యమం ఆవిర్భవించటానికి కారణభూతమైంది. దేశ జనాభాలో వివిధ కులాల నిష్పత్తులను బట్టి దేశ వనరులను న్యాయంగా పంపిణీ చేయాలనే డిమాండ్‌ను ఈ ఉద్యమం లేవనెత్తింది. అణగారిన వర్గాల మధ్య, ముఖ్యంగా ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీలు) మధ్య వనరుల పంపిణీ న్యాయంగా జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహించాలని అత్యంత గట్టిగా పోరాడుతున్న వ్యక్తిగా రాహుల్ గాంధీ నిలిచారు. ఓబీసీలకు న్యాయమైన హక్కులను ఇవ్వడంలో బీజేపీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సందేహాస్పద రికార్డును కలిగి ఉన్నాయి.
ఇటీవలి కాలంలో బీజేపీ ఓబీసీలను తాము అధికారాన్ని కైవశం చేసుకోవటానికి ఉపయోగపడే లాభదాయకమైన ఓటు బ్యాంకుగా భావిస్తోంది.
వెనుకబడిన కులాల ఓట్లను చీల్చడం ద్వారా ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నేరుగా పోరాట వైఖరిని తీసుకుని వెనుకబడిన కులాల గొంతులుగా యూపీ, బీహార్లలో ఆవిర్భవించిన సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లను వెనుకబడిన కులాల ఓట్లను చీల్చడం ద్వారా బలహీనపరచి ఎన్నికల్లో ప్రయోజనం పొందే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ఎస్సీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకోవడం ద్వారా షెడ్యూల్డ్ కులాలను చీల్చినట్టుగానే, బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఓబీసీ సమాజాన్ని లోపలి నుంచి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు బీజేపీ ఓబీసీలను అంతర్గతంగా కులాల వారీగా విభజించడానికి ప్రయత్నిస్తుంది. సంఖ్యాపరంగా పెద్ద, చిన్న ఓబీసీ సమూహాల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించడం ద్వారా, బీజేపీ కృత్రిమ కలహాలను సృష్టిస్తోంది. ఓబీసీల సామూహిక హక్కుల డిమాండ్‌ను పట్టాలు తప్పిస్తోంది.
ఈ విభజన రాజకీయాలు కుల- జనగణన కోసం, నిజమైన ప్రాతినిధ్యం కోసం ఇచ్చిన ఐక్య పిలుపును బలహీనపరచడానికి ఉద్దేశించబడ్డాయి. స్పష్టంగా చెప్పాలంటే అత్యంత పారదర్శకతగల కులగణన మాత్రమే ప్రతి కులం, చిన్నదా లేక పెద్దదా అనే తేడాలేకుండా, అధికారంలో, పాలనలో దాని న్యాయమైన వాటాను హక్కుగా పొందేలా చేస్తుంది. నిజమైన ప్రాతినిధ్యంతో ఓబీసీల సాధికారత పెరుగుతుంది. దానితో ఒకరిపై మరొకరు పోటీ పడవలసిన అవసరం ఉండదు. అందుకే బీజేపీ కులగణనకు భయపడుతుంది. ఇది వారి లాంచనప్రాయత(టోకెనిజాన్ని)ను బహిర్గతం చేస్తుంది. అధికారంపై వారి పట్టును సడలేలా చేస్తుంది.
మండల్ రాజకీయాలను వ్యతిరేకించడం, ఓబీసీల గుర్తింపును తిరస్కరించడం, కుల ఆధారిత రిజర్వేషన్లను వ్యతిరేకించడంలో సంఘ్ పరివార్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది.
వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లపై మండల్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం నుంచి, ఆ తరువాత ఆ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించడం, హిందూత్వ మత రాజకీయాల ద్వారా మండల్‌ను ఎదుర్కోవడానికి “మందిర్ రాజకీయాల” ఎజెండాను ఉపయోగించడం వరకు, వెనుకబడిన తరగతులు తమ న్యాయమైన హక్కును సాధించాలనే ఆలోచనను బీజేపీ ఎల్లవేళలా వ్యతిరేకించింది.
1994లో అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మధ్యప్రదేశ్‌లో ఓబీసీలకు 14% రిజర్వేషన్‌ను అమలు చేశారు. 2002–2003లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 50% కంటే ఎక్కువగావున్న ఓబీసీ జనాభాను ప్రతిబింబించేలా ఆ రిజర్వేషన్ని 27%కి పెంచాలని ప్రయత్నించింది. అయితే, చట్టపరమైన, విధానపరమైన సవాళ్ల కారణంగా ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. 2003లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా ప్రభుత్వాలు 27% కోటాను అమలు చేయడంలో విఫలమయ్యాయి.
ఆ విషయం ఇప్పుడు న్యాయస్థాన పరిశీలనలో ఉంది. ఆశిష్ భార్గవ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో జరుగుతున్న విచారణ సందర్భంగా, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న నిరంతర జాప్యంపై సుప్రీంకోర్టు పదే పదే ప్రశ్నించింది. ఆర్టికల్స్ 15(4), 16(4) కింద రాజ్యాంగంలో స్పష్టమైన అనుకూలత ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని గణనీయమైన ఆధారాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగాలలో, అవకాశాలలో వారి న్యాయమైన, చట్టబద్ధమైన వాటాను నిరాకరిస్తూనే ఉంది.
కులగణనను నిన్నటిదాకా తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ ఆకస్మికంగా అనుకూలంగా మారడం అనేది మనసు మార్చుకోవడం వల్ల కాకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా జరిగింది.
వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఆ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఎల్లప్పుడూ అగ్రవర్ణాలే ఉండటం. మండల్ కమిటీ సిఫార్సుల అమలుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆత్మహత్యా ప్రయత్నాల వంటి ఘటనల్లో అగ్రవర్ణాలకు చెందినవారే ముందు వరుసలో ఉన్నారు.
సంఘ్ పరివార్ అంటేనే అగ్రకుల ఆధిపత్యం
ఇప్పటివరకు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోవున్న ఆరుగురు సర్సంఘ్ చాలక్లలో ఐదుగురు బ్రాహ్మణులు కాగా, ఒకరు క్షత్రియుడు. ఇది సంఘ్ పరివార్ నిజమైన అగ్రవర్ణ స్వభావాన్ని తేటతెల్లం చేస్తుంది. ఇది ఒక ఉన్నత కుల ఆధిపత్య సంస్థ. ఇది వెనుకబడిన తరగతులను కేవలం లాంఛనప్రాయంగానే ఉపయోగించుకుంటుంది. హిందూ సమాజంపట్ల ఈ సంస్థ అవగాహన అత్యంత వక్రీకృతంగా ఉంటుంది. ఈ సంస్థలో అన్ని నిర్ణయాత్మక స్థానాలు ఉన్నత కులాల కోసం మాత్రమే కేటాయించబడతాయి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీలు పురాణాలను, హిందూ గ్రంథాలను ఉదహరించడానికి ఎల్లవేళలా ఆసక్తి చూపుతుంటాయి. విలువిద్యలో అర్జునుడి కంటే మెరుగైన విలుకాడిగా ఏకలవ్యుడిని ఉదాహరణగా ఇవ్వడం సముచితం. కానీ ఏకలవ్యుడు వెనుకబడిన తరగతికి చెందినవాడైనందున, అర్జునుడికి గురువైన ద్రోణాచార్యుడు తనకు ఇష్టమైన అగ్ర కుల యువరాజు అర్జునుడిని అధిగమించకుండా చూడటానికి ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు.
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడంలో బీజేపీది రికార్డు. అలాగే సమాధానాలు లేని ఎన్నికల కమిషన్ ప్రవర్తనపై లేవనెత్తిన ప్రశ్నలు ఎన్నో. కాబట్టి జనాభా గణనలో అంతర్భాగం కానున్న కులగణనకు సంబంధించిన డేటాను తారుమారు చేయకుండా న్యాయంగా నిర్వహించేలా చూడటం చాలా ముఖ్యం.
కుల- జనాభా గణన డేటాను తారుమారు చేస్తే, ఓబీసీ సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కులగణనను సమగ్రంగా నిర్వహించకపోతే, కుల- జనగణనను తక్కువగా నమోదు చేస్తే విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలలో దామాషా రిజర్వేషన్లను తిరస్కరించడంగా పరిణమిస్తుంది. పర్యవసానంగా సానుకూల వివక్ష(affirmative action) పునాది బలహీనపడుతుంది. జనాభా మారుతున్నప్పటికీ, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన కులాలలో న్యాయం కోసం పెరుగుతున్న డిమాండ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతమున్న 27% ఓబీసీ కోటాను కొనసాగిస్తే చాలనే వాదన సమర్థించబడుతుంది.
ఉదాహరణకు, ఇటీవల నిర్వహించిన బీహార్ కుల సర్వేలో ప్రతి రంగంలోనూ అగ్ర కులాలకు గల అత్యధిక ప్రాతినిధ్యం బయటపడటంతో బీజేపీ ఇబ్బందిపడింది. అగ్ర కులాలు బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నందున, భవిష్యత్తులో కులగణన నుంచి ఇటువంటి ప్రతికూల వాస్తవాలు బయటకు రాకుండా చూడటానికి ప్రయత్నం జరగవచ్చు.
తారుమారు చేసిన డేటాను ఓబీసీ కమ్యూనిటీలో విభజనలను సృష్టించడానికి, ఒక సమూహాన్ని మరొక సమూహానికి వ్యతిరేకంగా నిలబెట్టటానికి, రాజకీయ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రూపొందించబడే వ్యూహంలో ఉపయోగించవచ్చు. అటువంటి లోపభూయిష్టమైన డేటా మరో దశాబ్దంపాటు అపసవ్య విధానాలు రూపొందటానికి బాటలు వేస్తుంది. ఎందుకంటే అటువంటి లోపభూయిష్ట డేటా ఆధారంగానే అన్ని భవిష్యత్ ప్రణాళికలు రచింపబడతాయి. పర్యవసానంగా నిజమైన వెనుకబడిన వర్గాలకు కేటాయించ వలసిన వనరులు, రావలసిన ప్రాతినిధ్యం అందకుండా పోతుంది.
ఓబీసీలు అధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారనే తప్పుడు కథనాన్ని ముందుకు తీసుకురావడానికి వక్రీకరింపబడిన గణాంకాలను కూడా ఉపయోగించవచ్చు. ఇది అగ్ర కుల వ్యతిరేకతకు ఆజ్యం పోస్తుంది. రిజర్వేషన్ వ్యతిరేక భావాలను బలపరుస్తుంది.
నియోజకవర్గాల హద్దులను(డీలిమిటేషన్), స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించడానికి ప్రాతిపధికగా జనాభా లెక్కల డేటా ఉంటుంది. కాబట్టి తారుమారు చేసిన కులగణన సంఖ్యలు వివిధ ప్రజా సంస్థలలో ఓబీసీ ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి దారితీయవచ్చు. తద్వారా వారి ప్రజాస్వామిక స్వరాన్ని వినపడకుండా చేయవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే, లోపభూయిష్ట కుల గణన కేవలం గణాంక లోపం కాదు. అది సామాజిక న్యాయం, సమానత్వాలకు సంబంధించిన రాజ్యాంగ దృక్పథంపై చేయనున్న దాడి అవుతుంది.
కులగణన వాస్తవ రూపం దాల్చనున్న నేటి సందర్భంలో మనం ఆగి అడగవలసిన ప్రశ్న: బీజేపీ కులగణనను న్యాయంగా, నిజాయితీగా నిర్వహిస్తుందని విశ్వసించవచ్చా? చరిత్ర, ప్రస్తుత వాస్తవికత చెప్పే సమాధానమేంటంటే, ‘విశ్వసించజాలం’అనే.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
అఖిల్ చౌదరి రాజస్థాన్‌లో నివసించే మానవ హక్కుల న్యాయవాది. ఆయన X @akhilchaudharyలో పోస్ట్ చేస్తారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.