
పహల్గాం తీవ్రవాద దాడి, దానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మనం తీసుకున్న చర్యల గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు, నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాయబారులతో సహా ఏడు ప్రతినిధి బృందాలను ఎంపిక చేసి 33 దేశాలకు పంపించింది. నిజానికి భారతదేశానికి అనుకూలంగా ప్రపంచ దేశాల అభిప్రాయాలను కూడగట్టడానికి, అన్ని రూపాలలో అన్ని వ్యక్తీకరణలలో ఉన్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారతదేశం పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉందని తెలియచేయడానికి “ప్రాజెక్ట్ ఇండియా ”ను నిర్వహించింది.
అయితే, ఈ బృందాలలోని సభ్యులు- 33 దేశాలకు వెళ్లిన వారిలో కనీసం 25 మంది- ఆయా దేశాల్లోని భారతదేశీయులను కలుసుకోడానికి – అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడానికి, తమ రాజకీయాలు వ్యాప్తి చేసుకోడానికి ఉపయోగించుకున్నారు. అందువలన ఈ ప్రాజెక్టు లక్ష్యం పాకిస్తాన్‌ని అంతర్జాతీయంగా ఒంటరిని చేయడంపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడిందా లేదా అనేది చర్చనీయాంశమైంది.
ఈ పరస్పర కలయికలలో విదేశాలకు వెళ్లిన ప్రతినిధులు దేశీయ రాజకీయ వేదికలపై చేసిన ప్రసంగాల లాంటివే అక్కడ కూడా చేశారు. అందులో అత్యధిక భాగం సభ్యులు తమ వాక్చాతుర్యతకే ప్రాధాన్యతనిచ్చారు. ఈ ప్రసంగాలలో ఎక్కువ భాగం, హిందుత్వ సిద్ధాంతానికి ప్రతీక అయిన భారతీయ జనతా పార్టీతో మమేకమయ్యే హిందీ భాషలో సాగాయి. బీజేపీ ప్రపంచ పటంపై తన హిందుత్వ తీవ్రవాద చరిత్రని చతురతతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. పైగా బృంద సభ్యులు రాయబారంపై దృష్టి పెట్టడం కొరవడింది.
ఈ బృంద సభ్యులు ఎంతగా తమ సమయాన్ని విదేశాలలోని పర్యాటక స్థలాల సందర్శనకు వినియోగించుకున్నారంటే, వాళ్ళు వెళ్లిన అసలు పని ఏమాత్రం అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించలేదు. బృంద సభ్యులంతా ముఖాముఖీలు ఇవ్వడంలో, రాత్రి భోజన సమయాల్లో పాటలు పాడటంలో, సాంప్రదాయ నృత్యాలు చూడడంలో తలమునకలయి మొత్తం కాలం వెళ్లబుచ్చారు .
ప్రతినిధి బృందాలు దేశ ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి?
ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న వారిలో ఒకరు పార్లమెంటు సభ్యుడు సంజయ్ ఝా, లీ ఏచాం లేదా చార్లీ అనే అతను పాట్నాలో పెరిగిన కారణంగా , అతనిని సోషల్ మీడియాలో కొరియా బిహారీగా చెప్పుకుంటారు. ఝా అతనితో సియోల్‌లో కలిసి, ఒక వీడియో కూడా చేశారు.
ఝా, తాను నడిపిన సంభాషణను యూ ట్యూబ్‌లో, ఎక్స్‌లో కూడా పెట్టి పాట్నాలో పెరిగిన చార్లీని కలవడం “విభిన్నమైనది, ప్రత్యేకమైనది”అని రాశారు.
ఝా ప్రతినిధి బృందంలో ఒకరైన బీజేపీ పార్లమెంటు సభ్యుడు, అపరాజిత సారంగి ఇండోనేషియాలోని జకార్తాలో ఉండగా, అక్కడ రాయబార కార్యాలయంలో “బిజూ హాల్ ”కు ప్రారంభోత్సవం చేశారు. అక్కడే మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆమె అక్కడి ఒరియా మాట్లాడే వారిని కలిశారు .
త్రిణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ బృందంలో ఓ సభ్యులే. ఆయన అక్కడి జకార్తా బెంగాలీ అసోసియేషన్(జేఏబీఏ)తో మాటామంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది “ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులను కలిసే తన నిబద్ధతకి తార్కాణం” అని కూడా చెప్పుకున్నారు.
రాష్ బిహారీ బోస్ స్మృతి చిహ్నాన్ని కూడా బెనర్జీ సందర్శించారు. అంతేకాదు స్పెయిన్‌లో పర్యటిస్తున్న డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి తమిళులను కలిశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటక ప్రదేశాల సందర్శన..
వారి అధికారిక కార్యక్రమాలు పక్కన పెడితే, ప్రతినిధి సభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలు చూసే సమయం పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ పనామాలో తాను పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమం ఫొటోలను “ఎక్స్”లో ప్రచురించారు. దీనిని పార్లమెంటు సభ్యుడొకరు “గర్భ షూట్ అవుట్” అని ఎద్దేవా చేశారు.
బీజేపీ ఎంపీ రేఖ శర్మ అల్జిరియాలో రాత్రి భోజనసమయంలో పాటలు పాడిన వీడియో సామాజిక ప్రసార మాధ్యమాలలో కనిపించింది- ఇది సామాజిక మాధ్యమాల్లో కొంతమంది కాంగ్రెస్ సభ్యుల విమర్శలు ఎదుర్కొంది. శర్మ తనను తాను సమర్ధించుకుని, “అసలైన రాయబార కార్యక్రమంలో పాల్గొన్న దాన్ని వక్రీకరించడం చాలా బాధాకరం” అని రాశారు.
“అల్జీరియన్స్కు ఎంతో ఇష్టమైన ఈ పాట ఒక పార్టీలో పాడ లేదు. కానీ భారతదేశం పట్ల ఎంతో స్నేహభావం నిండిన గదిలో, స్నేహానికి ఒక సంకేతంగా మాత్రమే పాడాను. కాంగ్రెస్ దుష్ప్రచారం చేసినట్లు ఇది పాడింది కువైట్‌లో కాదు” అని దావా చేశారు.
అనేక పర్యాటక కేంద్రాలను సందర్శించిన ప్రతినిధుల బృందం..
ఉదాహరణకి అల్జీరియాలో బీజేపీకి చెందిన బైజయంత్ పాండా ఎల్ అలియా సెమెటరీని దర్శించి ఆధునిక అల్జీరియా వ్యవస్థాపకుడు అయిన అమీర్ అబ్దుల్ డెర్కు పుష్ప గుచ్చాన్ని సమర్పించి ఘన నివాళులు అర్పించారు. బాసిల్లస్లో ఔర్ లేడీ ఆఫ్ ఆఫ్రికాలో పహల్గాం దాడికి గురైన బాధితులు స్మృత్యర్ధం క్యాండిల్స్ వెలిగించారు. అక్కడి మృతవీరుల స్మృతికి – నేషనల్ మ్యూజియం ఆఫ్ ది మౌదుజాహిద్లో నివాళులు అర్పించారు.
సౌదీ అరేబియాలోని ప్రతినిధి బృందం డిరి ,- యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశాన్ని పర్యటించింది. బెహ్రయిన్‌లో బాబ్ అల బహరేన్‌లోని చారిత్రక ప్రసిద్ధ స్థలం మనామాను సందర్శించారు.
కౌలాలంపూర్, మలేషియాలోజేడీయూ నాయకత్వంలోని ఝా, రామకృష్ణ మిషన్‌ను సందర్శించారు. స్వామి వివేకానందుని విగ్రహానికి పుష్పగుచ్చాలిచ్చి, నివాళులు అర్పించారు. ఈ విగ్రహాన్ని 2015లో మోడీ ఆవిష్కరించారు. ఈ బృందం బ్రిక్ ఫీల్డ్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్‌ని దర్శించి సుభాష్ చంద్ర బోస్‌కు నివాళులు అర్పించారు. తొరణా గేట్ కూడా దర్శించారు. దీనిని 2015లో భారతదేశం బహుమతిగా ఇచ్చింది.
శశిథరూర్ నేతృత్వంలోని బృందం పనామాకు వెళ్లినప్పుడు పనామా కాలువను దర్శించారు. ఈ కాలువ చిత్రాలు ఎక్స్ వేదికగా ప్రచురిస్తూ శశి థరూర్, “ఇదొక వందేళ్ల కిందటి ఇంజినీరింగ్ అద్భుతం. ఒక భారీ నౌక ఇందులో నుండి వెళ్లడం ఊపిరి బిగబట్టుకుని చూశాను. నౌక ఒక చోటికి వెళ్ళినప్పుడు కవాటాలు తెరుచుకుంటే వేరొక చోటకు వెళ్ళగానే కవాటాలు మూసుకున్నాయి. ఒక ఔత్సాహికుడిగా నేను తీసిన చిత్రాలు ఈ కాలువ గొప్పతనాన్ని సరిగ్గా ప్రతిబింబించ లేదు ” అని అన్నారు.
ఇంగ్లాండ్‌లో బీజేపీ ప్రతినిధి ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అంబేద్కర్ మ్యూజియం సందర్శించారు. ఈజిప్ట్‌కు వెళ్ళిన ప్రతినిధి బృందం కైరోలోని హీలియో పోలీస్ వార్ మెమోరియల్‌ని దర్శించింది. అబుదాబికి వెళ్లిన ప్రతినిధి బృందానికి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నాయకత్వం వహించారు. వారు షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు, గురునానక్ దర్బార్ గురుద్వారా దర్శించారు.
భారత జాతీయులను కలుసుకోవడం..
ఈ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ భారత జాతీయులు ఏర్పాటు చేసిన ముఖ ముఖిలలో లేదా ఆహ్వాన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చేసిన ప్రసంగాలు ఆద్యంతం పాకిస్థాన్‌పై ఎక్కుపెట్టి సాగాయి- తీవ్రవాదులపై వాడిన ఆ భాష , వాక్పటిమ దేశంలోని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రసంగించి నట్టుగా ఉంది.
దేశంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంలో అతిశయంతో కూడిన దేశ భక్తి ప్రతిధ్వనించింది. అమెరికాలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశం “ఒకటి కాదు వంద ఆపరేషన్ సిందూర్”లు కూడా చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
“భారతదేశం యుద్ధాలు కోరుకోదు. మా నాగరికతలో యుద్ధాలు చేయాలన్న తాపత్రయం లేదు. మా ప్రతినిధి బృంద నాయకుడు శశిథరూర్ చెప్పినట్టు, మాది బుద్ధుడు, గాంధీ పుట్టిన దేశం. అయినంత మాత్రాన మేము అధర్మాన్ని చూస్తూ ఉరుకోము. దాడులు చేయడం ఆగితే శాంతి వికసిస్తుంది. కానీ మాపై దాడి చేస్తే, మేము స్తబ్దుగా చూస్తూ ఊరుకోము. ఒకటి కాదు వంద ఆపరేషన్ సిందూర్లు అయినా చేస్తాము ” అంటూ సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
భారత జాతీయులతో ఇటువంటి ముఖాముఖిలు 33 దేశాలలో 25 దేశాలలో జరిగాయి. కతర్, కువైట్, స్లొవినియా, కాంగో, గ్రీస్, ఇటలీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా, అల్జీరియా, యూకే, బ్రస్సెల్స్, డెన్మార్క్, మలేసియా, సౌత్ కొరియా, యూఏఈ, లైబీరియా, సియర్రా లేవోయీ, పనామా, కొలంబియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ, లాట్వియా, ఇథియోపియా.
పారిస్ లో బీజేపీ ఎం పి సమిక్ భట్టాచార్య ప్రసంగాలు , సూర్య ప్రసంగాలలాగానే ఉన్నాయి; అయితే ఆయన హిందీ లో మాట్లాడారు.
“పాకిస్థాన్ సింధూరాలు తుడిచేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంది ” అన్నారు.
వెనక పడిపోకుండా ఉండడానికన్నట్టు బీజేపీ రాజకీయ మిత్రుడు, ప్రభుత్వంలో భాగస్వామి, జేడీయూ ఎంపీ ఝా కూడా టోక్యోలో హిందీలో మాట్లాడారు. నరేంద్ర మోడీ , పహల్గాం మీద దాడి జరిగిన రెండో రోజు బీహార్ పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి మోడీ సభకు ఝా పార్టీ నాయకులెవరు హాజరు కాలేదు.
ఈ దాడి జరిగింది ఏప్రిల్ 22వ తేదీ. అప్పుడు ప్రధాని మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నేను బీహార్‌లోని మధుబని నుంచి వచ్చాను. అప్పటికే అక్కడ ప్రధాని పర్యటన ప్రకటించారు. ఇప్పుడు “మేము ఇదివరకటిలా ముందు ఫోన్ చేసి హెచ్చరికలు చేయం. తీవ్రవాద శిబిరాలను ఏకంగా మట్టు పెడతాము. మేము మీ పౌర ఆవాసాలను ముట్టుకోము. భారతదేశ సైన్యం కేవలం తీవ్రవాద శిబిరాలను లక్ష్యం చేసుకుని వాటి మీదే గురిపెట్టింది. అంగుళం కూడా ఇటుఅటు పోలేదు”అన్నారు. సభికుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
అధికార పక్షాన్ని ప్రతిపక్షం కూడా అనుసరించింది. ప్రసంగాలు అన్నీ పాకిస్తాన్ ఆధారంగా కొనసాగుతున్న తీవ్రవాదంపైనే కేంద్రీకరించి సాగాయి.
“మా దేశంలో నుంచి , మా సైనికులు మీ దేశంలోని తీవ్రవాద స్థావరాలపై దాడి చేశారు. ఈ తీవ్రవాద స్థావరాలను భారతదేశ ప్రభుత్వం ప్రకటించలేదు. వీటిని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. ఈ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామంటే మేము యుఎన్ చేయాల్సిన పని చేస్తున్నామని అర్ధం” అని శివ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది బెర్లిన్‌లో అన్నారు. “మేము పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశాం. కానీ పాకిస్థాన్ మా కశ్మీర్‌ని ఆక్రమించుకుంది” అన్నారు
ఆ తర్వాత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్‌ని తాలిబన్ సాంక్షన్స్ కమిటీ చైర్మన్‌గా, కౌంటర్ టెర్రరిజం కమిటీ వైస్ చైర్మన్‌గా నియమించడాన్ని గురించి ప్రస్తావించారు. “ఇది మసూద్ అజర్‌ని, హఫీజ్ సయీద్‌ని ప్రపంచ శాంతి , న్యాయం కోసం పోరాడామని అడిగినట్టు ఉందని” అన్నారు.
అక్కడికి హాజరైన ప్రజానీకాన్ని కూడా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మలేసియాలోని కౌలాలంపూర్‌లో “మీరు పాకిస్తాన్ సైనికాధికారి, తీవ్రవాది అంతిమ సంస్కారానికి హాజరైన దృశ్యం మీమీ మొబైల్స్‌లో భద్రపరుచుకోండి” అన్నారు.
“గర్వించే భారతీయ జాతి సభ్యులుగా మీరు మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని నేను భావిస్తున్నాను. మీరు చేయవలసిందల్లా పాకిస్థాన్ సైనికాధికారి తీవ్రవాది అంతిమ సంస్కారానికి హాజరైన దృశ్యం మనం చూసాం. దానిని మీ మొబైల్ లో భద్రపరుచుకోవడమే” అన్నారు.
అనువాదం: ఉషారాణి కె
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.