
ఎపిసోడ్ 14: డాక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజం
నికోలాస్ కాపర్నికస్, టైకో బ్రాహే, జోహానెస్ కెప్లర్ గురించి వివరంగా తెలుసుకుంటూ, వారి ఆవిష్కరణలను అవగాహన చేసుకుంటూ మనం వారి సమకాలీనుడు, పాఠ్య పుస్తకాల్లో ఎక్కువగా పేరు వినబడని శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బేకన్ మహాశయుడి గురించి తెలుసుకున్నాము. నిజానికి ఇప్పటి వరకూ మనం తెలుసుకున్న విఙ్ఞానశాస్త్ర మహామహులలో బేకన్, బ్రాహేల కృషి ఫలితాలను మనం ఈనాటికీ అనుభవిస్తున్నాం. వారి ఆవిష్కరణల ద్వారా అందిన విఙ్ఞానశాస్త్ర భావనలను ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాం.

గత మూడు ఎపిసోడ్లలో మనం బేకన్ ప్రతిపాదించిన ఙ్ఞానభ్రమల గురించి, ఆధునిక విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో దాని ప్రభావం గురించి, ఆ ఙ్ఞానభ్రమల బారిన పడకుండా ఎలా పురోభివృద్ధి సాధించాలి అనేది ప్రాక్టికల్‌గా ఉదాహరణలతో తెలుసుకున్నాము. ఇప్పుడు వారి సమకాలికుడైన మరో గొప్ప శాస్త్రవేత్త విలియమ్ గిల్బర్ట్ గురించి చూద్దాము.
విలియం గిల్బర్ట్(1544-1603) యునైటెడ్ కింగ్డమ్కు చెందిన వైద్యుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. ఎక్కువగా విద్యుత్, అయస్కాంత శాస్త్రాలలో అతని ప్రాముఖ్యమైన కృషికి ప్రసిద్ధి చెందాడు. పూర్తిగా విఙ్ఞానశాస్త్ర చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి తప్ప, అతని గురించి సాధారణంగా చాలామందికి తెలియదు. కానీ, ఈయన చేసిన పరిశోధనలు నేటికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మైకల్ ఫేరడే లాంటి వారు అంత గొప్ప పరిశోధనలు చేయటానికి గిల్బర్ట్ ప్రతిపాదించిన సూత్రాలు, సిద్ధాంతాలు పునాదులుగా నిలిచాయి.
గిల్బర్ట్ జీవితంలో కొన్ని ముఖ్యమైన విశేషాలు..
రాణి ఎలిజబెత్ I వ్యక్తిగత వైద్యుడు: ఎలిజబెత్- I మహారాణి వ్యక్తిగత రాజవైద్యుడిగా విలియమ్ గిల్బర్ట్ పనిచేశాడు. ఈ పదవి అతనికి రాజ ఆస్థానంలో గణనీయమైన పలుకుబడిని ఇవ్వటమే కాక, తన శాస్త్రీయ పరిశోధనలకు సమయాన్ని కేటాయించుకుంటూ, నిధులను సమకూర్చుకుంటంలో ఉపయోగపడింది.
“డీమాగ్నెట్” రచన: గిల్బర్ట్ అత్యంత ప్రసిద్ధ రచన, డీమాగ్నెట్, మాగ్నెటిక్స్ కార్పోరిబస్, ఎట్ డీమాగ్నో మాగ్నెట్ టెల్లూర్(De Magnete, Magneticis Corporibus, et de Magno Magnete Tellure, 1600 ప్రచురితం). అందులో భూమిని ఒక భారీ అయస్కాంతంగా వర్ణించాడు. ఈ రచన అయస్కాంత శాస్త్రంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. కారణం? ఇది ఆధునిక శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించిన తొలి రచనలలో ఒకటి.
విద్యుత్ శాస్త్ర పరిశోధనలకు పునాది: గిల్బర్ట్ “ఎలెక్ట్రిక్” (electric) అనే పదాన్ని ప్రతిపాదించాడు. ఇది గ్రీకు పదం “ఎలక్ట్రాన్”(elektron, amber) నుంచి వచ్చింది. అతను అంబర్ స్టోన్, ఇతర పదార్థాలు రాపిడి ద్వారా ఆకర్షణ శక్తిని ఉత్పత్తి చేయగలవని కనుగొన్నాడు. ఇది విద్యుత్ శాస్త్రంలో మొదటి అడుగులుగా పరిగణించబడుతుంది. మరొక విధంగా చెప్పాలంటే మన చేతులను రుద్దుకుంటే వాటి రాపిడికి వేడి పుడుతుంది. దానికి కారణం విద్యుత్.
అయస్కాంత క్షేత్రాలపై ప్రయోగాలు: గిల్బర్ట్ తన పరిశోధనల కోసం “టెరెల్లా” అనే చిన్న గోళాకార అయస్కాంతాన్ని ఉపయోగించాడు. ఇది భూఅయస్కాంత క్షేత్రాన్ని అనుకరించింది. ఈ టెరెల్లా ద్వారా అతను అయస్కాంత ధ్రువాలు, దిక్సూచి సూత్రాలను వివరించాడు.
ఖగోళ శాస్త్రంపై ఆసక్తి: ఆ కాలంలో అందరు శాస్త్రవేత్తల లాగానే గిల్బర్ట్ కూడా ఖగోళశాస్త్రం మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. కానీ అటు వైపు పరిశోధనలు చేయలేదు. ఆయన కాపర్నికస్ సౌరకేంద్ర సిద్ధాంతాన్ని(heliocentrism) సమర్థించాడు. దాని వలన ఆయన కాస్త వివాదాస్పదమయ్యాడు. కానీ, ఆయనకున్న పలుకుబడి ఉపయోగబడింది. అతను భూఅయస్కాంత క్షేత్రం దాని భ్రమణానికి కారణమౌతుందని నమ్మాడు.
సామాజిక స్థితి, విద్య: గిల్బర్ట్ ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. అతని ఉన్నతమైన ఆర్థిక, సామాజిక నేపథ్యం, రాజ వైద్యునిగా ఎలిజబెత్ మహారాణితో ఉన్న సత్సంబంధాలు అతని శాస్త్రీయ పరిశోధనలకు ఆర్థిక, సామాజిక మద్దతును పొందేలా ఉపయోగపడ్డాయి.
మరణం – వారసత్వం: గిల్బర్ట్ 1603లో ప్లేగు వ్యాధి కారణంగా మరణించాడని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విశేషాన్ని తరువాత తెలుసుకుందాము. ఆయన పరిశోధనలు, కృషి ఆధునిక విద్యుత్, అయస్కాంత శాస్త్రాలకు పునాది వేశాయి. ఆయన రచించిన డీమాగ్నెట్ రచన శాస్త్రీయ పరిశోధనలలో ప్రయోగాత్మక పద్ధతుల ఉపయోగానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘
ఇప్పుడు మనం ఆయన ప్రఖ్యాత రచన డీమాగ్నెట్ గురించి తెలుసుకుందాము.
విలియం గిల్బర్ట్ రచించిన డీమాగ్నెట్, మాగ్నెటిక్స్ కార్పోరిబస్, ఎట్ డీమాగ్నో మాగ్నెట్ టెల్లూర్ (De Magnete, Magneticis Corporibus, et de Magno Magnete Tellure), లేదా సంక్షిప్తంగా డీమాగ్నెట్, 1600లో ప్రచురితమై ఒక సంచలనం సృష్టించిన శాస్త్రీయ రచన. ఇది అయస్కాంత శాస్త్రం, విద్యుత్ శాస్త్రంలో నేటికీ ఒక ప్రధానమైన మైలురాయిగా పరిగణించబడుతోంది. ఈ పుస్తకం ఆధునిక శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించిన తొలి రచనలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కారణం? గిల్బర్ట్ తన పరిశోధనలను ప్రయోగాలు, పరిశీలనల ఆధారంగా నిర్మించాడు. ఈ పుస్తకం గురించి వివరంగా క్రింద చూద్దాము.
రచనా కాలం, నేపథ్యం..
◊ రచన సమయం: 16వ శతాబ్దం చివరలో యూరప్‌లో శాస్త్రీయ విప్లవం ఊపందుకుంటున్న సమయంలో ఈ పుస్తకం రాయబడింది. గిల్బర్ట్ ఈ రచనలో అప్పటి వరకు ఉన్న ఆలోచనలను సవాలు చేస్తూ, అయస్కాంత శాస్త్రంపై కొత్త దృక్పథాన్ని అందించాడు.
◊ ఉద్దేశ్యం: గిల్బర్ట్ ఈ పుస్తకంలో అయస్కాంత శక్తుల గురించి, ముఖ్యంగా భూఅయస్కాంత క్షేత్రం గురించి తన ప్రయోగాత్మక ఆవిష్కరణలను వివరించాడు. అతను అయస్కాంత శాస్త్రాన్ని ఒక స్వతంత్ర శాస్త్రీయ రంగంగా స్థాపించడానికి ప్రయత్నించాడు.
పుస్తకం గురించి..
సౌలభ్యత కోసం పుస్తకాన్ని ఆరు భాగాలుగా గిల్బర్ట్ విభజించాడు. ఒక్కొక్క విభాగం అయస్కాంత శాస్త్రం, విద్యుత్ శాస్త్రం, భూఅయస్కాంత క్షేత్రం గురించి నిర్దిష్ట అంశాలను వివరిస్తుంది.
పుస్తకం I: అయస్కాంత శాస్త్రం చరిత్ర- దాని గురించి అపోహలు
పుస్తకం II: అయస్కాంత పదార్థాల గుణాలు- ఆకర్షణ శక్తులు
పుస్తకం III: అయస్కాంత ధ్రువాలు- వాటి పరస్పర చర్యలు
పుస్తకం IV: విద్యుత్ శాస్త్రం గురించి గిల్బర్ట్ ఆవిష్కరణలు
పుస్తకం V: భూఅయస్కాంత క్షేత్రం గురించి అతని సిద్ధాంతం
పుస్తకం VI: అయస్కాంత శాస్త్రం- ఖగోళ శాస్త్రంలో దాని ఉపయోగాలు
ముఖ్యమైన ఆవిష్కరణలు- భావనలు..
◊ భూమి ఒక భారీ అయస్కాంతం: గిల్బర్ట్ భూమిని ఒక భారీ అయస్కాంతంగా వర్ణించాడు. దాని అయస్కాంత క్షేత్రం దిక్సూచి సూచీలను ఆకర్షిస్తుందని వివరించాడు. ఈ ఆలోచన అతని కాలంలో విప్లవాత్మకమైనది.
◊ టెరెల్లా ప్రయోగాలు: అతను “టెరెల్లా”(చిన్న భూమి – small earth) అనే గోళాకార అయస్కాంతాన్ని ఉపయోగించి భూఅయస్కాంత క్షేత్రాన్ని అనుకరించాడు. ఈ ప్రయోగాలు భూమి ధ్రువాలు, దిక్సూచి పనితీరును వివరించడంలో సహాయపడ్డాయి.
◊ విద్యుత్ శాస్త్రం ప్రారంభం: గిల్బర్ట్ అంబర్ వంటి పదార్థాలు రాపిడి ద్వారా ఆకర్షణ శక్తిని ఉత్పత్తి చేయగలవని కనుగొన్నాడు. దీనిని అతను “ఎలెక్ట్రిక్” శక్తిగా పేర్కొన్నాడు. ఇది విద్యుత్ శాస్త్రంలో ప్రాథమిక ఆలోచనలకు పునాది వేసింది.
◊ అయస్కాంత శక్తి vs విద్యుత్ శక్తి: గిల్బర్ట్ అయస్కాంత, విద్యుత్ శక్తుల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించి వివరించాడు. ఇది ఆ కాలంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. తరువాత జేమ్స్ క్లార్క్ మేక్స్వెల్ చేసిన విద్యుదయస్కాంత పరిశోధనలకు ఊతంగా నిలిచాయి.
డీమాగ్నెట్ ప్రాముఖ్యత..
◊ శాస్త్రీయ పద్ధతి: డీమాగ్నెట్ శాస్త్రీయ పరిశోధనలో ప్రయోగాత్మక పద్ధతులను ఉపయోగించిన మొదటి రచనలలో ఒకటి. గిల్బర్ట్ ఊహాగానాలకు బదులుగా పరిశీలనలు, ప్రయోగాలపై ఆధారపడ్డాడు. బ్రాహే-బేకన్ సిద్ధాంతాలను అనుసరించాడు.
◊ నావిగేషన్‌పై ప్రభావం: గిల్బర్ట్ అయస్కాంత క్షేత్ర సిద్ధాంతం దిక్సూచి పనితీరు, శాస్త్రీయ ఆధారాన్ని వివరించింది. ఇది నావిగేషన్‌లో కీలకమైన పురోగతిని సాధించటంలో ఉపయోగపడింది.
◊ ఖగోళ శాస్త్రంలో ప్రభావం: గిల్బర్ట్ భూఅయస్కాంత క్షేత్రం దాని భ్రమణంతో సంబంధం కలిగి ఉందని సూచించాడు. ఇది కోపర్నికస్ సౌరకేంద్ర సిద్ధాంతానికి ఉపయుక్తమైన ఆధారంగా మద్దతు ఇచ్చింది.
అపోహలపై సవాలు..
◊ గిల్బర్ట్ అప్పటి వరకు అయస్కాంత శాస్త్రం గురించి ఉన్న అనేక అపోహలను ఖండించాడు. ఉదాహరణకు, అయస్కాంతాలు ఆకర్షణ శక్తిని నక్షత్రాల నుంచి పొందుతాయనే భావనను తోసిపుచ్చాడు.
◊ అతను అయస్కాంత శక్తి ఒక భౌతిక శక్తి అని, ఇది భూమి అంతర్గత లక్షణమని నిరూపించాడు.
ఘనత..
◊ డీమాగ్నెట్ ఆధునిక అయస్కాంత, విద్యుత్ శాస్త్రాలకు పునాది వేసింది. గిల్బర్ట్ పని గెలీలియో, కెప్లర్ తరువాత శాస్త్రవేత్తలైన ఫారడే, మాక్స్‌వెల్‌ల కృషికి ప్రేరణగా నిలిచింది.
◊ ఈ పుస్తకం శాస్త్రీయ రచనలలో లాటిన్ భాషలో రాయబడిన చివరి ప్రధాన రచనలలో ఒకటి, ఇది శాస్త్రీయ సమాజంలో విస్తృతంగా చర్చించబడిన రచనగా నిలిచింది. తరువాత తరాల వారిని అత్యంత ప్రభావితం చేసిన రచనలలో టాలెమీ వ్రాసిన అల్మాజెస్ట్ తరువాత డీమాగ్నెట్ కూడా ఒకటిగా నిలిచింది.
ఆసక్తికర విషయాలు..
◊ భాష: ఈ పుస్తకం లాటిన్లో రాయబడినా సరళంగా ఉండి శాస్త్రవేత్తలకు, సామాన్యులకు(లాటిన్ తెలిసిన, విఙ్ఞానశాస్త్రానికి చెందని రంగాల వారికి కూడా అర్థమయ్యేలా ఉన్నది.
◊ ప్రచురణ: లండన్‌లో 1600లో ప్రచురించబడింది. ఇది యూరప్ అంతటా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.
◊ ప్రభావం: ఈ పుస్తకం ఆధునిక భౌతిక శాస్త్రంలో అయస్కాంత క్షేత్ర సిద్ధాంతాలకు ప్రధాన ఆధారంగా నిలిచింది.
డీమాగ్నెట్ ఒక శాస్త్రీయ రచనలలో క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. ఇది గిల్బర్ట్ ప్రయోగాత్మక దృష్టి, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ఆధునిక విఙ్ఞానశాస్త్ర రచనలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘℘
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అనేది మనం తరుచూ వినే క్లిషే. మన విలియమ్ గిల్బర్ట్ కూడా ఆ తరగతికి చెందిన వాడే. చదివింది వైద్య శాస్త్రం. చేసింది రాజవైద్యునిగా. కానీ పరిశోధనలన్నీ భౌతిక శాస్త్రానికి సంబంధించినవి. మరి వైద్యునిగా వైద్యశాస్త్రంలో ఏమి సాధించాడు?
విలియం గిల్బర్ట్(1544-1603) ఎలిజబెత్ మహారాణి ఆస్థానంలో రాజ వైద్యుడిగా పనిచేశాడు. అయినప్పటికీ, అయస్కాంత శాస్త్రం- విద్యుత్ శాస్త్రంలో అతని సంచలనాత్మక రచన డీమాగ్నెట్ ద్వారా అతనికి ఖ్యాతి వచ్చింది. రాజ వైద్యుడిగా అతని పాత్ర, వైద్య శాస్త్రంలో అతని కృషి గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు..
రాజ వైద్యుడిగా గిల్బర్ట్ ప్రభావం..
రాజ ఆస్థానంలో ప్రతిష్ఠ: గిల్బర్ట్ 1601లో రాణి ఎలిజబెత్- I వ్యక్తిగత వైద్యుడిగా నియమితుడయ్యాడు. ఈ పదవి అతనికి రాజ ఆస్థానంలో గణనీయమైన సామాజిక, వృత్తిపరమైన ప్రతిష్ఠను ఇచ్చింది. ఈ స్థానం అతని ఆర్థిక స్థిరత్వం చేకూర్చి, సామాజిక హోదాను ఇచ్చి శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన నిధులను సమకూర్చుకునే అవకాశం ఇచ్చింది. తద్వారా జీవితాంతం ఆయన స్థిరమైన పరిశోధనలు చేశాడు.
మరి ఆయనకు అంత ప్రతిష్ఠ రావటానికి వైద్య శాస్త్రంలో చేసిన కృషి ఏమిటి? పూజ్యం. పెద్దగా ఏమీ చేయలేదు. ఏ విధంగా రాజవైద్యునిగా ఆయన గొప్ప హోదాను అనుభవించాడు? తన మాటల ద్వారా సగం సాంత్వన చేకూరేలా చేసేవాడు. దాని వల్ల ఆయన ఇచ్చిన ఔషధాలు బాగా ప్రభావం చూపేవి. సామాజిక సంబంధాలను ఆయన బాగా నెరిపేవాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని ఆయన ఆస్థానంలో అందరితో సఖ్యత చూపి, మంచి అనుబంధాలను సంపాదించుకున్నాడు. అదృష్టం కొద్దీ ఆ కాలంలో పరిస్థితుల వల్ల రాజయకుటుంబీకుల ఆరోగ్యాలు బాగుండేవి. ఆ అదృష్టం ఈయన ఖాతాలో పడింది. సత్సంబంధాల వల్ల. అజాతశత్రువుగా నిలవటాన్ని ఆయన పరిశోధనలకు బాగా కలిసి వచ్చింది. అది ఒకరకంగా మన అదృష్టం కూడా.
సమాజంలో సంబంధాలు: రాజ వైద్యుడిగా తనకున్న పలుకుబడితో గిల్బర్ట్ ఇంగ్లాండ్‌లోని ప్రముఖ శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర మేధావులతో సంబంధాలు కొనసాగించాడు. ఇది అతని శాస్త్రీయ కృషిని ప్రచారం చేసుకోవటానికి, ఇతర మేధావులతో శాస్త్ర చర్చలు చేయటానికి సహాయపడింది.
పరిశోధనలకు స్వేచ్ఛ: రాజ వైద్యుడిగా అతని స్థితి అతనికి తన అయస్కాంత, విద్యుత్ శాస్త్ర పరిశోధనలకు సమయం, వనరులను కేటాయించే స్వేచ్ఛను ఇచ్చింది. రాజ ఆస్థానం అతని ప్రయోగశాల పనికి అవసరమైన ఆర్థిక మద్దతును అందించింది.
వైద్య శాస్త్రంలో గిల్బర్ట్ కృషి..
గిల్బర్ట్ వైద్య శాస్త్రంలో చేసిన కృషి చాలా తక్కువగా డాక్యుమెంట్ చేయబడింది. ఎందుకంటే అతని దృష్టి ప్రధానంగా అయస్కాంత శాస్త్రంపైనే ఉంది. అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన అంశాలు:
వైద్య విద్య: గిల్బర్ట్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సెయింట్ జాన్ కాలేజీలో వైద్య శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీని పొందాడు. ఈ విద్య అతని వైద్య జ్ఞానానికి ఆధారంగా ఉండి ఉపకరించింది. కానీ అతను ఈ రంగంలో ప్రత్యక్ష రచనలు లేదా ఆవిష్కరణలు చేసినట్లు ఎక్కడా వివరాలు లేవు.
రాజ వైద్యుడిగా విధులు: రాణి ఎలిజబెత్- I ఆరోగ్య సంరక్షణలో ఆయన చూపిన చొరవ, విధులు నిర్వహించిన తీరు ప్రధానంగా సాంప్రదాయ వైద్య పద్ధతులపై ఆధారపడి ఉన్నాయి. ఇవి అప్పటి కాలంలో శాస్త్రీయంగా అభివృద్ధి చెందలేదు. అతను వైద్య శాస్త్రంలో కొత్త సిద్ధాంతాలు లేదా చికిత్సలను ప్రతిపాదించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.
శాస్త్రీయ దృష్టి: గిల్బర్ట్ శాస్త్రీయ దృష్టికోణం వల్ల అందరికీ ఆయన వైద్యం మీద గురి ఏర్పరచింది. పైగా అయస్కాంత శాస్త్రం మీద కృషి చేసిన ఆయన అమోఘమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉండటం కూడా విశేషం.
సమకాలీన వైద్య పద్ధతులు: 16వ శతాబ్దంలో వైద్య శాస్త్రం ఇప్పటి వలె అభివృద్ధి చెందలేదు. గిల్బర్ట్ వైద్యం అతని కాలంలో సాధారణమైన మూలికా చికిత్సలు, రక్తస్రావం, ఇతర సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడి ఉన్నట్లు భావించాలి.
వైద్య శాస్త్రంలో పరిమిత ప్రభావం..
◊ గిల్బర్ట్ ప్రధాన కృషి వైద్య శాస్త్రంలో కాకుండా భౌతిక శాస్త్రంలో ఉంది. అతని అయస్కాంత శాస్త్ర పరిశోధనలు ఆధునిక శాస్త్రీయ పద్ధతులకు పునాది వేశాయి, కానీ వైద్య శాస్త్రంలో అతని పాత్ర సాంప్రదాయ వైద్య విధులకు పరిమితమై ఉంది.
◊ అతని రాజ వైద్యుడి పాత్ర అతని శాస్త్రీయ పరిశోధనలకు సామాజిక, ఆర్థిక మద్దతును అందించాయి. అయినప్పటికీ, ఇది వైద్య శాస్త్రంలో గణనీయమైన ఆవిష్కరణలకు దారితీయలేదు. అవసరపడి ఉండలేదు.
రాజ వైద్యుడిగా గిల్బర్ట్ గౌరవనీయమైన స్థానం అతని శాస్త్రీయ పరిశోధనలకు సామాజిక, ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో ముఖ్యపాత్ర పోయించింది. కానీ వైద్య శాస్త్రంలో అతని కృషి గురించి చరిత్రలో స్పష్టమైన ఆధారాలు లేవు. అతని అసలు వారసత్వం డీమాగ్నెట్ ద్వారా అయస్కాంత శాస్త్రం, విద్యుత్ శాస్త్రంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులకు వేసిన పునాదిలో ఉంది. దానికి తోడు ఉన్న అవకాశాలను ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని ఎలా అందిపుచ్చుకోవాలి? మనం చేసే కృషికి ఇతరుల నుంచి మన నిజాయితీతో ఎలా సహకారం పొందాలనే నేర్పుతుంది ఆయన జీవితం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.