
2025 జూన్ 25వ తేదీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన 50వ వార్షికోత్సవం. గణతంత్ర భారత చరిత్రలో అనూహ్యమైన ప్రజాస్వామ్య సంక్షోభానికి నిదర్శనం. 1975 నుంచి 1977 వరకు అమల్లో ఉన్న ఎమర్జెన్సీ కేవలం ప్రజాస్వామిక ప్రమాణాలను, రాజ్యాంగాన్ని డొల్ల బార్చటమే కాదు. రాజ్యాంగం ముసుగులో నియంతృత్వాన్ని ఎంత సమగ్రంగా కిరాతకంగా స్పష్టంగా అమలు చేయవచ్చో గుర్తు చేసిన ఉదంతం 1975 ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ విధించడానికి తక్షణ కారణం ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలపై ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికను చెల్లదని అలహాబాద్ న్యాయస్థానం ప్రకటించటం. నిజానికి 1960, 1970 దశకాల్లో దేశంలో పెరిగిపోయిన సామాజిక అశాంతి ఎమర్జెన్సీ విధింపుకు కావలసిన భూమికను సిద్ధం చేసింది.
ఎమర్జెన్సీ విధించిన తర్వాత దేశవ్యాప్తంగా పెల్లుబుకిన ఆందోళన అంతర్జాతీయంగా వెల్లువెత్తిన విమర్శలు నేపథ్యంలో 1977 నాటికి ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ ఉపసంహరించుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైన ఓటమిని చవిచూసింది. దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది.
50 ఏళ్ల తర్వాత భారతదేశం ఓ భిన్నమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని పరిశోధకులు మేధావులు అప్రకటిత ఎమర్జెన్సీ అని పిలుస్తున్నారు. వర్తమానభారతంలో ప్రజాతంత్ర హక్కులు 1975లో లాగా ప్రభుత్వ ప్రకటన లేదా నిర్ణయం ద్వారా రద్దు చేయబడలేదు. దానికి భిన్నంగా ఒక క్రమ పద్ధతిలో నిదానంగా రాజ్యాంగ వ్యవస్థలను పాలకులు డొల్ల బారుస్తున్నారు. ఎన్నికలలో ఆధిపత్యం సాధించాము కాబట్టి తాము ఏమి చేసినా చెల్లుతుంది, తమ ఏ చర్యకు అయినా ప్రజామోదం ఉన్నట్లే అన్న కుతర్కంతో రాజ్యాంగ విలువలను పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తున్నారు.
వర్తమాన భారతంలో పతనమవుతున్న ప్రజాస్వామ్యం..
2025 సంవత్సరానికి వీడెం అండ్ ఫ్రీడమ్ హౌస్‌లు రూపొందించిన నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నికైన నియంతృత్వ దేశంగా నిర్ధారించబడింది. పాక్షికమైన స్వేచ్ఛా భారతంగా ప్రకటించబడింది. ఈ సంస్థలు ఇచ్చే కితాబులు భారతదేశంలో 2014 నుంచి క్రమానుగతంగా పతనమవుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి హెచ్చరికలే.
భారతదేశంలో ప్రజాస్వామ్యం పతనం అవుతుందని చెప్పడానికి గల ప్రధానమైన కారణాలు: అల్పసంఖ్యాక తరగతులపై ఊచకోత, అసమ్మతిని, ప్రశ్నించే వారిని వెంటాడి వేటాడి వేధించటానికి చట్టాలను ఆయుధాలుగా వాడుకోవడం, హిందుత్వ జాతీయోన్మాద భావజాలాన్ని బలవంతంగా దేశంపై రుద్దటం. భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థలు అనూహ్యస్థాయిలో సంక్షోభ దశ గుండా ప్రయాణిస్తున్నాయని మేధావులు విశ్లేషించిన నిర్ధారణలకు పైన చెప్పిన పరిణామాలకు మధ్య విడదీయరాని సంబంధం ఉన్నది. అయితే ఈ పరిణామం 1975లో కనిపించినంత బాహాటంగా కనిపించకపోయినా నాటికంటే మరింత ప్రమాదకర స్థాయిలో సాగుతోంది.
సమకాలీన భారతంలో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే రాజకీయాలు రాను రాను మతోన్మాద భరితమై పోతున్నాయి. కీలకమైన రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్న వ్యక్తులే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పదేపదే చేస్తున్న ఉపన్యాసాలు దీనికి ఒక ఉదాహరణ.* జినోసైడ్ వాచ్ అనే సంస్థను ప్రారంభించి వివిధ దేశాలలో నరమేధం దిశగా జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేస్తున్న గ్రేగరీ స్టాంటన్ అభిప్రాయంలో “సమకాలీన భారతంలో దానికి సంబంధించిన ప్రాథమిక సూచనలు కనిపిస్తున్నాయి.”
1975 – 2014 అనంతర పరిణామాల మధ్య పోలిక..
2014 తర్వాత భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సమీప పోలిక 1975 నాటి పరిణామాలు. 1975లో తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించారు. రాజ్యాంగంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని పౌరహకులను రద్దు చేశారు. ప్రెస్ పై సెన్సార్షిప్ విధించారు. పాలనా సంస్థల స్వయంప్రతిపత్తిని హరించారు. ఈ పరిణామాలని ప్రముఖ చరిత్రకారుడు గ్యాన్ ప్రకాష్ ఓ సందర్భంలో ‘చట్టబద్ధంగా చట్టాన్ని రద్దు చేయడం’ అని వ్యాఖ్యానించారు. ఏదేమైనా అది బయటికి కొట్టొచ్చినట్లు కనిపించే పరిణామం. ఆనాటి ప్రభుత్వ నిర్ణయం విస్పష్టమైన ప్రకటన ద్వారానే అమల్లోకి వచ్చింది. దీనికి బదులుగా 1977లో భారత ప్రజానీకం అంతే అరమరికలు లేకుండా స్పందించింది. ఇందిరా గాంధీని కాంగ్రెస్ పార్టీని గద్దె నుంచి దించింది. ప్రజాతంత్ర స్ఫూర్తిని ప్రదర్శించింది.
సమకాలీన భారతంలో మోడీ పరిపాలనలో జరుగుతున్న పరిణామాలు దీనికి పూర్తిగా భిన్నమైనవి. అన్ని పనులు లోపాయికారీగానే జరుగుతున్నాయి. 1975లో లాగా మోడీ ప్రభుత్వం బహిరంగంగా ఎమర్జెన్సీ విధించలేదు. విధిస్తున్నామని ప్రకటించడం లేదు. దీనికి బదులు నిరంకుశపూరితంగా చట్టాల చర్యలు, అధికారుల చేతుల్లో సంపూర్ణ అధికారాలను కేంద్రీకరించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను వాటి స్ఫూర్తిని వాటి విలువలను డొల్లబారుస్తుంది. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి బలహీన పడింది. అసమ్మతి నేరపూరితమైంది. నియంతృత్వ అధికారాన్ని అమలు చేయడానికే చట్టాలు ప్రయోగించబడుతున్నాయి. ఫలితంగా సమాంతర ప్రత్యామ్నాయ రాజ్యాంగ వ్యవస్థ చట్టం ముసుగు వేసుకుని ముస్తాబవుతోంది. అయితే దీనికి నైతికత లేదు.
దేనికి మినహాయింపు తీసుకోవాలో తెలిసిన వాడే అసలైన సార్వభౌమాధికారి అన్న కారల్ స్కిమిట్ విశ్లేషణ నానాటికి భారతదేశంలో వాస్తవిక రూపం దాలుస్తోంది. ఇందిరాగాంధీ తీసుకొన్న మినహాయింపు అసామాన్యమైనది. కానీ మోడీ పరిపాలన ఆ మినహాయింపులనే రోజువారి వ్యవహారంగా మారుస్తుంది. రోజువారి పరిపాలన నుంచి రాజ్యాంగాన్ని మినహాయిస్తోంది. తత్వవేత్త జియోర్జియో అగాంబెన్ అభిప్రాయ పడినట్లుగా శాశ్వతమైన మినహాయింపు చట్టబద్ధతకు చట్ట ఉల్లంఘనకు మధ్య ఉన్న సున్నితమైన గీతను చెరిపేస్తుంది. సమకాలీన భారతంలో స్పష్టంగా కనిపిస్తున్న పరిణామం ఇదే.
రాజ్యాంగ పునాదిని బలహీనపరచటం..
న్యాయనిపుణులు అరవింద్ నరేన్ అంచనా ప్రకారం మోడీ పాలనలో భారతదేశం నిర్నిరోధమైన నిరపేక్ష సంపూర్ణాధికారం పరిధిని మించి పోతోంది. చాపకింద నీరులా నిర్మాణమవుతున్న హిందూ రాష్ట్రగా సమకాలీన భారతదేశాన్ని రాజకీయ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం భారత దేశంలో సంఖ్యాధిపత్యం పాలనాపరమైన నియంత్రణ కలసిమెలసి ముందుకు సాగుతున్నాయి. ఈ పరిపాలన లక్షణం రాజ్యాంగ విలువైన బహుళత్వంలో ఏకత్వం సంఘీభావం సూత్రాలకు పూర్తి భిన్నమైనది.
ఈ పరిణామాలను నిరంతరం దగ్గరగా అధ్యయనం చేస్తున్న రాజనీతి శాస్త్రవేత్త ప్రతాప్ భాను మెహతా భారతదేశంలో ప్రజాస్వామ్యం పదేపదే ఎందుకు విఫలమవుతుంది? ఈ ధోరణులు ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయి? ఈ పరిణామాలకు ఎలాంటి రాజ్యాంగబద్ధత ఉన్నదని చెప్పుకుంటున్నాయి? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
1950 నుంచి నేటి వరకు- సమస్యల సుడిగుండంలో ప్రజాస్వామ్యం..
భారత ప్రజాస్వామ్యం ప్రారంభం నుంచి తీవ్రమైన ఆకాంక్షలు రేకెత్తించింది. భారతదేశంలో ఉన్న వైవిధ్యం భిన్నత్వం, సామాజిక దొంతరలు, వలసవాద వారసత్వం నేపథ్యంలో భారతదేశం ప్రజాస్వామిక దేశంగా మనగలుగుతుందాని స్వాతంత్ర సాధన నాడే పలువురు అంతర్జాతీయ పరిశీలకు ప్రశ్నలు లేవనెత్తారు. అయినా సరే భారతదేశంలో తొలి ఎన్నికలలోనే సార్వత్రిక ఓటు హక్కు ఖాయం చేసింది. అప్పటివరకు పాలితులుగా మిగిలిపోయిన ప్రజలు విస్పష్టమైన రాజ్యాంగ హక్కులు అనుభవించే పౌరులుగా మారారు.
అయినా సరే బీఆర్ అంబేద్కర్ భారత ప్రజాస్వామ్యం అసమానమైన పునాదులపై ఆధారపడి నిర్మాణమవుతోందని హెచ్చరించారు. రాజ్యాంగ నైతికతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ పిలుపు నేటికీ సాకారం కాలేదు. స్వాతంత్రానంతర కాలంలో దీర్ఘకాలం సాగిన కాంగ్రెస్ ఆధిపత్యం ప్రాంతీయ రాజకీయాలకు బీజాలు వేసింది. ఈ ప్రాంతీయ రాజకీయాలు దేశంలోని బహుళత్వానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాయి. రాష్ట్రాల స్థాయిలో ఆశ్రిత రాజకీయాలకు తెరతీశాయి. ఉదారావాద ప్రజాస్వామ్యానికి ఈ రెండూ విరుద్ధమైన లక్షణాలు.
ప్రజారంజక రాజకీయాలు అంతిమంగా ఎమర్జెన్సీతో ముగిశాయి. వర్తమాన భారతదేశంలో కూడా అటువంటి ప్రజారంజక రాజకీయాలు మోడీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సామూహిక సమాచార ప్రసార సాధనాల కారణంగా రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. 1975 నాటి కంటే భిన్నంగా నేడు ఈ ప్రజారంజక రాజకీయాలకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉన్నది. ఈ లక్ష్యం మరింత కీలకమైనది విస్తృత భవిష్యత్ పరిణామాలకు దారితీసేది.
మోడీ భారతం చట్టం ముసుగు వేసుకున్న ఏకచత్రాధిపత్యం..
చట్టం ముసుగేసుకున్న ఏకచత్రాధిపత్యం అన్న భావనను హంగరీలో జరుగుతున్న పరిణామాలు అనే పద్యంలో చికాగో విశ్వ విద్యాలయంలోని న్యాయ కళాశాల ప్రొఫెసర్ కిం లానే షెప్పెలే ప్రతిపాదించారు. ఈ సూత్రం సమకాలీన భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. ప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలలో గెలిచిన పాలకులు తమ ఉదారవాద(ఇల్లిబరల్) రహిత లక్ష్యాల సాధన కోసం చట్టబద్ధమైన మార్గాలన్నింటినీ ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహంలో వ్యవస్థలను సంస్థలను స్వాధీన పరుచుకోవడం, నియమ నిబంధనలను పునర్వ్యాఖ్యానించడం, సవరించడం, ప్రతిపాదించడం, పౌర సమాజాన్ని సంకన పెట్టుకోవడం వంటి పద్ధతుల ద్వారా తమ చర్యలకు చట్టబద్ధతను ఆపాదించుకుంటుంది.
మోడీ పాలనలో భారత దేశంలో ఈ వ్యూహం తుచ తప్పకుండా అమలు జరగడాన్ని మనం గమనించవచ్చు.
♦ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఎటువంటి రాజకీయ ఏకాభిప్రాయం లేకుండానే తొలగించారు. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటైన సమాఖ్య స్వభావాన్ని తుంగలో తొక్కారు.
♦ ఎన్నికల సందర్భంగా పార్టీలకు నిధులు ఇచ్చే విధానాన్ని సంస్కరించే పేరుతో అమల్లోకి తెచ్చిన ఎన్నికల బాండ్స్ పథకం ఎంతో లోపభూయిష్టమైనది. పాలక పార్టీకి అడ్డులేని నిధులు సమకూర్చుకోవడానికి సాధనంగా మారింది. ప్రస్తుతానికి ఈ పథకం రద్దు అయినా దీర్ఘకాలం న్యాయ పోరాటంలో నలిగినా పాలక పార్టీకి వచ్చే నిధులకు ఎటువంటి అంతరాయమూ కలగలేదు.
♦ 2019లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత దేశంలో మొదటిసారి పౌరసత్వానికి మతానికి ముడిపెట్టారు. రాజకీయ తత్వవేత్త నీరజ గోపాల్ జయాల్ చెప్పినట్లు ఇప్పటి వరకు లౌకిక పునాదులపై నిలబడిన భారతీయ పౌరసత్వ భావనకు ఈ సవరణ ద్వారా మతవాద జాతీయత పునాదిని సమకూర్చింది మోడీ ప్రభుత్వం.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విస్తృత ధోరణుల నడుమ స్పష్టమైన వ్యూహం దాగి ఉంది. అప్రజాస్వామిక లక్ష్యాల సాధన కోసం ప్రజాస్వామ్య మార్గాల ద్వారా భారతదేశాన్ని సమూలంగా మార్చడం ఈ వ్యూహం.
ఇక్కడ మినహాయింపే నిబంధన..
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రమాదానికి కారణం కేవలం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, డొల్లబార్చడం మాత్రమే కాదు. నీతి నియమాలు, నైతికత, ప్రజాభిప్రాయం, న్యాయాన్యాయాల పట్ల ఎటువంటి భయభీతులు వెరపు లేకుండా ఈ ఉల్లంఘనలకు పాల్పడటం మరింత ఆందోళనకరమైన ప్రమాదం. పౌరహక్కులు ఓ పథకం ప్రకారం ఉల్లంఘించబడుతున్నాయి.
ఉపా, దేశద్రోహం వంటి ఆరోపణల క్రింద విద్యార్థులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై తప్పుడు కేసులు మోపడం రోజువారి పరిపాలనలో భాగం అయ్యింది. 2019 ఊపా చట్టానికి కేంద్రం తెచ్చిన సవరణ ప్రకారం ఏ వ్యక్తిని అయినా ఎటువంటి దర్యాప్తు లేదా విచారణ లేకుండా ఉగ్రవాదిగా ప్రభుత్వం పరిగణించి చర్యలు తీసుకోవచ్చు. సదరు వ్యక్తి ఉగ్రవాది కాదని అతనే నిరూపించుకోవాలి.
అత్యవసర పరిస్థితులను అధిగమించటానికి లేదా ఎదుర్కోవడానికి రూపొందించిన చట్టాలు నియమనిబంధనలు విధివిధానాలు రోజువారి పరిపాలన వ్యవహారాలుగా మారుతున్న పరిణామాన్ని న్యాయ శాస్త్రనిపుణుడు నాస్సర్ హుస్సేన్ హెచ్చరిస్తున్నారు. మోడీ హయాంలో ఈ చట్టబద్ధమైన అణచివేత వ్యవస్థలు యంత్రాంగం అనూహ్యంగా విస్తరించింది. దాంతో శాసనబద్దమైన పరిపాలన నానాటికీ కుదించుకుపోతోంది.
ఆందోళనకరమైన పరిస్థితులు..
1975 నాటి పరిణామాలు 2014 తర్వాతి కాలంలో జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే బాధ్యతాయుతమైన పౌరులు ఆందోళన చెందకుండా ఉండలేరు. ఇందిరా గాంధీ అమలు చేసిన నియంతృత్వం వ్యక్తిగతం, బాహాటంగా కనిపించేది, అంతిమంగా ప్రజలు తిరస్కరించిన నియంతృత్వం. మోడీ నియంతృత్వం రానురాను సంస్థాగతంగా మారుతున్న నియంతృత్వం. దీనికి తనదైన సైద్ధాంతిక నేపథ్యం, స్ఫూర్తి, లక్ష్యం ఉన్నాయి. ఈ నియంతృత్వాన్ని సమాజం ఆహ్వానిస్తోంది. రోజువారీ సామాజిక జీవితంలో అనైవార్యమైనదిగా పరిగణించబడటం మోడీ నియంతృత్వంలో అత్యంత ప్రమాదకరమైన ధోరణి.
ఈ మార్పు మన ముందు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజాస్వామిక విలువలు పాటించకుండా ప్రజాస్వామిక సంస్థలు వ్యవస్థలు మనుగడ సాగించగలుగుతాయా? డొల్లబారిన రాజ్యాంగం తమ మౌలిక విలువలతో మనుగడ సాగించగలుగుతుందా?
ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా మనం వేసుకోవలసిన ప్రశ్న, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ప్రమాదం ఏమిటి అని కాదు. చెదపురుగులు లోలోన తొలుచుకుంటూ పోవడాన్ని చూస్తూ వదిలేస్తే వట వృక్షము సైతం నిశ్శబ్దంగా కూలిపోతుంది. భారత దేశంలో రాజ్యాంగ బద్ధమైన పాలన అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదా అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సమాధానాలు వెతుక్కోవాల్సి ప్రశ్న.
శతక్తివంతమైన ప్రజాస్వామిక వ్యవస్థకు ఆరోగ్యవంతమైన, పురోగామి దృక్పథం కలిగిన పౌరసమాజం అవసరం. 1975 నాటి ప్రకటిత ఎమర్జెన్సీ 2014 నుంచి అమలు జరుగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు మనకి నేర్పుతున్న గుణపాఠాలు ఏమిటి? ఒకసారి ప్రజాస్వామిక దేశంగా మారినంత మాత్రాన మనం ఏమి చేసినా చేయకున్నా ఆ ప్రజాస్వామిక దేశం అలాగే కొనసాగుతుంది అన్న భ్రమల్లోకి కూరుకు పోకూడదు. ఎమర్జెన్సీ యాభయ్యవ సంవత్సరం గురించి మనం చర్చించుకోవడం అంటే దేశాన్ని దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ శక్తులు, వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఒకవేళ అటువంటి వారి చేతుల్లో పడితే దాన్ని విముక్తి చేసి సరైన దారిలో పెట్టాలి. రాజ్యాంగ మౌలిక విలువలు పునాదులు, ప్రజల పట్ల జవాబుదారీతనం, పాలకులపై సామాజిక నిఘాలే ప్రజాస్వామ్యాన్ని పదిలంగా కాపాడే మార్గం. దేశాన్ని ఆ మార్గంలో నడిపించడమే ప్రగతిశీల పౌర సమాజ కర్తవ్యం.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.