
ఎన్నోసార్లు కాల జ్వాలపు
అవాంతరాల అగాథపు
నిశీథిని ఛేదిస్తూ
దశాబ్దాల కృషి పరిమళాల
శిఖరాన్ని నడిపిస్తూ
కలల సౌధాలు రెక్కలు విప్పాయి
ఫాల్కన్-9 రాకెట్ తోడుగా
శతకోటి తారల వెలుగును తలదన్నేలా
నా దేశ త్రివర్ణ పతాకం ప్రకాశిస్తుండగా
నూట నలభై కోట్ల భారతీయుల
గుండె గళాల నిశ్శబ్ద స్పందన
విస్ఫోటనాల దృశ్య చిత్రమై
“శుక్లా”నవ తేజపుంజం అంతరిక్షంలో
నాదేశ మట్టి పాద ముద్రలతో అడిగేసింది
భిన్న సాంస్కృతిక, భావోద్వేగాల
ప్రయోగాల కలగలిపిన
కొత్త ఇంద్రధనుస్సు వారధిగా
డ్రాగన్ వ్యోమనౌక రోదసి హృదయాన్ని
నవోదయ సరాగాల స్వరమై చేరగా
“జాయ్ బొమ్మ” స్వేచ్ఛగా విజయనాదపు
సంకేతానికి సాంకేతిక ఉపిరి పోసింది
యావత్ ప్రపంచం చూస్తుండగానే
ఫేజింగ్ విన్యాసాల
పద్మవ్యూహాల ధగధగలను
అలవోకగా అద్వితీయ
మేధస్సై అధిగమిస్తూ
యాక్సియం-4 గమన జాడ
నూతన చరితకు
ముందుమాట లిఖిస్తుంది
మైక్రో గ్రావిటీ పరిశోధనల
తారా తీరపు అన్వేషణలు
వినువీధుల్లో అద్భుతాల పరంపర
ముఖద్వారాలను తెరిచేశాయి
ప్రతి సెకన్
ఓ ప్రపంచ యుద్ధమై గమిస్తున్న
జీవన స్పేస్ ప్రయాణంలో
సాహసాల కొలిమి వెలుతురులో
జైహింద్ నినాదాల ఉదయమైంది
వందేమాతరం నేటి నాదేశపు
పతాక శీర్షిక అయింది
అనంత విశ్వానేశ్వషణలో
అమర భారతం మానవ సహిత
యాత్రకు తొలి అడిగేసింది
శూన్యంలో కాంతి తరంగాల మధ్య
అద్భుతాల తళుకులకు
నవ మాతరపు గాత్రమై
నా దేశం మొత్తం ఒక్కటై
ఆ ఒక్కడి గెలుపు కోసం
ఆల్ ది బెస్ట్ శుక్లా అంటూ
నీ వెంట మేమంతా అంటూ
సమైక్య గీతమై తొలి అడుగుకు
634 నాంది పలికింది
ఫిజిక్స్ అరుణ్ కుమార్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.