
ఇజ్రాయెల్ ఇరాన్‌పైన దాడి చేయటం, తిరిగి ఇరాన్ ఇజ్రాయెల్‌ను ఎదుర్కొన్న తీరును యావత్ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల రాచరిక ప్రభుత్వాలు నిశితంగా గమనించాయి. ఈ సాయుధ సంఘర్షణలో ఇరు దేశాలు బాగా నష్టపోయాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బలహీనమైన ఇరాన్ వాయు రక్షణలను దెబ్బతీశాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్స్ హత్య చేయబడ్డారు. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఆయుధ కర్మాగారాలు ధ్వంసం చేయబడ్డాయి.
అయితే, ఈ యుద్ధంలో మొదటిసారిగా ఇజ్రాయెల్ సంప్రదాయ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటుందో అరబ్ పాలకులు చూడగలిగారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ పెద్ద ఎత్తున్న చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ అతలాకుతలం అయింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించగలిగింది. ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థ(ఐరన్ డోమ్) దుర్భేద్యమనే భావన డొల్ల అని తేలిపోయింది. మొట్టమొదటిసారి గాజా, లెబనాన్, సిరియాలలో తాము చేస్తున్న వినాశకర దాడుల ప్రభావం అక్కడి ప్రజలపై ఎలావుంటుందో ఇజ్రాయెల్ ప్రజలకు స్వీయ అనుభవం ద్వారా తెలిసివచ్చింది. ఇజ్రాయెల్ దాడికి ప్రధాన లక్ష్యమైన ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం జరగకపోగా అది మరింతగా బలోపేతం కావటం ఇజ్రాయెల్‌ని నిరుత్సాహపరిచింది.
అంతిమంగా ఇరాన్‌లోని ఫోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేయడం, ఆ తరువాత ఇరాన్ అమెరికాకు ముందుగానే తెలియజేసి తన అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారానికి దిగింది. ఇందులో భాగంగా ఖతార్‌లో అమెరికాకు చెందిన అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అలా ఇరాన్ చేసిన ప్రతీకాత్మక దాడి తరువాత ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ – ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించాడు. అలా ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం ముగిసింది.
యుద్ధంలో వెల్లడైన ఇజ్రాయెల్ దుర్బలత కారణంగా భవిష్యత్తులో అమెరికా- అరబ్ మిత్రదేశాలు ఇజ్రాయెల్‌తో మరింత స్వేచ్చగా వ్యవహరిస్తాయనటంలో సందేహం లేదు. అబ్రహం ఒప్పందాల కింద 2020లో దానితో సంబంధాలను సాధారణీకరించిన దేశాలు కూడా ఉన్నాయి.
టెహ్రాన్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. గల్ఫ్ నాయకులు టెహ్రాన్‌లో పెట్టుబడులు పెడతారని వారు ఆశిస్తున్నారు. రాబోయే నెలల్లో ఉన్నత స్థాయి సందర్శనలను తోసిపుచ్చడం లేదు. ఏప్రిల్‌లో సౌదీ అరేబియా రక్షణ మంత్రి, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సోదరుడు టెహ్రాన్‌ను సందర్శించారు.
ఇరాన్ తన అణు కార్యక్రమం “తీవ్రంగా దెబ్బతిన్నది” అని చెబుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలన ఇరాన్‌తో అణు చర్చలను తిరిగి ప్రారంభిస్తుందని చెప్పారు. గల్ఫ్ దేశాలు గతంలో అణు చర్చలకు మద్దతు ఇచ్చాయి. ఇరాన్ పైన ఈ దేశాల ప్రభావం ఇప్పుడు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
మేలో ట్రంప్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా అమెరికాతో వందల బిలియన్ డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఆ సమయంలో, వారికి రాయితీలు లభించినట్లు అనిపించింది. సౌదీ అరేబియా ఒత్తిడితో యెమెన్‌లోని హౌతీలపై అమెరికా దాడులను ఆపిందని భావిస్తున్నారు. ట్రంప్ సిరియాపై ఆంక్షలను కూడా ఎత్తివేశారు. అయితే గల్ఫ్ దేశాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆపలేకపోయాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్లకు భిన్నమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ దేశాలు అమెరికా నేరుగా ఇజ్రాయెల్- ఇరాన్ పైన చేస్తున్న దాడిలో భాగం కాకూడదని భావించాయి. ఈ గల్ఫ్ దేశాలు తెరవెనుక దౌత్య పాత్రను పోషించటమే కాకుండా తమ భూభాగాల నుంచి అమెరికా ఇరాన్‌పైన దాడులు నిర్వహించకుండా చూడగలిగాయి. ఈ సంక్షోభం గల్ఫ్ దేశాల నాయకత్వాన్ని పెంచింది.
ఇరాన్‌ను ఎదుర్కోవడానికి అమెరికా సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్‌తో పొత్తు కలపటానికి ప్రయత్నించింది. హిజ్బుల్లా లెబనాన్‌లో ఆధిపత్యం చెలాయించినప్పుడు, బషర్ అల్- అసద్ సిరియాను పాలించినప్పుడు, హౌతీలు సౌదీ అరేబియాపై క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు ఆ ప్రయత్నం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. హమాస్ నేతృత్వంలో 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి జరగడానికి ముందు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇజ్రాయెల్‌ను గల్ఫ్ దేశాలతోను, ఈజిప్ట్ తోను వైమానిక రక్షణతో అనుసంధానించి, “మిడిల్ ఈస్ట్ నాటో”ను సృష్టించడానికి ప్రయత్నించింది.
కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి దిగినప్పుడు, ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో భాగస్వాములవడానికి బదులుగా, అమెరికా అరబ్ మిత్రదేశాలు యుద్ధాన్ని ఆపమని ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఇజ్రాయెల్- ఇరాన్ 2024లో రెండుసార్లు ప్రత్యక్షంగా తలపడినప్పుడు ఇజ్రాయెల్‌ను రక్షించడానికి అమెరికాకు సౌదీ, ఖతార్‌ల మద్దతు లభించింది. కానీ ఇరాన్ అప్పుడు తన క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని బయటపడకుండా జాగ్రత్తపడింది. ఈసారి ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్‌ను ఢీకొట్టాయి. అందుకు ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్, హైఫా వంటి ప్రధాన నగరాలలో పెను విధ్వంసాన్ని సృష్టించింది.
యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించటమే కాకుండా ఈ దేశాలు కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెచ్చాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు ఊహించి ఉండకపోవచ్చు. వారికి ఇప్పుడు తత్వం బోధపడింది. ఇలా ఒత్తిడి తేవడంలో సౌదీ అరేబియా ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గతంలో ఇరాన్, సౌదీల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. 2018లో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని హిట్లర్‌తో పోల్చారు. ఆ తర్వాత, యెమెన్‌లో ఇరాన్ మిత్రదేశాలతో జరిగిన పోరులో సౌదీ అరేబియా కూరుకుపోయింది. 2019లో రెండు ప్రధాన సౌదీ చమురు కేంద్రాలపై దాడులు జరిగాయి. తరువాతి సంవత్సరాల్లో, సౌదీ అరేబియా ఇస్లామిక్ రిపబ్లిక్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ముందుకు వచ్చింది.
ఇటీవలి కాలంలో పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం ప్రాంతంలో చైనా క్రియాశీలంగా ఉంది. పశ్చిమ ఆసియా – మధ్యప్రాచ్య ప్రాంతంలో చేసిన యుద్ధాలతో అమెరికా అపారంగా నష్టపోయిన విషయాన్ని, అలాగే పరిమితులను దాటి రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూపోయి పతనమైన సోవియట్ యూనియన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా తన విదేశాంగ విధానాన్ని రూపోందించుకున్నట్టు కనపడుతోంది. ఈ అవగాహనతో చైనా సైనికేతర మార్గాల ద్వారా ఇరాన్‌కు మద్దతు ఇవ్వడానికి ఎంచుకుంది. 2023 ఇరాన్- సౌదీ సయోధ్యకు మధ్యవర్తిత్వం వహించడం, 2021లో ఇరాన్‌తో 25 సంవత్సరాల సహకార ఒప్పందంపై సంతకం చేయడం, అలాగే 2024లో పాలస్తీనాలో పరస్పరం కలహించుకునే పతా, హమస్ వర్గాల మధ్య రాజీ కుదర్చటంలో చైనా ప్రముఖ పాత్రను పోషించింది. అన్నింటికీ మించి అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్ చమురులో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేయడంవల్ల ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చైనా తోడ్పడింది. ఈ చర్యలు సైనిక సహాయం కంటే ఎక్కువ ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి.
ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రయోజనాలు అపారమైనవి. దాని చమురు దిగుమతుల్లో సగం హార్ముజ్ జలసంధి గుండా వెళతాయి. దాని పెట్టుబడులు ఇరాన్ ఇంధన రంగంలోను, సౌదీ అరేబియా మౌలిక సదుపాయాలలో విస్తరించి ఉన్నాయి. సంఘర్షణ విస్తృతమైతే ఈ పెట్టుబడుల ప్రవాహాలు దెబ్బతింటాయి. చైనా తన చమురు రవాణా కోసం ఆధారపడే హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచేలా చూసుకుంది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నప్పటికీ ఇరానియన్ చమురు ఎగుమతులు పెరిగాయి.
ఈ ప్రయోజనాలను సంరక్షించుకునేందుకు మధ్యప్రాచ్యంలో ఘర్షణను నివారించటానికి రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జూన్ 19న ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం గురించి చర్చించి, ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యలను ఖండించారు. వెంటనే ఉద్రిక్తతను తగ్గించాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ ను ఉల్లంఘించినందుకు ఇజ్రాయెల్‌ను పుతిన్, జిన్‌పింగ్ తీవ్రంగా ఖండించారు.
గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడటాన్ని తగ్గించుకోవడంపైన దృష్టిని సారిస్తున్నాయి. సౌదీ అరేబియా సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ముందుకు సాగుతోంది. లగ్జరీ రెడ్ సీ టూరిజంతో సహా ప్రతిష్టాత్మకమైన విజన్ 2030 ఎజెండాను అనుసరిస్తోంది. రియాద్, అబుదాబి రెండూ ఏఐ డేటా సెంటర్లను నిర్మించాలని కోరుకుంటున్నాయి.
ఇక్కడ గుర్తించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, యెమెన్, సిరియా వంటి దేశాలను ప్రభావితం చేయటం కోసం సౌదీ అరేబియా, ఇరాన్ మధ్యగల పోటీ తీవ్రత తగ్గింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీలో సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నందున, షియాల పట్ల సౌదీ మతాధికారుల ప్రతికూల వైఖరి నియంత్రించబడింది. అంతేకాకుండా మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాలో వహాబీ మత ఛాందసాన్ని తగ్గించాలని చేస్తున్న ప్రయత్నం ప్రభావాన్ని కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి.
ఈ పరిణామాలు సౌదీ అరేబియాను ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మార్చటాని అడ్డంకిగా మారాయి. అంతేకాకుండా గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మానవ హననంలో ఇప్పటివరకు 56,000 మందికి పైగా పాలస్తీనియన్లు చంపబడటంతో గల్ఫ్ దేశాలలోని ప్రజాభిప్రాయం అత్యంత ప్రతికూలంగా మారింది. ఈ దేశాలు ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలను కొనసాగించటాన్ని ఆయా దేశాలలోని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన మూలం “గాజాలో జరుగుతున్న సంఘర్షణ” అనే భావన గల్ఫ్ దేశాలలో సర్వత్రావుంది. చాలా కాలంగా, గల్ఫ్ దేశాలు “ఇరాన్‌ను అతిపెద్ద అస్థిరపరిచే శక్తిగా”, వారు ఎదుర్కోవాల్సిన ముప్పుగా భావించాయి. ఆ లెక్క మారిపోయింది. ఈ ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా అత్యంత అస్థిరతకు కారణమైన శక్తి ఇజ్రాయెల్ అనే అభిప్రాయం స్థిరపడింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య గాజాలో కాల్పుల విరమణకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘర్షణలను ముగిస్తేనే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించటం కుదురుతుంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి ఇజ్రాయెల్ పాలస్తీనా రాజ్య స్థాపన వైపు తిరుగులేని చర్యలు తీసుకునేలా చూడాలని సౌదీ అరేబియా కోరుతోంది. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తర్వాత, సౌదీ అరేబియా ఈ విషయాన్ని బలంగా డిమాండ్ చేస్తోంది. అరబ్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో సౌదీ అరేబియాకు బాగా తెలుసు.
ఇరాన్‌తో గల్ఫ్ దేశాల సంబంధాలను మెరుగుపడకుండా చూడటం, ఇరాన్‌ను ఒంటరి చేయడం గత 30 సంవత్సరాలుగా అమెరికా వ్యూహంగా ఉంది. ఈ వ్యూహం సాధించింది శూన్యం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపాలని చూస్తే, అది పెరిగింది. అలాగే క్షిపణి కార్యక్రమం ప్రభావాన్ని పరిమితం చేయాలని భావించారు. అది జరగలేదు. ఇరాన్ ప్రాక్సీ దళాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావించారు, కానీ దానికి విరుద్ధంగా జరిగింది. కాబట్టి “ఇతర దేశాలతో మనం వ్యవహరించే విధంగానే ఇరాన్‌తోనూ వ్యవహరించాలి” అనే విధానాన్ని అవలంభించవలసిన ఆవశ్యకత ఉందని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. ఇలా ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తరువాత పశ్చిమ ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతంలో రాజకీయ దృశ్యం మారిపోయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.