
IPTA stamp. Photo: India Post.
ఇండియన్ పీపుల్స్ ధియేటర్ అసోసియేషన్ అందించిన నాటకాలు, సినిమాలు అద్భుతమైన కళా ఖండాలు. వాటిని ఎన్నటికీ మరువలేము. ఇప్టా సభ్యులను చిన్నపాటి రాజకీయ కార్యకర్తలు అని పిలవటం వారి కృషిని అవమానించటమే.
కేంద్ర ప్రభుత్వం, దాని తైనాతీలు చరిత్రను, చారిత్రక పరిణామాలనూ, చారిత్రక వాస్తవాలనూ వికృతీకరించటంలో ప్రావీణ్యం సంపాదించారు. మరీ ముఖ్యంగా ఫాసిజాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఈ దేశంలోని అసమానతలతో కూడిన సమాజ నిర్మాణాలను సవాలు చేసిన ప్రజా ఉద్యమాల విషయంలో ఈ వికృతీకరణ మరింత ఎక్కువగా ఉంటోంది. భారతదేశంలో అభ్యుదయ రచయితల సంఘం 1936లో ప్రారంభమైంది. ఆరంభం నుండీ పితృస్వామిక వ్యవస్థ, పేదరికం, సామాజిక అసమానతలు, భూస్వామ్య దోపిడీ, మితవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడం ఈ సంస్థ లక్ష్యాలుగా ఉన్నాయి. ఇదే లక్ష్యాలతో ఇండియన్ పీపుల్స్ ధియేటర్ అసోసియేషన్ ఏర్పడే నాటికి ప్రపంచం, దేశం రాజకీయంగా అల్లకల్లోలంగా ఉంది. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నాటికి దేశవ్యాప్తంగా పని చేస్తున్న వివిధ ధియేటర్ బృందాలు ఏకతాటిమీదకు వచ్చాయి. 1943 మే 25న ఇప్టా బొంబాయిలో ప్రారంభమైంది. ప్రారంభ సమావేశానికి ప్రొఫెసర్ హీరేన్ ముఖర్జీ అధ్యక్షత వహించారు.
ఇప్టా ఏర్పడే నాటికి జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పరిణామాలేమంత ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా లేవు. రెండో ప్రపంచ యుద్ధంలో పరుగులు తీస్తున్న జర్మనీ దాదాపు యావత్ యూరప్‌పై జయకేతనం ఎగురవేసి రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయింది. ప్రపంచాన్ని తన పదఘట్టనల కింద నలిపి వేయటానికి సిద్ధమవుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సృజనాత్మక శక్తులు, కళాకారులు, రచయితలు ఏకమైన ఓ ప్రతిఘటనా వేదికను ప్రారంభించారు. జర్మనీ ప్రపంచం మీద సాగిస్తున్న సైద్ధాంతిక దాడికి వ్యతిరేకంగా ప్రపంచంలో పేరెన్నికగన్న మేధావులంతా ఒక వేదిక మీదకు రావటం దేశంలో ఇఫ్టా సభ్యులను ప్రభావితం చేసింది. అంతర్జాతీయంగా సాగుతున్న ప్రతిఘటనా సంస్కృతికి వీరిని మరింతగా ఆకర్షించింది. ఇప్టా ప్రారంభం వెనక అప్పటి భారత కమ్యూనిస్టు పార్టీ కృషి ఉన్నదని పలువురు పరిశోధకులు గుర్తించారు. అంగీకరించారు.
అభ్యుదయ రచయితల సంఘంలో లాగానే ఇఫ్టాలో కూడా ఉన్న క్రియాశీల కార్యకర్తలందరూ కమ్యూనిస్టులు కాదు. వేర్వేరు రాజకీయ సైద్ధాంతిక ధోరణులు ఉన్నవాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. భారతదేశం ఆ నాటి దుస్థితికి దిగజారటానికి కారణమైన అన్నిరకాల దుర్గుణాల నుండి దేశాన్ని విముక్తి చేయటమన్నదొక్కటే వారందరినీ ఏకం చేసిన లక్ష్యం. ఈ లక్ష్యాల దిశగా జనాన్ని సమీకరించటానికి నాటకరంగం సాధనంగా అక్కరకొస్తుందని భావించారు. అత్యంత దోపిడీ పీడనలతో కునారిల్లుతున్న దేశంలో నాటకరంగం ప్రత్యేకించి కళారంగం పాత్ర గురించి పునరాలోచించాల్సి ఉంది. కళ కళ కోసం కాదనీ, సమాజం కోసమనీ 1936లో విడుదల చేసిన మానిఫెస్టో ద్వారా అభ్యుదయ రచయితల సంఘం ప్రకటించింది.
కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్టా గురించిన సమాచారం కోసం అంతర్జాలంలో వెతుకుతుంటే అజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్ కనిపించింది. అందులో అందులో డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపాజిటరీ వివరాలు అన్న శీర్షికన ఈ వెబ్ సైట్ నడుస్తోంది. ఇప్టా గురించిన సంక్షిప్త పరిచయం అన్న శీర్షికన ఉన్న వ్యాసంలో స్వాతంత్య్రోద్యమంతో సమాంతరంగా సాంస్కృతికోద్యమాన్ని చేపట్టడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యిందని రాశారు. ‘ఈ సంస్థ మౌలిక లక్ష్యం ప్రజల్లో ఆత్మాభిమాన భావనను పెంపొందించటం. ప్రజలెదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన కల్పించటం, ప్రజలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించటం’ కోసం ఏర్పాటైందని కూడా రాశారు.
సరిగ్గా ఈ వ్యాఖ్యానంలోనే ఇప్టా సభ్యుల మౌలిక రాజకీయ ఉద్దేశ్యాలను పాఠకుల దృష్టికి తీసుకురాకుండా చేయటానికి అధికారిక చరిత్రకారులు, వ్యాఖ్యాతలు ఇప్టా సభ్యులు దేశంలో పేదరికాన్ని నిర్మూలించటం, ప్రజల దుస్థితి నుండి వారిని విముక్తి చేయటం వంటి కీలకమైన లక్ష్యాలు ఉన్నాయి. దాంతో పాటు బెంగాల్ క్షామానికి వలసపాలన విధానాలతోపాటు జమీందారీ వ్యవస్థ కూడా కారణమన్న విషయంలో ఇప్టా శ్రేణుల్లో ఎటువంటి సందేహాలూ లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం భావితరాలకు ఇప్టా గురించి వారి రాజకీయ కార్యాచరణ గురించి తెలియచెప్పే ఈ విషయాల్లో ఈ కీలకమైన సారాన్ని మాత్రం చెప్పటానికి సిద్ధం కావటం లేదు. చరిత్రను వక్రీకరించటంలో ఇదో విన్నూత్న మార్గం.
ఇప్టా సభ్యులకు స్థిరమైన రాజకీయాభిప్రాయలు లేవనీ, స్వల్పంగా రాజకీయ భావాలు కలిగిన వారిని ఈ సంస్థలోకి ఆహ్వానించేదనీ, ప్రధానంగా సాంస్కృతిక రంగం ద్వారా జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేసిందని ఈ వ్యాఖ్యానంలో చెప్పారు.
ఇప్టా సభ్యులు స్వల్ప రాజకీయాభిప్రాయాలు కలిగిన వారు అని చెప్పటం అంటే వారి కృషిని, త్యాగాలను అవమానించటమే కాదు. మన పాలకవర్గాల భేషజాన్ని నగ్నంగా బయటపెట్టుకోవడంతో పాటు కోట్లాదిమందిని దోపిడీ పీడనల నుండి విముక్తి చేయాల్సి ఉందన్న ఇప్టా లక్ష్యాన్ని అటకెక్కించటమే అవుతుంది.
ఇప్టాలో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీకి చెందినవారే అయినప్పటికీ అందరూ వామపక్షవాదులే కాదు. అయితే అభ్యుదయ రచయితల సంఘంలో లాగానే ఇప్టా సభ్యులు కూడా మౌలికంగా సామ్రాజ్యవాద వ్యతిరేకులు. ప్రజాతంత్రవాదులు. భూస్వామ్య వ్యతిరేక, పెట్టుబడిదారీ వ్యతిరేక లక్ష్యాలకు కట్టుబడి ఉన్న వాళ్లు. ఇప్టా సభ్యుల రాజకీయ భావజాలం ఏమిటో అర్థం చేసుకోవడానికి కొంతమంది నాయకుల గురించి అయినా మనం గుర్తు చేసుకోవాలి. సోంబు మిత్ర, బిజోన్ భట్టాచార్య, ఉత్పల్ దత్. భూపేన్ హజారికా, రాజారావు, కె ఎ అబ్బాస్, బలరాజ్ సాహ్ని, రాజీందర్ సింగ్ బేడి, సాదత్ హసన్ మంటో, కృష్ణ చందర్, ఇందర్ రాజ్, ఆనంద్ పృధ్వీరాజ్ కపూర్, కైఫీ అజ్మి, ఎకె హంగల్, బిమల్ రాయ్, సత్యేన్ బోస్, బాసు భట్టాచార్య, దుర్గా ఖోటే, దీనా పాఠక్, షౌకత్ అజ్మి, సలిల్ చౌదురి, సజ్జన్, సత్యేన్ కప్పు, ఎం ఎస్ సత్యు, అనంత్ నాగ్ నాటి ఇప్టా అగ్రశ్రేణి నాయకత్వంలో కొందరు. వీరితో పాటు మరెందరో మెరికల్లాంటి ప్రజా సాంస్కృతిక మేధావులున్నారు. అందరూ దేశాన్ని, ప్రజలను పట్టి పీడిస్తున్న మిగతవాద ప్రగతి నిరోధక ఆలోచనలు, అవగాహనలు, ఆచరణల నుండి విముక్తి చేయాలన్న తలంపుతో కళా రంగాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నవారే. ఈ దిశగా సాగించిన కృషిలో భాగంగా ఇప్టా సినీ, నాటక మాధ్యమాల్లో ఇప్టా అందించిన కొన్ని ఆణిముత్యాలను మనం ఎన్నటికీ మరువలేము.
ప్రజల వద్దకే నాటకం అన్నది అద్భుతమైన సృనాత్మక కార్యాచరణ. అప్పటి వరకూ నాలుగు గోడలు, కులీన ప్రేక్షకుల నడుమ బందీ అయిన నాటకాన్ని స్వేఛ్చగా రెక్కలు విప్పుకుని ప్రజల ముంగిట్లో వాలే చేసింది ఇప్టా. ఆకాశమే పందిరిగా భూదేవే వేదికగా నాటకాలు ప్రదర్శించటం మొదలైంది. ఈ నాటకాలు వాస్తవానికి దగ్గరగానూ, ప్రజల జీవిత సమస్యలను ప్రతిఫలించేవిగానూ ఉండేవి. ఇక్కడ కళాకారుల ఉద్దేశ్యం ఒక్కటే. ప్రజల ఈతిబాధలతో పాటు ఆకాంక్షలను కూడా కళాత్మక ప్రదర్శనల ద్వారా ప్రజల ముందుంచటం. ఆర్థిక ఆధిపత్యం, దోపిడీ, మతోన్మాద మూఢత్వం, సామాజిక ధూర్తలక్షణాలను వ్యతిరేకంటమే ఇప్టా లక్ష్యంగా ఉండేది.
1943 నాటి కలకత్తా క్షామం తర్వాత 1944లో సోంబు మిత్ర దర్శకత్వంలో నబన్నా (మిగులు పంట) పేరుతో ప్రదర్శించిన నాటకమే ఇప్టా తొలి భారీ ప్రదర్శన. ఇప్టా వ్యవస్థాపక సభ్యులు బిజోన్ భట్టాచార్య రాసిన నాటకం ఇది. రైతాంగాన్ని పీడిస్తున్న భూస్వాములు, కటిక పేదరికం, ఆకలి చావులు గురించి నాటకంలోని వర్ణన గుండెలను పిండేస్తుంది. ఈ మహా క్షామం మనిషి అనుసరించిన అర్థం లేని విధానాల ఫలితమే తప్ప కేవలం ప్రకృతి కృత్యం కాదని బిజోన్ బాబు నిస్సంకోచంగా చెప్పాడు. క్షామం బారిన పడ్డ గ్రామం వదిలిన కొందరు రైతులు సుదూరంగా ఉన్న నగరానికి చేరి అనాధలుగా, భిక్షగాళ్లుగా బతుకులీడుస్తున్న తీరే ఈ నాటకం సారాంశం. నగరం నేర్పిన రాజకీయ చైతన్యంతో ఈ రైతాంగం రెట్టించిన పట్టుదలతో తిరిగి గ్రామానికి చేరుకుంటారు. దాంతో నాటకం ముగుస్తుంది.
1943 నాటి క్షామంలో చనిపోయిన శవాలు చూడటానికి కూడా సిద్ధపడక మొఖం తిప్పుకున్న వాళ్లు కూడా నబన్నా నాటకం చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టకుండా వెళ్లలేదు. ప్రముఖ చలన చిత్ర దర్శకులు రిత్విక్ ఘటక్ మాటల్లో నాటకం కేవలం సామాజిక సంఘర్షణ సాధనం మాత్రమే కాదు. ఆయుధం కూడా అని విశ్లేషించాడు. నాటకం ప్రజా ప్రయోజనాల క్షేత్రంగా ఎలా ఉండగలదో, ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఉన్న సామాజిక వాస్తవాన్ని ఒకేసారి బహుముఖ రూపాల్లో ప్రేక్షకుల ముందు ఆవిష్కృరింపచేయవచ్చని తొలిసారి చూపిన వ్యక్తి బిజోన్ బాబు అంటాడు రిత్విక్ ఘటక్. ఇటువంటి నాటకరంగాన్ని, కళారూపాల సృష్టికర్తలను స్వల్పమైన రాజకీయ భావాలు కలిగిన వారిగా చిత్రీకరించటం అంటే వాస్తవాన్ని మసిపూసిమారేడు కాయ చేయటం తప్ప మరేమీకాదు.
1930లో బీమార్ పేరుతో సజ్జాద్ జహీర్ రాసిన ఏకాంకిక కు ఆంగ్లానువాదం 1941లో అచ్చయ్యింది. ఈ నాటికలో మధ్యతరగతి రైతాంగానికి, వ్యవసాయకార్మికులకు మధ్య ఉండే వైరుధ్యాలను ఎత్తిచూపుతారు రచయిత. నాటిక చరమాంకంలో ప్రధాన పాత్ర బషీర్ ‘‘ఇప్పుడున్న చట్టం కష్టపడే వాడికి ఫలితం దక్కేలా చూసేది కాదు. ఏ పనీ చేయని వాడే భూస్వామిగా మారి పెత్తనం చేస్తున్నాడు. కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే ఆసాములు మాత్రం సుఖసంతోషాలు, విందులువినోదాలతో కాలక్షేపం చేస్తుంటారు. ఇక్కడున్న సాంప్రదాయం ఏమిటంటే ఫలానా ఫలితం కావాలని ఎవరన్నా గొంతెత్తి నిలదీస్తే లాఠీలు, అప్పటికీ వినకపోతే తూటాలు ప్రయోగించటం. శ్రమ ఫలితంగా సృష్టించిన సంపదంతా అర్భకులు, సోమరులు, పరాన్నభుక్కులు, భజనపరులు, ముందు చూపులేని మూర్ఖుల పాలవుతుంది. సంపద ఉన్న వాళ్ల చేతుల్లోనే అధికారం ఉంటుంది. అధికారం చేజిక్కించుకున్న వాళ్లే చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు పేదలకు, శ్రమజీవుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇదే నేటి నీతి. అటువంటి చట్టాలకు లొంగి ఉండటం అంటే నా దృష్టిలో మానవాళికి అన్యాయం చేయటమే.’’ అంటాడు బాధగా. ఇలాంటి నాటికల ద్వారా రచయితలు చెప్పదల్చుకున్న సందేశం స్పష్టంగానే ఉంది. శ్రమ దోపిడీయే అన్ని రకాల సామాజిక సమస్యలకూ కారణం. అందువల్లనే ఇప్టా నేతృత్వంలో నాటకరంగం, సృజనకారులు శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కళారూపాల ద్వారా గళమెత్తారు.
బొంబాయి కేంద్రంగా నడుస్తున్న చలనచిత్ర రంగాన్ని 1950, 1960 దశకాల్లో ఇప్టా పెద్దఎత్తున ప్రభావితం చేసింది. స్వాతంత్య్రానంతరం కూడా దేశం ఆర్థిక సామాజిక బానిసత్వం నుండి విముక్తి పొందలేదన్న వాస్తవాన్ని ఈ కాలంలో విడుదలైన సినిమాల్లో మనం చూడవచ్చు. ముగింపుగా చెప్పాలంటే ఇప్టా సభ్యులు స్వల్ప రాజకీయ భావాలు కలిగిన వారు మాత్రమేనని వర్ణించటం వారు జీవితాలు అంకితం చేసుకున్న లక్ష్యాలను ఎగతాళి చేయటమే. స్వాతంత్య్ర భావనను అనేక కోణాల్లో విస్తరించేందుకు కృషి చేసిన సృజనకారులు నిర్మించిన ఉద్యమ వాస్తవిక చరిత్రను తప్పుదారి పట్టించటమే. తీవ్రవాద భావాలున్న వారి గురించి భావితరాలకు తెలియచెప్పకుండా ఉండటమే అధికారిక చరిత్ర క్రమం అయితే ప్రస్తుత పాలకులు రాజకీయాలంటే ఓనమాలు తెలీదనే చెప్పాలి. భిన్నాభిప్రాయాల మధ్య జరిగే ఘర్షణే రాజకీయాలు. ఎన్నికల్లో పోటీ చేయటం ఒక్కటే రాజకీయం కాదు.
(నీరజ ఛందోక్ ఢల్లీి విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఫ్రొఫెసర్‌గా పని చేశారు).
రచన: నీరజ చందోక్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.