
పదో తరగతి జీవశాస్త్ర పాఠ్య పుస్తకం నుండి డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం అధ్యాయాన్ని తొలగిస్తూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీయార్టీ) నిర్ణయించింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కోవిడ్ పుట్టుక, వ్యాప్తిని అర్థం చేసుకోవాలంటే డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి సమయంలో కోవిడ్ పేరు చెప్పి దాని పుట్టు పూర్వోత్తరాలు తెలియచెప్పే డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా రద్దు చేయటం కంటే ఘోరం మరోటి ఏముటుంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రాలైన జెనెటిక్స్, ఇమ్యునాలజీ వంటివన్నీ జీవశాస్త్రానికి అనుబంధాలే.
కోవిడ్ కాలంలో విద్యార్థులపై భారం తగ్గించేందుకు జీవపరిణామం అధ్యాయాన్ని పాఠ్యపుస్తకాల నుండి తొలగించామని చెప్పటం నమ్మశక్యం లేదు. నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా కూడా లేరు. 2018లోనే అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ ఓ ప్రకటనలో ‘జీవపరిణామ సిద్ధాంతం ఒట్టి బోగస్ సిద్ధాం. వానరుడు నరుడుగా మారటం అన్నది భూమ్మీద ఎవ్వరూ చూడలేదు. మనిషి మనిషిగానే భూమ్మీదకొచ్చాడు.’ అని తేల్చేశారు. తన వ్యాఖ్యలకు సమర్థించుకుంటూ అసలు పిల్లలకు జీవపరిణామ సిద్ధాంతం గురించి బోధించటం మానేయాలని కూడా పట్టుబట్టారు. సత్యపాల్ సింగ్ ప్రస్తుతం విద్యాశాఖలో లేరు. కానీ ఆయన చెప్పిన సూత్రం మాత్రం ఇప్పుడు విద్యావిధానంలో భాగం అయ్యింది.
అమెరికాతో సహా అనేక దేశాల్లో మతోన్మాద ఛాందసవాద బృందాలు డార్విన్ సిద్ధాంతాన్ని దశాబ్దాల తరబడి తెగనాడుతూనే ఉన్నాయి. కానీ ఆయా దేశాల్లో ఎక్కడా ఈ పాఠ్యాంశాన్ని పిల్లకు నేర్పకూడదనే స్థాయికి బరితెగించలేదు. డార్విన్ సిద్ధాంతంపై దాడి చేసే దేశాల్లో ఎక్కువ భారతదేశానికి సరిహద్దుల్లోనూ, పశ్చిమాసియాలోనూ ఎక్కువగా ఉన్నాయి. సౌదీ అరేబియా, మొరాకో, ఒమన్, అల్జీరియా దేశాల్లో డార్విన్ సిద్ధాంతంపై పూర్తి నిషేథం ఉంది. లెబనాన్‌లో నిషేధం లేకపోయినా పిల్లలకు పాఠాలుగా చెప్పటం లేదు. జోర్డాన్‌లో జీవశాస్త్రం కూడా మతగ్రంధాల బోధనలో భాగం అయ్యింది. ఈజిప్ట్, ట్యునిషియా వంటి దేశాల్లో నిరూపణకు అవకాశం లేని సిద్ధాంతం పేరుతో డార్విన్ సిద్ధాంతాన్ని పిల్లలకు పరిచయం చేస్తున్నారు. ముస్లిం మతోన్మాద శక్తులు జారీ చేసే ఫత్వాల్లో డార్విన్ సిద్ధాంతంపై దాడి అంతర్భాగంగా ఉంటుంది. అంటే డార్విన్ సిద్ధాంతాన్ని చదివినా, చెప్పినా మతపరమైన ప్రమాణాలను ఉల్లంఘించినట్లన్నమాట. అటువంటివారు ఆయా దేశాల్లో శిక్షార్హులవుతారు. అమెరికాలో కాథలిక్ సంస్థల మద్దతుతో పని చేస్తున్న కొన్ని శక్తులు సృష్టికర్త సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. డార్విన్ చెప్పినట్లు మానవజాతి నిర్దిష్ట పరిణామ క్రమంలో పుట్టుకురాలేదనీ, కేవలం ఓ సృష్టికర్త అనుకున్నాడు కాబట్టి మనిషి పుట్టాడన్నది ఈ సంస్థలు చేసే ప్రచార సారాంశం.
ఇటువంటి వాదన పర్యవసానమేమిటి?
పాఠ్యాంశంగా డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించటం అన్నది గుర్తించలేనంత చిన్న మార్పేమీ కాదు. పునరుద్ధరణవాదం, అంతా వేదాల్లోనే ఉందష అనే ప్రచారాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. ఈ నిర్ణయం దేశంలో శాస్త్రీయ దృక్ఫధం పెంపొందించుకోవడంపైనా, హేతవాదంపైనా, మౌలికంగా విజ్ఞాన శాస్త్రాల బోధనపైనా జరుగుతున్న దాడిలో భాగమే. ఈ నిర్ణయం విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం, శాస్త్రజ్ఞాన పరిశోధనలను రానున్న కాలంలో తీవ్రంగా ప్రభావితం చేయనున్నది. ప్రపంచ శాస్త్రవిజ్ఞాన సముదాయంలో భారతదేశపు పాత్రను కించపర్చేదిగా ఉంటుంది.
జీవశాస్త్రంతో ముడిపడి ఉన్న అన్ని అనుబంధ రంగాల్లో సాగే పరిశోధనలకు డార్విన్ సిద్ధాంతం పునాది. పర్యావరణం, యాంటీ బయాటిక్ నిరోధక శక్తి, పశుపక్ష్యాదులు, మనుషులు కలిసి మెలిసి జీవించే వాతావరణంలో తలెత్తే మహమ్మారి రోగాలు వంటి అనేక సంక్షోభాలను సమస్యలను పరిష్కరించటంలో డార్విన్ సిద్ధాంతం ఆధారంగా సాగే పరిశోధనలు మానవాళికి ఎంతగానో మేలుచేయనున్నాయి. చేస్తున్నాయి. ఇప్పుడున్న ప్రమాణాలతో చూస్తే భారతీయ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాల బోధన సమస్యాత్మకంగానే ఉంది. వర్తమాన ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలో ఈ ప్రమాణాలు మరింత పతనావస్థకు చేరనున్నాయి. ధర్మశాస్త్రాలే విజ్ఞాన శాస్త్రాలని నొక్కి వక్కాణించే క్రమంలో ముందు ముందు అటు పాఠశాల స్థాయిలోనూ, ఇటు ఉన్నత విద్యాసంస్థల్లోనూ విజ్ఞాన శాస్త్రాల బోధన ప్రమాణాలు మరింత దిగజారనున్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి బదులు దశావతారాలే మన పరిణామవాదం అన్న పాఠాలు నేర్చుకున్న తర్వాత రానున్న విద్యార్థి తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. 2019లో జరిగిన భారతీయ విజ్ఞాన శాస్త్ర సదస్సులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి నాగేశ్వరరావు ఈ పాటికే దశావతారాలే అసలైన జీవపరిణామ క్రమం అని ప్రచారంమొదలు పెట్టాడు. ఈ సదస్సులోనే న్యూటన్, ఐనస్టీన్ సిద్ధాంతాలను తోసిపుచ్చుతూ చదువుకున్న పండితులు పలు ‘పరిశోధనా పత్రాలు’ కూడా ప్రవేశపెట్టారు.
భారతదేశంలో భవిష్యత్తులో జరిగే శాస్త్రసాంకేతిక పరిశోధనలపై ఈ నిర్ణయాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రాచీనకాలపు శాస్త్ర విజ్ఞానాన్ని సమర్ధిస్తూ చేసే వాదనల పేరిట ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా, పరిశోధన సంసస్థల్లో కుహనా విజ్ఞానశాస్త్రాలను ప్రారంభించటం మనం చూస్తున్నాము. ఈ ప్రయత్నమంతా అంధ విశ్వాసాలు శాస్త్రసమ్మతమైనవేనని చెప్పే ప్రయత్నమే. ప్రాచీన కాలపు విజ్ఞానంపై పరిశోధనల పేరిట గోమూత్రం, పేడలో ఔషధ లక్షణాలు, ఆధ్యాత్మిక వ్యవసాయం, జ్యోతిష్య వైద్యం వంటి అర్థం లేని పరిశోధనలకు నిధులు కేటాయించాలని కేంద్రప్రభుత్వం ఆధీనంలో పని చేసే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, పారిశ్రామిక, విజ్ఞాన శాస్త్ర పరిశోధన సంస్థ వంటివాటిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఆయా ఒత్తిళ్లకు తలొగ్గి విలువైన నిధులను ఈ సంస్థలు ఇటువంటి పరిశోధనలకు కేటాయిస్తున్నాయి. దేశంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించటంలో కీలక పాత్ర పోషించే ఎన్సీయార్టీ లాంటి ప్రభుత్వ సంస్థలే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తర్వాత చరిత్ర చీకటి యుగాల్లో తలెత్తిన ఆలోచనలకు ప్రజాసమ్మతి సమకూర్చేందుకు జరిగే పరిశోధనలకు పెద్దన నిధులు మళ్లించకుండా ఆపటం కూడా సాధ్యం కాబోదు. ఇటువంటి పరిణామాలు భావి భారత విజ్ఞానశాస్త్ర పరిశోధనలను మసకబార్చనున్నాయి.
మేధావుల స్పందన
2018లో అప్పటి కేంద్ర మంత్రి సత్యపాల్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తోసిపుచ్చినప్పుడు దేశంలో శాస్త్రవ్తేత్తలు, పౌర మేధావులు ఆయన ప్రకటనలను ఖండిరచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్స్ ` ఇండియా, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ ఆకాడమీ ఆఫ్ సైన్స్‌లు మూడు కలిసి కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ఉమ్మడి ప్రకటన కూడా చేశాయి. ఈ ప్రకటనలో ‘‘ డార్విన్ విశేష కృషితో పురోగమించిన జీవపరిణామ సిద్ధాంతం వాస్తవికత నిస్సందేహంగా రుజువు అయ్యింది. జీవపరిణామానికి సంబంధించిన మౌలిక వాస్తవాల విషయంలో ఎటువంటి వివాదమూ లేదు. ఇది శాస్త్రీయ సిద్దాంతం. అనేక ప్రయోగాలు, పరిశీలనల్లో నిజమని నిగ్గుదేలిన సిద్థాంతం.’’ అని ఈ సంస్థలు తేల్చాయి.
డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాశంగా తొలగించాలన్న మంత్రి ప్రకటనను సవాలు చేస్తూ దేశంలోని శాస్త్రవేత్తలకు ప్రాతినిధ్యం వహించే ఈ మూడు సంస్థలూ ‘‘ నిరాధారమైన నమ్మకాలు, విశ్వాసాలే వాస్తవాలని ప్రచారం చేస్తూ వందల ఏళ్లుగా రుజువు అవుతూ వస్తున్న డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా తొలగించటం తిరోగామి చర్య.’’ అని నిర్ద్వంద్వంగా ఖండిరచాయి. అప్పట్లో మంత్రి వ్యాఖ్యానమే నేటి విద్యావిధానంగా మారిన నేపథ్యంలో శాస్త్రవేత్తలకు ప్రాతినిధ్యం వహించే ఈ మూడు సంస్థలూ పట్టుపబట్టి తమ పలుకుబడిని ఉపయోగించి డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు ఉమ్మడిగా కృషి చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవిజానంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటిస్తూ కుహనా విజ్ఞానశాస్త్రాల మర్మాన్ని విప్పిచెప్పేందుకు అనేక సంస్థలూ, శక్తులూ కృషి చేస్తున్నాయి. విశాల జనబాహుళ్యంలో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలోని శాస్త్రవిజ్ఞాన సంస్థలు కూడా ఇదే దోవలో నడవాలి. ఉలిపికట్టెల్లా మిగిలిపోకూడదు.
బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ పేరుతో ఒక వేదిక మీదకు వచ్చిన స్వతంత్ర శాస్త్రవేత్తలూ, విద్యావేత్తలూ ఎన్సీయార్టీ నిర్ణయాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో ‘‘ జీవపరిణామ సిద్ధాంతం నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్ఫధాన్ని పెంపొందించుకునేందుకే కాక శాస్త్రీయమైన ప్రాపంచిక దృక్ఫధాన్ని పెంపొందించుకునేందుకు కూడా అవసరం. డార్విన్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగించిన అధ్యయనాలూ, పరిశోధనల ఆధారంగా రూపొందిన జీవావరణ సిద్ధాంతం విద్యార్థుల్లో విమర్శనాత్మక దృక్కోణానికి పునాదులేస్తుంది. విజ్ఞానశాస్త్ర క్రమం గురించి ఓ ప్రాధమిక అవగాహన కల్పిస్తుంది. పదో తరగతి తర్వాత జీవశాస్త్రం చదవని విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. వారందరికీ పాఠశాల స్థాయిలో ఈ మాత్రం ప్రాధమిక అవగాహన కల్పించేందే డార్విన్ సిద్ధాంతం. ఆ పాఠాన్ని రద్దుచేయటం అత్యంత తిరోగామి చర్య.’’ అని స్పష్టం చేశాయి.
విజ్ఞానశాస్త్రాల అధ్యయనం, బోధనలపై జరుగుతున్న దాడి డార్విన్ దగ్గరో, జీవపరిణామ సిద్ధాంతం దగ్గరో ఆగిపోదని జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ దాడిని ప్రతిఘటించేందుకు హేతుబద్దమైన, తర్కబద్దమైన సాంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించే వారంతా పూనుకోవాలి. ఇదేదో విజ్ఞాన శాస్త్రాలకో, విజ్ఞానశాస్త్రాల బోధనకో పరిమితమైన సమస్యగా చూడకూడదు. యావత్ దేశానికీ, సమాజానికీ సంబంధించిన సమస్యగా చూడాలి.
రచన: దినేష్ సి శర్మ
అనువాదం: కొండూరి వీరయ్య
(దినేష్ సి శర్మ ఢల్లీ నివాసి. రచయిత. విలేఖరి. ఆయన తాజా రచన ఇండియన్ ఇన్నొవేషన్, నాట్ జుగాడ్ : 100 ఐడియాస్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా పుస్తకాన్ని 2022లో రోలి బుక్స్ వారు ప్రచురించారు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.