
Darwin
2018లో అస్సాంలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి పిల్లల బోధనాంశాల జాబితా నుండి డార్విన్ బోధించిన జీవావరణ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా తొలగించాలని ప్రతిపాదించారు. దానికి ఆయన చెప్పిన కారణం కోతి నుండి మనిషిగా పరిణామం చెందటాన్ని ఎవ్వరూ చూడలేదు కాబట్టి అదే సత్యమని నిర్ధారించలేమన్నది ఆయన వాదన. తర్వాత కూడా అనేక సదర్భాల్లో డార్విన్ పరిణామవాద సిద్ధాంతానికి శాస్త్రీయ పునాది లేదనీ, మన పూర్వీకులతో సహా ఎవ్వరూ తాము నరునిగా మారిన వానరాన్ని చూడలేదని అన్నారు. దేశంలోని 2000పైగా శాస్త్రవేత్తలు మంత్రి ప్రకటన అశాస్త్రీయమైనదనీ, ప్రజలను తప్పుదారి పట్టిస్తుందనీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రి ప్రకటనలకు భిన్నంగా ఆధునిక ప్రపంచం ఆవిష్కరిస్తున్న ప్రతి పురోగమనమూ డార్విన్ సిద్ధాంతాన్ని పదేపదే రుజువు చేస్తున్నాయని ఈ శాస్త్రవేత్తలు ఆ పిటిషన్లో తెలిపారు.
దేశంలో మితవాద పార్టీకి ప్రతినిధిగా ఉన్న మంత్రి డార్విన్ సిద్ధాంతాన్ని తూలనాడటంలో వింతేమీ లేదు. 1859లో ఆరిజన్ ఆఫ్ స్పీసీస్ గ్రంధాన్ని వెలువరించిన నాటి నుండీ ప్రపంచ వ్యాప్తంగా మతోన్మాదుల దాడికి గురవుతూనే ఉంది డార్విన్ సిద్ధాంతం. ఈ గ్రంథంలోనే ఆయన జీవావరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. లక్షల సంవత్సరాల క్రితం భూమ్మీద పుట్టుకొచ్చిన ప్రాణులు నేటికీ మన చుట్టూ అనేక రూపాల్లో పరిణామం చెందుతూనే ఉన్నాయన్నది ప్రకృతి గురించిన మానవాళి అవగాహన మారటానికి వేసిన మొదటి పునాది. ఈ ఒక్క ఆవిష్కరణ మానవాళి చరిత్రనే మార్చేసింది. మన పుట్టుక, పరిణామం, చావులకు దేవుడు కారణం కానేకాదని తేల్చి చెప్పింది.
‘చరిత్ర తనను తాను పునరావృతం చేసుకుంటుంది. ఈ పునరావృతం మొదటిసారి భయానకంగా ఉంటే రెండోసారి ఎగతాళిగా మారుతుంద’ని కారల్ మార్క్స్ వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ మాత్రం ఎగతాళిగా మొదలైన సంఘటనలు భయానకంగా మారుతున్న పరిణామాన్ని దేశంలో చూస్తున్నాము. సదరు మంత్రి మహోదయులు మనమంతా కోతికి పుట్టామా అని నిలదీసిన ఐదేళ్ల తర్వాత ఆయన అభిప్రాయం ప్రభుత్వ విధానంగా మారటంతో దేశ విద్యారంగంతో ముడిపడి ఉన్న వారంతా హతాశులయ్యారు. ఇప్పుడది కఠోర వాస్తవంగా మనముందు నిలుస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) పదోతరగతి విజ్ఞానశాస్త్రాల పుస్తకం నుండి డార్విన్ సిద్ధాంతాన్ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించింది. కోవిడ్ నిర్భంధనల కాలంలో ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాల్సి రావటంతో విద్యార్ధులకు భారంగా ఉండకూడన్న నెపంతో కొన్ని పాఠాలను తొలగించారు. కానీ ప్రస్తుతం ఎన్సీఆర్టీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పత్రం ప్రకారం విద్యాంశాలను హేతుబద్దంగా మార్చే ప్రయత్నంలో శాశ్వతంగా ఈ పాఠాన్ని తొలగిస్తున్నట్లు వెల్లడిరచారు. కోవిడ్ కాలంలో తాత్కాలికంగా తొలగించిన పాఠాలను సాధారణ బోధనాపద్ధతి పునరుద్ధరించిన తర్వాత కూడా శాశ్వతంగా తొలగించటం పాఠ్యాంశాలను హేతుబద్దీకరించటం ఎలాగవుతుందో అర్థం కాని పరిస్థితి.
ఎన్సీఆర్టీ ప్రకటించిన విధాన పత్రంలో ఇప్పటివరకూ పదోతరగతి జీవశాస్త్రంలో పాఠ్యాంశంగా ఉన్న ‘వారసత్వం`పరిణామం’ అన్న అధ్యాయాన్ని తొలగించి కేవలం వారసత్వం అన్న భాగాన్నే సిలబస్‌లో కొనసాగిస్తున్నామని, పదోతరగతి సిబ్బందికి పాఠ్యాంశాల భారాన్ని తొలగించేందుకు జరుగుతున్న కసరత్తులో ఇది భాగం మాత్రమేనని తెలియచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా భూమ్మీద ప్రాణి పుట్టుక అన్న చార్లెస్ రాబర్ట్ డార్విన్ పరిశోధన, మాలిక్యులార్ ఫైలోజెని, జీవావరణం, వర్గీకరణ, దశలవారీగా జరిగిన జీవావరణం, అంతిమంగా మానవుని ఆవిర్భావం, వివిధ జీవావరణ పరిణామాల మధ్య ఉన్న సంబంధాలు వంటి అంశాలను పాఠ్యపుస్తకాల నుండి కేంద్రం తొలగించింది. ఈ నిర్ణయం దేశంలో శాస్త్రవిజ్ఞాన బోధనకు తీరని చేటు చేస్తుందని 1800 మంది శాస్త్రవేత్తలు కేంద్రానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం కేంద్ర మంత్రి చేసిన విమర్శలే నేడు దేశంలో ప్రభుత్వ విధానంగా మారాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో పాఠశాల విద్యా బోర్డు ఆ రాష్ట్రంలో విద్యార్ధులు ఇష్టపడితేనే జీవావరణ పాఠాలు నేర్చుకోవచ్చు లేదంటే బాదరబందీ ఏమీ లేదు అని నిర్ణయించింది. దీనిపై స్పందిస్తూ ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త పౌర మేధావి స్టీఫెన్ జే గౌల్డ్ అన్నమాటలు ఇక్కడ ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది. మీకు ఇంగ్లీషు పాఠాలు చెప్తాము కానీ ఇంగ్లీషు వ్యాకరణం చెప్పాల్సిన అవసరం లేదంటే ఎలా ఉంటుందో జీవావరణ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటే కూడా అలాగా ఉంటుందని జే గౌల్డ్ వ్యాఖ్యానించారు.
‘జీవావరణ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా తొలగించటంపై విజ్ఞప్తి’ పేరుతో శాస్త్రవేత్తలు ఇచ్చిన అర్జీలో దేశంలో విద్యార్ధులకు శాస్త్రీయ దృక్ఫధాన్ని అలవర్చటంలో ఈ పాఠం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనీ, ఈ పాఠాన్ని తొలగించటం మొత్తం పాఠశాల విద్యాబోధనకే హానికరమని గుర్తు చేశారు. కేవలం జీవ పరిణామ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికే కాక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందులో జరిగే మార్పులనూ అర్థం చేసుకోవడానికి కూడా ఈ పాఠ్యాంశాలు కీలకమైనవని ఆ లేఖ రాసిన శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా భూమ్మీద కొన్ని ప్రాణులు ఎందుకు అంతరిస్తున్నాయో, మరికొన్ని ఎందుకు ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయో అర్థం ఏసుకోవచ్చు. పర్యావరణం, ఔషధ పరిశోధనలు, పర్యావరణం, అంటువ్యాధుల అధ్యయనాలు వంటి విషయాల్లో ఈ పాఠ్యాంశాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తమ లేఖలో తెలిపారు.
దేశంలో శాస్త్ర విజ్ఞాన బోధనకు అవకాశాలు కుందించుకుపోవటం జాతీయ సాంస్కృతికాభివృద్ధికీ, స్థూలంగా దేశ ప్రజల మేధో అభివృద్ధికి నష్టదాయకం. మతాధారిత సిద్ధాంతాల ఆధారంగా పాలన సాగించే దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమించలేకపోవటం వెనక ఉన్నా కారణాలు అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఇస్లాం సంస్కృతిలో స్వర్ణయుగం అని చెప్పదగిన కాలంలో ఇరాన్ బహుముఖ రంగాల్లో విశేష ప్రగతి సాధించింది. కానీ నేడు దానికి భిన్నమైన పరిస్థితుల్లో ఆ దేశం మనుగడ సాగిస్తోంది. తనదైన శైలిలో ఇస్లాం ఛాందసవాదాన్ని పెంచిపోషించటంతో ఆ దేశ ప్రజల్లో సృజనాత్మక శక్తి సార్ధ్యాలు కునారిల్లిపోయాయి. జాతీయ సామాజిక సాంస్కృతిక జీవనాన్ని చేజేతులారా సంక్షోభంలోకి నెట్టిన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. స్వయంగా రూపొందించుకున్న మతమౌఢ్యం కబంధ హస్తాల్లో దేశ ప్రగతి చిక్కుకుపోయింది. మతమౌఢ్యమే విద్యావిధానంగా ఉన్న దేశాలు శాష్ట్ర సాంకేతిక రంగాల్లో తమదైన గుర్తింపుకు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉంటాయ్నది చారిత్రక వాస్తవం. ఆధునిక భారతాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన రీతిలో రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యంగా ఉన్న భారతదేశం అటువంటి దుస్థితికి దిగజారకుండా యువతరం మేలుకోవల్సి ఉంది.
పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా జీవావరణ సిద్ధాంతాన్ని తొలగించటాన్ని ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్నయాల్లాగా కొట్టిపారేయలేము. దేశాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన సాధనం శాస్త్రవిజ్ఞానం అన్న సూత్రాన్నే కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సవాలు చేస్తున్న సందర్భంలో తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. 1990 దశంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో ఓ మంత్రి జ్యోతిష్యాన్ని కూడా పాఠ్యాంశంగా చేర్చాలని ప్రతిపాదించిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో దీనికోసం ఓ ప్రత్యేక విభాగాన్నే నెలకొల్పాలని, జ్యోతిష్యానికి విజ్ఞాన శాస్త్రం హోదా ఇవ్వాలని సదరు మంత్రి ప్రతిపాదించారు. మరికొందరు మన దేశంలో చరిత్ర చూడని చీకటి యుగాల్లోనే నేడు ప్రపంచం చూస్తున్న అత్యాధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిందనీ, క్వాంటం మెకానిక్స్ మొదలు సాపేక్షత సిద్ధాంతం వరకూ అన్నీ ఈ దేశంలో చరిత్ర పూర్వ యుగాల్లోనే ఉనికిలో ఉన్నాయని నమ్మే విశ్వాసులు కూడా ఉన్నారు. మరికొంత మంది రాజకీయ నాయకులు గోమూత్రంతో కాన్సర్ వ్యాధిని నయం చేయవచ్చని ఎటువంటి మౌలిక శాస్త్రీయ పరిశోధనలూ చేయకుండా నిర్ధారించేస్తున్నారు.
భౌతిక ప్రపంచం గురించిన పరిజ్ఞానం, అవగాహన అత్యంత ప్రాథమిక దశలో ఉన్న సమయంలో అనేక దేశాల నాగరికతలు ఆవిర్భవించి విస్తరించాయి. అభివృద్ధి చెందాయి. ప్రకృతిలో జరుగుతున్న పరిణామాలు గురించి అర్థం చేసుకోవడానికి తమ సృజనాత్మక సామర్ధ్యాలకు పదును పెట్టారు. ఎక్కువసార్లు ఈ విధంగా రూపొందించుకున్న అవగాహనలు తప్పని రుజువు అయ్యాయి. కాలక్రమంలో విశాల ప్రకృతి గురించి, దాని శక్తుల గురించీ ఏమీ తెలీని స్థితిలో ఏర్పాటు చేసుకున్న అవగాహనలే తర్వాత నమ్మకాలుగానూ, విశ్వాసాలుగానూ, మత విశ్వాసాలుగానూ పరిణామం చెందాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, పరిజ్ఞానం పురోగమించటంతో ఇటువంటి నమ్మకాలు వెనకపట్టు పట్టాయి. 1958లో భారత పార్లమెంట్ విజ్ఞానశాస్త్ర పరిశోధనల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన తీర్మానం భారతదేశం ఎదుర్కునే సమసస్యలను పరిష్కరించటంలో శాస్త్రీయ అవగాహనకు పునాదులు వేస్తుంది. 1976 నాటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51లో అ క్లాజు చేర్చటం ద్వారా కూడా శాస్త్రవిజ్ఞానం, శాస్త్రీయ దృక్ఫధం, సంస్కృతి పట్ల ఈ దేశం తమ అవగాహనను పునరుద్ఘాటించింది. మూఢ నమ్మకాలు, అంథ విశ్వాసాలు ఆధిపత్యం చలాయించే సాంప్రదాయానికి పెద్ద పీట వేసే మన దేశం లాంటి దేశంలో విద్యార్థి దశలోనే శాస్త్రీయ దృక్ఫధాన్ని పెంపొందించాలి తప్ప వేరే మార్గం లేదు. ఈ కోణంలో చూసినపుడు ఎన్సీఆర్టీ తీసుకున్న నిర్ణయం అత్యంత తిరోగామి నిర్ణయం.
(సిపి రాజేంద్రన్, బెంగుళూరు కేంద్రంగా ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో అడ్జెంక్ట్ ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.)
రచన: సిపి రాజేంద్రన్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.