
రాజ్యాంగ ప్రవేశికలోని “లౌకిక”, “సోషలిస్ట్” పదాలను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆ పదాలపై అభ్యంతరం వ్యక్తం చేసి వాటిని “వేడి నోటిపొక్కులు” అని అభివర్ణించారు. అదే సమయంలో, రాజ్యాంగంలోని ఏదైనా పదాన్ని తాకడానికి ప్రయత్నిస్తే, పార్టీ చివరి శ్వాస వరకు దానిని వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలోని “లౌకిక”, “సోషలిస్ట్” పదాలను సమీక్షించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. దీని తర్వాత , ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కూడా ఈ పదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని “వేడి నోటిపొక్కులు”గా అభివర్ణించారు .
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ప్రకటనను ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది. అంతేకాకుండా ఆ సంస్థ పేదలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకమని ఆరోపించింది.
జూన్ 28న ది ట్రిబ్యూన్తో ధన్కడ్ మాట్లాడుతూ, “రాజ్యాంగానికి చీకటి కాలమయిన అత్యవసర పరిస్థితిలో ఈ పదాలు చేర్చబడ్డాయి. ఈ పదాలను జోడించడం వల్ల మన ఉనికికే ముప్పు ఏర్పడింది. ఈ పదాలు “వేడి నోటిపొక్కులు” లాంటివి, అల్లకల్లోలం సృష్టిస్తాయి. వీటిని రాజ్యాంగ ప్రవేశికలో జోడించడం రాజ్యాంగ నిర్మాతలకు చేసిన ద్రోహం. ఇది మన నాగరికత వారసత్వానికి అవమానం, ఇది సనాతన ఆత్మను అపవిత్రం చేయడమే” అని అన్నారు.
మరే ఇతర దేశం కూడా తన రాజ్యాంగంలోని ప్రవేశికలో ఇంత మార్పు చేయలేదని, ప్రవేశికను మార్చలేమని ధన్కడ్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గొంతు కోసి చంపబడుతున్న సమయంలో ఈ పదాలు జోడించబడటం అత్యంత దురదృష్టకరమని ఆయన నొక్కి చెప్పారు.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ప్రకటనకు కొన్ని రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
“రాజ్యాంగంలోని ఏ పదాన్ని అయినా ముట్టుకునే ప్రయత్నం జరిగితే, కాంగ్రెస్ చివరి శ్వాస వరకు పోరాడుతుంది”
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం(జూన్ 30) బెంగళూరులో పీటీఐతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఏదైనా పదాన్ని తాకడానికి ప్రయత్నిస్తే, తమ పార్టీ చివరి శ్వాస వరకు దానిని వ్యతిరేకిస్తుందని అన్నారు.
“బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని హోసబాలే కోరుకోవడం లేదు. వేల సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో అది కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఆయనకు సోషలిజం, లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి సూత్రాలు నచ్చవు” అని ఖర్గే చెప్పారు.
ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ పేదలు, అణగారిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వర్గాలకు వ్యతిరేకంగా ఉందని ఖర్గే ఆరోపించారు. “వారు నిజంగా హిందూ మత ప్రతినిధులమని చెప్పుకోవాలనుకుంటే, వారు మొదట దేశం నుంచి అంటరానితనాన్ని అంతం చేయాలి. కేవలం మాట్లాడటం, నానా యాగి చేయడం, గందరగోళం సృష్టించడం వల్ల ఏం సాధించలేము” అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో అంటరానితనాన్ని అంతం చేయడానికి ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛంద సేవకులను పంపాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గే పిలుపునిచ్చారు.
“బదులుగా వారు కేవలం మాట్లాడతారు, దేశంలో గందరగోళాన్ని వ్యాపింపజేస్తారు. ఇది చాలా తప్పు, మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. రాజ్యాంగంలోని ఏ పదాన్ని మార్చే ఏ ప్రయత్నానికైనా కాంగ్రెస్ మౌనంగా చూస్తూ కూర్చోదు. పూర్తి శాయశక్తులతో దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది” అని ఖర్గే అన్నారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి