
విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడలోని అయోధ్య నగర్ అపార్టుమెంట్లలో స్మార్ట్‌మీటర్లు పెట్టడానికి కొందరు వస్తున్నారని, వారిని అనుమతించకూడదని ఆ ప్రకటనలో పిలునిచ్చింది. ఒకవేళ స్మార్ట్‌మీటర్లను ఇళ్లలో పెట్టడానికి వారికి అనుమతిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
విజయవాడ: విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ప్రకటన ప్రకారం, “నివాసగృహాలకు కూడా స్మార్ట్‌మీటర్లు బిగించటం ప్రారంభం అయింది. అయోధ్య నగర్లో బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లను బిగిస్తున్న వారు అదానీ మనుషులు. కానీ కరెంటు డిపార్టుమెంట్ వాళ్ళమని మాయమాటలు చెప్పి, మీటర్లు మార్చుతున్నారు. మీటర్లు మార్చటం మాతమ్రే కాదు. వాళ్ళేదో మనకు మంచి చేస్తున్నట్టు, మీటరు మార్చామని చెప్పి రూ 200, రూ 300లు మామూళ్ళ పేరుతో వసూలు చేస్తున్నారు.”
అయితే, ఇంతకుముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తరువాత కమర్షియల్ కనెక్షన్లకు(పరిశ్రమలకు, షాపులకు) స్మార్ట్‌మీటర్లను బిగించారు. ప్రస్తుతం నివాస గృహాలకు స్మార్ట్‌మీటర్లను పెట్టడానికి కొందరు వెళ్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికకు చెందిన విజయవాడ శాఖ ప్రకటనను విడుదల చేసింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో షాపు యజమానులు స్మార్ట్‌మీటర్లను పెట్టుకున్నారని, కొన్ని చోట్ల తమకు వస్తున్న బిల్లులను చూసి షాపు యజమానులు గుండెలు బాదుకుంటున్నారని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక తెలియజేసింది.
“విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించటం కోసం ముందస్తు చర్యగా స్మార్ట్‌మీటర్లు బిగిస్తున్నారు. స్మార్ట్‌మీటర్లు బిగించాలంటే మన అనుమతి కావాలి. ఒక సారి స్మార్ట్ మీటరు బిగిస్తే మనం అనుమతించినట్లే. క్రమంగా మన కరెంటు కనెక్షన్ అదానీ చేతికి పోతుంది. కాబట్టి అనుమతించవద్దు. అపార్టుమెంట్లలో మీటర్లు క్రింద స్టిల్ట్ ఫ్లోర్ లేక సెల్లార్లో ఉంటాయి. చెప్పా పెట్టకుండా బిగించి వెళ్లి పోయే అవకాశం ఉంది. జాగ్రత్తతో చూస్తూ ఉండండి. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని అడ్డుకోండి” అని హెచ్చరించింది.
స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు కలిగే నష్టమేమిటో విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక వివరించింది.
♦ ఐక్యవేదిక తెలిపిన దాని ప్రకారం, ఈ మీటరు ఖరీదును వినియోదారుడే భరించాలి. సింగిల్ ఫేజ్ మీటరు ఖరీదు రూ 8,927లు ఉంటుంది. అదే త్రీఫేజ్ మీటరు ఖరీదు రూ 17,286 వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని 93 నెలల పాటు ఇన్స్టాల్మెంట్లుగా బిల్లుతో పాటు వసూలు చేస్తారు.
♦ మీటరు అంటే ఒక దానిని కొలవటానికి ఉపయోగపడేది. అంతేగాని నియంత్రించే పరికరం కాదు. కానీ స్మార్ట్ మీటర్ మామూలు విద్యుత్ మీటర్ మాదిరిగా విద్యుత్ వాడకాన్ని రికార్డు చేయటానికి మాత్రమే ఉపయోగించే పరికరం కాదు. ఈ మీటరును రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. దీనికోసం ఇందులో రెండు పరికరాలను ఏర్పాటు చేశారు.
అందులో మొదటిది ఏఎంఐ: ఏఎంఐ అంటే అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(అధునాతన మీటరింగ్ మౌలిక సదుపాయాలు)అని అర్ధం. ఈ సదుపాయం ద్వారా వినియోగదారుడి ఇంట్లో మీటరున్న ఎక్కడో ఉన్న బ్యాక్ ఆఫీసుకు వైర్లెస్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. వందల కిలో మీటర్ల దూరంలో ఉండి కూడా ఈ స్మార్ట్‌మీటర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది చాలా ప్రమాదం. విద్యుత్ మీటరు అంటే మనం ఎంత విద్యుత్ వాడామనే దానిని రికార్డు చేసే పరికరంగాకాక, రిమోట్ నుంచి ఆపరేట్ చేసే పరికరంగా ఈ స్మార్ట్ మీటర్ ఉపయోగపడుతుంది.
రెండవ అంశమేంటంటే, ఏఎంఆర్: ఏ సమయానికి ఎంత విద్యుత్ వాడుకున్నారన్నది ఆటోమెటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) పరికరం రికార్డు చేస్తుంది. పీక్ సమయం పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయటానికి విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఉదాహరణకు ఉదయం 6 నుంచి 10 గంటవరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటలవరకు పీక్ సమయంగా ప్రస్తుతం నిర్ణయించారు. ఈ సమయంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దీనికోసమే ఈ ఏర్పాటు చేశారు. ఇది ప్రజలకు భారంగా మారుతుంది.
అంతేకాకుండా ఇంకా ప్రకటనలో తెలియజేస్తూ, ఈ రెండు పరికరాల జోడింపు చాలా ప్రమాదకరమైనదిగా ఐక్యవేదిక హెచ్చరించింది. అయితే ఈ స్మార్ట్‌మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు కాబట్టి ముందుగానే సెల్‌ఫోన్ రీచార్జీలా డబ్బులు కట్టి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది
♦ ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ విధానంలో బిల్లు చెల్లించటానికి 15 రోజులు గడువు ఉంటుంది. బిల్లుచెల్లించడానికి, చెల్లించకపోతే పెనాలిటీతో చెల్లించటానికి, అప్పటికీ చెల్లించకపోతే, కనెక్షన్ కట్ చేయటానికి నిర్దిష్టమైన గడువు ఉంటుంది. బిల్లు చెల్లించటానికి వినియోగదారునికి వెసులుబాటు ఉంటుంది. ఈ గడువు వరకు వినియోగదారునికి విద్యుత్ సరఫరా గ్యారెంటీ ఉంటుంది. ప్రీపెయిడ్ విధానంలో ఈ వెసులుబాటు ఉండదు. ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు కనెక్షన్ కట్ అవుతుంది.
♦ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు లక్షలలో విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటాయి. వాడుకున్న తరువాత చెల్లించే బిల్లు నిర్దిష్టంగా ఉంటుంది. అదే మొత్తాన్ని ముందుగా ఊహించి చెల్లించాలంటే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు వర్కింగ్ కేపిటల్ పెరుగుతుంది.
♦ వర్కింగ్ కేపిటల్ భారాన్ని విద్యుత్ జనరేషన్ కంపెనీలు, డిస్కంల మీద నుంచి వినియోగదారుని మీదకు నెట్టివేయబోతున్నారు. దీని వల్ల కొన్ని పరిశ్రమలు మూతబడతాయి. ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది.
♦ వాడుకున్న తరువాత పేపరు మీద బిల్లు ఇస్తే ఎంతవాడామో, ఏ రేటు చెల్లిస్తున్నామో నిర్దిష్టంగా ఉంది. ప్రీపెయిడ్ అయితే యూనిట్‌కు ఎంత వసూలు చేస్తున్నారో వినియోగదారునికి తెలియదు.
♦ విద్యుత్ ఉపకరణలతో పని చేస్తున్నప్పుడు కరెంటు పోతే, సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే చేసే పనులు కూడా ఆగిపోతాయి.
♦ సేవలు పొందిన తరువాత వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలుచేసే విధానం నుంచి, వినియోగదారుడు ముందుగానే చెల్లించి సేవలు పొందే విధానంలోనికి మార్పుచేసే ప్రక్రియే ఈ స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన. ఈ విధానం వలన అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారులను విద్యుత్ సరఫరాకు దూరంచేసే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది.
వినియోగదారుడు ఎదుర్కొనే సమస్యలను కొన్ని వివరాలతో ఐక్యవేదిక ప్రకటలో తెలియజేసింది.
“ఈ స్మార్ట్ మీటర్లు కేవలం మనం వాడిన విద్యుత్‌ను కొలవటానికి మాత్రమే ఉద్దేశించినవి కావు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు వారికి, ముఖ్యంగా అదానీకి అప్పగించటానికి ఉద్దేశించినవి. ఈనాడు బయటకు మనకు కనుపిస్తున్న విద్యుత్ స్థంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫారాలు, సబ్ స్టేపన్లు, భవనాలు అన్నీ మనం కట్టిన పన్ను డబ్బులతో నిర్మించినవి. వీటిని ఈనాడు అక్రమంగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుంటే, మన కష్టార్జిలతాలను కొల్లగొట్టడానికి వ్యూహాలను రచిస్తుంటే చూస్తూ ఊరుకుందామా?” అని ప్రశ్నించింది.
విద్యుత్ అనేది ప్రజలకు ప్రభుత్వాలు కల్పించే సౌకర్యమని, వ్యక్తి ఆర్ధికాభివృధ్ధికి- దేశ ఆర్ధికాభివృధ్ధికి కీలకమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగమని, అంతే కానీ విద్యుత్ అనేది ప్రజలను పిండుకునే వ్యాపారం కాదని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక పేర్కొన్నది.
ఇంకా ప్రకటనలో “మన పాలకులు విద్యుత్‌ను సరుకుగా మార్చి వ్యాపారం చేశారు. ఇప్పుడు వ్యాపార దశను కూడా దాటి, దోచుకు తినటానికి వ్యూహాలు రచిస్తున్నారు. దానికోసమే విధానాలను రూపొందిస్తున్నారు. మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించటం కోసం వేగంగా పావులు కదుపుతున్నారు. అందుకోసమే తొలిమెట్టుగా స్మార్ట్ మీటర్లు అమలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు అన్ని విధాల నష్టమని” హెచ్చరిస్తూ, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిచ్చింది.
స్మార్ట్ మీటర్ల విషయంలో గత పాలకుల వైఖరిని గుర్తుచేస్తూ ప్రస్తుత పాలకుల విధానాన్ని ప్రకటన నొక్కిచెప్పింది. “మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి కూటమి నాయకులకు రోజూ తగాదే నడుస్తోంది. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అదానీ- అదానీ మీటర్ల మిషయంలో వీరంతా ఒకటే. ఆనాడు జగన్ ప్రభుత్వం ఖరారు చేసిన అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లను నేడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దుచేయలేదు. పైగా బిగించటానికి అనుమతించి, ఈ విషయంలో ఇద్దరూ ఒకటేనని నిరూపించారు.”
అసెంబ్లీ- లోక్‌సభ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు అండ్ కో మాట్లాడిన మాటలను ప్రకటనలో ప్రస్థావించారు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రలోభపెట్టి ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని పరోక్షంగా పేర్కొన్నారు. “ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పెడితే పగులగొట్టమని ఎన్డీఏ నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను మన ఇళ్ళకు బిగించమని ఆదేశాలిచ్చారు. ఆనాడైనా, ఈనాడైనా పడే భారం మనమీదనే. అడ్డుకోవాల్సింది మనమే. మోడీ ఆదేశాల మేరకు, అదానీకి మన విద్యుత్ సంస్థలను అప్పగించటం కోసం మన ఇళ్ళలో ఈ స్మార్ట్ మీటర్లను చంద్రబాబు బిగిస్తున్నారు ” అని పేర్కొన్నది.
ఇప్పటికే స్మార్ట్‌మీటర్లను తమ షాపులకు బిగించుకున్న వారు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రకటన మరోసారి ప్రస్థావించింది. కొన్ని చోట్ల షాపు యజమానలకు వస్తున్న బిల్లులను చూసి ఆయా యజమానులు గుండెలు బాదుకుంటున్నారని తెలిపింది. ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత “మనం స్మార్ట్‌మీటర్లను అనుమతిద్దామా?” అని వినియోగదారులను ఉద్దేశ్యించి ప్రశ్నించింది. “అదాని దోపిడీని మన ఇంట్లో ప్రవేశపెడితే చూస్తూ ఊరుకోవద్దు, ప్రతిఘటిద్దాం. స్మార్ట్‌మీటర్లు రాకుండా అడ్డుకుందామ”ని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ప్రజలందరికీ ప్రతిఘటనా పిలుపునిచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.