
1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినపుడు దేశీయంగా గానీ అంతర్జాతీయంగా గానీ భారతదేశ ఉనికి ప్రశ్నార్థకం కాలేదు. అవినీతి వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రారంభించిన ఉద్యమం దేశంలో అంతర్గత సుస్థిరతకు ప్రమాదం తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధింపును సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ విధించడానికి తక్షణ కారణం అలహాబాద్ హైకోర్టు తీర్పు. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడినట్లు నిరూపణ అయినందున ఇందిరాగాంధీ లోక్‌సభ సభ్యులుగా కొనసాగకూడదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లోక్‌సభ సభ్యులుగా లేకపోతే ప్రధానమంత్రిగా ఉండటం సాధ్యపడదు.
అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ అస్తిత్వానికి ముప్పు తెచ్చింది తప్ప దేశ అస్తిత్వానికి సుస్థిరతకు ఎటువంటి ముప్పు తీసుకురాలేదు. కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే బారువా మాటల్లో ఇందిరాయే ఇండియా- ఇండియాయే ఇందిరా. కాబట్టి ఇందిరాగాంధీకి వచ్చిన ప్రమాదం దేశానికి వచ్చిన ప్రమాదంగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావించాయి. 1990 దశకంలో కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక విందులో కలిసిన సందర్భంలో ఈ రచయితతో ముచ్చటిస్తూ కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు అన్నారు. ఇటువంటి ఆలోచన ధోరణే ఆరోజు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసింది. ఈ ఆలోచన ధోరణిలో వ్యక్తిగత సమస్య జాతీయ సమస్యగా మారుతుంది. లేదా మార్చబడుతుంది.
1970 దశాబ్దంలో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆధిగమించటానికి ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదు. వ్యవస్థ నిర్వహణలో అనవసరపు జోక్యం తర్వాత కాలంలో అనేక పరిస్థితులకు పరిణామాలకు దారితీసింది. 1947లో స్వాతంత్రం సిద్ధించటం ద్వారా భారతదేశం ఒక మౌలికమైన మార్పును చూసినట్లే 1975లో ఎమర్జెన్సీ కారణంగా దేశం ఒక మౌలికమైన మార్పుకు తెరతీసింది. సమాజంలో జరిగే చర్చను సమూలంగా మార్చేసింది.
ఎమర్జెన్సీ నేపథ్యం..
1971 నాటికి తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో జరిగిన పరిణామాల వలన లక్షలాదిమంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. ఒక అంచనా ప్రకారం సుమారు కోటి 20 లక్షల మంది తూర్పు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. ఒకేసారి అంత మంది దేశంలోకి రావడంతో భారత ఆర్థిక వ్యవస్థ, సమాజం రెండూ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి. పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికాతో సంబంధాలు విషమించాయి. పశ్చిమ దేశాలకు మిత్రుడుగా ఉన్న పాకిస్తాన్ 1971లో రెండుగా చీలిపోవటానికి ఆ దేశాలు సిద్ధంగా లేవు. తూర్పు పాకిస్తాన్ పరిణామాలలో భారతదేశం జోక్యం చేసుకోవడం ద్వారా ఆనాటి ఉమ్మడి పాకిస్తాన్ నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా చీలిపోయింది. దీంతో ఇందిరా గాంధీ ఒక శక్తివంతమైన నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటికి దారిద్ర నిర్మూలన నినాదంతో కాంగ్రెస్ పార్టీ బలమైన మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది.
1967లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇందిరాగాంధీ బలహీనమైన రాజకీయనేతగా పరిగణించబడ్డారు. కొంగు కప్పుకున్న అమ్మాయిగానే కనిపించారు. అయితే ఆ తర్వాత ఇందిరాగాంధీ పట్ల ఉన్న ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. కాంగ్రెస్‌లోని సాంప్రదాయవాదులందరిని ఇందిరాగాంధీ బయటకు పంపించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, 19701లో బొగ్గు గనుల జాతీయీకరణ, 1974లో జౌళి మిల్లుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు ఇందిరా గాంధీ తీసుకున్నారు. బహుళజాతి కంపెనీలలో విదేశీ యాజమాన్యాన్ని తగ్గించటానికి విదేశీ చెల్లింపుల నియంత్రణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అధిక ధరల నియంత్రణ లక్ష్యంతో 1972లో స్వల్పకాలికంగానైనా గోధుమల టోకు వ్యాపారం జాతీయం చేసింది
ఇవన్నీ మధ్యేవాద వామపక్ష విధానాలే. అప్పట్లో ప్రధానమంత్రి కార్యాలయంలో ఇందిరాగాంధీ వ్యక్తిగత సలహాదారుగా పీఎన్ హక్సర్ పని చేసేవారు. ఆయనతోపాటు భావసారూప్యత కలిగిన మరికొంతమంది ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేవారు.
స్వాతంత్రానంతరం 1972లో భారతదేశం తొలిసారి ఘోరమైన కరువును చవిచూసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ధరలు విపరీతంగా పెరిగాయి. 1973లో యోంకిప్పూర్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. చమురు ధరల పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితులు సామాజిక ఆర్థిక రాజకీయ అశాంతికి దారితీశాయి. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పుంజుకోసాగింది. ఈ సమయంలోనే గుజరాత్లో ప్రారంభమైన నవనిర్మాణ ఉద్యమం తర్వాత కాలంలో జేపీ ఉద్యమంగా మారింది. 1974లో రైల్వే ఉద్యోగుల సమ్మె ప్రభుత్వాన్ని కుదిపివేసింది.
1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీకి మద్దతు పలికిన దేశం క్రమంగా ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగింది. పైన ప్రస్తావించిన సంక్షోభాల కారణంగా పేదరికం విజృంభించింది. పేదరిక నిర్మూలన నినాదం డొల్ల నినాదంగా మారింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మాధ్యేవాద వామపక్ష విధానాల పట్ల ప్రజల్లో విముఖత మొదలైంది. ఇవన్నీ ఎలా ఉన్నా సార్వత్ర సంక్షోభం నెలకొన్న పరిస్థితి మాత్రం లేదు. ఎమర్జెన్సీ విధించాల్సినంత తీవ్రసంక్షోభం లేదు.
ఎమర్జెన్సీ- మౌలిక వ్యవస్థాగత మార్పులు..
ప్రతిపక్ష- వామపక్ష పార్టీ నేతలను, సోషలిస్టు- మితవాదులను అందరినీ ప్రభుత్వం జైళ్ళ పాలుచేసింది. ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ తన పిడికెడు మంది అనుచరగణంతో ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవడం మొదలైంది. వ్యవస్థలను కాదని ఏకవ్యక్తి పాలన మొదలైంది. ధిక్కారం నేరమైంది. మీడియా గొంతు మూగబోయింది. సెన్సార్షిప్ పేరుతో ఆలోచనలు, అక్షరాలపై పూర్తి స్థాయి నియంత్రణ అమల్లోకి వచ్చింది. కనీస వేతనాలు, భూపరిమితి చట్టాలు వంటి కొన్ని సానుకూల అంశాలతో కూడిన ప్రజాకర్షక 20 సూత్రాల కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీకి ముందు మధ్యేవాద వామపక్ష దిశలో ఉన్న ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ఎమర్జెన్సీ కాలంలో మధ్యేవాద మితవాద దిశవైపుకు మళ్లాయి. హక్సర్, ఆయన సహచరులు ప్రాధాన్యతను కోల్పోయారు. అంతిమంగా భారత రాజకీయాలు మితవాద మలుపులోకి ప్రవేశించాయి. ఈ మలుపు దీర్ఘకాలంలో దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో మొదలైన మితవాద రాజకీయాలు నేడు ఘనీభవించే దశకు చేరుకున్నాయి.
బలవంతంగా కుటుంబ నియంత్రణ విధానాలు అమలు చేయటం వివిధ తరగతుల్లో వ్యతిరేకతకు దారితీసింది. పట్టణాలలోని మురికివాడల్లో పనిస్థలానికి దగ్గర్లో నివసిస్తున్న వారిని ఊరికి దూరంగా నెట్టేశారు. కనీస వేతనాలు కానీ, భూపరిమితి చట్టాలు కానీ అమల్లోకి రాలేదు. దాంతో పేదరికం, ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. దేశం కరువు కోరల నుంచి బయటపడి ధరలు అదుపులో ఉండి, కొరతల సమస్య పరిష్కారం అయినా ఇందిరాగాంధీ ప్రజాదరణ కొల్పోతూనే ఉన్నారు. 1977లో ఎన్నికలకు సిద్ధమై ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ఓటమి సంపూర్ణమయింది. జనతా సంకీర్ణం అధికారానికి వచ్చింది.
ఎమర్జెన్సీ కాలంలోనే అంతర్జాతీయ సంస్థల నుంచి నిపుణులు వచ్చి పోవడం మొదలైంది. ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ప్రతినిధుల జోక్యం, ప్రభావం ఆర్థిక విధానాల రూపకల్పనలో పెరిగింది. ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారులు కూడా ఈ సంస్థల్లో పని చేసే అవకాశం కోసం ఎగబడ్డారు. ఈ సంస్థల్లో పని చేయటం తమ హోదా పెంచుతుందని భావించారు. ఉన్నత స్థాయి విధాన రూపకల్పనలో ఈ రకమైన జోక్యం, మన దేశీయ ప్రతినిధులు కూడా ఆయా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించే సంస్థల్లో పని చేయటంతో మన లాంటి వర్ధమాన దేశాల్లో సైతం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలు కాపాడటానికిగాను ఎటువంటి విధానాలు అవసరమో వాటిని రూపొందించి అమలు చేయటం మొదలైంది. భారతదేశంలో వివిధ రంగాలలో నిపుణులుగా గుర్తింపు పొందిన మేధావులతో సెమినార్లు నిర్వహించడం, వారికి వివిధ సందర్భాల్లో సలహాదారు పాత్రలు అప్పగించడం ద్వారా దేశంలోని మేధావులను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రతినిధులు ప్రభావితం చేయటం మొదలైంది. విధానాల రూపకల్పనలో భారతదేశం పాటిస్తూ వచ్చిన స్వయంప్రతిపత్తి క్రమంగా కోల్పోనారంభించింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు..
మార్కెటీకరణ, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి దేశ మార్కెట్ల తలుపులు తెరవడం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలు. అందువలన ఎమర్జెన్సీ నాటి నుంచి త్రాసు ప్రభుత్వం నుంచి మార్కెట్లకు మారింది. ప్రభుత్వాలు అసమర్థమైనవి మార్కెట్లు సమర్థవంతమైనవనే వాదన సిద్ధాంత రూపం ధరించింది. జన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగం కార్యక్షేత్రానికి సంబంధించిన విషయాల్లో మార్కెట్ ఆధారిత పరిష్కారాలు విధాన నిర్ణయాలుగా మారాయి. మార్కెట్లు సమర్థవంతమైనవి అనే సిద్ధాంతానికి పరిమితమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ చూసినా మార్కెట్ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. మార్కెట్లు సత్ఫలితాలు సాధించాలంటే ప్రభుత్వాల జోక్యం అనివార్యంగా మారింది.
1970 దశకం మధ్యనాటికి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన వ్యూహాత్మక మార్పుల పర్యవసనంగా రాజకీయాలలో మితవాద ధోరణులు ఉధృతమయ్యాయి. సోవియట్ యూనియన్ పతనం ప్రారంభమైంది. వర్ధమాన దేశాలకు సహాయం చేసే సామర్థ్యం రష్యాకు తగ్గుతూ వచ్చింది. మావో మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన డెంగ్ జియావో పింగ్ నేతృత్వంలో చైనా పెట్టుబడిదారీ అభివృద్ధి పంథాను అనుసరించటం ప్రారంభించింది. ఎలుకని పట్టే పిల్లి నలుపైతే ఏంటి తెలుపైతే ఏంటి అంటూ డెంగ్ జియావో పింగ్ తన విధానాలను సమర్ధించుకున్నారు. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ చైనా అధినేత మావోను కలిసిన తర్వాత చైనా ఆర్థిక అభివృద్ధి పంథాలో మార్పు వచ్చింది.
1978 నుంచి థాచెరిజం, రీగనిజంలు మార్కెటీకరణను ప్రోత్సహించాయి. మార్కెటీకరణకు పెద్దపీట వేశారు. 1990 నాటికి థాచెరిజం, రీగనిజం అన్నీ చరిత్ర అంతం స్థాయికి చేరాయి. శ్రమశక్తికి ఉన్న చలనానికంటే వందల వేల రెట్లు అధికంగా వేగంతో దేశాలు దాటే పెట్టుబడి ఈ కాలంలో తన ఆధిపత్యాన్ని పదింతలు చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా రూపొందిన ద్రవ్య పెట్టుబడి వ్యవస్థలు, పెరుగుతున్న ఆర్థిక అక్రమాల నేపథ్యంలో నానాటికి బలహీన పడుతున్న ప్రభుత్వాల నుంచి పెట్టుబడి అంతకంతకు మరిన్ని రాయితీలు రాబట్టింది. ద్రవ్య నియంత్రణ చట్టం లాంటి మార్గాల ద్వారా ప్రభుత్వాల కార్యాచరణ సామర్థ్యాన్ని మరింతగా కట్టిపడేసింది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి. ఫలితంగా ప్రపంచం ఒక శాతం సంపన్నులు 99 శాతం పేదలుగా మారింది. 2008 నాటి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సంక్షోభంలో ఈ అంతరాలు మరింత కొట్టొచ్చినట్లు కనిపించాయి.
ఈ విధంగా 1970 దశకం మధ్యనాటికి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగాను మితవాద ధోరణి 1990 దశకం నాటికి స్థిరపడిపోయింది. ఈ మార్పును సవాలు చేయడానికి కావలసిన ప్రత్యామ్నాయ దృక్పథం భారతదేశంలో వామపక్షానికి లేకపోయింది.
ఎమర్జెన్సీ అనంతర పరిస్థితిలో ఉధృతి..
1977లో అధికారానికి వచ్చిన జనతా ప్రభుత్వంలో సోషలిస్టులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రధాన నాయకత్వం మితవాదుల చేతుల్లోనే కేంద్రీకృతం అయింది. జనతా కూటమిలో మొదలైన భిన్నాభిప్రాయాలను వేగిరపరచి ప్రభుత్వం కూలిపోయే వరకు కాంగ్రెస్, సంజయ్ గాంధీలు క్రియాశీలకంగా పనిచేశారు.
ఇందిరాగాంధీ తిరిగి 1980లో అధికారానికి వచ్చేనాటికి పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. 1979- 80లో మళ్ళీ పలకరించిన కరువు, 1979లో ఇరాన్లో చోటుచేసుకున్న విప్లవం నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సంక్షోభం, 1979లో ఆఫ్ఘనిస్తాన్పైకి నడిచిన రష్యా సేనలు, పంజాబ్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదం దేశాన్ని కల్లోలితం చేశాయి. భారతదేశ ద్రవ్యోల్బణంతో పాటు మారకద్రవ్య నిలువల సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్న సమయం అది.
ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించడంతో షరతులు విధించింది. ఆర్థిక వ్యవస్థ తలుపులు విదేశీ పెట్టుబడులకు తెరవాల్సి వచ్చింది. పేద దేశం వినిమయతత్వాన్ని అధికారిక విధానంగా మార్చుకున్నది. కలర్ టీవీలు, ఆధునిక వాహనాలు, కంప్యూటర్ ఉత్పత్తులు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు పొదుపును పాటించే దేశం వినిమయత్వంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలో ధనికులు మాత్రం ఈ మార్పులను ఆహ్వానించారు. 1985లో ముంబైలో జరిగిన కాంగ్రెస్ శతజయంతి సభలో మాట్లాడుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పేదల గురించి నామ మాత్రం ప్రస్తావనతో సరిపెట్టుకున్నారు. కార్మిక సంఘాలను విమర్శించారు. వ్యాపారవేత్తలను అభినందించారు. పాలకవర్గం అవగాహనలో, దృక్పథంలో వస్తున్న మార్పులకు ఇది సంకేతం.
ఎమర్జెన్సీ అనంతర కాలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలు ఆర్థిక వ్యవస్థను మార్కెటీకరించడంపైనే కేంద్రీకరించాయి. నియంత్రణలు, సబ్సిడీలను అధ్యయనం చేయడానికి దగలి కమిటీ, పరోక్ష పన్నుల విషయంలో ఝా కమిటీ వంటి నివేదికలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 1980 దశకంలో పేదరిక నిర్మూలన కోసం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో జరిగిన అధ్యయనాలు పేదరిక నిర్మూలనకు మార్కెట్ ఆర్థిక వ్యవస్థలే పరిష్కారమని సిఫార్సు చేశాయి. దేశంలో పెరుగుతున్న నల్లధనాన్ని వెలికితీయటానికి కూడా మార్కెటీకరణ మార్గమని ప్రతిపాదించాయి. పట్టణ ప్రాంత భూపరిమిత చట్టాల అమలును అంచనా వేయటానికి మార్కెట్ సామర్థ్యం మార్గమనే ప్రతిపాదించాయి. ఇలా ఈ కాలంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలలో మార్కెట్‌ను ప్రభుత్వ స్థానంలో ప్రోత్సహించడానికి కావలసిన సైద్ధాంతిక విధానపరమైన భూమికను ప్రభుత్వాలు సిద్ధం చేశాయి.
ఇటువంటి అనేక నివేదికల రూపొందించిన సిఫార్సుల ప్రాతిపదికనే దేశ ఆర్థికవ్యవస్థను సంపూర్ణంగా మార్కెట్ మయం చేసేందుకు 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభించబడ్డాయి. 1985 దశకంలో అమలు జరిగిన మార్కెట్ విధానాల వైఫల్యాలను మాత్రం కప్పిపుచ్చుకుంటూ పోయాము. ఈ దశలో కేవలం వినిమయతత్వం పెరగటం నయా మధ్యతరగతికి కావలసిన వినిమయ వస్తువులు సమకూర్చడం తప్ప ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ సంస్థాగత పురోగతి ఏమీ కనిపించలేదు. సంపన్నులకు కావలసిన వినియోగ సరుకులు సమకూర్చే ప్రయత్నంలో దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. దిగుమతుల కోసం తొలుత దీర్ఘకాలంలో చెల్లించే విధంగా తీసుకున్న వీదేశీ అప్పులు, విదేశాలలో పనిచేసే భారతీయ కార్మికులు పంపించే విదేశీ మారకద్రవ్యంలతో నిధులు సమకూర్చుకున్నాము. మెజారిటీ నిధులు స్వల్పకాల రుణాల ద్వారా సమకూర్చుకున్నవే.
1989 ముడిచమురు ధరలు పెరిగాయి. 1990లో కువైట్‌ను ఇరాక్ ఆక్రమించుకోవడంతో పశ్చిమాసియాలో సంక్షోభం మొదలైంది. స్వల్పకాల రుణాలు లభ్యత తగ్గిపోవడంతో విదేశీ చెల్లింపుల సంక్షోభం ముందుకు వచ్చింది. 1980 దశకం చివరికి వచ్చేసరికి విదేశీయులను 10 బిలియన్ డాలర్ల నుంచి 90 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఐఎంఎఫ్ దగ్గర నుంచి తీసుకున్న అప్పు కూడా వడ్డీలు చెల్లించటానికి సరిపోలేదు. ప్రవాస భారతీయులు బ్యాంకులలో ఉన్న తమ సొమ్మును ఉపసంహరించుకున్నారు. భారతీయ ఉత్పత్తుల ఎగుమతులకు రావాల్సిన చెల్లింపులు ఆలస్యమయ్యాయి. రూపాయి విలువ పడిపోతుందన్న అంచనాతో దిగుమతులు పెరిగాయి. వెరసి 1990- 91 ఆర్థిక సంవత్సరం నాటికి విదేశీ కరెన్సీలో చేయాల్సిన చెల్లింపులు చెల్లించలేకపోయాము. దేశం దివాళా అంచుకు చేరింది. దేశంలో ఉన్న బంగారం విదేశాల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
1991 జూన్‌లో అధికారానికి వచ్చిన పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ పెట్టిన షరతులను అంగీకరించింది. ఈ షరతులన్నీ 1991 జూన్- జూలైలో నూతన ఆర్థిక విధానాల రూపంలో దేశం ముందు ఆవిష్కృతం అయ్యాయి. రూపాయి విలువ తగ్గించబడింది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు విదేశీ కంపెనీలో పెట్టుబడులకు తలుపులు తెరిచాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రత్యక్ష పన్నుల తగ్గింపు, చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న రక్షణలో రద్దు, గుత్త సంస్థలు, స్వేచ్ఛ వ్యాపారాన్ని నియంత్రించే వాణిజ్య విధానాల చట్టం రద్దు వంటివి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ 1994లో మురకేష్లో జరిగిన సమావేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంపై భారతదేశం సంతకాలు చేయడంతో ఈ ధోరణులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. శాశ్వత రూపం తీసుకున్నాయి.
ఈ మార్పులన్నీ ఆర్థిక వ్యవస్థలో ఒక మౌలికమైన దిశానిర్దేశానికి దారి తీశాయి. భారత ఆర్థిక వ్యవస్థ సంపూర్ణంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా మారింది. అప్పటివరకు అమలు జరిగిన ఆర్థిక విధానాన్ని వ్యక్తిగత అభివృద్ధికి ఉమ్మడి బాధ్యత, ప్రత్యేకించి వెనకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం బాధ్యతనే నినాదం నుంచి ప్రభుత్వాలు వైదొలిగాయి. ఈ విధంగా ఎమర్జెన్సీ అనంతర కాలంలో మార్కెటీకరణ దిశగా మొదలైన అడుగులు 1991 నాటికి అవసరమైనంత శక్తి పుంజుకుని పరుగులు తీయడం ప్రారంభించింది.
సామాజిక ఆర్థిక రంగాలలో వెనుకబడిన వారికి చేయందించాలన్న బాధ్యతను ప్రభుత్వం క్రమంగా వదిలేసుకుంటూ వచ్చింది. ఎలాగైనా సరే అభివృద్ధి సాధించాలి అన్న తపనతో ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అసమానతలు పేదరికం గురించి పట్టించుకోవటం అప్రధానమైన విషయంగా మారింది. ఈ విధంగా దూకుడుతో మొదలైన నూతన ఆర్థిక విధానాలు దేశంలో పర్యావరణాన్ని, సామాజిక- ఆర్థిక రంగాలలో బలహీనమైన తరగతులను ప్రధానంగా కార్మికులు, రైతులను ఫణంగా పెట్టాయి. 1990 వరకు మాటమాత్రం గానైనా సమానత్వం గురించి మాట్లాడిన ప్రభుత్వాలు 1991 తరువాత ప్రైవేటు వ్యాపార అభివృద్ధి ప్రభుత్వాల ఏకైక లక్ష్యంగా వ్యవహరించాయి.
1991, 2008, 2012, 2020లలో లాగా ఆర్థిక వ్యవస్థ విఫలమైన ప్రతిసారి బలహీన వర్గాలను ఫణంగా పెట్టి కార్పొరేట్ వర్గాలకు ప్రైవేట్ రంగానికి ప్రభుత్వాలు రాయితీలు పెంచుకుంటూ పోయాయి. ఫలితంగా భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక అసమానతలు కలిగిన దేశంగా ఎదిగింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అధికారం నిలబెట్టుకోవటానికి పేదలకు చెదురుముదురు రాయితీలు విదిలించే అలవాటు ఒక విధానంగా మారింది. దేశంలో వెనుకబడిన తరగతులు భారతీయులుగా గౌరవప్రదమైన జీవితం సాగించేలా పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ విధానాల పరిధికి సంబంధం లేని అంశంగా మారింది. సంక్షేమ పథకాలన్నీ ప్రధానమంత్రి దయతోను ముఖ్యమంత్రుల దయతోను పేదలకు అందిస్తున్న ప్రత్యేక వెసులుబాటులుగా చెప్పుకోవడమే కాక అదేదో సొంత కష్టార్జితం పంచి పెడుతున్నట్లు సిగ్గు లేకుండా ప్రచార ప్రకటనలు చేసుకుంటూ తిరుగుతున్నారు.
సామాజిక- రాజకీయ రంగాలలో మార్పులు..
రోజురోజుకు పెరుగుతున్న మార్కెటీకరణ ఉమ్మడి తత్వాన్ని తోసిపుచ్చి వ్యక్తివాదాన్ని, నా అనే సంకుచితత్వాన్ని ముందుకు తెచ్చాయి. దాంతో పౌరులకు హక్కుల పట్ల ఉండాల్సిన అవగాహన పూర్తిగా మారిపోయింది. పౌర హక్కులు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన శాశ్వత హక్కులు అన్నా అవగాహన బదులు పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన అవకాశాలుగా మారాయి. స్థూల జాతీయ ఆదాయం 1950- 51తో పోల్చినప్పుడు 35.3 రెట్లు పెరిగింది. తదనగుణంగానే ప్రజలకు అందుబాటులో ఉండే సరుకులు వస్తువులు సేవల మోతాదు పెరిగింది. సగటున మూడున్నర రెట్లు పెరిగిన పొదుపు నిల్వల కారణంగా దేశంలో ఆర్థిక వనరుల లభ్యత 123 రేట్లు పెరిగింది. తలసరి ఆదాయం 31 రెట్లు పెరిగింది. ఇవన్నీ గమనించినప్పుడు మోతాదులోనూ నాణ్యతలోను మరిన్ని మెరుగైన అవసరమైన వస్తువులు సేవలు ఆర్థికంగా వెనకబడిన తరగతులకు అందించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ వనరులన్నింటినీ సంపన్నులు వ్యాపారవేత్తల ముఠాలు ఎమర్జెన్సీ అనంతర కాలంలో తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. దాంతో ఆర్థిక వ్యవస్థలో పెరిగిన సామర్థ్యాన్ని కనుగుణంగా సాధారణ ప్రజలకు అందాల్సిన వస్తుసేవలు, సరుకులు అందటం లేదు.
వినిమయతత్వం పెంపొందించడం, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలహీన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం అనేక సామాజిక, రాజకీయ పరిణామాలకు దారి తీసింది. ఒక మనిషికి ఒక ఓటుకున్న విలువకు భిన్నంగా కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న చందంగా అమలవుతోన్న మార్కెటీకరణ ప్రవాహంలో కొట్టుకుపోకుండా బ్రతికి బట్ట కట్టడానికి సాధారణ ప్రజలు యాతన పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విస్తరిస్తున్న ఆర్థికవ్యవస్థలో అందుబాటులో కనిపించే సరుకుల సముద్రంలో ఉన్నప్పటికీ గొంతు తడారేలా తాగటానికి గుక్క నీళ్లు దొరకని పరిస్థితి లాగానే అవసరం తీర్చుకోవటానికి కావలసిన సరుకులు కొనుక్కోలేని దుస్థితికి ప్రజలు నెట్టబడుతున్నారు. రాజకీయ రంగంలో ప్రత్యేకించి ఎన్నికల రంగంలో పెరుగుతున్న ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఉమ్మడి స్ఫూర్తి అవగాహన పక్కకు పోయి “నేను నా అవసరం” అన్న ధోరణులు ముందుకు వస్తున్నాయి. దాంతో రాజకీయ నాయకులు కూడా ఉమ్మడి అవసరాలకు సంబంధించిన విషయాలను విస్మరించి నోరు కలిగిన కొద్ది మందిని సంతృప్తి పరిచి ఓటు దండుకుని ఎన్నికల పబ్బం గడుపుకుంటున్నారు.
పాలకులు అనుసరించే సామాజిక, ఆర్థిక, రాజకీయ, మితవాద విధానాలను, ప్రజావ్యతిరేక విధానాలను సమర్థించుకోవడానికి ఎమర్జెన్సీ ఒక మైలురాయిలాగా మారింది. స్వేచ్ఛను సంపూర్ణంగా హరించకపోయినా అనుభవించలేనంతగా అంక్షలు పెట్టవచ్చు. మీడియాను ప్రభావితం చేయటం ఎమర్జెన్సీ కాలంలో నాటి సెన్సార్షిప్ లాంటిది కాదు. ఎమర్జెన్సీలో పాలకులు ప్రతిపక్ష నేతలను నేరుగా జైళ్లలో పెట్టారు. దానికి భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష నేతలను నయానోభయానో, ఆశచూపో, భయపెట్టో నోరు మూయించటం నేటి ఆనవాయితీగా మారింది. పాలకవర్గం అవసరాలు తీర్చడానికి న్యాయ వ్యవస్థ పని చేయటం ప్రారంభించింది. ఎమర్జెన్సీ కాలం నాటి ధిక్కార స్వరం న్యాయవ్యవస్థలో లేదు. ఎమర్జెన్సీ కాలానికి మించిపోయిన పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగం రాజకీయ పార్టీలు లొంగుబాటు నేడు తారస్థాయికి చేరుకుంటుంది. ఎమర్జెన్సీ తరహాలో నేడు కార్మిక హక్కులను పూర్తిగా హరించడం లేదు. కార్పొరేట్ లాభాలు పెంచటానికి అవసరమైన అంతవరకు మాత్రమే కార్మిక హక్కులను హననం చేస్తున్నారు. కాగితాలపై కార్మిక హక్కులు బతికే ఉన్నాయి.
సామాజిక విభజనలను ఉపయోగించుకోవటం, అందమైన భవిష్యత్తును ఆశ చూపటం, వినియోగ తత్వాన్ని పెంచి పోషించటం వంటి మార్గాలలో పాలకవర్గానికి ఎదురవుతున్న ప్రతిఘటనను దారితప్పిస్తున్నారు. పాలకులు మాట్లాడే భాష కూడా మారిపోయింది. సమానత్వం అంటే పేదరికం అందరికీ పంచటంగా వ్యాఖ్యానిస్తున్నారు. గుత్త పెట్టుబడిదారీ అనుకూల విధానాలను సంస్కరణలని పిలుస్తున్నారు.
ఎమర్జెన్సీ అనంతరకాలంలో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వెలివేతకు గురైన వారి పక్షాన నిలబడటానికి బదులు సంపన్నులను అందాలమెక్కించడమనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాయి. తద్వారా సామాజిక అసంతృప్తి తిరుగుబాటు దశకు చేరకుండా అడ్డుకోవడంలో అన్ని పార్టీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. విధాన రూపకల్పన మౌలికంగా మితవాద మధ్యేవాదం వైపు స్థిరపడిపోయింది. 1991 తర్వాత ఏ పార్టీ అధికారానికి వచ్చినా వెనుకబడిన తరగతులను మరింత వెనక్కు నిట్టేశాయి. చరిత్ర దశదిశ ఎన్నడూ స్పష్టంగా ముందస్తుగా తెలియదు. చరిత్ర ప్రయాణం అనేక ఎత్తుపల్లాల గుండా సాగుతుంది. కానీ ఎమర్జెన్సీ అనంతరకాలంలో మొదలైన ధోరణి నుంచి నేటి వరకూ రాజకీయ రంగంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తూనే ఉన్నాయి. వర్తమాన పరిణామాలు కూడా ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీనపరిచే దిశగానే సాగుతున్నాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
వ్యాస రచయిత అరుణ్ కుమార్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. భారత ఆర్థిక వస్తువులు అత్యంత తీవ్రమైన సంక్షోభం – కరోనా వైరస్ ప్రభావం భవిష్యత్తు అన్న గ్రంథాన్ని 2020లో వెలువరించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.