
సంపూర్ణ జీవితాన్ని చిత్రించేది నవల అయితే జీవితంలోని ఒక పార్శ్వన్ని మాత్రమే అయినా అత్యంత సమగ్రంగా చిత్రించి పాఠకుడిని ఆకట్టుకోగలిగేది కథ. అంటే నాలుగైదు పేజీలలో రాసిన కథ చదివాక దానికి సంబంధించి ఇక ఏ సమాచారమూ బాకీ లేదు అని అనిపించాలి పాఠకుడికి. తెలుగులో ఆధునిక కథ నూరేళ్ళముందే వేళ్ళూనుకున్నది. కథల్లో కొన్ని తాత్విక చింతనను రేకెత్తించేవిగా ఉంటాయి, మరికొన్ని చమత్కారంతో ముగిసేవిగా ఉంటాయి. మొదటి విభాగం కథలు గొప్ప ఆలోచనాపరుల కోసం రాయబడితే, రెండవ రకం కథలు సాధారణ పాఠకులను కూడా ఆకట్టుకునేవిగా ఉంటాయి. ఈ రెండు రకాల కథనాలు ప్రధాన ప్రపంచ భాషలన్నింటిలోనూ వర్ధిల్లుతూ ఉన్నాయి.
రవీంద్రనాథ్ ఠాగూర్ కథ ‘కాబూలీ వాలా’లో రహమత్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కలకత్తాకు వివిధ వ్యాపార పనుల మీద వచ్చి మినీ అనే అమ్మాయితో ఆత్మీయ స్నేహంలో పడతాడు. రహమత్ ఒక జైలు శిక్ష అనుభవించి చాలాకాలం తర్వాత తిరిగి మినీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకు పెళ్లి అవుతూ ఉంటుంది. ఒక రకంగా మినీ రహమత్ ను మర్చిపోవడం కూడా జరుగుతుంది. ఆ క్షణంలో కాబూల్ లో ఉన్న తన సొంత కూతురుని గుర్తుకు తెప్పించే ప్రేమను చెప్పడమే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉద్దేశంగా కబూలీవాలాను పాఠకుడు చదువుతూ ఉంటాడు. ప్రేమ్ చంద్ నషా కథలో తీవ్రమైన అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కూడా భోగలాలసలలో మునిగిపోయినట్లయితే భూస్వామ్య మనస్తత్వాన్ని ఒంటబట్టించుకుంటాడని చెబుతాడు. ఇవి ఆలోచనాపరులైన పాఠకులు ఎక్కువగా గుర్తు పెట్టుకునే కథలు.
కాగా కొన్ని ఇలా చూడగానే అలా ఆకట్టుకునే కథలు కూడా ఉంటాయి. వాటిలోని మెలికలు ఆ కథలను సులభంగా పాఠకుల దగ్గరికి తీసుకుపోతాయి. సోమర్ సెట్ మామ్ ‘ఇల్లిటరేట్’ అనే కథ ద్వారా విద్యావంతుడి కంటే నిరక్షరాసుడే ఎక్కువగా సంపాదించిన సంగతిని చెబుతూ, అతడు దాచుకున్న డబ్బును చూసి బ్యాంకు మేనేజర్ అతనికి పెద్ద బిజినెస్ చేయడానికి లోన్ ఇస్తానంటాడు. ఆ లోన్ పత్రంపై సంతకం చేయమని మేనేజర్ అతనికి పెన్ను చేతిలో పెడతాడు. తను ఇల్లిటరేట్ నని, వేలిముద్ర వేస్తానని చెప్పడంతో ఆశ్చర్యపోయిన మేనేజర్, ‘చదువు రాకుండానే ఇంత సంపాదించారంటే చదువు వస్తే ఇంకెంత సంపాదించేవారో ‘అని కామెంట్ చేస్తాడు. అప్పుడు ఆ ఇల్లిటరేట్ అన్నమాట మనకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. అతనిలా అంటాడు: ‘మీ అభిప్రాయం ఏడ్చినట్టే ఉంది. చదువు వస్తే నేను ఓ చర్చి ఫాదర్ దగ్గర క్లర్క్ గా పని చేస్తూ ఉండేవాడిని. అది రాకపోవడం వల్లే కదా ఇంత పని చేసుకోగలిగాను.’ సుప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి వాజీదా తబస్సుం రాసిన కథ ‘ఉతరన్’ లో జీవితమంతా షహజాదీ పాషా వాడి పడేసిన సెకండ్ హ్యాండ్ బట్టలు తొడిగిన చమ్కీ, షహజాదీ పాషా కు కాబోయే వరుణ్ణి మొదలే అనుభవించి ఆమెకు సెకండ్ హ్యాండ్ మొగుడిని ఇస్తున్నానని గలగలా నవ్వడంతో కథ ముగుస్తుంది. కథా వైవిధ్యాన్ని చెప్పడం కోసం ఇలా ఎన్ని కథలనైనా ఉదారించవచ్చు. ఏది ఎలా ఉన్నా రచయిత దృక్పధాన్ని బట్టి మాత్రమే
-2-
కథ నడుస్తుంది అనేది తిరుగు లేని సత్యం. దృక్పథం మీద రచయిత ఎదిగి వచ్చిన దారిలో ఎదురైన సైద్ధాంతిక భూమిక పనిచేస్తుంది. అలాంటి సైద్ధాంతిక భూమిక నుంచి రాసిన కథలే కటుకోజ్వల ఆనందాచారి గస్సాల్ మరికొన్ని కథలు.
గస్సాల్ మరికొన్ని కథలు ఎక్కువగా పేదరికం చుట్టూ తిరిగాయి. దిగువ మధ్యతరగతి కన్నీటి కథలు ఇవన్నీ ఆనందాచారి కథలు ఇలాంటి వస్తువునే ఎందుకు ఎంచుకున్నాయి అని ఆలోచిస్తే దానికి ఆయన నడిచి వచ్చిన ఉద్యమాల స్వభావం ఒక బలమైన కారణంగా కనిపిస్తోంది. ఇక్కడ కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మరొక మాట కూడా మనకు గుర్తు రాకమానదు. ‘వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి సుభిక్షంగా ఉన్నప్పుడు కథలు రావని; పంటలు పండక పోవడం, ఊహించింది జరగకపోవడమే కథను పుట్టిస్తుంది’ అన్న కొకు మాట నిజం. ఈ సంపుటిలో గస్సాల్ లో చాంద్ ది, లచ్చిమిలో సోమ్లా ది, ఆకాశం మారలే దృశ్యమూ మారలే లో ఈశయ్యది, ప్రతిస్పందనలో మిత్రాది, ఆచూకీ లేని హత్యలో వెంకటాచారిది, గూడులో గుడిసె వాసులది, హిందూ సితా హమారాలో పాషాది దారిద్రానికి దగ్గరగా ఉన్న దిగువ మధ్యతరగతి కుటుంబాలే. ఊర్వశి కథలో రమణది మాత్రమే కాస్త ధనిక కుటుంబం. మిగతా కథలన్నీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులవే. కాబట్టి ఈ కథల నిండా కష్టాలే తొణికిసలాడతాయి.
మరింత శ్రద్ధగా పరిశీలించి చూస్తే ఈ కథల్లో సింహభాగం కథలు మరణంతో ముగించబడ్డాయి. గస్సాల్ లో చాంద్, రాణి జీవన గమనంలో అమ్మ, ఆకాశం మారలే దృశ్యమూ మారలేలో దళిత మహిళ, లక్ష్మీబాయి స్మారక సిమెంట్ బల్లలో ఆనందరావు, ఆచూకీలేని హత్యలులో వెంకటాచారి, చెత్తోడులో వెంకన్న, హిందూ సితా హమారాలో పాషా తల్లి మహబూబ్బీ, ఊర్వశిలో శృతి, కరుణ దొరకలేదులో మోహన్ రావు ఏదో ఒక కారణంతో చనిపోతారు. ఇదొక ప్రత్యేకంగా గుర్తించదగిన విషయం ఈ కథల్లో. 14 కథలున్న ఈ సంపుటిలో తొమ్మిది కథల్లో మరణం తప్పనిసరిగా మారింది. బహుశా పేదరికం మరణాన్ని చాలా సులభంగా ఆశ్రయిస్తుంది అని ఈ రచయిత అన్కాన్షియస్ గానే చెప్పాడు. అలా చెప్పడం వల్లనే ఆయన పేదల పక్షపాతి అని ఆయనకు కూడా తెలియకుండానే ప్రకటితమైంది.
ఈ కన్నీటి వెతలను నడపడంలో రచయితగా కటుకోజ్వల ఆనందాచారి టెక్నిక్ పాఠకులను చకితుల్ని చేస్తుంది. ఆచూకీ లేని హత్యలో వెంకటాచారి నిద్రలేవకముందు ఒక కలగంటూ ఉంటాడు. ఆ కలలో తన తండ్రి కాలంలో కంసాలి వృత్తి ఎంత సజావుగా నడుస్తూ ఉండేదో, సంసారం ఎంత నింపాదిగా సాగుతూ ఉండేదో చూస్తూ ఉన్న కలతో కథను ప్రారంభిస్తాడు. చివరికి చారి నిద్రలేచిన తర్వాత జోయలుకాస్, ఖజానా తదితర రెడీమేడ్ నగల దుకాణాలు ఆయన బతుకుని ఎలా ఛిద్రం చేశాయో చెప్పి పూటకు లేనితనాన్ని సృష్టించిన పెట్టుబడిదారీ సమాజాన్ని కళ్ళకు కడతాడు. ఒకరూ ఇద్దరూ నగలను కరిగించి కొత్త వస్తువు తయారు చేయించడానికి మాత్రమే తన దగ్గరికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళ నగలోంచి రెండు గ్రాములను
అమ్ముకుంటే తప్ప ఆ పూట గడవని స్థితిని చాలా సహజంగా చిత్రించాడు. చివరికి నగ కోసం వచ్చిన వాళ్ళు
-3-
పెట్టిన ఒత్తిడి వల్ల ఆ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడిన వైనం పాఠకుడిని కంటతడి పెట్టిస్తుంది. ఇంకొక కథ హిందూ సితా హమారా లో పాషా తల్లి తాము అద్దెకు ఉండొచ్చిన ఇంటి పరిసరాలలోనే తిరగాడుతూ చివరికి అక్కడే చనిపోతూ తనను అక్కడే సమాధి చేయమని కూడా కోరుకుంటుంది. ఈమె స్వస్థలం మీది ప్రేమ కుటుంబాన్ని అంత ఇబ్బంది పెడుతూ ఉండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఏఏను వ్యతిరేకిస్తూ పాషా కొడుకు ఒక ర్యాలీలో పాల్గొనడం వల్ల అతన్ని పోలీసులు పట్టుకుపోయి జైల్లో పెడతారు. ఆ తగాదా అలా నడుస్తూ ఉండగానే పాషా తల్లి మెహబూబ్బీ తను 40 ఏళ్లుగా అద్దెకుండిన ఇంటి పరిసరాలలోనే చనిపోతుంది. ఒక శిలాఫలకం కూడా చేయించి సమాధి మీద అతికించమని చెప్పి మరీ పోతుంది. అది మేము ఇక్కడి వాళ్ళమే అన్న సారాంశంతో ఉంటుంది. ముస్లింలకు ఇక్కడి వాళ్లమే అని నిరూపించుకోవాల్సిన దుర్గతిని సృష్టించిన సీఏఏ చట్టం మీద ఎక్కుపెట్టిన బాణం ఈ కథ. ఇంకొక విలక్షణమైన కథ గూడు. పేదింటి పిల్లలైన అన్నా చెల్లెలు ఆటలో భాగంగా మట్టితో ఒక గూడు కట్టుకుంటారు. పోలీసులు గుడిసె వాసులను తొలగించి గుడిసెలను కూల్చివేస్తూ ఉన్న క్రమంలో చెల్లి కోసం అన్న కట్టిన గూడు కూడా ధ్వంసం చేయబడుతుంది. ఇది రాజ్యం చేసిన విధ్వంసాన్ని సంకేతాత్మకంగా చేసిన చిత్రణ. ఇలా ఈ సంపుటిలో ఉన్న 14 కథలు విభిన్న సమస్యలు చుట్టుముట్టినప్పుడు సామాన్యులు విలవిడిలాడిన విధానాన్ని చిత్రించినవి.
ఇందులో ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయని రచయిత పరోక్షంగా పాఠకుడికి చెబుతూ ఉంటాడు. అందులో ఆకాశం మారలే దృశ్యమూ మారలేలో అధికారుల స్వభావం వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి. ప్రతిస్పందనలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆచూకీ లేని హత్యలులో పెట్టుబడి దారీ సమాజపు వికృత విన్యాసం ఉన్నది. గూడులో గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాల వైఫల్యం ఉన్నది. మతం ప్రాతిపదికగా ఓట్ల రాజకీయం చేస్తున్న ప్రభుత్వపు కుటిలత్వం హిందూ సితా హమారాలో కనిపిస్తుంది. మిగతా కథల్లో మధ్యతరగతి మనస్తత్వం నుండి పుట్టుకొచ్చిన సమస్యలు ఉన్నాయి. సమగ్రమైన అభివృద్ధికి వ్యూహం లేని స్థితి చెత్తోడు, బతుకు బురఖా లాంటి కథల్లో కనిపిస్తుంది.
కటుకోజ్వల ఆనందాచారి ప్రధానంగా కవి. వస్తు దర్శనం కాగానే కవిత్వం తనంతట తాను రెండు మూడు పాదాలను రూపొందించుకోవడం కవులకు అనుభవైకవేద్యమే. ఆనందాచారి కథలు రాస్తున్నా చాలా ఎమోషనల్ టర్నింగ్స్ దగ్గర కథను కవిత్వమయం చేశారు. చాలా చోట్ల ఇది అసంకల్పితంగానే జరిగింది. పాఠకుడినీ ఈ కవితా వాక్యాలు కట్టిపడేస్తాయి. ఊర్వశి కథలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం పట్ల ఆసక్తి లేని ఊర్వశి కంపెనీల స్వార్థాన్ని ఇలా చెబుతుంది. ‘పాలు పితకడం ఊరి వాళ్లకు తెలుసు. మెదళ్లను పిండుకొనే ప్రక్రియ కంపెనీలది’ అని. ఇంకోచోట ఆమె అంటుంది ’తను హోంసిక్ ఫీల్ అవుతున్నట్లు తల్లిదండ్రులు అనుకుంటారు కానీ తాను హ్యుమానిటీ సిక్ ఫీలవుతున్నానని, అది వాళ్లకు తెలిసేదెలా’ అంటుంది. ఆచూకీ లేని హత్యలో
-4-
వెంకటాచారి ‘తాను కూర్చుండే దుకాణంలోనే అలా కూర్చుండిపోయాడు, బెస్ట్ చెక్కకు ఒత్తిపెట్టి బంగారం బిళ్ళను రంపంతో తాను కోసినట్టుగానే తన మర్యాదను, వ్యక్తిత్వాన్ని పరిస్థితులు కోసివేస్తున్నాయి. రాలి పడుతున్న రజనులా చెల్లాచెదరయ్యాడు చారి’ అంటాడు. చివరగా ఇదే కథలో చారి కుటుంబంతో సహా చనిపోయాక అన్న మాటలు: ‘ఇంత దయార్ద్ర హృదయులు చూస్తుండగానే ఒక కుటుంబం ఒక్క రక్తపు బొట్టు పడకుండా విముక్తి పొందింది’ అని. ఎప్పుడూ ‘చెత్తను పారేయాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి’ అని పాఠాలు చెప్పే భర్త కులం విషయంలో తనకున్న జాడ్యాన్ని వదిలించుకోలేక పోతున్నాడని భార్య నిస్సంకోచంగా భర్తను హెచ్చరిస్తుంది. అప్పుడు ఆలోచనలో పడ్డ భర్త ‘ఏకధాటిగా భార్య అంటున్న మాటలకు నిర్ఘాంతపోయి ఆమె వైపే చూస్తున్నట్లు కనబడుతున్నప్పటికీ తనలోకి తాను చూసుకోవడం మొదలైంది శేషుకి’ అని చెబుతాడు రచయిత కవితాత్మకంగా. లచ్చిమి అనే కథలో సోమ్లా ఇలా అంటాడు: ‘దాని తెల్లని ముఖం కన్నా దాని తెల్లని మనసే నా కండ్లకు కనిపిస్తది. నేను లచ్చిమి తోడే’ అంటూ సోమ్లా కూడా మనసులోనే లచ్చిమిని కౌగిలించుకున్నాడట.
మునగనూరు గ్రంథాలయం వారు నిర్వహించిన కథల పోటీకి రాసిన గస్సాల్ కథ మొదటి బహుమతి పొందడంతో తను కవిత్వం నుండి కథలకి కూడా షిఫ్ట్ అయ్యాడు ఈ సంకలనకర్త కటుకోజ్వల ఆనందాచారి. ప్రక్రియను కొత్తగా చేరుకోవడంతోపాటు తన ఉద్యమ ప్రస్థానం ఇచ్చిన కొత్త చూపుతో కలిసి చేరుకున్నాడు. అది కథా ప్రక్రియను మరింత ప్రజోపయోగకరంగా అలంకరిస్తూ ఉన్నది.
-ఏనుగు నరసింహారెడ్డి
8978869183
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.