
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది.
దీంతో పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, రేపు మాపో అధికారానికి వస్తామని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీల బలాబలాలు తెలుసుకునేందుకు రంగం సిద్ధమైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది లోకసభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ గతంలో ఎప్పుడు లేనంత బలంతో ముందడుగులు వేస్తోంది.
సాధారణంగా గ్రామపంచాయతీలో ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు. అయినా ఆ ఎన్నికలు ముఖ్యమైనవి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగే వారంతా ఏ ఏ పార్టీలకు చెందినవారో, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ తెలిసిందే. కాబట్టి పార్టీ గుర్తులపై పోటి పడకున్నా, పార్టీలే పోటీలో ఉన్నాయని జనం భావిస్తారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మండల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు, మరో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల వరకు ఈ సంవత్సరం చివరకు కానీ 2026 జనవరి నాటికి కానీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఈ ఎన్నికలు ఎందుకు ఆలస్యమయ్యాయి?
తెలంగాణలోని 12,769 గ్రామపంచాయతీలకు సంబంధించిన ఎన్నికల విషయంలో 17 నెలలుగా సాగుతున్న సస్పెన్స్‌ను హైకోర్టు ముగించింది. గత సంవత్సరం ఫిబ్రవరి నాటికి పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది.
అంతకు రెండు మూడు నెలల ముందే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అప్పటి నుంచి స్థానిక ఎన్నికల విషయంలో జాప్యం చేసుకుంటూనే వచ్చింది. ఆర్థిక వనరులకు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న బహుముఖ సవాళ్లను అధిగమించి సానుకూలమైన సమయంలో ఎన్నికలు జరపాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రాజకీయ ప్రయోజనాన్ని మరింత సంఘటితం చేసుకోవడానికి వీలుగా గ్రామస్థాయిలో తన క్యాడర్‌కు పునరావాసం కల్పించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అంటే స్థానిక సంస్థల్లో కూడా అధిపత్యాన్ని సంపాదించాలి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక సంస్థల్లో అత్యధిక స్థాయిలో గెలుపొందారు. క్షేత్రస్థాయిలో పునాదులు పునర్నిర్మించుకోవడం కాంగ్రెస్‌కు మరింత అవసరం. స్థానిక స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్న పాలక పార్టీల పంచన చేరి అంతోఇంతో లబ్ధి పొందారు.
తెలంగాణ సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అభిప్రాయంలో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలలో 9,000 గ్రామపంచాయతీలు బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్నాయి. బీఆర్ఎస్ వార్డ్ మెంబర్ల సంఖ్య కూడా అదే మోతాదులో ఉంటుంది.
స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చాలా ఇస్తున్న వీరందరూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ రాజకీయ కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీ వైపుకు మొగ్గు చూపుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే స్థానిక సంస్థల్లో కూడా అభివృద్ధి పనులు ముందుకు పోవాలంటే ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా పట్టిపీడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనేక సబ్సీడీలు రాయితీలు, ఖజానా ఖాళీ కావడంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఉదాహరణకు రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి.
ఈ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తుంది. చాలామంది లబ్ధిదారులు తమకు ఈ పథకాల వల్ల ప్రయోజనం జరగలేదని ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున ఖర్చవుతున్నప్పటికీ ఏ నెలలో మొదటి వారంలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు కానీ బీజేపీకి కానీ అవకాశం ఇవ్వకుండా ఉండటానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లబ్ధిదారులతో భారీ సభలు నిర్వహిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పీ మహేష్ కుమార్ గౌడ్ ది వైర్‌తో మాట్లాడుతూ, ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. స్థానిక సమస్యలు ఎన్నికల్లో అమలు జరగాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత షెడ్యూల్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుందని మహేష్ కుమార్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఉపాధి విద్యారంగాలలో వెనుకబడిన తరగతులకు జరిగే రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఉభయ సభలలో బిల్లు ఆమోదించి, కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు ప్రకారం వెనుకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరగాలంటే ఇప్పుడు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగును సవరించాలి. ఆ సవరణ జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుపై కేంద్రం ఇంత వరకు స్పందించలేదు.
గత సంవత్సరం మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో భాగంగా నూతన రిజర్వేషన్ విధానాన్ని ఖరారు చేయటం వంటి వాటి వలన స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యాయని పీసీసీ అధ్యక్షులు తెలిపారు.
కోర్టు ఏమన్నది?
స్థానిక సమస్యల ఎన్నికలకు తుది గడుగును ఖరారు చేస్తూ, ఎనిమిది పేజీల తీర్పును వెలువరించారు. ఇందులో జస్టిస్ టీ మాధవి దేవి గత 17 నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వైఫల్యాన్ని ప్రశ్నించారు.
ఇరుపక్షాలవాదనలను విన్న న్యాయస్థానం, ఈ మొత్తం క్రమం పూర్తిగా అవడానికి మూడు నెలల గడువుని నిర్ణయించారు. ఇందులో, నూతన రిజర్వేషన్ల చట్టం ప్రకారం స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణకు 30 రోజుల గడువు కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు మరో 60 రోజులు గడువు కేటాయించారు.
మాజీ సర్పంచులు వేసిన రిట్ పిటిషన్లపై వాదనలు విన్న తర్వాత జస్టిస్ మాధవి దేవి ఈ తీర్పునిచ్చారు.
సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పంచాయతీల నిర్వహణ భారాన్ని స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి పంచాయతీ చట్టాల స్ఫూర్తికి విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఈ స్పెషల్ ఆఫీసర్లు అందరూ తమతమ రోజువారి విధులు నెరవేర్చే క్రమంలో పంచాయతీలకు హాజరై సమస్యలు పరిష్కరించలేకపోతున్నారని కావలసినంత సమయం వెచ్చించలేకపోతున్నారని పిటిషనర్ల వాదన.
15 ఫైనాన్స్ కమిషన్ నిధులు రాగానే స్థానిక సంస్థలకు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం ఆధారంగా గ్రామాలలో అనేక అభివృద్ధి పనులను సొంత పెట్టుబడులతో పూర్తి చేశామని సర్పంచులు వాదిస్తున్నారు. కానీ 2024- 25 సంవత్సరానికి 15 ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రానికి రావాల్సిన 1500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో తాము అభివృద్ధి పనులకు పెట్టిన నిధులు వెనక్కు తీసుకోలేకపోయామని సర్పంచులు వాపోతున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడం ఈ నిధుల నిలుపుదలకు కారణమంటూ కేంద్రం చెప్తోంది.
బీసీ రిజర్వేషన్ ఖరారు చేయాల్సి రావటంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మరో నెల రోజులు పాటు సాగుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైన తరువాత ఎన్నికల క్రమాన్ని పూర్తి చేయడానికి మరో రెండు నెలలు గడువు కావాలని ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ కోర్టును అభ్యర్థించారు. స్థానిక సంస్థలలో అమలు జరగాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గత 15 నెలల కాలంలో గ్రామాలలో పారిశుధ్యం తాగునీటి సమస్యలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయని సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి ది వైర్‌తో అన్నారు. సర్పంచులందరికీ సుమారు 1200 రూపాయలు చెల్లించాల్సిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆయన ఆరోపించారు. “ఉన్నపలంగా 1200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే ఆ నిధులు ఇప్పటివరకు పనిచేసిన బీఆర్ఎస్ సర్పంచ్ల ఖాతాలోకి వెళ్తాయి. ఆ సొమ్ముతో బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో బలంగా పోటీ చేసే అవకాశం ఉంది” అని కూడా అన్నారు.
ఢిల్లీలో చెల్లింపు ఆలస్యం కావడంతో సర్పంచులు ఇబ్బందులకు గురవుతున్నారని నరసింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారానికి రాగానే పంచాయతీలకు ఉన్న బకాయిలు చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వాగ్దానం చేసిన విషయాన్ని సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి గుర్తు చేశారు. బిల్లులకు చెళ్లింపులో జరిగిన జాప్యం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీ రాజు పల్లి సర్పంచ్ దాసరి శంకరయ్య ఆత్మహత్యకు కారణమని నరసింహారెడ్డి తెలిపారు.
సర్పంచులందరూ పార్టీ అభిమానులతో సంబంధం లేకుండా సేవలందించారని నరసింహారెడ్డి పేర్కొన్నారు. గ్రామాలలో గుర్తింపు గౌరవం కలిగిన వారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వారికి దురుద్దేశాలు ఆపాదించడం వింతగా ఉందన్నారు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్‌లు చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులను మరో పార్టీ అధికారం వచ్చిన తర్వాత చెల్లించటం షరామాములుగా జరిగే కార్యక్రమం. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందన్నారు.
“గత ఐదేళ్ల మా పదవీకాలంలో అప్పులు చేశాము, ఆస్తులను అమ్మాము, బంగారం తాకట్టు పెట్టాము ఏది చేసినా చివరికి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులను పూర్తి చేశాము. ప్రజల విశ్వాసాన్ని పొందటానికి పోటీ పడి మరీ పనిచేశాము. సర్పంచ్‌లను ప్రభుత్వం విశ్వాసంలో తీసుకోవటానికి ఇవన్నీ పనికిరాకుండా పోయాయి” అని నరసింహారెడ్డి వాపోయారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.