
2025 వార్షిక నివేదికలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి మూడు నుండి నాలుగులక్షల కోట్ల రూపాయలు డెవిడెండ్గా అందించనున్నదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మొత్తం 2025-26 బడ్జెట్ అంచనాల కంటే రెట్టింపు అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంతేకాక 2025 ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంకు అచ్చేసిన కరెన్సీ విలువ కంటే ఖచ్చితంగా రెండు రెట్లు ఎక్కువ. 2024-25లో ఆర్బీఐ లక్షన్నర కోట్ల విలువైన కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేసింది.
ఆర్బీఐ తీసుకుంటున్న ఈ చర్య ద్రవ్యమార్కెట్లను పెద్దఎత్తున ప్రభావితం చేయనున్నది. వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే ఆదాయం 6.8 శాతం నుండి 6.2 శాతానికి పడిపోతుందని అంచనా. దానికి తోడు మార్కెట్లో నిధులకు రెక్కలు కట్టేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇంకా ఆచరణలోకి రాకపోవటం, డిపాజిట్ల కంటే రుణాలు తక్కువగా ఉండటంతో బ్యాంకుల వద్ద అదనపు నగదు నిల్వలు పేరుకుంటున్నాయి.
తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు ఇచ్చే బాండ్లుతో పాటు ఆర్బీఐ ప్రభుత్వానికి ఇచ్చే డెవిడెండ్ల గురించిన సమాచారం బయటికి పొక్కటంతో ఈక్విటీ బాండ్ మార్కెట్లో కదలికలు పుంజుకున్నాయి. అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కూడా శాంతించటం ఈ కదలికలు పెరగటానికి కారణం. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వ వనరుల విషయంలో మాత్రం సంక్షోభ స్థితి కొనసాగుతూనే ఉంది. వార్షిక పన్ను ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల విషయంలో ఆర్బీఐ జోక్యం పెరగటంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా తగ్గాయి. దాంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసంలో పన్నుల ద్వారా ప్రభుత్వం ఆశించినంత ఆదాయం రాకపోవటంతో కీలకమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడినది. గత సంవత్సరం ఆర్బీఐ నుండి 2.10 లక్షల కోట్ల రూపాయలు డెవిడెండ్గా తీసుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వపు ఆర్థిక స్థితి ఇలా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా రక్షిత ఆర్థిక విధానాల అమలు, పొంచి ఉన్న మాంద్యం నేపథ్యంలో 2025 సంవత్సరానికి గాను ఆర్బీఐ కేంద్రానికి అందించనున్న డెవిడెండ్కు ప్రాధాన్యత ఉన్నది. ఆర్బీఐ వార్షిక నివేదికలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలోనూ ద్రవ్య వ్యవస్థలోనూ మారుతున్న పొందికలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐకి ప్రధాన ఆదాయ వనరు వడ్డీల రూపంలో వచ్చే ఆదాయమే. 2024 వార్షిక నివేదిక ప్రకారం ఆర్బీఐకి లక్షల 90 వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో ఆదాయం వస్తే ఈ సంవత్సరం అది లక్షా 70 వేల కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థలో మదుపుదారరులకు, పెట్టుబడిదారులకు విశ్వాసం సన్నగిల్లుతోంది అని చెప్పేందుకు ఇది ఒక సూచన.
మార్కెట్లో వచ్చే ఊపుతాపులను అధిగమించటానికి కేటాయించే కంటిన్జెన్సీ ఫండ్ కూడా ప్రస్తుతం ఉన్న షుమారు యాభై వేల కోట్ల నుండి లక్షా 60 వేల కోట్లకు పెంచింది. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. 2024లో ఈ కంటింజెన్సీ ఫండ్ కేటాయింపులు కూడా తగ్గించి అదనపు లాభం లెక్క చూపించి అందులోంచి బడ్జెట్లో కోరినదానికంటే ఎక్కువ మొత్తం కేంద్రానికి డెవిడెండ్లుగా అప్పగించింది ఆర్బీఐ.
2025 సంవత్సరానికి ఆర్బీఐ వడ్డీల రూపంలో సంపాదించిన లక్ష 70 వేల కోట్ల రూపాయలు కంటింజెన్సీ నిధికి బదిలీ అయినా విదేశీ మారకద్రవ్యం మేనేజ్మెంట్ ద్వారా సంపాదించిన రెండు లక్షల కోట్ల రూపాయల నిల్వలును డెవిడెండ్లుగా ప్రకటించనున్నది. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీమారక ద్రవ్య నిల్వల కంటే 131 బిలియన్ డాలర్లు విదేశీ మారకద్రవ్య లావాదేవీలు జరిపింది. మరింత వివరంగా చెప్పాలంటే 396 బిలియన్ డాలర్లు అమ్మి 364 బిలియన్ డాలర్లు కొన్నది. తద్వారా వచ్చే ఆదాయం రెండున్నర లక్షల కోట్లరూపాయలు ఉంటుందని అంచనా.
ఆర్బీఐ సంపాదించే ఆదాయ వనరుల్లో విదేశీ మారక ద్రవ్య లావాదేవీల ద్వారా సంపాదించే మొత్తం పెరుగుతూ రావటం గమనిస్తే ఇప్పటి వరకూ వడ్డీరూపంలో సంపాదించే ఆదాయం కంటే విదేశీ మారక ద్రవ్య లావాదేవీల ద్వారా సంపాదించే ఆదాయం పెంచుకోవడానికే ఆర్బీఐ సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కేంద్రానికి సాధ్యమైనంత పెద్దమొత్తంలో డెవిడెండ్లు సమకూర్చటానికి ఆర్బీఐ పడుతున్న పాట్లు గమనించినప్పుడు ఆర్బీఐ వ్యవస్థాగత లక్ష్యాలకు దూరంగా జరుగుతుందన్న సందేహం కలుగుతోంది. ఆర్థిక వ్యవస్థలో ధరల స్థిరీకరణ, ద్రవ్య విధానాల్లో స్థిరత్వం, విదేశీమారక నిల్వల సంక్షోభాన్ని నివారించటం ఆర్బీఐ మౌలిక వ్యవస్థాగత లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆర్బీఐ వార్షిక నివేదికను పరిశీలిస్తే ఈ వ్యవస్థాగత లక్ష్యాల కంటే ఆర్బీఐ తమ ఆదాయ వనరులు పెంచుకోవటంపైనే కేంద్రీకరిస్తోందని అర్థమవుతుంది. తద్వారా తన యజమాని అయిన కేంద్ర ప్రభుత్వాన్ని ద్రవ్య సంక్షోభం, ద్రవ్య లోటు నుండి బయట పడేయటమే ప్రాధాన్యతగా భావిస్తోంది. ఈ వ్యవహార శైలి రూపాయి ఆధారిత మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. పెద్దఎత్తున విదేశీ మారక నిల్వలు పోగుచేయాలన్న తపన దీర్ఘకాలంలో ఆర్బిఐని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కూడా ఉంది.
రానురాను ఆర్బీఐ ఇచ్చే డెవిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడటం కూడా దేశపు ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యంగా లేదన్న వాస్తవాన్ని ముందుకు తెస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 196 లక్షల కోట్ల రూపాయల అప్పులుంటే రాష్ట్రాలన్నింటికీ కలిపి మరో 96 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం తగ్గటం, ఉత్పాదక తగ్గటం, లాభాలు కుదించుకుపోవటంతో ఆర్థిక వృద్ధి కుంటినడక నడుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ సవాళ్లు మరింత తీవ్రం కానున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డెవిడెండ్లు ఆశాజనకంగానే ఉండొచ్చు కానీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనబోయే సంక్షోభానికి ఇవి సూచికలు.
ధనంజయ సిన్హా,
సిస్టమిక్స్ గ్రూప్ సహా అధిపతి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.