
1934లో జర్మనీ అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్‌బర్గ్ మరణించిన తర్వాత హిట్లర్ చాన్సలర్, (ప్రధానితో సమానమైన హోదా) అధ్యక్ష పదువుల రెండిటినీ తానే చేపట్టాడు. అప్పటి వరకూ సైన్యంపై సంపూర్ణాధికారాలు అధ్యక్షుడికి మాత్రమే ఉండేవి. కానీ హిండెన్‌బర్గ్ మరణానంతరం దేశాధినేతతో పాటు సర్వసైన్యాధక్ష పదవి కూడా తాను చేబట్టి నియంతగా మారాడు.
అప్పటి వరకూ జర్మనీ సైన్యం విధుల్లోకి చేరేటప్పుడు ‘‘ ఒక ధీరుడైన సైనికుడిగా రాజ్యాంగానికి బధ్దుడినై, జర్మనీ దేశ రక్షణకు నిరంతరం కట్టుబడి ఉంటాను. అధ్యక్షుడికీ, నా పై అధికారులకూ విధేయుడినై ఉంటాను’’ అని ప్రమాణస్వీకారం చేసేవారు.
హిట్లరే సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాక ‘‘భగవంతునిపై ప్రమాణం చేసి ఈ ప్రమాణం చేస్తున్నాను. జర్మన్ సర్వాధికారి, సర్వసైన్యాధ్యక్షుడు అయిన అడాల్ఫ్ హిట్లర్‌కు విధేయుడినై ఉంటాను. ఈ ప్రమాణానికి కట్టుబడి ఉండేందుకు నా జీవితంలో ఏ క్షణమైనా త్యాగానికి సిద్ధమై ఉంటాను’’ అని ఈ ప్రమాణ పత్రాన్ని మార్చేశాడు.
ఈ ప్రమాణం వలన ఒకింత జరిగిన ప్రయోజనమేమైనా ఉందంటే అది ఆ కాలంలో జర్మన్సైన్యం సాగించిన అకృత్యాలన్నీ తమ విధి నిర్వహణలో భాగంగా సాగించినవే తప్ప వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సాగించినవి కాదని చెప్పుకోవడానికి అక్కరకు రావడమే.
మన కాలంలో సైతం హిట్లర్ పట్ల ఆయన సేనలు ఎంత అంకిత భృావంతో ఉన్నాయో తాను కూడా అమెరికా సేనల నుండి అటువంటి అంకిత భావాన్ని ఆశిస్తున్నానని ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు స్పష్టంగానే ప్రకటించారు. తర్వాత అదేదో మాటల్లో వచ్చిందే తప్ప అధికారిక అభిప్రాయం కాదని తిరస్కరించారనుకోండి.
ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద కవ్వింపు చర్యలకు తగిన గుణపాఠం చెప్పామన్న అమితోత్సాహంతో సరికొత్త కీర్తి పతాకలు భుజకీర్తులు తగిలించుకుంటున్న సందర్భాన్ని కూడా పై రెండు సందర్భాలతో పోల్చి చూడాల్సిందే. మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ‘సైస్యం మోడీకి పాదాభివందనంచేస్తున్నాయ’న్నారు. ఈ వ్యాఖ్యలపై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి తరఫున ఇచ్చిన వివరణలూ ఏవీ ఇంగితం ఉన్న వారిని ఆకట్టుకోలేకపోయాయి.
కాకపోతే మోడీ తన నోటి నుండి నేరుగా ఎన్నడూ యావత్ సైన్యం తనకు విధేయులై ఉండాలన్న మాట చెప్పలేదు. అలాగని హిట్లర్ లాగా రాజ్యాంగాన్ని మార్చేసి ఉపముఖ్యమంత్రి చెప్పినట్లు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చర్యలు ప్రారంభించిన దాఖలాలు ఇప్పటికైతే లేవు. ఆయనచుట్టూ ఉన్న భక్తజన భజన బృందం మాత్రం ఈ చర్చ ముందుకు తెస్తోంది.
నిజానికి నేడు మోడి ఉన్న స్థితిలో నెహ్రూ ఉండి ఉంటే మాత్రం సదరు ఉపముఖ్యమంత్రి చెవులు మెలిపెట్టి మరీ క్షమాపణలు చెప్పించి ఉండేవారు. తనకు తరచూ నియంతృత్వం పట్ల కలిగే మోజు గుర్తుకొచ్చినప్పుడల్లా తనను తాను నిందించుకునేవాడినని 1937లో మోడరన్ రివ్యూ పత్రికకు రాసిన వ్యాసంలో నెహ్రూ చెప్పుకున్నారు. ఈ వ్యాసం నెహ్రూపేరుతో ప్రచురితం కాలేదు.
అప్పుడప్పుడూ మోడీ తనను తాను ఎవరో సంబోధిస్తున్నట్లు సంబోధించుకోవటం తరచూ గమనిస్తాము. పాతకాలంలో రాజులు, జమీందార్లు తమ గురించి చెప్పుకోవాల్సినప్పుడు తృతీయ పురుషతో సంబోధించుకునేవారు. మోడీ ఇచ్చే గ్యారంటీ అంటూ తన మాట బంగారంతో సమానమన్నట్లు వ్యవహరిస్తారు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడూ మోడీ మాటలు షేక్స్ఫియర్ రచన జూలియస్ సీజర్ డైలాగ్ లాగా ‘ సీజర్ అన్నాడంటే అయిపోవాల్సిందే’ అన్నట్లుంటాయి.
రాజ్యాంగం ప్రతిపాదించిన అధికారాల విభజనను తుడిచిపెట్టి కార్యనిర్వాహకవర్గపు ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునేందుకు చట్టపరమైన చర్యలు కూడా ఇంకా మోడీ ప్రారంభించలేదన్నది వాస్తవం. సైన్యం విషయంలో గతంలో ‘నా సైనికులు’ అని మాత్రం ఒకటి రెండు చోట్ల సంబోధించారు. పైపైన చూసేవారికి పెద్దమనిషి తరహాలో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అనిపిస్తుంది.
ఇదంతా ఎలా ఉన్నా ఉపముఖ్యమంత్రి నోరుపారేసుకున్న తీరు క్షమార్హమైపోతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఆ మాటలకు ఆ ఉప ముఖ్యమంత్రిపై మోడీ ఎటువంటి చర్యలూ తీసుకోకుండా వదిలేస్తారా అన్న ఆందోళన చట్టబద్ధమైన పౌరజీవనంసాగించే వారందరిలోనూ ఉంది. ఇప్పటికైతే భారత సైన్యం రాజ్యాంగానికి విధేయులై ఉన్నారు. ఏ వ్యక్తికీ, వ్యవస్థకూ, రాజకీయ విధానాలకు విధేయులు కాదు. ఈ రాజ్యాంగం పట్ల సైన్యం విధేయతను ఇలాగే కొనసాగించేందుకు మోడీ సిద్ధపడుతున్నారని ప్రస్తుతానికి విశ్వసిద్దాం.
అయినా ఉపముఖ్యమంత్రి మాటలు కొట్టిపారేయటానికి వీల్లేనంత తీవ్రమైనవే. వీటిపై మోడీ తన వైఖరిని వెల్లడిస్తే సగటు పౌరునికి ఉన్న సందేహాలు కేవలం సందేహాలేనా లేక భయాలా అన్నది తేలుతుంది.
బదరీ రైనా
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.