
“ డిప్లమాటిక్ అవుట్ రీచ్” పేరుతో ఒక దౌత్య ఉద్యమాన్ని భారతదేశం మొదలుపెట్టింది. ఏడు బృందాలు, ముప్నైరెండు దేశాలలో పర్యటించి, అక్కడి ప్రభుత్వ ప్రతినిధులను, రాజకీయనేతలను, ప్రభావశీలురను కలిసి పెహెల్గామ్ దగ్గర నుంచి ఆపరేషన్ సిందూర్ దాకా జరిగిన పరిణామాలను, పాకిస్థాన్ కొన్ని దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి భారత్ లో సృష్టిస్తున్న ఉగ్రవాద అశాంతిని వివరించి చెప్పనున్నాయి. ఈ అనధికార దౌత్యబృందాలలో దేశంలోని వివిధ రాజకీయపక్షాల ప్రతినిధులు, దౌత్య, విదేశాంగ వ్యవహారాల నిపుణులు, మాజీ రాయబారులు ఉన్నారు. భద్రతాసంఘంలో శాశ్వత సభ్యదేశాలను, తాత్కాలిక సభ్యదేశాలను, త్వరలో తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ యాత్రలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం భద్రతాసంఘం తాత్కాలిక సభ్యదేశంగా ఉండి, అక్కడ తన ప్రభావాన్ని కొంత చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందాల సభ్యులు పర్యటనలు ప్రారంభించి, ఆయా దేశాలలో వార్తాపత్రికలు, చానెళ్లకు భారత- పాక్ ఉద్రిక్తతల మీద ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. భారతవైఖరిని వివరిస్తున్నారు.
ఈ దౌత్య ఉద్యమం మంచిది. ఎటువంటి దౌత్య ప్రయత్నమైనా సమస్య యుద్ధాల దాకా వెళ్లకుండా నివారిస్తుంది. ఇతర మార్గాల ద్వారా పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ సమాజానికి విషయాన్ని వివరించడం న్యాయపక్షాన్ని బలపరుస్తుంది. అన్యాయపక్షాన్ని బలహీనం చేస్తుంది. పొరుగుదేశం పై భారతదేశం ఒక కఠినచర్య తీసుకోవలసి వచ్చినప్పుడు, దాని పూర్వాపరాల విషయంలో అనేకరకాల కథనాలు, వాదనలు ప్రపంచంలో వ్యాప్తిలో ఉన్నప్పుడు, తన వైఖరిని, వాదనను భారతదేశం వినిపించాలి. ఆ స్వరం భారతదేశంలో ఒక పక్షానిదో, ఒక వర్గానిదో కాకూడదు. ఆంతరింగికంగా రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా, జాతీయ ప్రయోజనాల విషయంలో దేశమంతా ఒకటే అన్న సంకేతం ఉండాలి. అందుకే ఈ దౌత్యయాత్రా బృందాలలో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అంతే కాదు, ప్రతి బృందంలో కనీసం ఒక ముస్లిం ఉండాలన్న విధానాన్ని కూడా అనుసరించింది. రాజకీయంగా, సామాజికంగా అందరినీ కలుపుకుపోతామన్న సూచన ప్రపంచానికి ఇవ్వడం కూడా ఒక సానుకూల అంశం.
ఇతర దేశాల నుంచి మద్దతును కూడగట్టుకోవడమే కాదు, పాకిస్థాన్ ప్రచారాలను ఓడించడం కూడా భారత్ కు అవసరం అవుతుంది. అనేక ప్రయోజనాల పరస్పరతల మీద దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి. నేటి ప్రపంచవ్యవస్థలో దేశాల మధ్య సంబంధాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. వలసవాద కాలం నుంచి, ప్రచ్ఛన్నయుద్ధ కాలం వరకు ఏర్పడిన కూటములు, మైత్రులు, వైరసంబంధాలు, ఏకధ్రువ ప్రపంచమని అనుకుంటున్న కాలంలో కూడా కొనసాగాయి. భారత-పాక్ ఉద్రిక్తతలకు స్వాతంత్ర్యపూర్వ కాలం నుంచి, అమెరికా-సోవియెట్ శిబిరాల కాలం నుంచి వారసత్వ చరిత్ర ఉంది. అనేక పశ్చిమదేశాల వైఖరులు పాక్-భారత్ విషయాల్లో భారత్ కు వ్యతిరేకంగా కనిపించడానికి కారణం అదే.
ప్రాంతీయశక్తిగా ఎదుగుతున్న ఇండియా మీద వాటికి కొన్ని అనుమానాలు, భయాలు కూడా ఉండవచ్చు. తన విధానాల మీద ఆ దేశాలకు ఉన్న ప్రతికూల అభిప్రాయాలను సవరించాలంటే, భారత్ తన వ్యవహారసరళి ద్వారా విశ్వాసం కల్గించడం ఒక్కటే చాలదు, సరిహద్దు ఉగ్రవాద బాధిత దేశంగా ఎదుర్కొంటున్న కష్టనష్టాలను కూడా పూసగుచ్చినట్టు చెప్పాలి. పెహెల్గామ్ అనంతరం భారత్-పాక్ మధ్య జరిగిన స్వల్పకాల సంఘర్షణ విషయమై ప్రపంచదేశాలకు నివేదించాలని భారత్ అనుకోవడం వెనుక ఆలోచన అదే.
అయితే, యుద్ధాలకు, ఘర్షణలకు దారితీయగల ద్వైపాక్షిక ఉద్రిక్తతలకు. దేశాల ఆంతరంగిక సమాజంలో కూడా ప్రభావాలు, ప్రయోజనాలు, పర్యవసానాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో దేశ ప్రభుత్వాల వైఖరుల మీద సమాజంలో అనుకూల, ప్రతికూల అభిప్రాయాలుంటాయి. జాతీయ విధానాల మీద విమర్శలు ఉన్నట్టే, విదేశాంగ విధానం మీద కూడా స్వదేశంలో అభ్యంతరాలుంటాయి. పొరుగుదేశంతోనో, శత్రుదేశంతోనో యుద్ధం వచ్చినప్పుడు, దేశమంతా ఒక్కతాటి మీద నిలబడాలన్నది ఎంతటి ఆమోదం కలిగిన విలువో, ఆ యుద్ధానికి దారితీసే ప్రభుత్వ విధాననిర్ణయాల మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో తప్పులేదనేది కూడా ప్రజాస్వామ్యంలో అంతే ఉన్నతమైన విలువే. ఆంతరంగికంగా తప్పులు చేసే రాజకీయపార్టీ లేదా దాని ఆధ్వర్యంలోని ప్రభుత్వం, బాహ్యవిషయాల్లో మాత్రం తప్పులు, ద్రోహాలు చేయదని ఏముంది? కొరియా మీద, వియత్నాం మీద, ఇరాక్ మీద, ఆప్ఘనిస్థాన్ మీద యుద్ధాలు చేసినప్పుడు, అమెరికన్ ప్రభుత్వ వైఖరికి అమెరికన్ సమాజం నుంచే విమర్శలు, వ్యతిరేకతలు వచ్చాయి.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ వైఖరుల గురించి పాక్ ప్రముఖులే అనేకులు విమర్శనాత్మకంగా మాట్లాడినవి మనం చూశాము.
మన దేశంలో కూడా ఆపరేషన్ సిందూర్ నేపథ్య, అనంతర పరిణామాల విషయంలో ప్రతిపక్షాలు భిన్న వైఖరులు చూపించాయి. పెహెల్గామ్ సంఘటన కు భద్రతావైఫల్యాల కారణాన్ని వేలెత్తి చూపించాయి. పాకిస్థాన్ మీద చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించడమేమిటని నిలదీశాయి. ఆపరేషన్ సిందూర్ మొదలైనప్పుడు, దానికి పూర్తి మద్దతు ఇచ్చాయి, కానీ, కాల్పుల విరమణ సందర్భంలో అభ్యంతరాలు చెప్పాయి. అమెరికా అధ్యక్షుడి ప్రమేయాన్ని తప్పుపట్టాయి. ఈ కీలకమైన ఘట్టాలలో ప్రధానమంత్రి కశ్మీర్ సందర్శించకపోవడాన్ని,అఖిల పక్ష సమావేశాలలో పాల్గొనకపోవడాన్ని గట్టిగా ప్రశ్నించాయి. జాతీయ అధికారపార్టీ బిజెపి కూడా, తక్కువేమీ తినలేదు. ఒకవైపున, ప్రతిపక్షాలతో సంప్రదిస్తూనే ఉంది. మరోవైపు, తన సామాజికమాధ్యమ శ్రేణుల ద్వారా, దిగువశ్రేణి రాజకీయ నాయకుల ద్వారా, ప్రతిపక్ష నేతల దేశభక్తి రాహిత్యాన్ని, పాక్ అనుకూలతను ప్రచారం చేస్తూ వచ్చింది. అంటే, పొరుగుదేశంతో ఘర్షణ వాతావరణంలో కూడా దేశంలో రాజకీయ పోరాటం సాగుతూనే వచ్చింది.
పెహెల్గామ్ అనంతర పరిణామాలను భారతీయ జనతాపార్టీ బిహార్ తదితర రాష్ట్రాల ఎన్నికలలో అనుకూలంగా ఉపయోగించుకుంటుందన్న భయాలు ప్రతిపక్షాలకు ఉన్నాయి. పెహెల్గామ్ తరహా హత్యాకాండ వల్ల దేశంలో కలిగిన భయాందోళనల విభజన వాతావరణం నుంచి, పాకిస్తాన్ మీద చర్య తీసుకోవడం ద్వారా సమకూరే ప్రతిష్ఠ నుంచి బిజెపి రాజకీయంగా ఎక్కువగా లాభపడకుండా చూడడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో, టెర్రరిస్టుల స్థావరాల మీద గురిచూసి చేసిన దాడిని పదే పదే చెప్పుకోవడం ద్వారా, కలిగే సానుకూలతను పెంచుకోవాలని కేంద్రప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. కేంద్రప్రభుత్వ సారథులు, వారి పార్టీ మధ్య ఈ సందర్భంలో సరిహద్దురేఖ సహజంగానే అస్పష్టంగా మారిపోతుంది.
మరి, నెలరోజులుగా దేశంలో జరుగుతూ వచ్చిన పరిణామాల మీద, ప్రభుత్వం తీసుకున్నచర్యలు-నిర్ణయాల మీద ప్రతిపక్షాలకు భిన్నమయిన అభిప్రాయాలు ఉన్నప్పుడు, దౌత్య ప్రచారయాత్రలో అందరూ కలసి ఎట్లా పాల్గొంటున్నారు? ఒకే వైఖరిని ఎట్లా చెబుతారు? అన్న సందేహాలు కలగడం సహజం. దౌత్య ప్రచారయాత్రలో జాతీయ ప్రయోజనాలతో పాటు, ప్రతిపక్షం తనతో గొంతుకలిపేట్టు చేసే రాజకీయప్రయోజనం కూడా కేంద్రప్రభుత్వం చూస్తోందా అన్న అనుమానాలూ కొందరికి ఉన్నాయి. అట్లాగే, ఈ దౌత్యప్రచార యాత్రకు ప్రతినిధులను ఎంపిక చేయడంలో కూడా రాజకీయ వివాదాలు తలెత్తాయి. తమపార్టీ నుంచి శశిథరూర్ ను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి అసౌకర్యం కలిగించింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారిక వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శశిథరూర్ వార్తలలో ఉంటున్నారు. దౌత్యప్రచారయాత్రా బృందంలో తమ పార్టీకి చెందిన నలుగురి పేర్లను రాహుల్ గాంధీ సూచించగా, అందులో ఒకరిని మాత్రమే ప్రభుత్వం తీసుకున్నది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి యూసుఫ్ పఠాన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా, మమతా బెనర్జీ అతనికి అనుమతి ఇవ్వలేదు. బదులుగా అభిషేక్ బెనర్జీ పేరును సూచించగా, ప్రభుత్వం దిగివచ్చి అంగీకరించింది. రాజ్యసభలో మార్క్సిస్టు పార్టీ నాయకుడు జాన్ బిట్రాస్ ను దౌత్యయాత్రా బృందాల్లోకి తీసుకున్నారు. ఆయనను నేరుగా కేంద్రం సంప్రదించినట్టు ఉంది కానీ, పార్టీ అందుకు అభ్యంతరమేమీ చెప్పినట్టు లేదు.
పెహెల్గామ్ నుంచి సిందూర్ దాకా జరిగిన పరిణామాలపై, కాల్పులు విరమణ నిర్ణయంపై భిన్నాభిప్రాయం ఉన్న పార్టీ సిపిఐ(ఎం). ఆపరేషన్ సిందూర్ తరువాత, బిజెపి పాలిత రాష్ట్రాల సమావేశాన్నిమాత్రమే ప్రధాని ఏర్పాటు చేయడం వివక్షాపూరితమని, ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచి ఉండాలని సిపిఎం అభ్యంతరం చెప్పింది. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉగ్రవాదం-సరిహద్దు ఉద్రిక్తతల అంశాన్ని మతతత్వ కోణంలో ప్రచారం చేయడం మానుకోవాలని కూడా ఆ పార్టీ చెప్పింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఆ పార్టీ డిమాండ్లలో ఒకటి. జాతీయ ప్రాధాన్యం ఉన్నఅంశాన్ని ఒక పార్టీ వ్యవహారంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దేశప్రజలందరికీ తాను జవాబుదారీనన్న సంగతిని విస్మరిస్తోందని ఆ పార్టీ తప్పుపట్టింది. కాల్పుల విరమణకు దారితీసిన పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడి ప్రమేయం వంటి అంశాల మీద ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కూడా విమర్శించింది. ఈ పార్టీ ఈ దౌత్యయాత్రలో భాగస్వామిగా పాల్గొనడం ప్రత్యేకంగా చెప్పవలసిన విశేషమే. కానీ, జాతీయ భావోద్వేగాలు ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన కార్యక్రమం నుంచి విడిగా వ్యవహరించడం ప్రస్తుత పరిస్థితులలో సాధ్యమయ్యే పని కాదు, మరో రకంగా వ్యవహరించడం రాజకీయంగా హితవు కాదని ఆ పార్టీ భావించి ఉండవచ్చు. దౌత్య యాత్రలో ప్రతినిధులుగా పాల్గొంటున్నంత మాత్రాన, తామందరూ ఒకే మాటలు మాట్లాడవలసిన అవసరం లేదని, ఎవరి దృక్పథం నుంచి వారు మాట్లాడవచ్చునని జాన్ బిట్రాస్ చెప్పారు. కశ్మీర్ లో రాజకీయంగా చెప్పుకోదగ్గ ఉనికి ఉన్న పార్టీగా, మార్క్సిస్టుపార్టీ, సరిహద్దు ఉగ్రవాద అంశాన్ని కేవలం ద్వైపాక్షిక అంశంగానో, పెహెల్గామ్ తరువాత భావిస్తున్నట్టు మతవిభజన అంశంగానో చూడాలని భావించదు. కశ్మీర్ తో ముడిపడిన సమస్యల పరిష్కారంలో రాజకీయ అంశాలు భాగంగా ఉండాలని, ముందు కశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తి ఇచ్చి ప్రజాప్రాతినిధ్య అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో కోరుతున్నది. అయితే, ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ రంగస్థలాన్ని అధికారపక్షానికి వదిలివేయడం సబబుకాదన్న ఆలోచనతోనే ఆ పార్టీ ఈ దౌత్యయాత్రలో పాల్గొనేందుకు అంగీకరించి ఉండవచ్చు.
ఇతర దేశాలతో శత్రుసంబంధాల సందర్భంగా, జాతీయోద్వేగాలు ఉధృతంగా ఉంటాయి. సమాజంలో విచక్షణలు కనీసస్థాయిలో ఉంటాయి. దేశ అధికార వైఖరికి భిన్నమైన వైఖరి తీసుకుంటే ఫలితాలు ఎట్లా ఉంటాయో కమ్యూనిస్టులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చైనా యుద్ధం నాటి అనుభవాల నుంచి పాఠం తీసుకోవడం మంచిదే కానీ, ఒకనాటి అంతర్జాతీయ వాదం పూర్తిగా జాతీయవాదంగా పరిణమించడం కూడా ఆశ్చర్యమే. పంజాబ్, కశ్మీర్ సమస్యల నాటి నుంచి అధికారిక సమగ్రత, సమైక్యతల జాతీయవాదాన్ని మార్క్సిస్టు పార్టీ స్వీకరిస్తూ వచ్చింది. జాతీయవాదానికి ఉండే పరిమితులను, మతమూ జాతీయవాదమూ జమిలిగా పెరిగితే కలిగే ప్రమాదకర పరిస్థితులను అంచనా వేయడంలో కమ్యూనిస్టులు మొత్తంగానే విఫలమయ్యారు. ఇప్పుడు, వెనుకకు వెళ్లడం కానీ, విచక్షణాయుత ఆలోచనలను సమాజంలో పునరుజ్జీవింపజేయడం కానీ సాధ్యం కానంతగా పరిస్థితులు మారిపోయాయి. దేశ ప్రయోజనాలను కాపాడడం వారికి కూడా బాధ్యతే, కానీ, ఆ క్రమంలో ఆంతరంగికంగా తాము పోరాడుతున్న రాజకీయాలకు ప్రస్తుత పరిణామాల నుంచి మరింత లబ్ధి జరగకుండా, తాము మరింత నష్టపోకుండా ఎట్లా, ఎంతమాత్రం నిరోధించగలరన్నది, మార్క్సిస్టులకు గడ్డుపరీక్ష.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.