
హైదరాబాద్: తెలుగు సాహితీ క్షేత్రంలో విభిన్న రచనలతో రచయిత్రి ప్రొఫెసర్ సూర్యాధనంజయ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి కవనంలోంచి జాలువారిన బంజారా సాహిత్య, సాంస్కృతిక వ్యాసాల గుచ్చం ‘కాకోటి’ బంజారాల అస్తిత్వాన్ని అక్షరాలుగా మలిచిన పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ్యం ప్రజాభవన్‌లోని భట్టివిక్రమార్క చాంబర్లో జరిగింది.
పుస్తకావిష్కరణ సందర్భంగా, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్యా ధనంజయ్‌ను మంత్రి అభినందించారు. వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, ఎంత పని ఒత్తిడిలో ఉన్న తాను అభిమానించే, తనను నిలబెట్టిన బంజారా సాహిత్యాన్ని వదిలిపెట్టకుండా ఈ కాకోటిని చక్కగా రాశారని వారన్నారు. బంజారాల మూలాలను నమోదు చేసిన ఉత్తమ పరిశోధన గ్రంథమని కొనియాడారు. భారతీయ గిరిజన సాహిత్యంలో ఇదొక అపురూప గ్రంథమన్నారు. కనుమరుగవుతున్న బంజారాల అరుదైన చరిత్రను, సాంస్కృతిక వైభవాన్ని నమోదు చేసిన రచయిత్రి ప్రయత్నం ఎంతో గొప్పదని భట్టీ విక్రమార్క కొనియాడారు.
రచయిత్రి ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ తన స్పందనను వినిపిస్తూ, తాను పుట్టిన జాతి పట్ల సేవానిరతితో ఈ గ్రంథాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో తీసుకొచ్చానన్నారు. శోధనకు దూరంగా ఉన్న అస్తిత్వ సంపదను తనవంతు కర్తవ్యంగా ఈ వ్యాసాలను పరిశోధనాత్మకంగా తీసుకువ వచ్చినట్టుగ పేర్కొన్నారు. వ్యాస సంపుటిని ఉపముఖ్యమంత్రి తన చేతులమీదుగా ఆవిష్కరించడంతో రచయిత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బల్ రాంనాయక్ మాట్లాడుతూ, బంజారా సాహిత్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన పుస్తకంగా కాకోటిని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్, జీఎస్టీ నిపుణులు డా ధనంజయ్ నాయక్ మాట్లాడారు. ఆచార్య సూర్యాధనంజయ్ సాహిత్యంలో ఈ గ్రంథం ఒక మైలురాయి లాంటిదని ఇందులో చరిత్ర, సంస్కృతితో పాటు వీరగాథలు, బహుముఖ అంశాలు చోటుచేసుకోవడం విశేషమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భాషా సమ్మాన్ అవార్డు గ్రహీత రమేష్ ఆర్య బంజారా సాహిత్య నిర్మాణానికి చారిత్రక మూలాల చమురును అందించిన గ్రంథంగా కాకోటిని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రచయిత్రికి అభినందలు తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.