
ఏ ఉద్యమంలోనైనా ఒడుదొడుకులు మామూలేనని, అంతమాత్రాన అంతా అయిపోయినట్టు భావించాల్సిన అవసరం లేదని, ఉద్యమాలకు కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌లు ఉండవని విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. జూన్ 22న గుంటూరులోని ఎన్జీఓ హోమ్‌లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) పూర్వ విప్లవ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ఆర్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
ఒకప్పుడు పలుఉద్యమాల్లో పాల్గొని అసమానమైన తమ ప్రభావాన్ని చూపిన ఆర్ఎస్యూ పూర్వ విప్లవ విద్యార్థులు ఈ సమావేశానికి హాజరైయ్యారు. యాభై ఏళ్ల క్రితం గుంటూరు మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలలో తాము చదువుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆనాడు క్రీయశీలకంగా పలుఉద్యమాలలో పాల్గొన్న తీరుతెన్నుల గురించి ప్రస్థావిస్తూ, వర్తమాన దేశపరిస్థితి గురించి మాట్లాడారు. యాభై ఏళ్ల క్రితం తామేనా అలా ఉద్యమాలు చేసిందని ఒకింత ఆశ్యర్యపోయారు.
తదనంతర కాలంలో ఉద్యమ బాటను కొనసాగిస్తూ అమరులైన తమ సహచరులకు కార్యక్రమంలో జోహార్లు అర్పించారు. వారి ఉద్యమ కార్యదక్షతను, త్యాగనిరతిని సభలో వేనేళ్ల కొనియాడారు. కళాశాల చదువు వరకే ఆర్ఎస్యూతో భాగస్వాములై, తర్వాత వేరువేరు వృత్తులలో స్థిరపడిన పలువురు నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మరికొందరు ఉద్యమబాటలో నడిచి అనారోగ్య కారణాలతోనో, తప్పనిసరి పరిస్థితుల్లోనో రాజ్యానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో ఉంటున్న మాజీలు అమరులైన తమ సహచరులను తలచుకుని కంటతడి పెట్టుకున్నారు.ఆర్ఎస్యూ పూర్వ విద్యార్థుల సమావేశ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు జరిగింది. గుంటూరు మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎన్జీఓ హోమ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు అమరులైన పంచాది కృష్ణమూర్తి, ఆదిభట్ల కైలాసం, చాగంటి భాస్కరరావు, దివాకర్ల నుంచి నేటి నంబళ్ల కేవవరావు, చలం, గాజర్ల రవి దాకా పలువురికి లాల్సలాములు అర్పించారు.
కార్యక్రమంలో విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, “ఏ ఉద్యమంలోనైనా ఒడిదుడుకులు మామూలే. అంతమాత్రాన అంతా అయిపోయినట్టు భావించాల్సిన అవసరం లేదు. ఉద్యమాలకు ఫుల్‌స్టాప్‌లు ఉండవు, కామాలే ఉంటాయి. ఉద్యమం అనేది ఒక రిలే పరుగుపందెం లాంటిది. ఒకరి తర్వాత ఒకరు అందిపుచ్చుకుంటూ గమ్యం వైపు ముందుకు సాగిపోతుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక గుణాత్మకమైన మార్పు వచ్చిందంటే అది విద్యార్థుల నుంచే వచ్చింది. ఆ తర్వాత దాన్ని రైతులు, రైతు కూలీలు, కార్మికులు, దళితులు, మహిళలు అందిపుచ్చుకుంటారు. కాబట్టి యువత ఒక కెటలిస్ట్ వంటిది. సమాజంలో యువత తీరుతెన్నులను బట్టే ఆ సమాజ గతిశీలత ఆధారపడి ఉంటుంద”ని పేర్కొన్నారు.
ఆర్ఎస్యూ ప్రస్థానం అసమాన్యం: ఎన్ వేణుగోపాల్
ఆర్ఎస్యూ ప్రయాణంలోని ఆనాటి ఉద్యమాలను, అది యువతకు అందించిన ఉద్యమస్పూర్తిని వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గుర్తుచేశారు. “ఆర్ఎస్యూ అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ నాడు అది సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. ఆర్ఎస్యూ 1974 నుంచి దానిపై 1992లో నిషేధం విధించేవరకు 18 ఏళ్లే మనుగడలో ఉంది. అందులో కూడా 1975- 77 ఎమర్జెన్సీ కాలాన్ని, 1985- 89 నిర్బంధ కాలాన్ని మొత్తం కలిపి ఈ ఆరేళ్లను కూడా తీసేస్తే క్రీయాశీలకంగా పనిచేసింది కేవలం 12 ఏళ్లు. ఈ పుష్కర కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో కీలక విజయాలను నమోదు చేసింది. యాభై ఏళ్ల ఆర్ఎస్యూ ప్రస్థానం అసామాన్యమైనది. ఆ స్మృతుల నుంచి రేపటి తరం కోసం మనం ఏమివ్వగలమని ప్రతి ఒక్క పూర్వ విప్లవ విద్యార్థి ఆలోచించాలి. కాలం మనమీద పెడుతున్న కర్తవ్యాన్ని మనం ఎలా నెరవేర్చగలం. మనం మాట్లాడగలం, రాయగలం, సహకరించగలం, ఈ వేదిక అందుకు ఉపయోగపడితే అంతకంటే కావలసింది ఏముంద”ని మరో ఉద్యమానికి నడుంబిగించేలా తన మాటలతో వేణుగోపాల్ సభికులకు తమ కర్యవ్యాన్ని గుర్తు చేశారు.
వయసు పైబడిన బాధపడాల్సిన అవసరం లేదని ఆర్ఎస్యూ పూర్వ విద్యార్థి నవజ్యోతి అన్నారు. వృద్ధాప్యంలో కూడా వ్యూహాలు రచించి ఉద్యమానికి రూపకల్పన చేసిన వారిని గుర్తుచేస్తూ, ఆశాజ్యోతిని ప్రతిఒక్కరి హృదయంలో వెలిగించారు. “వయసు అరవై ఏళ్లు దాటాక ఏమీ చేయలేమని మూలన కూర్చుని దుఃఖించాల్సిన పని లేదు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్య అరవై ఏళ్లు దాటాక విద్యార్థి ఉద్యమానికి రూపకల్పన చేశారు. మనందరం కూడా ఎవరి పరిధుల్లో వారు ఉద్యమానికి చేయగలిగిన స్థాయిలో చేయగలిగినంత చేయవచ్చ”ని నవజ్యోతి చెప్పారు.
గుంటూరుకు చెందిన ఆర్ఎస్యూ పూర్వ విద్యార్థి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రస్తుత సాంకేతికత ప్రాధాన్యతను వివరిస్తూ, “ఈరోజు ఎవరైతే సైన్సును వ్యతిరేకిస్తున్నారో వారే ఎక్కువగా సైన్స్(సోషల్ మీడియా)ను వాడుకుంటున్నారు. సైన్సును నమ్మే మనం దానిని సరిగా వాడుకోవడంలో విఫలమవుతున్నాం” అని విచారం వ్యక్తం చేశారు.“యాభై ఏళ్ల నాటి పరిస్థితుల కంటే ప్రస్తుతం ఉద్యమ ఆవశ్యకత ఎంతో ఉంది. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు వచ్చినా కేంద్రం వారిని మట్టుపెట్టడమే లక్ష్యంగా మారణకాండను సాగిస్తోంది. ఈ అరాచకత్వాన్ని అడ్డుకోవడానికి మన వంతుగా మనం ఏం చేయగలమని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి”అని ఆర్ఎస్యూ పూర్వవిద్యార్థి రంగావఝుల భరద్వాజ తక్షణ బాధ్యతను గుర్తుచేశారు.
పోలీసు కనుసైగల నడుమ కార్యక్రమం..
ప్రస్తుత అప్రకటిత అత్యవసరపరిస్థితలో, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పూర్వ విద్యార్థులు సభ జరుపుకోవడానికి గుంటూరు పోలీసులు అనేక ఆంక్షల నడుమ అనుమతి ఇచ్చారు. బ్యానర్‌పై పూర్వ విప్లవ విద్యార్థులు అనే పదం కానీ, రాడికల్స్ అనే పదం కానీ ఉండకూడదని హెచ్చరించారు. దీనివల్ల బ్యానర్‌పై యాభై ఏళ్ల వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థానమని మాత్రమే రాయవలసి వచ్చింది. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ రంగావఝుల భరద్వాజ ఈ కార్యక్రమం మొత్తాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుని దిగ్విజయంగా నడిపించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.