
ఎక్కడైనా మనుషులుంటే రండి
నా హృదయం పిలుస్తుంది
ఈ భూగోళం పైన ఎక్కడైనా పర్వాలేదు
మీ భాష, మాండలికం
మీ శరీరఛాయ మీ దుస్తులు
మీ జాతి,మతం ఏదైనా కావచ్చు
ఎక్కడైనా మనుషులుంటే రండి
మనందరికీ పెద్ద వేదిక మన హృదయమే
కలుసుకుందాము రండి
ఒక శాతం కూడా నిండుగా లేని
మనిషి లేని మనుషులు
మనల్ని, మన భూముల్ని, వెన్నెలను,
ఎండను, గాలిని, నీళ్ళని, మబ్బుల్ని, అడవుల్ని,
మన భోజనాలను, నిద్రలను,
నిద్రలోని కలల్ని,
శరీరంలోని శక్తిని దోపిడీ చేస్తున్నారు.
యుద్ధాలు చేస్తున్నారు
చిన్నాపెద్దా తేడా లేకుండా పాలుకోరు
పసిపిల్లలను, ముదుసుళ్ళను
మొత్తం మీద మనుషుల్ని చంపేస్తున్నారు
వాళ్ళకు చాలా వేదికలున్నాయి
వాళ్లందరూ కలిసి మెలిసి ఉన్నారు
వాళ్ళకు పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలున్నాయి
వాళ్ళ వస్తు అవశేషాలు భూగోళం పైనున్న
అన్ని రకాల మట్టిలో కలిసిపోయి ఉంటాయి
వాళ్ళకు ఆయుధాలు తయారు చేసే
కర్మాగారాలున్నాయి
యుద్ధాలను తయారు చేసే పెద్దపెద్ద తలలున్నాయి
మనకు వాళ్ళు తయారు చేసిన ఆంక్షలున్నాయి
మనకు వాళ్ళు గీసిన సరిహద్దులున్నాయి
మనం ఒకరితో ఒకళ్ళం కలుసుకుంటే
వాళ్ళు క్షమిస్తే శరణార్థులమవుతున్నాము
వాళ్ళు శిక్షిస్తే నేరస్తులమవుతున్నాము
పనిస్థలం వదిలేసినప్పటి నుంచి
మనం మనలాగా ఉండక అదిగో వాళ్ళున్నారే,
మనల్ని మన శక్తియుక్తులతో మనం సృష్టించిన
సంపదపైన హక్కు కల్పించుకున్న వాళ్ళు
వాళ్ళలాగ ఉంటున్నందుకు,
మనదైనది ప్రతీదీ రోజురోజుకు
మనది కాకుండా పోతుంది
రండి మనం మనలాగా పునర్వికాసం పొందుదాం
ఎక్కడికక్కడ మన హృదయవేదికలపైన నిలబడి
యుద్ధాలను ఆపేద్దాం రండి
యుద్ధాలలో చిందరవందర అయిపోయిన
మనిషి మాంసపు ముద్దల్ని ఏరి
అతికించి ప్రాణం పోద్దాం రండి
సముద్రాలను, అడవుల్ని, పర్వతాలను
నదులను నదిలోని పాయల్ని
వట్టిగా వాలిపోతున్న మబ్బుల్ని
కాపాడుకుందాం రండి
నా హృదయవేదిక స్వాగతిస్తుంది
ఎక్కడైనా మనుషులుంటే రండి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.