
భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థికవ్యవస్థగా అవతరించిందంటూ గతకొద్ది రోజులుగా గోడి మీడియా, ప్రభుత్వవర్గాలవారు సంబరం కొద్దీ హడావుడి చేస్తున్నారు.
వాస్తవానికి ఇది పాక్షిక సత్యం. వరస ఆర్థిక సంక్షోభాలతో సతమతమవుతోన్న జపాన్ను గణాంకాల రీత్యా మన దేశం అధిగమించేదానికి అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతానికి మనం ఇంకా ఐదవస్థానంలోనే ఉన్నాం. వచ్చే ఏడాదినాటికి మనదేశం జపాన్ను అధిగమించి నాల్గవ స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశాలు ఉన్నాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఐఎంఎఫ్ అంచనాలను ఆధారం చేసుకుని దేశభక్తి పూనకంతో ఊగిపోతున్నారు. పచ్చిఅబద్దాలు, స్వార్థ ప్రయోజనపూరిత వక్రీకరణలతో లేని గొప్పలు ఎగదోసే ప్రచారం ముమ్మరం చేశారు.
గతకొంతకాలంగా మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల సరసన నిలుస్తా వచ్చింది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఆర్థికాభివృద్ధి సూచికలు యూపీఎ పరిపాలనా హయాం నుంచి గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ఈ సూచికలు చూసుకుని సంబరాలు జరుపుకోవడం కంటే ఈ గణాంకాల మాటున మరుగునపడిన అనేక ఇబ్బందికరమైన వైరుధ్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆర్థికాభివృద్ధి జరుగుతున్నా ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, కీలకమైన వస్తూత్పత్తి, వ్యవసాయరంగాలలో ఉత్పాదికత క్షీణించడం, దేశసంపద పెరుగుతూ వస్తున్నా సమాజంలో ఆర్థిక అసమానతలు మరింత పెచ్చరిల్లడం, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మన దేశ గ్రామీణ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉండడం, సంక్షోభంలో కూరుకుపోవడం చూస్తుంటే మన దేశ ఆర్థికాభివృద్ధిలో సంస్థాగత లోపాలు ఉన్నాయని స్పష్టం అవుతున్నది. తక్షణమే ఈ లోపాలను అధిగమించడానికి పక్కా ప్రణాళికలతో మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చెయ్యడానికి బదులు ఐఎంఎఫ్ అంచనాలో ప్రపంచ బ్యాంక్ కితాబుతో చూసుకుని మురిసిముక్కలవడం అవివేకం అవుతుంది.
మన దేశం జపాన్ను అధిగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వెయ్యడానికి రెండు దేశాల స్థూలజాతియోత్పత్తి(జీడీపీ)లను ప్రాతిపదికగా తీసుకున్నది. అయితే మనం అనుసరిస్తున్న జీడీపీ లెక్కింపు పద్ధతిలోనే అనేక సంస్థాగతమైన బలహీనతలు ఉన్నాయి. మానవాభివృద్ధి సూచికలలో తీసికట్టుగా ఉన్న మనస్థాయిని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వపరంగా పెట్టుబడులు పెంచడం, ఉపాధి అవకాశాలు క్రమబద్ధీకరించుకోవడం, పారిశ్రామికంగా మరింత వైవిధ్యతను సంతరించుకోవడం, ప్రజాస్వామిక జవాబుదారీతనానికి కట్టుబడడం వంటి చర్యలు నిరంతరాయంగా కొనసాగించే రాజకీయ సంకల్పం లేకుంటే, స్థూలజాతీయోత్పత్తి సుస్థిర అభివృద్ధికి దారితీసేందుకు ఆటంకంగా ఉన్న బలహీనతలను అధిగమించలేం. జీడీపీ పెరుగుతున్నా ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్న వైరుధ్యాన్ని పరిష్కరించలేం.
“బేస్” పరిగణనలో మార్పు- భ్రమాత్మక గణాంకాలు..
మనదేశం ఈ మధ్యకాలంలో సాధించిన మెరుగైన ఆర్థికాభివృద్ధి గణాంకాలకు “బేస్ పాయింట్”లో తీసుకువచ్చిన మార్పులు గణనీయంగా దోహదం చేశాయి. “బేస్ పాయింట్‌ను తక్కువ చేసి తీసుకోవడం మూలంగా గణాంకాల శాతాలు అధికంగా కనబడతాయి.
కోవిడ్- 19 ఉత్పాతం మూలంగా 2020 ఆర్థిక సంవత్సరంలో కుంచించుకుపోయిన మన ఆర్ధికవ్యవస్థ ఆ తరువాతి కాలంలో క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా, అతినాటకీయంగా పెరిగాయి. 2015లో జీడీపీ లెక్కింపు పద్ధతిలో తీసుకువచ్చిన మార్పులతో పాటు మార్కెట్ ధరల మూలసూచీని 2004- 05 ఆర్థిక సంవత్సరానికి బదులు 2011- 12 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం మూలంగా జీడీపీలో కృత్రిమ పెరుగుదల కనిపిస్తుంది. జనానికి “మంచి రోజులు”(అచ్ఛేదిన్) వస్తాయని మోడీ చేసిన వాగ్దానాన్ని ఇలా గణాంకాలను ప్రభుత్వం తొత్తడం చేసి సాకారం చేసింది. యూపీఏ హయాంలో సాధించిన ప్రగతి కన్నా మోడీ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకోవడానికి కొత్తపద్ధతిలో లెక్కగట్టిన జీడీపీ తదితర గణాంకాలు ఉపయోగపడ్డాయో తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకురాలేకపోయాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మార్పు చేసిన ఈ పద్దతిని బట్టి వెనుకటి యూపీఏ హయాంలో సాధించిన ప్రగతిని లెక్కగట్టి వాటిని తక్కువ చేసి చూపించి ప్రచారానికి వాడుకున్నారు.
2016లో మోడీ అనాలోచితంగా అమలు చేసిన పెద్దనోట్ల రద్దు పథకం, 2017లో జీఎస్టీ అమలు చెయ్యడం మూలంగా ఆర్థికవ్యవస్థకు జరిగిన నష్టాన్ని కప్పిపెట్టి విమర్శకుల నోళ్లు మూయించడానికి కూడా ఈ కొత్త పద్ధతి లెక్కింపువాటంగా కలిసి వచ్చింది.
వాస్తవానికి పెద్దనోట్లరద్దు, ఆ వెంటనే అమలు చేసిన జీఎస్టీ మూలంగా ఆర్థికవ్యవస్థ మందగమనానికి లోనయ్యిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే 2016- 17 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.8 శాతం వృద్ధి నమోదు చేసిందని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీవంటివి సాహసోపేత నిర్ణయాల మూలంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులకు దారి తీసినా దేశ స్థూలజాతీయోత్పత్తి ఎంత వృద్ధి చెందిందో చూశారాని మోడీ ప్రభుత్వం దబాయింపులకు దిగింది.
అయితే జీడీపీ లెక్కింపులో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో సంక్షోభాల తాకిడికి బలయ్యే అసంఘటిత రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించలేదని, తత్పర్యవసానంగానే జీడీపీ గణాంకాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆర్థికరంగ నిపుణులు విమర్శించారు. ఉపాధిరహిత ఆర్థికాభివృద్ధి వృద్ధిరేటు సాధించామని చేసే అధికారిక ప్రకటనలను, ప్రచారాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. 2017- 18లో నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత హెచ్చు స్థాయికి పెరగడం ఆర్థికనిపుణుల వాదనలు సరైనవేనని విశదీకరిస్తున్నాయి.
భారతదేశ స్థూలజాతీయోత్పత్తి గణాంకాలు ఇతర స్థూల సూచికలలో సరిపోల్చి చూస్తూ వైవిధ్యభరితమైన పజిల్లా అనిపిస్తుందని మోడీ హయాంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం 2019లో సూటిగా వ్యాఖ్యానించారు.
జీడీపీ వృద్ధి వెనుక ఉన్న కారణాలు..
భౌగోళిక వినిమయ డిమాండు: 2025 నాటికి భారతదేశ జనాభా సగటు వయసు 28.8 సంవత్సరాలుగా ఉండి ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అతి యువకప్రాయంగా నిలిచింది. 15- 64 ఏళ్ల వయసు ఉన్న పని చెయ్యగలిగిన జనాభా శాతం 64.4గా ఉన్నది. ఇది 2031 నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. జననాల రేటు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఈ కారణంగా శ్రామికశక్తి, వినిమయాల్లో నిలకడగా వృద్ది సాధించే అవకాశాలు ఉన్నాయి. తలసరి సగటు ఆదాయం 2.937 డాలర్లు(సుమారు రూ 205,579)గా ఒక మోస్తరు స్థాయిలో ఉన్నప్పటికీ మన దేశ శ్రామిక జనాభా దృష్ట్యా దేశియ డిమాండ్, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో అధికంగా ఉంటుంది. మన దేశ జనాభా పట్టణ ప్రాంత వినియోగదారుల సంఖ్య 54.3 కోట్లు అంటే 37 శాతం జనాభాతో సమానం. ఈ సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం విదేశీ ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు ఆశాజనకంగా లేని దృష్ట్యా కనీసంగా పట్టణ వినిమయదారులు ఆహారం, ఆరోగ్యం, సేవల మీద మరింత ఖర్చు చెయ్యగలిగేలా వారి ఆదాయాలు పెరిగేలా చూస్తే లోటును అధిగమించవచ్చు.
సేవలరంగం అభివృద్ధి: భారతదేశం పారిశ్రామికరంగం ద్వారా అభివృద్ధి సాధించాలనే సంప్రదాయ మార్గం నుంచి పక్కకు తొలగి ఐటీ, ఫైనాన్స్, టెలికాం వంటి సేవల రంగం మీద ఆధారపడి అభివృద్ధి సాధించాలని ఎంచుకున్నట్లు ఉన్నది. స్థూలజాతీయోత్పత్తిలో 55 నుంచి 60 శాతం సేవల రంగం నుంచే తోడవుతున్నది. వస్తూత్పత్తి రంగం 15- 17శాతం మధ్యనే స్థంభించిపోయింది. శ్రామిక శక్తిలో సగం మంది జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయరంగం జీడీపీకి 15- 16 శాతం మాత్రమే తోడ్పాటు ఇవ్వగలుతోంది. దీని మూలంగా సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలకు పరిమితులు ఏర్పడిపోయి తక్కువ ఉత్పాదకతగల అసంఘటిత రంగ ఉపాధి పెరుగుతోంది.
ఉపాధి రహిత అభివృద్ధి- అసంఘటితరంగ విస్తరణ: ఆకర్షణీయమైన జీడీపీ వృద్ధిరేటు సాధించినప్పటికీ కార్మిక వర్గంలో 90శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తూ ఎలాంటి భద్రతకు, సామాజిక సంక్షేమ పథకాలకు నోచుకోకుండా ఉన్నారు. జీడీపీలో సాధించిన వృద్ధి నిరుద్యోగ యువతకు తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యింది. ఇలాంటి ఉపాధిరహిత అభివృద్దినే “ఆశ్రిత వర్గాల సంపద పోగువేత”గా దాస్‌గుప్తా, బసోల్ అభిర్ణించారు. ఈ రకమైన సంపద కేంద్రీకరణ సమాజంలో అత్యధికశాతం ప్రజానీకాన్ని ఆర్థిక వెలివేతకు గురి చేస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వ పెట్టుబడుల వ్యయం పెంపు- ఉద్దీపన పథకాలు: 2025 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కన్నా 11.1 శాతం పెంపుతో 11.1 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా ఖర్చు చెయ్యాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడం జీడీపీలో వృద్ధి సాధించడానికి దోహదం చేసింది. ఈ పెట్టుబడి వ్యయం ప్రధానంగా రోడ్లు, రైలు మార్గాలు, డిజిటల్ ప్రాజెక్టులకు ఉద్దేశించినది. 2020- 25 మధ్య ఐదేళ్లకాలంలో మౌళిక సౌకర్యాల పెట్టుబడుల వ్యయం 39 శాతం పెరిగింది. కానీ ఇందులో సింహభాగం బడ్జెటేతర మార్గాల ద్వారా సేకరించిన రుణాలు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలాల నుంచి సేకరించిన నిధులే. ఏదేమైనా ఈ పెట్టుబడుల వ్యయం పెంపు ద్వారా డిమాండు, ఉపాది అవకాశాలు మెరుగయ్యాయి. కానీ ఈ వ్యయం కోసం సేకరించిన రుణాలను ద్రవ్యలోటు పెరగకుండా చూడడానికి బడ్జెట్ ఖాతాలో పొందుపరచకుండా ఉండడం పారదర్శకతకు పాతర వెయ్యడమే. ఇలాంటి అంకెలగారడీల మూలంగా ప్రభుత్వం ఎంత రుణభారం మోస్తుంది. జీడీపీతో పోల్చి చూస్తే ఈ రుణభారం నిర్దేశిత పరిమితుల్లో ఉందాలేదా అన్న కీలక విషయాలు మరుగునపడిపోయాయి.
ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ): 2024వ సంవత్సరం చివరి నాటికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం 1.61 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించింది. తద్వారా 14 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి జరిగిందని, 11.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించాయని ప్రభుత్వ గణంకాలు వివరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఫోన్ల తయారీ, ఫార్మా రంగాలు అత్యధికంగా లబ్ధిపొందితే సౌరఫలకాల తయారీ, స్టీల్ ఉత్పత్తి రంగాలు వెనుకపట్టులో ఉండిపోయాయి. కాబట్టి ప్రాధాన్య రంగాల విస్తరణకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగాలి. ఒకటి రెండురంగాలు చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసినా స్థూలంగా చూస్తే ఈ పథకం ఆశించినంతగా విజయవంతం కాలేదని స్పష్టం అవుతున్నది.
ప్రపంచవ్యాప్త అనిశ్చితి- ఎగుమతులలో పాక్షిక వృద్ది: మనదేశం ఫార్మారంగ ఉత్పత్తులు, శుద్ధి చేసిన చమురు, ఇంజనీరింగ్ సరుకులు ప్రత్యేకించి ఐటీ సేవల ఎగుమతులలో పోటాపోటీ స్థానాన్ని నిలబెట్టుకున్నది. కరెంటు ఖాతాలో మిగులు సాధించిడానికి దోహదపడ్డాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్త వాణిజ్యంతో పోలిస్తే మనదేశం వాటా 2 శాతానికి లోపే ఉన్నది. తూర్పు ఆసియా దేశాలతో పోలిస్తే మనదేశం ప్రపంచ సరఫరాల వ్యవస్థతో అనుసంధానించబడడంలో వెనకుబడే ఉన్నది.
అసమాన అభివృద్ధి- పెరుగుతున్న ఆర్థిక అసమానతలు: ఆర్థికాభివృద్ధి ఫలాలు సంపన్న, అతి సంపన్న వర్గాలకే దక్కి అపారమైన సంపదవారి వద్దనే పోగుబడి పోతుంది. రియల్ ఎస్టేట్, విలాస వస్తువుల కొనుగోళ్లు, భారీ వినిమయం, సేవల మూలంగా జీడీపీలో వృద్ది కావస్తున్నది. గ్రామీణ ప్రాంత సంక్షోభం, వేతనాలతో ఎదుగూబొదుగూ లేకపోవడం, పోషకాహారలేమి, అరకొరవైద్య సేవలు వంటి తీవ్ర సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. ప్రపంచంలో నాలుగోవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించామని సంబరాలు చేసుకునే మనదేశంలో నెలకొని ఉన్నా ఈ తీవ్రమైన సామాజిక, ప్రాంతీయ అసమానతలు సమ్మిళిత అభివృద్ది నేపథ్యాన్ని అపహాస్యం చేయడం లేదా?
దేశ ఆర్థికాభివృద్ధి కథనాల్లో అపశృతులు..
ఎదురుదెబ్బలు తిన్నా, వివిధ సంక్షోభాలు ఎదురయినా మనదేశ ఆర్థిక వ్యవస్థ పడిలేచిన మాదిరి తిరిగి పుంజుకోవడం మనం అనేక సందర్భాలలో అనుభవపూర్వకంగా చూశాం. కానీ వార్తాపత్రికల పతాక శీర్షికల కోసమో, మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌ల కోసమో కృత్రిమ వృద్ధితో కూడిన జీడీపీ గణాంకాలను వెలువరించడం బలంలేని పునాదులు మీద బహుళ అంతస్థుల భవనం నిర్మించడం వంటిది.
నైపుణ్యం లేని, అక్కరకు రాని జనాభా..
అభివృద్ధి ప్రయాణంలో మనదేశం ఎదుర్కొంటున్న నికరమైన సమస్య ఏంటంటే దశాబ్దాలపాటుగా మన ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూ వచ్చినా మానవవనరుల పెట్టుబడిలో గణనీయమైన మెరుగుదల లేకపోవడం. విద్య, వైద్య రంగాలకు జీడీపీలో 4శాతానికి సమానమైన మొత్తాన్ని కేటాయించాలనే లక్ష్యాన్ని వరుసవారీ ప్రభుత్వాలు ఏవీ చేరుకోలేకపోయాయి. అర్థవంతమైన, అత్యుత్తమ ఉత్పాదికతతో కూడిన ఉపాధి అవకాశాలు యువతరానికి అందాలంటే ఏ ప్రభుత్వమైన విద్య, వైద్య రంగాలకు భారీగా నిధులు కేటాయించాలి కదా. ప్రభుత్వ పాఠశాలలో అభ్యసన స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. నాణ్యమైన వైద్యసౌకర్యాల విషయంలో తీవ్ర అసమానతలు నెలకొని ఉన్నాయి. పోషకాహార విలువ స్థాయి, ముఖ్యంగా పిల్లలలో, ఎదుగూబొదుగూ లేకుండా ఉన్నాయి. తత్ఫలితంగా జనాభాపరంగా మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరుకు ఉపాధి కల్పించలేకపోవడం, లేదా తక్కువ ఆదాయాలు గల అసంఘటిత రంగంలో కుదురుకునేలా చెయ్యడం ద్వారా వృధా చేస్తున్నాం.
వ్యవసాయరంగ విస్తరణ..
మన దేశంలో సగం మంది శ్రామికులు వ్యవసాయం రంగం మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఈ రంగం నుంచి స్థూల జాతీయ ఆదాయానికి లభించే తోడ్పాటు 1/5వ వంతు మాత్రమే. సంస్థాగతమైన ఈ అసమతుల్యత ఆర్థికపరంగా అసమర్థమైదిగాను, సామాజికంగా ప్రమాదకరంగానూ భావించాలి. వ్యవసాయ ఆదాయాలు నిరంతంర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రతికూల వాతావరణ ప్రభావాలు, మార్కెట్ వైఫల్యాలు, విధానపరమైన నిర్ణయలోపాల మూలంగా వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోతుంది. రైతుల బలవన్మరణాలు, ఉద్యమాలు, పోరాటాలను కేవలం వార్తాపత్రికల పతాక శీర్షికలుగా భావించరాదు. వ్యవసాయరంగాన్ని గిట్టుబాటు వ్యవహారంగా మలచడంలో ప్రభుత్వ వైఫల్యంగా మనం చూడాలి. పాలకులు వ్యవసాయరంగంలో మౌళికమార్పులు తీసుకురావడం మీద దృష్టిసారించకుండా చౌకగా లభించే శ్రమశక్తిరంగంగా కొనసాగించడం మూలంగా గ్రామీణ ప్రాంత సంక్షోభం నానాటికీ తీవ్రతరం అవుతున్నది.
క్షీణిస్తున్న ఆర్థిక వ్యవహారాల పారదర్శకత..
వీటన్నిటికీ తోడు అధికారికంగా అందుబాటులో ఉన్న గణాంక సమాచారంతో విశ్వసనీయత కరవవుతున్నది. గతకొద్ది సంవత్సరాలుగా కీలకమైన ఉపాధి కల్పన, వినిమయం, దారిద్రం వంటి అంశాలపై నిర్వహించిన సర్వేలను ఆలస్యం చెయ్యడమో, వాస్తవ పరిస్థితులను దాచి పెట్టడమో, సవరించిన అంచనాల పేరిట మోడీ ప్రభుత్వపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చడమో ఆనవాయితీగా మారిపోయింది.
గణాంక విభాగ సంస్థలలో మితిమీరిన రాజకీయ జోక్యం మూలంగా సుపరిపాలనకు పునాది వంటి వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. వాస్తవాలు మరుగునపడి పోతున్నాయి. ఎప్పుడయితే గణాంక సమాచారం రాజకీయ ప్రయోజనాలకు లొంగిపోతుందో దాని పర్యవసానంగా ప్రభుత్వ విధానాలు, పథకాలు క్షేత్రస్థాయి వాస్తవాలతో పొంతన లేకుండా పోతాయి, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి.
పారిశ్రామికీకరణ భ్రమ..
మనదేశ ఆర్థికాభివృద్ధి నమూనా పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం మీద కాకుండా వ్యవసాయాధారితం నుంచి సర్వీసురంగం మీదకు కప్పగంతు వేసింది. ఐటీ పరిశ్రమలు, ఫైనాన్స్రంగం పుంజుకోగా వస్తూత్పత్తి రంగం జీడీపీలో 15- 17 శాతం మధ్యనే పడకేసింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పరిమితం అయిపోయాయి. గత పదేళ్లుగా తక్కువ వేతనాలు, తక్కువ ఉత్పాదకత, ఎలాంటి భవిష్యనిధి రక్షణలులేని అసంఘటితరంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. అర్థాంతరంగా ఈ రకంగా పారిశ్రామికీకరణకు స్వస్థి చెప్పడం సువార్ణవకాశాన్ని జారవిడుచుకున్నట్టే అని ప్రముఖ ఆర్థికవేత్తలు ఎందరో హెచ్చరిస్తున్నారు. అదీగాక ఉపాది అవకాశాలు నికరంగా పెరగడానికి అవకాశంలేని సంస్థాగత ఉచ్చులో చిక్కుపడిపోతామని కూడా వివరిస్తున్నారు.
మినహాయింపుధోరణుల అభివృద్ధి నమూనా ఈ బలహీనతలు అన్నీ సంపన్నులకు లబ్ధి చేకూర్చి సామాన్యులను మినహాయించే అభివృద్ధి నమూనాకు దారి తీస్తాయి. ఒక వంక ఇంద్రభవనాలను పోలిన నివాసం హర్మ్యాలు, విలాసవంతమైన కార్లు, అత్యంత విలాసవంతమైన వినిమయ జీవితాలు అతికొద్దిమంది చేజిక్కించుకుంటూ ఉంటే మరో వంకన గ్రామీణ భారతదేశంలో వేతనాలు స్థంభించిపోవడం మూలంగా డిమాండ్ ప్రతిష్ఠంభనకు లోనుకావడం, ప్రభుత్వ వ్యయం అస్తుబిస్తుగా ఉండడంతో ఆదాయ- జీవన వ్యయాల్లో, సంపదలో అసమానతలు ఊహింపనలవి కాని రీతిలో పెరిగిపోయాయి. కోటీశ్వరులు శతకోటిశ్వరులయి ప్రపంచకుబేరుల జాబీతాలోకి ఎగబాకుతుంటే సాధారణ ప్రజానీకం వారి కనీస ఆకాంక్షలను నెరవేర్చుకోలేని దైన్య స్థితిలో మిగిలిపోతున్నారు.
సంస్థాగత బలహీనతల పరిష్కారం..
మన దేశ ఆర్థిక భవితవ్యం కేవలం జీడీపీ వృద్ధి మీదనే ఆధారపడి ఉండదు, పోగుపడిన సంపద ప్రజలందరికీ సముచితమైన, సమాన ఫాయిదాలో ఏ రకంగా పంచబడుతందనే కీలకాంశం మీద ఆధారపడి ఉంటుంది. జీడీపీలో సాధించిన అభివృద్ధిని చూసి సంబరాలు జరుపుతున్న కేంద్రప్రభుత్వం కీలకమైన ఈ అంశాన్ని విస్మరిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక జానాభాగల మన దేశం ఈ భౌగోళిక అనుకూలతను ఆధారం చేసుకుని జీడీపీ తలసరి సగటులను ఇంకా అధికాధికంగా సాధించే అవకాశం ఉన్నది. అయినప్పటికీ మన దేశం ప్రపంచంలో అగ్రగామి ఆర్ధికవ్యవస్థగా ఎందుకు ఎదగలేకపోతున్నది, లేదా తలసరి ఆదాయాల్లో ఎందుకు అగ్రస్థానానికి చేరలేకపోతున్నదనేది మన ముందున్న కీలక ప్రశ్న. ఐఎంఎఫ్ అంచనాల మేరకు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మన దేశ స్థూలజాతీయోత్పత్తి(జీడీపీ) జపాన్ను అధిగమించి ఉండకపోవచ్చుగాక కానీ తలసరి సగటు ఆదాయాల్లో మొత్తం 193 దేశాలలో మనం 140వ స్థానంలో ఎందుకు ఉన్నాం, జపాన్ 37వ స్థానంలో ఎందుకు ఉన్నది అనేది ఆందోళన కలిగించే అంశం కదా.
వాస్తవానికి ఐఎంఎఫ్ మన దేశానికి ఇచ్చిన ర్యాంక్ దేశంలో అంతర్గతంగా నెలకొన్న అసమానతల దృష్ట్యా తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది. ప్రపంచ అసమానతల పరిశోధనాశాల వెలువరించిన 2024 నివేదికను పరిశీలిస్తే మనదేశంలో పైస్థాయి 1 శాతం సంపన్నులు జాతీయాదాయంలో 22 శాతాన్ని కైవసం చేసుకుంటున్నారు. అడుగు స్థాయి 50 శాతం మంది ప్రజానీకానికి దక్కింది కేవలం 13 శాతం జాతీయదాయమే. ఇది 1980లలో 20 శాతంగా ఉండింది. ప్రస్తుతం ఉన్న జీడీపీలో పై స్థాయి ఒక్క శాతాన్ని మినహాయిస్తే జాతీయ సగటు ఆదాయం 2,245 డాలర్లుగాను, దిగువ స్థాయి 50 శాతం మంది ఆదాయం కేవలం 741 డాలర్లుగానూ లెక్క తేలుతుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్(700 డాలర్లు) నైజర్ (600 డాలర్లు) దేశాల కన్నా ఒక మెట్టుపైన ఉన్నాయన్న మాట. ఈ అసమానతలు ఇతర మానవాభివృద్ధి సూచికలలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. 2021- 22లో ఈ సూచికలో 131 స్థానంలో ఉన్న మనదేశం 2023- 24 నాటికి 134వ స్థానానికి దిగజారి బంగ్లాదేశ్(129) కంటే వెనుకబడి ఉన్నాం. జపాన్ దేశానికి(19) దరిదాపుల్లో లేము.
మోడీ ప్రభుత్వానికి ఈ వాస్తవాలు తెలియక కాదు. కాకపతే ఏ కొద్దిపాటి అవకాశం దొరికినా మోడీ మన దేశాన్ని తెగ ఉద్ధరించేస్తున్నాడు అన్న కథనాలను జనాన్ని నమ్మించడానికి పాక్షికమైన దృక్పథంతో అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో మన దేశానికి ప్రతికూలంగా పరిణమిస్తుంది. మన దేశ ఆర్థికవ్యవస్థలో నెలకొన్న సంస్థాగత బలహీనతలను అధిగమించిడానికి నిజాయితీగా చెయ్యాల్సిన పాలనాపరమైన కృషి పక్కకిపోతుంది. మన ఆర్థిక వ్యవస్థలో అసమానతలు తీవ్రమై పెళుసుగా తయారవుతుంది.
మానవ వనరులపై ప్రభుత్వవ్యవయాన్ని పెంచడం వ్యవసాయరంగంలో అర్థవంతమైన మౌళిక మార్పులు చేపట్టడం, పాలనాపరంగా పారదర్శకత పాటించడం మన ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలు. అభివృద్ధి వేగవంతంగా సాధించడం ఒక్కటే కాదు. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ మెరుగ్గా సమానంగా దక్కేలా చూడాలి.
ప్రస్తుతం మనదేశం చాలా లోతైన సంస్థాగత బలహీనతలలో చిక్కుకుపోయి ఉన్నది. దీని నుంచి బయటపడాలంటే ప్రసార, ప్రచార మాధ్యమాల్లో పతాకశీర్షికల కోసం ఉద్దేశించిన ఆర్ధికాబివృద్ధి గురించి పాకులాడకుండా పునాది నుంచి మానవ వనరులను బలోపేతం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. సృజనాత్మకమైన ఉత్పాదకత సాధించడానికి ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం జీడీపీలో 4 శాతానికి తగ్గకుండా కేటాయింపులు జరపాలి. విద్య అంటే పాఠశాలల్లో భర్తీ అయిన విద్యార్థుల సంఖ్యగా చూడడం మానేసి విద్యార్జనా స్థాయి, వృత్తి నైపుణ్య శిక్షణ, డిజిటల్ పరిజ్ఞానం పెంపుదలవంటి అంశాలపై కేంద్రీకరించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వ్యవస్థాగతంగా బలోపేతం చేసి ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందితే జనాభాపరంగా మన దేశానికి ఉన్న అదనపు ప్రయోజనాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. లేదంటే జనాభా సంఖ్యయే మన పాలిట గుదిబండలా మారుతుంది.
అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 90 శాతం శ్రామికులకు సంఘటితరంగ ప్రయోజనాలు కల్పించాలి. కార్మిక చట్టాలు మరింత సమ్మిళిత స్వభావం సంతరించుకోవాలి. సామాజిక భద్రతా పథకాన్ని కార్మికులు అందరికీ వర్తింపచేసేలా విస్తరించాలి. ఆర్థికాభివృద్ధి అనేది కార్మికులకు మెరుగైన జీతాలు, గౌరవప్రదమైన జీవితాలు, ఉద్యోగ భద్రతకు పూచీపడాలి. మన పారిశ్రామిక రంగాన్ని మరింతగా వైవిధ్యపరచాలి. సేవల రంగాన్ని మించిపోయే స్థాయికి తీసుకువెళ్లాలి. వస్తూత్పత్తి పరిశ్రమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఉత్పత్తిని వికేంద్రీకరించడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించి ప్రాంతీయ అసమానతలు సమసిపోయేలా చూడాలి. ఇవన్నీ చేపట్టాలంటే కేంద్రప్రభుత్వం ముందుగా ప్రజాస్వామికంగా జవాబుదారీతనం వహించడానికి సిద్ధపడాలి. సంస్థాగతమైన నిజాయితీ, నిబద్దత, పారదర్శకత, సమాఖ్యతత్వం లేకుండా పటిష్టమైన రీతిలో అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు. కేంద్రప్రభుత్వం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. స్థానిక సంస్థల అధికారాలను మరింత బలోపేతం చెయ్యాలి. పౌరభాగస్వామ్యాన్ని విశేషంగా విస్తృతపరచాలి. అప్పుడే మోడీ వాగ్దానం చేసిన “సబ్ కే సాత్- సబ్ కా వికాస్” సాకారం అవుతుంది. భారతదేశం సమాన సమాజాభివృద్ధి సాధిస్తుంది.
ప్రజాస్వాహ్యం వెనుకపట్టుపట్టడమే అతి పెద్ద శాపం..
మన దేశంలో నానాటికీ లుప్తమవుతున్న ప్రజాస్వామిక విలువలు దేశాభివృద్ధి క్రమానికి ఆటంకంగా మారుతున్నాయనే కీలకమైన అంశాన్ని తరచూ విస్మరిస్తున్నారు. రాజ్యాధికారం కేంద్రీకృతం కావడం, ఏక వ్యక్తి పాలన కొనసాగుతుండడం రాజ్యాంగానికి విఘాతంగా తయారయ్యాయి. సమిష్టి నిర్ణయం అనేది గాలికి ఎగిరిపోయిన పేలపిండి మాదిరి తయారయింది. జవాబుదారీతనానికి చోటే లేకుండా పోయింది. పాలనా వ్యవహారమంతా ఏ ఎన్నికలు జరిగినా దానిలో గెలవాలనే లక్ష్యంతో నడుస్తున్న యవ్వారంగా మరిపోయింది. ఈ నియంతృత్వ పోకడలు అధికార దుర్వినియోగాన్ని నిలవరించే ప్రజాస్వామిక పర్యవేక్షణ, సమతుల్యతలను దెబ్బతీశాయి, సమాఖ్యతత్వాన్ని నీరుగార్చాయి, అసమ్మతి స్వరాలను, భిన్నాభిప్రాయాలను అణిచివేస్తున్నాయి.
వర్తమాన ప్రపంచంలో మనదేశం ఎదుర్కొంటున్న బలహీనతలు అధిగమించడానికి ప్రజోపయోగకరమైన, ఆరోగ్యకరమైన చర్చలు నిర్వహించి, ప్రోత్సహించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం కుహనా దేశభక్తి ప్రచారంతో, ఆర్భాటపు ప్రచారాలతో అనుకూల వాతావరణం సృష్టించుకోవడం మీదనే తన శక్తినంతా వెచ్చిస్తున్నది. సంక్షేమ పథకాలు రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులుగాకాక మోడీ ఇచ్చిన వరాలుగా శృతిమించిన ప్రచారానికి పాల్పడుతున్నారు. వీటన్నిటి పర్యవసానంగా అభివృద్ధి అంటే దేశ ప్రజానీకం జీవన ప్రమాణాల్లో సాధించే మెరుగుదలకాకుండా ప్రచారానికి, పతాక శీర్షికలకు ఎక్కే అసత్యపు, అర్ధ సత్యపు అంకెల మాయాజాలంగా మారిపోయింది. ప్రభుత్వ పరిపాలన అంటే అంగరంగ వైభోగ ప్రచారం, నియంత్రణలుగా మారిపోయాక ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లు తెలుసుకునే సోయిలో లేకుండా పోయింది. రాజ్యానికి సమాజానికి మధ్య నెలకొన్న ఈ భారీ అంతరాన్ని ఎంత గొప్ప జీడీపీ శాతం కూడా కప్పిపెట్టలేదు.
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాస రచయిత ఐఐటీ ఖరగ్‌పూర్, జీఐఎం గోవాలో పూర్వ ఆచార్యులు. పీఐఎల్ మాజీ సీఇఓ రచయిత, పౌరహక్కులు కార్యకర్త కూడా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.