ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్త సీసాలో పాత నీళ్లు పోస్తున్నారు. తిరిగి తన పాత పాటకే కొత్త రాగం అందుకున్నారు. మిషన్ పేరును ఇప్పుడు కొద్దిగా మార్చి… ‘విజన్ 2047’ అంటున్నారు! స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి చెప్పే ముందు, పాతికేళ్ల కింద ప్రతిపాదించిన విజన్ 2020లో ఏముంది? పదేళ్ల కింద ప్రతిపాదించిన విజన్ 2029లో ఏముంది? ఈ రెండు విజన్ డాక్యుమెంట్ల వల్ల రాష్ట్రానికి నికరంగా ఒరిగిందేంటో? నికార్సుగా జరిగిందేంటో? చెప్పి ఉంటే ఇటీవల ఆయన 225 పేజీలతో ఆర్భాటంగా విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ మీద ఒక ఆలోచన, అవగాహన ప్రజలకు ఏర్పడే అవకాశం ఉండేది. దానికి భిన్నంగా రంగురంగుల కాగితాలు పట్టుకొచ్చి, గ్రాఫిక్స్ లో జనానికి వైకుంఠం చూపించి, తెరవెనక ఆశ్రితులకు ఆస్తులను కట్టబెట్టే పన్నాగాన్ని ఎన్నిసార్లని ప్రజలు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు?
చంద్రబాబు ఇటీవల స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో కొత్త డాక్యుమెంట్ విడుదల చేసి, ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ గా, దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలిపే కృషికి బీజం ప డిరదని చెప్పారు. ప్రజల తలరాతను, రాబోయే తరాల భవిష్యత్తును ఈ విజన్ డాక్యుమెంట్ మారుస్తుందని ఒక అడ్వర్టైజ్ మెంట్లో రంగురంగుల అక్షరమాలతో, ఇంద్రదనుస్సును తలపించేలా ప్రగతి కనికట్టును ప్రదర్శించారు. కానీ, ఒక్కసారి ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచిన ముఖ్య విషయాలను, లక్ష్యాలను గమనిస్తే… క్షేత్రస్థాయి పరిస్థితులకు అవి ఎంత దూరంగా ఉన్నాయి, ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అవెంత విరుద్ధంగా ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది.
‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం’ ఇది విజన్ 2047 నినాదం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన, నదుల అనుసంధానంతో నీటి భద్రత, పేదరికం సంపూర్ణ నిర్మూలన, రాబోయే 25 ఏళ్లలో ఏడాదికి సగటున 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతామని డాక్యుమెంట్లో చెప్పారు. ప్రస్తుతం రూ. 2.54 లక్షలు ఉన్న తలసరి ఆదాయం, 2047 నాటికి రూ.35.62 లక్షలు చేయడం ద్వారా… ఇలా విజన్ డాక్యుమెంట్ ని బరువైన అంకెలతో చెక్కి పెట్టి, దేశంలోనేగాక ప్రపంచంలోనే ఏపీ ని అగ్రగామిగా మారుస్తామని ఊదరగొట్టారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ డాక్యుమెంట్ ని పూర్తిగా చదివారో, లేదో తెలియదుగానీ….. చంద్రబాబు విజన్ అద్భుతమని, 2047 నాటికి ఇది తప్పక నెరవేరుతుందని, ఆయనకు వంతపాడే తన సహజ దోరణిలోనే కితాబిచ్చారు.
ఆరు నెలల కాలంలోనే ‘విజన్ 2047 డాక్యుమెంట్’ తీసుకొచ్చామంటే అది తనకున్న విజన్ అని చంద్రబాబు తనని తానే పొగుడుకున్నారు. తానొక విజనరీ అనుకోవడంలో తప్పులేదు, కానీ, ఒక విజన్ ప్రకటించి, దాన్ని ఆచరణలో చూపించకపోవడమే తప్పు! విజన్ ప్రగల్భాల పరంపరలో ఆయన గత ట్రాక్ రికార్డును గమనిస్తే… దోపిడీ తప్ప అభివృద్ధి లేదని స్పష్టమవుతుంది. 1999లో చంద్రబాబు ‘విజన్ 2020’ పేరుతో ఇలాగే ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. విజన్ 2020లో రెండు దశాబ్దాల్లో రాష్ట్ర వృద్ధిరేటు పది శాతం చేస్తానని చెప్పారు. దానికి 30 లక్షల కోట్ల పెట్టుబడి కావాలన్నారు. మన కళ్ల ముందే ఐదేళ్ల కిందట 2020 వెళ్లిపోయింది. ఈ రోజు పరిస్థితులతో దాన్ని లెక్కగట్టినా అది సాధ్యపడలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో రైతుల ఆత్మహత్యలు, ఉపాధి లేక వలసలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కష్టాలు పడుతుంటే, ఈ సమస్యల్ని గాలికొదిలేసి విజన్ 2020 పేరు చెప్పి రాష్ట్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే, రాష్ట్ర జీడీపీలో వేగమైన పెరుగుదల సాధించడమేనని విజన్ 2020 నుంచి చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. దీనికోసం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని చెప్తున్నారు. పెట్టుబడులు రావాలంటే, కంపెనీలకు చవకగా వనరులు కట్టబెట్టాలని, లేదంటే ఆ పెట్టుబడి వేరే రాష్ట్రాలకు తరలిపోతుందని భయపెడుతుంటారు, భ్రమపెడుతుంటారు. అలా హైదరాబాదులో విలువైన ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు, ఆశ్రితులకు, ధనవంతులకు పంచిపెట్టారు. వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. చేతి వృత్తులన్నీ నాశనమయ్యాయి. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. ధనవంతులకు తప్ప ఎవరికీ ఉపయోగపడని ఈ డాక్యుమెంట్ విజన్ 2020 కాదు… 420 అంటూ బాబు తీరును ప్రతిపక్ష పార్టీలే కాకుండా సాధారణ ప్రజలు కూడా నిరసించారు. ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో ఘోరంగా ఓడించి, బుద్ధి చెప్పారు.
‘విజన్ 2020’ వేలం వెర్రికి బుద్ధి చెప్పినా సరే, 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన ‘విజన్’ నినాదాన్ని వదులుకోలేదు. విజన్ 2020ని, విజన్ 2029గా మార్చి మరో డాక్యుమెంటును విడుదల చేశారు. అందులోనూ 2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత అభి వృ ద్ధి చెందిన రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని ఊదరగొట్టారు. అది కూడా ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. ఆ ఐదేళ్లకాలంలో చంద్రబాబు ఒక్క పోర్టుగానీ, ఫిషింగ్ హర్బర్ గానీ, మెడికల్ కాలేజీ గానీ కట్టలేదు. ప్రభుత్వ ఆస్పత్రులను, పాఠశాలలను బాగు చేయలేదు. రాష్ట్ర విభజన గాయంతో బాధపడుతున్న ప్రజలు కోరుకున్న రాజధానిని కూడా నిర్మించలేకపోయారు. రాజమౌళి ‘బాహుబలి రాజధాని’ గ్రాఫిక్స్ లోనే సరిపుచ్చారు. ప్రత్యేక హోదా సంగతలా ఉంచినా, కనీసం ఇతర విభజన హామీలు కూడా సాధించలేకపోయారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించలేకపోయారు. కార్పోరేట్ కంపెనీలకు భూములు అప్పజెప్పారుగానీ, ఆర్థిక అభివృద్ధి మీద, యువత భవిష్యత్తు మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అందుకే, ‘విజన్ 2029’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో మురిపించిన టీడీపీని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడిరచారు. పార్టీ చరిత్రలోనే అతి తక్కువ అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేసి పాఠం నేర్పారు.
మంచికో, చెడుకో… అయిదేళ్ల విరామం తర్వాత, 2024లో ప్రజలు మళ్లీ టీడీపీకి అధికారం కట్టబెట్టారు. ఈ అధికారం కట్టబెట్టింది కచ్చితంగా చంద్రబాబు విజన్ చూసి మాత్రం కాదు. మార్పు కోరుకున్న ప్రజలకు 2019- 24 అయిదేళ్లలో…. రాజధాని నిర్మాణం కాలేదు, ఉద్యోగాలు రాలేదు, కనీసం రోడ్లు వేయలేదు, అసలేమాత్రం అభివృద్ధి జరగలేదు అనే కారణంతోనే మళ్లీ టీడీపీకి ఓటేశారు. 2024 జూన్ 13న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, గత ఆరు నెలల పాలనలో ప్రజలు సంతృప్తి చెందే ఒక్క కార్యక్రమాన్ని కూడా రూపొందించలేకపోయారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ, ఏకంగా 23 ఏళ్ల భవిష్యత్తును అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ స్వర్ణాంధ్ర 2047ని చదివితే, గతంలో చంద్రబాబు అమలు చేసిన నయా ఉదారవాద ప్రపంచ బ్యాంక్ వ్యుహాలను, విధానాలను మరింత విస్తృతంగా, వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
2047నాటికి అమెరికా, చైనా తర్వాత… ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నయా ఉదారావాద విధానాలతో ‘వికసిత్ భారత్’ విధాన పత్రాన్ని విడుదల చేస్తే, దానికి కాపీగా ‘స్వర్ణాంధ్ర-2047’ని రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుందనే ఉద్దేశ్యంతో, ఇదంతా అమృత కాలమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నినాదం ఎత్తుకుంది. మరి, 2047కు ఏపీకి ఉన్న బాదరాయణ సంబంధమేమిటో…? ఎవరికీ తెలియదు. విజన్ 2020లో ‘వ్యవసాయం దండుగ’ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, మొఖం వాచే చివాట్లకు జడిసి, ఇప్పుడు వ్యవసాయరంగాన్ని ఎగుమతి ఆధారిత, వాణిజ్య కేంద్రకంగా రాష్ట్రంలో మార్పులు తీసుకొస్తామని విజన్ రూటు మార్చుకున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో 47 శాతం ప్రకృతి వ్యవసాయం చేసేలా, 40 శాతం సాగుభూమి పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలకు మార్పు జరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ, ఇతర వ్యవసాయాధారిత అనుబంధ వాణిజ్య పంటలే రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమానికి ముఖ్యమనీ ఈ విజన్ పత్రం పేర్కొంది. కానీ, రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి, వాటి పరిష్కార మార్గాల గురించి విజన్ డాక్యుమెంట్లో ఎక్కడా కనిపించదు. వారికి అందించాల్సిన మద్దతు ధర, మార్కెటింగ్ వ్యవస్థ, పెట్టుబడి కల్పన, పోలవరం లాంటి ముఖ్యమైన నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటికి తగిన నిధుల కేటాయింపు… వంటి నిర్మాణాత్మక, వాస్తవిక విషయాలకు ఈ విజన్లో స్థానమే లేదు. ఇది వ్యవసాయాన్ని బాగు చేయకపోగా, భూములను పెద్ద ఎత్తున ధనవంతులకు, కార్పోరేట్లకు కట్టబెట్టడానికి, చిన్న సన్నకారు రైతుల భూములు ఏదో ఒక మార్గంలో లాక్కోవడానికి పరోక్ష ప్రణాళికలు మాత్రం రూపొందించారు.
ఇక పారిశ్రామిక రంగంలో అద్భుతాలు జరగబోతున్నట్టు, రూ. 11.97 లక్షల కోట్ల పెట్టబడుల వరద రాష్ట్రానికి రాబోతున్నట్టు విజన్ డాక్యుమెంట్లో ఓ రంగుల కల చూపారు. 25 పారిశ్రామిక క్లస్టర్లు, 500 పారిశ్రామిక ఎస్టేట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. చేతిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటుపరమౌతుంటే నిలువరించే దిక్కు లేదు కానీ, ప్రయివేట్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని గొప్పలు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిశ్రమలన్నింటికీ కావాల్సిన 2 లక్షల ఎకరాల భూమిని మొదట పెట్టుబడిదారులకు అప్పజెప్పి, వారికి విద్యుత్ రాయితీలు, నీరు, రోడ్లు, రైల్, పోర్టు కనెక్టివిటీ సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే… ఇప్పటికే కేటాయించిన భూముల్లో, సెజ్ ల్లో, క్లస్టర్లలో పరిశ్రమలు రాక అవన్నీ ఖాళీగా పడున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. గత పదేళ్లలో అనేక సదస్సులు నిర్వహించినా… రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన జాడే లేదు. ఈ ఆర్థిక సంక్షోభ కాలంలో అవి వస్తాయనే నమ్మకం కూడా లేదు. ఈ విజన్ పేరుతో రైతుల భూములను, ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను, ఆటవి సంపదను కార్పోరేట్లకు ధారాదత్తం చేయడానికి ఒక పెద్ద వ్యూహాన్నే రచించారనేది విస్పష్టం.
విజన్ 2047 చెప్తున్నట్టుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది కూడా ఒక భ్రమ మాత్రమే. వారు చెప్పే ఈ ఉద్యోగాలన్నీ తక్కువ వేతనంతో, కనీస భద్రతా లేకుండా మానవ వనరుల శ్రమశక్తిని భారీగా దోపిడికి గురిచేసేవే! ఆర్థిక సంక్షోభం పెరిగే కొద్దీ నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తున్నది. పేదరిక నిర్మూలన కోసం ప్రతిపాదించిన పరిష్కారాలను చూస్తే…. ఆశ్చర్యం కలుగుతుంది. బాగా సంపద ఉన్న పై అంతస్తులోని 10 శాతం మంది సంపన్నులు, పేదరికంలో మగ్గుతున్న అట్టడుగున ఉండే 20 శాతం మంది పేదల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక సహాయం చేస్తారట! దాంతో పేదరికం తగ్గుతుందట! ఎలా చేస్తారో చెప్పలేదు. మరింత దోచుకోకుంటే చాలు. ఈ మాయ వల్ల పేదరిక నిర్మూలన, ఇంటికో పారిశ్రామికవేత్త అనే భ్రమల్లో … ప్రజలు తమకున్న కొద్దిపాటి ఆస్తులు కూడా కోల్పోయి వలస కూలీలుగా మారే ప్రమాదం ఉంది.
‘‘భూమిపై హక్కు, విద్యావకాశాలు, ఆరోగ్యం, సమానావకాశాలు, మార్కెట్ వ్యవస్థలో పాల్గనే ఆర్థిక స్వేచ్చ, ప్రభుత్వ పాలనలోనూ, విధాన నిర్ణయాల్లోనూ భాగస్వామ్యం…. ఇలా ప్రజలకు అన్ని విషయాల్లో బలాన్ని ఇస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. పేదరికం పోదు’’ అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఎప్పుడో చెప్పారు. ఈ ఆర్థిక సూత్రాలకు పూర్తి విరుద్ధంగా తయారైన చంద్రబాబు నాయుడు కుహనా విజన్ ప్రజల సామర్థ్యాన్ని పెంచేది కాదు. ఆయన విజన్ లో భూమి, జలవనరులు, ఆటవి సంపద, దుర్బలులైన ప్రజలకు కొత్త బలాన్ని ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకునే ప్రయివేట్ కంపెనీలకు, ప్రభుత్వంలో ఉన్నవారికి బలాన్ని ఇస్తాయి. ధనవంతుల ఆదాయం పెరగడం వల్ల కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది, కానీ ‘గణాంక మాయాజాలం’లో పేదలు మరింత పేదలవుతారే తప్ప టీడీపీ చెప్తున్నట్టుగా పేదరికం పోయే అవకాశం లేదు. సమాన అవకాశాలు, సమాన వనరులు, అధికారంలో భాగస్వామ్యం వల్లనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది. కానీ, ఇప్పటివరకు చంద్రబాబు విడుదల చేసిన మూడు విజన్ డాక్యుమెంట్లలో ఈ విషయాలపై చర్చకాదు కదా, కనీసం ఒక్క అక్షరమాత్రపు ప్రస్తావన కూడా లేదు.
విజన్ 2047 సాధించాలంటే వరుసగా రెండు దశాబ్దాలకు పైగా వారే పాలనలో ఉండాలి. అంటే, టీడీపీ వచ్చే నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలవాలి. ఒక ఎన్నికలో ఓడినా…. ఆ వచ్చే రాజెవరో? మంత్రెవరో? ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితికి ఇంత పెద్ద విజన్ ప్రకటన చూస్తే…. పనితీరుతో ప్రమేయం లేకుండా అన్ని సార్లూ తామే గెలవాలనే దురాశ కనిపిస్తుందే తప్ప దూరదృష్టి కనిపించదు. వరుస ఎన్నికలు గెలవాలంటే ప్రజావిశ్వాసం నిరవధికంగా చూరగొనాలి. దీనికోసం వాళ్లు చేయాల్సిన మొదటిపని ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే, సూపర్ సిక్స్ ఆశ చూపి సామాన్యుల ఓట్లు దండుకొని గెలిశారే తప్ప, ఎన్నికలకు ముందే ‘విజన్ 2047’ అని ఉంటే ప్రజల స్పందన వేరేలా ఉండేదేమో!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు కావాల్సింది విజన్లు కాదు… విభజన హామీల అమలు! విభజన హామీలను దశాబ్ద కాలంగా గాలికి వదిలేశారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని అడిగి, డిమాండ్ చేసి సాధించుకునే అవకాశం ఉన్నా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైన టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయింది. అంతే కాకుండా…. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి, బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలి, కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మించాలి. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ – చెన్న్కె ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, ఇలా ఎన్నో విభజన హామీలు ఇప్పటికీ కలగానే మిగిలాయి.
ప్రత్యేక హోదా వచ్చి ఉంటే 10 ఏళ్లలో పన్నుల్లో రాయితీలు ఉండేవి. చెప్పుకోదగ్గ సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి. లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది ఉంటే పేదరిక నిర్మూలన దిశగా అడుగులు పడేవి. కానీ, విభజన హామీల గురించి ఒక్క మాట కూడా విజన్ 2047 మాట్లాడటం లేదు. ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా బలాన్నిచ్చే ఉద్యోగాలు, సమానావకాశాలు, రాజధాని నిర్మాణం, రైతులకు గిట్టుబాటు ధర, వీటి మీద సూపర్ సిక్స్ హామీలు… రాబోయే నాలుగేళ్లలో ప్రజలు ప్రధానంగా ఆశించిన ఈ ప్రాథమిక అంశాల్ని నెరవేర్చడమే రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం కావాలి. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, ప్రజల కనీసావసరాలకు ప్రాధాన్యత ఇచ్చి, అందుకనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకుంటేనే… ఏ విజన్ పత్రమైనా నమ్మడానికి ఉంటుంది. అది వారికే మంచిది, లేదంటే, ‘విజన్’ ముసుగుతో ఒక ఊహాపత్రం విడుదల చేసిన ప్రతిసారి… ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వర్తమాన చరిత్రే సాక్ష్యం.
-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, డ్కెరెక్టర్ – పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ