వైర్ న్యూస్ మన భాషలో మరింతగా అందుబాటులోకి వస్తుందన్న వార్త నిజాలు నిజంగా తెలుసుకోవాలనుకునే తెలుగువారందరికీ అమితానందం కలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు. నిర్భయంగా నిస్సంకోచంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వడంతో పాటు దాని వెనక గల అన్ని కోణాలనూ చర్చకు పెట్టడం ద్వారా సంపూర్ణమైన అర్థంలో సత్యాలను ఆవిష్కరించే వైర్ జాతీయ ప్రతిష్ట , క్రియాశీల పాత్ర అందుకు ప్రధానకారణమనడంలో సందేహం లేదు. అయితే అంతే కీలకమైన మరో కారణం తెలుగు మీడియా ప్రస్తుత దృశ్యం. ప్రాంతీయ పార్టీలలాగే వాటి వాటి ప్రయోజనాలకుపరిమితమై పూర్తిగా విభజితమై ‘నా కళ్లతో చూడు’ అన్నట్టు వారి వారి వ్యూహాల కోణం నుంచే జాతీయ అంతర్జాతీయ సామాజిక పరిణామాలను చూపించడం నిత్యకృత్యమైపోయింది. విశాలమైన ప్రజల ఎజెండా కుదించుకుపోయింది. సమాచార హక్కుకే భంగమేర్పడిరది. నడుస్తున్నదే ఒక ఉదాహరణ చాలు. అదానీ ఎనర్జీ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులపై తెలుగులో చాలా గంటల కొద్ది ప్రసారాలు, పేజీల కొద్ది కథనాలు వెలువడ్డాయి కానీ ఇందులో అదానీ గ్రూపుపై అంతర్జాతీయంగా వచ్చిన ఆరోపణల ప్రసక్తి మాత్రం వుండదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముచ్చటే వుండదు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కూ ప్రస్తుత చంద్రబాబు నాయుడు ఎన్‌డిఎ ప్రభుత్వానికి మధ్యనే ఈ చర్చ మొత్తం నడుస్తుంటుంది. లేదా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ బిఆర్ఎస్ నేతలు కెటిఆర్‌కు మధ్య యుద్ధంగా మారుతుంది. ఎపిలో పాలక కూటమిలో భాగంగానూ, తెలంగాణలో మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పే పార్టీగానూ అంతకుమించి దేశాన్ని పాలించే పాలక పార్టీగానూ బిజెపి విధానాలు చర్చకు రావడం అరుదు. దానిపై ప్రధాన విమర్శగా వున్న మత రాజకీయాల కోణం అసలే లోతుగా చర్చ జరగదు. అదానీ సంస్థల గురించి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య చర్చ కూడా విధానాల లోకి పోని వివాదంగానే సాగుతుంటుంది.
యాభైలలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం వున్నప్పుడు, 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినపుడు అప్పటి వార్తాపత్రికలు పాక్షికంగా వ్యవహరించిన అనుభవాలున్నాయి. కానీ ఇప్పటి పరిస్థితిని దాంతో పోల్చలేము. ఇప్పుడు అప్రకటితంగానే అయినా బాహాటంగా గత, ప్రస్తుత పాలక పార్టీల ప్రచారం, వ్యూహాలకు దిశానిర్దేశం చేసే బాధ్యత అనేక మీడియా సంస్థలు తమ భుజాలపై వేసుకున్నాయి. కొందరైతే నేరుగా మీడియా సంస్థలే స్థాపించుకున్నారు. ఏతావాతా తెలుగు వాళ్లు ఇప్పుడు ఏ మీడియా ఏం చెబుతుందని గాక ఏ వైపునుందనేదాన్ని బట్టి చూస్తున్న స్థితి. ప్రపంచీకరణానంతర మార్కెట్ వ్యవస్థలో దేశమంతటా ఇదే స్థితి వుండొచ్చుగానీ మీడియా విస్తరణలో స్థానికీకరణలో ముందున్న తెలుగురాష్ట్రాలు మరింత తీవ్రంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆఖరుకు సినిమా రంగాన్ని కూడా శ్రుతిమించిన రాజకీయాలు ఆవరించాయని తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై సాగిన అలజడి నిరూపించింది. తిరుపతి లడ్డూ అయినా అంతర్జాతీయ అవినీతి అయినా ఇవే కొలబద్దలు. ఇవే భజనలు, దాడులతో ఈ విభజన సంపూర్ణమైంది.
తాము లౌకిక ప్రజాస్వామ్య విలువల కోసం సామ్యవాద సాధన కోసం శ్రమజీవుల తరపునపనిచేస్తామని ప్రకటించుకున్న వామపక్ష భావజాలం విషయం వేరు. అలాటి స్పష్టత ఇవ్వకుండానే స్పష్టంగా కొన్ని ప్రయోజనాల కోసం పనిచేయడమే ఇప్పుడు ఆవరించిన జాడ్యం. ఈ క్రమంలో అణగారిన వెనకబడిన తరగతులు, మహిళలు అల్పసంఖ్యాకులు వంటివారి హక్కులపై జీవితాలపై జరిగే ప్రత్యక్ష పరోక్ష దాడులను గురించిన సమాచారమే చేరడం లేదు. అధికారంలో వున్న వారిని బట్టి ఏదో జరిగిపోతున్నట్టు జనాన్ని భ్రమపెట్టడమే! మహిళల విషయంలో ఇది మరీ దిగజారి వారిని వార్తా కథనాలకు ముడిసరుకుగా మార్చడం… మతాల మధ్య మంటలు కులాల మధ్య కుంపట్లు. వ్యూస్ కోసం వ్యూస్ మార్చుకోవడం లేదా తమ వ్యూస్‌నే న్యూస్‌గా మల్చుకోవడం. జుగుప్సాకరంగా సాగిపోతున్నది. మీడియాను మోడియాగా గోది మీడియాగా కొత్త పేర్లు పుట్టాయి. ప్రత్యామ్నాయ భావాలనూ భిన్నాభిప్రాయాలకు వేదికలే తగ్గిపోతున్నాయి, సామ్రాజ్యవాదం, న్యాయవ్యవస్థ వంటివాటిపై అసలు జరగాల్సిన చర్చలే కొరవడ్డాయి. ప్రసిద్ధ జర్నలిస్టులే సంస్థల నుంచి బయిటకు వచ్చి చిన్నవో పెద్దవో స్వంత వేదికలు ఏర్పాటు చేసుకుంటున్న దశ. ఈ మధ్యనే కరణ్‌థాపర్ రాజ్‌దీప్ సర్దేశాయి సంభాషణలో చర్చకు వచ్చిన ఇలాటి అంశాలు అందరినీ ఆవేదనకు గురి చేస్తున్నాయి.
ఆయా యజమానుల పాత్రికేయుల ఆలోచనలు ఎత్తుగడలు మద్దతు విమర్శ ఏదైనా కావచ్చు గానీ పాఠకులకూ వీక్షకులకూ వున్న మొత్తం పరిస్థితులు తెలియాలి. నడుస్తున్న అన్ని చర్చలు ఎంతోకొంత అందాలి. దానిపై ఎవరి భావాలను బట్టి వారు నిర్ణయాలు, వైఖరులు తీసుకుంటారు. తప్పొప్పులుంటే సరిచేసుకోవచ్చు. కానీ ముందస్తు ముద్రలతో, హైప్లతో ఇష్టాయిష్టాలను బట్టి కొన్ని కథనాలే పెంచి కొన్ని అసలే తప్పించి మీడియా విశ్వసనీయత కోల్పోవడం అనుమతించరానిది. అనుకున్న కథనంతో అంగీకార సృష్టి గురించి నామ్‌చోమ్‌స్కీ వంటివారి అధ్యయనాలు ఇక్కడ పూర్తిగా అన్వయిస్తాయి. పాలకులు, రాజకీయ నాయకులు మీడియాపై విమర్శలతో మొదలు పెడుతున్నారు, నచ్చని మీడియాపై వేధింపులు, దాడులు కేసులు మామూలైపోయాయి. వైర్ న్యూస్ వంటివి ఎన్ని రకాలుగా ప్రతికూలతను ఎదుర్కొన్నాయో దేశమంతటికీ తెలుసు. దేశాధినేతలు న్యాయస్థానాలలో కూడా చూపిన భిన్న ప్రమాణాలు ప్రశ్నార్థకమయ్యాయి. భావప్రకటనా స్వేచ్చను కాపాడుకోవలసిన పోరాటం ఒకటైతే సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా పోరాడవలసిన పరిస్థితి ఓ తలకిందులు పరిణామం. కనిపించేవే రాయనివ్వనిస్థితిలో పరిశోధనాత్మక జర్నలిజం ఓ సవాలు. సాంకేతిక అవకాశాల వల్ల రకరకాల రూపాల్లో మీడియా విస్తరిస్తుండగా స్వతంత్రంగా సంపూర్ణంగా సత్యాన్ని చెప్పాలనుకునే శక్తులకు స్థానం లేకుండా చేయడం. కార్పొరేట్ వ్యూహాలనూ మత చాందసాన్ని నిరంకుశ రాజకీయాలనూ నిలదీసే గొంతులకు అడ్డంకులు కల్పించడం. భారతీయ మీడియా గురించి అంతర్జాతీయంగానే ఆ వర్ణన ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. కానీ అలాటివేవీ పైకి కనిపించకుండానే నిశ్శబ్ద నియంత్రణ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక సంక్లిష్టత. ఈ తరుణంలో వైర్ తెలుగులో వెలువడటం ఒక కొత్త భావావరణానికి చోటు కల్పిస్తుందనే ఆశ విశ్వాసాలున్నాయి.
తెలుగువాళ్లకు తిండి మాటలు,సినిమాలు ఎక్కువంటుంటారు గానీ మీడియా విషయంలోనూ వారి ఆదరణ చాలా ఎక్కువగా వుంటుంది. స్థానిక సంచికలను తీసుకురావడం,కలర్ పేజీలు ప్రకటించడం అందుకో ఉదాహరణ . ఎక్స్‌ప్రెస్ గ్రూపు ప్రారంభించిన ఆంధ్ర ప్రభ చాలా కాలం అగ్రశ్రేణి పత్రికగా వుండిరది. ఇండియా టుడే పక్షపత్రిక ప్రాంతీయ ఎడిషన్ తొలిగా తెలుగులోనే వెలువడిరది. ఈ రోజున తెలుగు సినిమా పాన్ ఇండియా దశ దాటి ప్రపంచ వసూళ్లను సాధిస్తున్నది. చైతన్యవంతమైన తెలుగు ప్రజానీకం నూతన ప్రయోగాలనూ ప్రయత్నాలనూ ఎప్పుడూ రెండు చేతులా ఆహ్వానిస్తారు. పత్రికావికాసంలో ముందున్నట్టే డిజిటల్ యుగంలోనూ ముందంజ వేశారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ పత్రికలకు చానళ్లకు విస్త్రత ఆదరణ లభిస్తున్నదని 2024 అధ్యయనాలు చెబుతున్నాయి.మారిన పరిస్థితులలో కొత్తతరహా ప్లాట్పాంలనూ వారు స్వాగతిస్తున్నారు.దేశ వ్యాపితంగా రాయిటర్ సంస్థ కాంటూర్తో కలసి జరిపిన సర్వేలో 71శాతం భారతీయులు ఆన్లైన్ వార్తలు స్వీకరిస్తున్నారని తేలింది. 49శాతం సోషల్ మీడియాలో చదువుతున్నారు. యూ ట్యూబ్‌ను 93శాతం, సోషల్ మీడియాను 88శాతం,చాట్ ఆప్స్‌ను 82శాతం వినియోగిస్తున్నారు.సోషల్ మీడియాలోని వెబ్ ఆప్స్ ద్వారా 45 శాతం మంది వార్తలు సమాచారం తెలుసుకుంటున్నారట. హిందీరాష్ట్రాలలోనూ గుజరాత్‌లోనూ అధీకృత స్థానిక సమాచారాన్నే అధికంగా కోరుతుండగా దక్షిణాదిన అన్ని రకాల సమాచారాలపై ఆసక్తి పెరుగుతున్నది.పైగా స్వంత భాషలో నే అంతర్జాతీయ సమాచారంతో సహా తెలుసుకోవాలని ఆసక్తికనపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే విస్తారమైన వైవిద్య భరితమైన నెట్వర్క్ కలిగిన సువ్యవస్థితమైన వైర్ న్యూస్ వంటిది తెలుగు ప్రజల మన్నన పొందడం తథ్యమని చెప్పొచ్చుభిన్న కోణాల కోసం ఆధునిక సమాచార ఆవిష్కరణ కోసం సమగ్ర విశ్లేషణల కోసం జిజ్ఞసతో చూస్తున్న తెలుగు పాఠకులకు వీక్షకులకువిలక్షణ కానుకగా వైర్ గేమ్ ఛేంజరే!.
వైరిచ్చుటయే బెస్టన్నింటిన’ని మరో సందర్భంలో తెలుగు కవి రాసిన మాట ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది… వైరొచ్చుటయే బెస్టిప్పటికిన్!
– తెలకపల్లి రవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.