
‘‘ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అవగాహన కలిగిన పౌరసమాజం పునాదిగా ఉండటంవల్ల స్వతంత్ర, కార్పొరేటేతర మీడియా అవసరం నేడు ఎన్నడూ లేనంతగా ఉంది.’’ – దార్ జమైల్
భారతదేశంలో జరిగినంత కార్పొరేట్ మీడియా స్థిరీకరణ మరేదేశంలోనూ జరగలేదు. 1990లలో నయావుదారవాద ఆర్థిక విధానాల అమలు తరువాత మీడియా ప్రయివేటీకరణ పెరిగింది. నేడు టెలివిజన్ చానళ్ళు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటిలో వార్తలను అందించే చానళ్ళ సంఖ్య 500పైనే. ఇలా ఏర్పడిన ప్రయివేటు మీడియా మనగలగటానికి (వ్యాపార) ప్రకటనలు(అడ్వర్టయిజ్ మెంట్స్) ప్రాణవాయువుగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ప్రకటనలకు ప్రధాన వనరులయ్యాయి. దీనితో ఈ ప్రభుత్వాలను నియంత్రించే రాజకీయ పార్టీలు మీడియా కవర్ చేసే విషయాలను గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభావితం చేయడానికి వీలు ఏర్పడింది. ఇది మీడియాలో మరింత ఆశ్రితతత్వానికి(క్రోనీయిజం) దారితీసింది.
నయావుదారవాద ఆర్థిక వ్యవస్థలో మీడియా సంస్థలను నడపటానికి అవసరమయ్యే వ్యయం విపరీతంగా పెరిగింది. పర్యవసానంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు అడ్వర్టయిజింగ్ కి మరో ప్రధాన వనరుగా మారాయి. ఆర్థిక వనరుల లేమి కారణంగా కార్పొరేటేతర మీడియా సంస్థల పాఠకుల సంఖ్య, వీక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ మీడియా సంస్థల ముందు ప్రభ్వుత్వ, కార్పొరేట్, చందా అనే మూడు రకాల ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇటువంటి కార్పొరేటేతర మీడియా సంస్థలు మార్కెట్ లో మిగలాలంటే మొదటి రెండింటిని అధిగమించేంత చందాలు ఉండాలి. అయితే ప్రభుత్వ, కార్పొరేట్ అడ్వర్టయిజ్ మెంట్స్ మద్దతుగల కార్పొరేట్ మీడియా సంస్థలు కార్పొరేటేతర మీడియా సంస్థలను పోటీలో లేకుండా చేయడానికి చందా రేట్లను తక్కువ స్థాయిలో ఉంచటం జరిగింది.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పాలకవర్గ భావజాలంగా ‘‘కాషాయ ఫాసిజం’’ ఆధిపత్య స్థానంలోకి రావటంతో సంక్షుభిత నయావుదారవాద వ్యవస్థకు మరింత విస్త్రుతమైన కార్పొరేట్ మీడియా అవసరం ఏర్పడింది. ఆంగ్ల మీడియాలో ప్రత్యామ్నాయం అనేదే లేకుండా చేయడానికి ఎన్ డి టివీ ని అదానీ గ్రూపు కైవశం చేసుకున్న తీరును ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇలా విస్త్రుతమైన కార్పొరేట్ మీడియా కాషాయ ఫాసిజం ఎజెండా అయిన హిందుత్వను నెత్తికి ఎత్తుకుంది.
అలా మీడియా తన స్వతంత్రతను కోల్పోయి తమ యజమానుల, కార్పొరేట్ సంస్థల, ప్రభుత్వాల ప్రయోజనాలను కాపాడే, పాలకులను కీర్తించే బాకాలుగా మారిపోయాయి. వార్తలు నిస్సార నాటకీయతతో, విద్వేషపూరిత వాస్తవాల కలగాపులగంగా తయారవుతున్నాయి. నిలయ విద్వాంసులవంటి జర్నలిస్టులు, నిష్ణాతులు, విశ్లేషకులు అధికారంలోవున్న పార్టీలకు విదూషకులుగా మారుతున్నారు. జాతీయ మీడియా మోడీ భజనతోను, ప్రాంతీయ మీడియా రాష్ట్రాల పాలకుల భజనతోను మార్మోగిపోతోంది. తత్ఫలితంగా అనేక విషయాలపై ప్రతిపక్ష, ప్రత్యామ్నాయ ద్రుక్పథాలకు చోటేలేకుండా పోతోంది.
ఈ సమస్యకు పరిష్కారం సోషల్ మీడియా అనే భావన చాలామందికి ఉంది. దీనికి కారణం సంప్రదాయ మీడియాకు పూర్తి భిన్నంగా సోషల్ మీడియా నిర్మాణం ఉండటమే. సోషల్ మీడియాలో తమకు గల ఆసక్తులను ఉపయోక్తలు(యూజర్లు) ప్రకటించుకునే స్వేచ్చ ఉంటుంది. సంప్రదాయ మీడియాలో పాఠకుడు లేక వీక్షకుడు కేవలం వినియోగదారుగానే ఉంటాడు. సదరు వ్యక్తికి ప్రతిస్పందించే అవకాశం ఉండదు. అయితే సోషల్ మీడియా పైకి కనిపించినంత సోషల్ కాదు. 2012 నుంచి ఆన్ లైన్ మీడియా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఆన్ లైన్ లో లభించే సమాచారం ‘‘ఫేక్ న్యూస్’’, ఫిల్టర్ బబుల్స్, అల్గోరిథమ్స్ తో ప్రభావితం అవటంతో అటువంటి సమాచారం విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతోంది. రాజకీయ దురాక్రమణకు, ద్రువీకరణకు అవకాశం ఉండటంతో దాని విశ్వసనీయత కూడా అంతంత మాత్రంగానే ఉంది.
కార్పొరేట్ కంపెనీల, ప్రభుత్వాల నియంత్రణలోని బడా మీడియా సంస్థలు మీడియా స్వేచ్చను యధేచ్చగా కాలరాస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని స్వతంత్ర మీడియా ఐక్యంగా ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది. అపారమైన నిధులతో విస్త్రుతంగా వ్యాపించిన కార్పొరేట్ మీడియాకు వ్యతిరేకంగా స్వతంత్ర మీడియా నిలదొక్కుకోవాలంటే ముందుగా వివిధ స్వతంత్ర మీడియా సంస్థల మధ్య ఐక్యత, సహకారం అవసరం. ఇప్పటికే ద వైర్, స్క్రోల్, కారవాన్, న్యూస్ లాండ్రీ, న్యూస్ మినిట్ వంటి స్వతంత్ర మీడియా సంస్థలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ ఐదు సంస్థల స్థాపకులకు, సీనియర్ సంపాదకులకు అనేక సంవత్సరాలపాటు మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది.
భారతదేశంలో ప్రముఖ స్వతంత్ర మీడియా సంస్థలలో ఒకటైన ద వైర్ ను సిద్దార్థ వరదరాజన్ స్థాపించారు. అంతకుముందు ఆయన ద హిందూ దినపత్రిక కు ఎడిటర్ గా ఉన్నారు. ఆయనతో ప్రముఖ జర్నలిస్టులు సిద్దార్థ భాటియా, ఎమ్ కె వేణు జతకలిశారు. ఆ తరువాత ద వైర్ లో సీమా సిస్తి ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. ద వైర్ నిర్మాణం కార్పొరేటేతర స్వభావం కలిగివుంది. దాని ఆర్థిక వనరులు మీడియా స్వతంత్రతను దెబ్బతీసే వ్యాపార, రాజకీయ వత్తిడులకు అతీతమైనవి. ద వైర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల మార్గదర్శకత్వంలో పనిచేస్తుంది. అందుకే ద వైర్ అచిరకాలంలో దేశంలో ప్రముఖ మీడియా సంస్థగా ఎదిగింది.
తెలుగు రాష్ట్రాలలో మీడియా పరిస్థితి దేశంలో ఉన్నదానికి భిన్నంగా ఏమీ లేదు. కేవలం మూడు, నాలుగు వార్తా సంస్థలు 80శాతం సర్క్యులేషన్ ను, వీక్షకులను కలిగివున్నాయి. ఈ మీడియా సంస్థలు ప్రజలకు నిజాయితీగా వార్తలను అందించటానికి బదులుగా వివిధ రాజకీయ పార్టీలకు ప్రచార సాధనాలుగా పనిచేస్తున్నాయి. ఇటువంటి ప్రచార వార్తల నిజ స్వరూపాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించేందుకోసం, మరింత లోతైన విశ్లేషణలను నిజాయితీగా అందించటం కోసం ‘దవైర్’ ను తెలుగులో తీసుకురాబోతున్నాము. ఒక సంస్థగా, ‘ది వైర్ తెలుగు’ ప్రజాప్రయోజనాలకు, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా నడుచుకోవడానికి కట్టుబడి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో ‘‘ద వైర్ తెలుగు’’ ఒక మేధో వనరుగా ఉంటుంది.
– నెల్లూరు నరసింహారావు
ఎడిటర్
www.thewiretelugu.in
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.