
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సమగ్రతల గురించిన చర్చను మరింత అర్థవంతంగా నడపాల్సిన అవసరం ఉంది. ఈ చర్చలో ఎన్నికలాధారిత ప్రజాస్వామిక వ్యవస్థ పాటించాల్సిన విలువల ప్రాధాన్యత ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సమస్య చాలా చిన్నదే. ఎన్నికల క్రమంలో ప్రజల భాగస్వామ్యం కేవలం ఓటు వేయటానికి మాత్రమే పరిమితం అయినది కాదు. తాము ఎవరికి ఓటే వేయాలనుకున్నామో ఆ ఓటు వారికి జమ అయ్యిందా లేదా, జమ పడిన ఓటు లెక్కకు వచ్చిందా లేదా అన్నది తనిఖీ చేసుకునేందుకు కూడా అవకాశం ఉండటం కీలకమైన సూత్రం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వేగంగా, తగిన సామర్ధ్యంతో పని చేస్తున్నాయా లేదా అన్న దానికంటే పైన చెప్పిన విధంగా ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నారా లేదా, వినియోగించుకున్న ఓటుకు విలువ దక్కుతుందా లేదా అన్న అంశానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించిన సాంకేతికత, భధ్రతలకే పరిమితం అవుతోంది. ఎన్నికల ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రాల గురించిన చర్చకు దారితీయటం లేదు.ఈ చర్చ పెడుతున్నామంటే ఈవిఎంలలో జరుగుతున్న లోపాలు, మోసాలను పట్టించుకోవటం లేదని కాదు. అదే సమయంలో ఎన్నికల కమిషన్ చర్యలను సమర్థించేవారు, లేదా సాంకేతికతల గురించి చర్చోపచర్చలు చేసేవారు ముందుకు తెస్తున్న వాదలను అర్థవంతంగా చర్చకు పెట్టాలి. ఈవిఎం ల పట్ల ఓటర్లల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ ఉన్న అనుమానాలు, ఆందోళనలను కొట్టిపారేసే సాంప్రదాయానికి స్వస్తి చెప్పాలి. ఈవిఎంలను ప్రశ్నించటం ఒక్కటే ప్రజాస్వామ్యంలో అసమ్మతికి ఆఖరి సాధనం కాదని స్పష్టం చేయాలి.
ఎన్నికల క్రమం సమగ్రతల గురించిన అనుమానాలు తొలగకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల పనితీరులో ఉన్న గందరగోళం. పారదర్శకతా రాహిత్యం. ఇందులో న్యాయవ్యవస్థ ప్రత్యేకించి సుప్రీం కోర్టుకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ గురించి న్యాయస్థానం ముందుకు వచ్చిన పలు వ్యాజ్యాలను విచారించేటప్పుడు కేవలం ఎన్నికల సంఘం ఇచ్చిన వాంగ్మూలాలను యథాతథంగా ఆమోదించి హడావుడిగా తీర్పులు ఇవ్వటం ఎన్నికల పారదర్శకత, సమగ్రతలపై సందేహాలు కొనసాగటానికి మరో కారణంగా ఉంది. ఈ ప్రయత్నంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర మేధావులు, పౌర మేధావుల అభిప్రాయలను పరిగణించటానికి వారు లేవనెత్తిన ప్రశ్నలను సావధానంగా ఆలకించటానికి సిద్ధం కావటం లేదు. 2019 నుండీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తున్న అనుమానాస్పద తీరు, సందేహాస్పదమైన పద్ధతుల్లో రూపొందిస్తున్న విధి విధానాలు గమనిస్తే స్వతంత్రంగా నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైనందువల్లనే ఈ గందరగోళం ఏర్పడుతుందా అన్న సందేహానికి తావిస్తోంది.
తాజాగా 2024 డిశంబరు 20న కేంద్ర ప్రభుత్వం కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ లో 93(2) (అ) నిబంధనను సవరిస్తూ ఓ గజెట్ ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న గందరగోళాన్ని ఈ సవరణ మరింత తీవ్రం చేసింది. ఎన్నికల క్రమానికి సంబంధించిన కొన్ని వివరాలను, రికార్డులను పిటిషనర్‌కు అందుబాటులో ఉంచాలని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల నిర్వహణ నిబంధనలకు లోబడే ఈ తీర్పు ఉన్నది. కానీ ఉన్నట్లుండి ఈ వివాదంలోకి కేంద్రప్రభుత్వం తలదూర్చింది. తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి రూల్ 93(2) (అ)ను సవరిస్తున్నట్లు గజెట్ జారీ చేసింది. అంటే ఇకపై ఎన్నికల క్రమానికి సంబంధించిన ఎటువంటి రికార్డులు, పత్రాలు, వివరాలు పౌరలకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఈ తాజా సవరణ సారాంశం. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన ఈ సవరణను గమనిస్తే ఈవిఎంల సాంకేతిక సామర్థ్యం, నిస్పాక్షికత, భద్రతల గురించి ప్రజల్లోనూ, విశ్లేషకుల్లోనూ, ఈ రంగంలో ప్రవేశం ఉన్న మేధావులు, రాజకీయ పార్టీల్లోనూ గూడుకట్టుకున్న అనుమానాలు, సందేహాల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తోంది.
ఈ వ్యవహారం అనుమానాలకు తావిచ్చేదే కానీ సందేహ నివృత్తి చేసేది కాదు.
కేంద్రంలో పాలక పార్టీ, ఎన్నికల సంఘం ప్రజల నుండి దాస్తున్న సంగతులు వాస్తవాలేమన్నా ఉన్నాయా?
ఎన్నికల నిర్వహణ క్రమానికి సంబంధించిన రికార్డులు ప్రజా పరిశీలనకు పెట్టడానికి భయపడుతున్నారా?
కాదనే ఆశిద్దాం.
ఒకవేళ దాయటానికి ఏమీ లేదనే అనుకున్నప్పుడు ఇంత హడావుడిగా ఈ సవరణలు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న ముందుకొస్తుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే అసలు ఈ సందేహాలకే తావుండేది కాదు కదా.
ఎన్నికల నిర్వహణ క్రమానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించటం లేదన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణను కూడా చేద్దాం.
2019లో కేంద్ర ప్రభుత్వం ఏ సవరణ తెచ్చింది. ఆ సవరణ ప్రకారం కేంద్ర సమాచార కమిషనర్లు తమ జీతభత్యాల కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పదవుల్లో ఉన్నంత కాలం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తేనే ప్రభుత్వం నుండి జీత భత్యాలు అందుతాయన్నమాట. ఇటువంటి సవరణ మొత్తంగా కేంద్ర సమాచార కమిషన్ స్వయంప్రతిపత్తికే గొడ్డలి పెట్టు.
అప్పట్లో ఆ సవరణ తీసుకొచ్చిన సందర్భం కూడా ముఖ్యమైనదే. గమనించదగ్గదే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివిపాట్ల లెక్కింపుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ సందర్భంలో 2019 సవరణ వచ్చింది.
ది క్వింట్ వార్తా సంస్థ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన ప్రశ్నల వెలుగులో ఈ గందరగోళం ప్రపంచ దృష్టికి వచ్చింది.
‘‘2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లవారీ సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద లేదు. ఈ సమాచారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల వద్ద ఉండొచ్చు. అందువల్ల ఆయా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు ఆశించిన సమాచారాన్ని పొందవచ్చు. (మీకు కావలిసిన సమాచారాన్ని సేకరించటానికి) ఎంతో మంది సమాచార అధికారుల భాగస్వామ్యం అవసరం అయినందున ఈ దరఖాస్తును నేరుగా వారికి బదిలీ చేయలేము’’ అన్నది క్వింట్ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘ సమాచార అధికారి ఇచ్చిన సమాధానం.
కానీ ‘‘అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు వివిపాట్ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందచేయాలంటూ’’ంస్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌కు పైన ఆర్టీఐ దరఖాస్తు కింద ఇచ్చిన సమాధానానికి మధ్య పొంతన లేదు.
మరో కోణంలో కూడా ఎన్నికల సంఘం స్పందన సందేహాస్పదమైనదే. ఏ సమాచార అధికారికి దరఖాస్తు పెట్టుకుంటామో సదరు అధికారే సమాచారాన్ని సేకరించి దరఖాస్తుదారుకు అందచేయాలని సమాచార హక్కు చట్టం చెప్తోంది. కానీ ఎన్నికల సంఘం ఈ సమాచారమంతా దేశమంతా చెల్లాచెదురుగా పడి ఉంది కాబట్టి మీరే వెళ్లి ఏరుకోండి అన్నట్లుగా ఉంది. ఇది ఆర్టీఐ చట్ట స్పూర్తి కాదు.
ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానమే సరైనది అనుకున్నా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని సమాచార అధికారుల ముందు 2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో వివిపాట్ల వివరాలు వెల్లడిరచాలన్న దరఖాస్తుల వెల్లువకు అవకాశం ఇచ్చినట్లే. ఆ పరిస్థితుల్లో సమాచార కమిషన్‌ను గుప్పిట్లో పెట్టుకోవడానికి పై ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
2024 డిశంబరులో జారీ చేసిన సవరణలు, 2019లో సమాచార కమిషన్ విషయంలో జారీ చేసిన ఆదేశాలూ కలిపి చూస్తే ఎన్నికల నిర్వమణ క్రమాన్ని పర్యవేక్షించేందుకు, సంపూర్ణ పారదర్శకత కోరుకునే ప్రజలు అవకాశం, హక్కు లేకుండా చేయటానికి ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం నడుం కట్టాయా అన్న అనుమానం రాకమమానదు.
వోట్ ఫర్ డెమొక్రసీ, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, ఇండిపెండెంట్ పానెల్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎలక్షన్స్ వంటి పౌరసమాజ సంస్థలు 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈవిఎంలల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య ఉన్న తేడాను, పోలింగ్‌కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రాధమిక అంచనాలు, తుది అంచనాల మధ్య కొన్ని కోట్ల ఓట్లు తేడా రావడాన్ని ఎత్తి చూపుతున్నారు. అనేక రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంలో సైతం అటువంటి తేడాలను సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపిన సందర్భాలు గణనీయంగానే ఉన్నాయి.
2024 ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ప్రాధమిక అంచనాలు, తుది అంచనాల మధ్య ఉన్న వ్యత్యాసాలే కాదు. ఇంకా అనేక రకాలైన సమస్యలు ముందుకొచ్చాయి.
ఉదాహరణకు ఎన్నికల సంఘం జారీ చేసిన వివరాల్లో పోలింగ్ శాతాలు మాత్రమే ఉన్నాయి. పోలైన నిరకర ఓట్ల సంఖ్యల వివరాలు లేవు. సగటు పోలింగ్ శాతం కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లేవు. గుండుగుత్తగా ఉన్నాయి.
పౌరసమాజం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఎట్టకేలకు 25 మే 2024న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలవారీగానూ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగానూ మొదటి ఐదు దశల పోలింగ్‌లో పోలైన ఓట్ల వివరాలు విడుదల చేసింది. మరో మూడు రోజుల తర్వాత ఆరో దఫా పోలింగ్‌కు సంబంధించి కూడా ఇటువంటి వివరాలు వెల్లడిరచింది.
చాలా రోజుల ఆలస్యం తర్వాత తుది పోలింగ్ వివరాలు వెల్లడించింది. మొదటి దఫా పోలింగ్ జరిగిన పన్నెండు రోజులకు గానీ ఆ దఫా పోలింగ్‌లో పోలైన ఓట్ల వివరాలు బహిర్గతం చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధం కాలేదు. మిగిలిన దఫాల్లో జరిగిన పోలింగ్ వివరాలు వెల్లడించేందుకు మూడు నుండి ఐదు రోజుల వ్యవధి సరిపోయింది.
రెండో దఫా పోలింగ్ విషయానికొస్తే పోలింగ్ ముగిసే సమయానికి దేశవ్యాప్త సగటు ప్రాధమిక పోలింగ్ శాతాన్ని మాత్రమే విడుదల చేసింది. సగటు పోలింగ్ శాతం రాష్ట్రాలవారీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కూడా ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్ధం కాలేదు. అందువలన రెండో దఫ పోలింగ్‌లో ఉన్న లోపాలను, వ్యత్యాసాలను పరిశీలించటం అసాధ్యమైంది. ఈ దశకు సంబంధించిన తుది అంచనాలే ఉన్నాయి తప్ప ప్రాధమిక అంచనాల వివరాలు లేవు. దాంతో పోలికే చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒకటి తర్వాత మరోటి సమస్యలు సందేహాలు పోగుపడుతూనే ఉన్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఆరు దశల పోలింగ్ వివరాలను 2024 మే 28 తేదీన విడుదల చేసింది. ఏడో దఫా పోలింగ్ కు సంబంధించిన వివరాలు జూన్ ఆరోతేదీకి గానీ వెలుగు చూడలేదు. ఈ లోగా మొత్తం ఎన్నికల క్రమం పూర్తయ్యింది. ఫలితాల ప్రకటన కూడా వెలువడిరది.
ఇన్నిరోజుల ఆలస్యంగా వెల్లడిరచినా 542 నియోజకవర్గాలకు గాను, 538 నియోజకవర్గాల్లో ఈవిఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య పొంతన కుదర్చలేకపోయింది ఎన్నికల సంఘం. సూరత్ లో పోలింగే జరగలేదు.
గతంలో ఓ కేసు సందర్భంగా ఫారం 17 సిలో ఉన్న వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న నిబంధనలేవీ లేవని ఎన్నికల సంఘం వాదించింది. ప్రతి పోలింగ్ బూత్‌లో పోలైన ఓట్ల తుది వివరాలు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల వద్ద ఉంటాయని భావించబడిరది. అది నిజమే అయి ఉండొచ్చు. కానీ ఈ వివరాలు ఎన్నికల సంఘం వద్ద క్రోడీకరించబడతాయి. అటువంటి క్రోడీకరించబడ్డ వివరాలను ప్రజలతో పంచుకోవడానికి ఎన్నికల సంఘం సిద్ధం కాకపోవటమే ఆశ్చర్యానికీ, ఆందోళనకూ కారణం అవుతోంది.
అటు రాజకీయ పార్టీతో సంబంధం లేని పౌరుడు కానీ, అభ్యర్ధి కాని పౌరుడు కానీ ఈ వివరాలు తెలుసుకోవాలంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?
అటువంటి సాధారణ స్వతంత్ర పౌరులకు తెలుసుకునే అధికారం హక్కు లేవా?
ప్రజలకు వార్తలు వాస్తవాలు తెలియచేయాల్సిన మీడియాకు ఇటువంటి సమాచారం తెలుకునే హక్కు లేదా?
మన ఎన్నికలు కేవలం ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలకూ సంబంధించిన వ్యవహారమేనా?
మొత్తం ఎన్నికల క్రమంలో ప్రధాన పాత్రధారి ఎవరు? ఎవరికోసం ఈ ఎన్నికలు?
ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్రధారి సాధారణ పౌరుడు కాదా?
ఈ దేశంలో ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా అంతిమంగా జవాబుదారీగా ఉండాల్సింది ప్రజలకే కదా?
ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగానూ, పారదర్శకంగానూ వ్యవహరించాల్సిన పని లేదా?
17 సి ఫారంలో ఉన్న వివరాలు వెల్లడిరచేందుకు ఎన్నికల సంఘం ఎందుకు జంకుతోంది? ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎన్ని ఓట్లు లెక్కకు వచ్చాయి అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా?
సమాచార కమిషనర్లను గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆరాటపడుతోంది?
‘ఎన్నికల సంఘంతో సంప్రదించి’ కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు సవరించేందుకు తాపత్రపడటంలో మతలబు ఏమిటి?
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక ప్రమాణాలు పాటించే వ్యవస్థలను కలిగి ఉండటం పౌరుల హక్కు. ఎన్నిల క్రమం పారదర్శకత, సమగ్రతల పరిరక్షణలో ఈ ప్రాధమికత అనివార్యమైన అవసరం. తిరుగులేని విషయం. దీనికి భిన్నంగా జరిగే ఏ చర్య అయినా పారదర్శకమైన ఎన్నికల క్రమానికి తూట్లు పొడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది.
పరకాల ప్రభాకర్ రాజకీయ ఆర్థికవేత్త. అష్టవంకర్ల నవభారతం పుస్తక రచయిత
ఎంజి దేవసహాయం మాజీ ఐఎఎస్ అధికారి. సిటిజెన్స్ కమిషన్ ఫర్ ఎలక్షన్స్ కన్వీనర్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.