
అమెరికా విద్యా శాఖను రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా విద్యా వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నది విద్యాశాఖ. ఆ శాఖ రూపొందించిన పాఠ్య ప్రణాళికల కారణంగా ఉదారవాద భావాలు పెరిగిపోతున్నాయని గత రెండు దశాబ్దాలుగా అమెరికాలోని మితవాద మేధో బృందాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దేశంలో సార్వత్రిక విలువలు పెంచి పోషించడం వల్ల దేశానికి నష్టం కలుగుతుందని వారి వాదన. భారత దేశంలో కూడా విద్యావ్యవస్థలో విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన సిలబస్ కారణంగా దేశంలో ప్రశ్నించే మనస్తత్వం పెరిగిపోతోంది కాబట్టి ఆ ఆవగాహన పెంచేందుకు తోడ్పడే సిలబస్ ను తొలగించేందుకు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇలానే నడుం కట్టింది.
తన ఎన్నికల ప్రచారంలో కూడా విద్యాశాఖ సార్వత్రిక విలువల పేరిట ఉదారవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తోందని దుమ్మెత్తి పోశాడు. అయితే విద్యాశాఖను రద్దు చేయటానికి కేవలం అధ్యక్షుని ఆదేశాలు సరిపోవు. అమెరికా పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంది. విద్యాశాఖ 1979 నాటి చట్టం ద్వారా ఉనికిలోకి వచ్చింది. సహజంగానే రిపబ్లికన్ ప్రతినిధులు విద్య శాఖ రద్దు చట్టాన్ని ప్రతిపాదించేందుకు సిద్ధం అయితే డెమొక్రాట్లు వ్యతిరేకించటానికి సిద్ధం అవుతున్నారు.
అధ్యక్షుడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం. విద్యాశాఖ కార్యదర్శి ప్రస్తుతం విద్యాశాఖలోని విభాగాలు రద్దు చేసి వాటిని పూర్తిగా రాష్ట్రాలు స్థానిక కమ్యూనిటీలకి అప్పగించి వాటి నిర్వహణా భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలి. అయితే ఎపుడు ఎలా ఈ పని ప్రారంభం అవుతుంది అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దిగువ ఆదాయ వర్గాలు, వికలాంగులు వంటి ప్రత్యేక తరగతులకు చెందిన విద్యార్థుల భారాన్ని మాత్రం ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటుందని మిగిలిన అన్ని రకాల బాధ్యతలు రాష్ట్రాలకు బదలాయిస్తుందని ట్రంప్ ప్రకటించారు.
ప్రస్తుతం అమెరికాలో లక్ష అరవై వేల కోట్ల డాలర్ల మేర విద్యార్థులు ఉన్నత చదువుల కోసం తీసుకున్న రుణాలు ఉన్నాయి. వీటి చెల్లింపులు వాయిదాలు పర్యవేక్షించేందుకు విద్యా శాఖలో తగినంత సిబ్బంది లేరన్నది అధ్యక్ష భవనం వాదన.
ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలో ఈ శాఖ నిర్వహణ ఉండటం వల్లనే విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి అనే రాష్ట ప్రభుత్వాల పర్యవేక్షణ మెరుగైన ప్రమాణాలు సాధించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఈ శాఖ సిబ్బందిని సగానికి పైగా తగ్గించారు. దేశంలో విద్యా ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పర్యవేక్షించే పౌర హక్కుల విభాగం, శాస్త్ర విజ్ఞానాల విభాగాలకు కేటాయించే నిధులు కూడా క్రమేణా కోత పడుతున్నాయి.
ఇక మీద రాష్ట్ర ప్రభుత్వాలే తమకు విద్యారంగంలో ఏది మంచిదో నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పిస్తామని అనుమతుల జారీలో జరుగుతున్న ఆలస్యానికి స్వస్తి పలుకుతామని విద్యా శాఖ కార్యదర్శి లిండా మెక్ మహాన్ తెలిపారు. ఈ విద్యా శాఖ నిర్వహణ భారాన్ని ఏ విభాగాలకి అప్పగించటానికి అవకాశం ఉందో పరిశీలిస్తున్నామని కూడా తెలిపారు.
న్యాయ శాఖ ఆధ్వర్యంలో కూడా పౌర హక్కుల విభాగం పని చేస్తోంది. అందువలన విద్యా శాఖ నిర్వహించే ఈ పనులను కొన్నింటిని న్యాయ శాఖకు బదిలీ చేసే అవకాశాలు చర్చిస్తున్నామన్నారు
ఇప్పటికే విద్య ప్రమాణాల బదులు వామపక్ష భావజాలాన్ని ఎక్కించడానికి ప్రజలపై పన్నులు వేసి సంపాదించిన కోట్ల డాలర్లు వృధా అయ్యాయన్నది ట్రంప్ ప్రభుత్వం ముందుకు తెస్తున్న మరో వాదన. తాజా నిర్ణయం వల్ల పేదలకు ఉన్నత విద్య మరింత దూరం అవుతుందన్నది పౌర మేధావుల వాదన. ఈ నిర్ణయం ద్వారా చివరికి ట్రంప్ కు ఓటు వేసిన కోట్లాది కుటుంబాల్లోని విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతారని, ఉన్న విద్యా రంగంలో పెరుగుతున్న ఫీజుల భారం మోయలేక విద్యా రుణాలు అందుబాటులో లేక ఎంతోమంది ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న డెర్రిక్ జాన్సన్ అంటున్నారు. డెమోక్రసీ ఫార్వర్డ్ లాంటి పౌరహక్కుల సంస్థలు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి సిద్ధం అవుతున్నాయి.సెనేట్ లో మైనారిటీ నాయకుడు చుక్ స్కుమార్ ఇప్పటి వరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ఇది అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయం అమెరికాలో విద్యా రంగాన్ని సంస్కరించటానికి దారితీస్తుందన్న వాదన పై జార్జ్ బుష్ హయాంలో విద్యా శాఖ కార్యదర్శిగా పని చేసిన మార్గరెట్ స్పెల్లింగ్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల విద్య రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే నడుస్తోందని దీంతో ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రాలకు అదనంగా అధికారాలు వ్యాక్సిడమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం విద్యార్థులకు ఇచ్చే రుణాలు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు ఇచ్చే ఆర్థిక సహాయం, అనాథ విద్యార్థులు ఇతరులకు అందించే మధ్యాహ్న భోజన పథకంతో పాటు విద్యారంగంలో పౌర హక్కులను పర్యవేక్షించడం విద్యా శాఖ ప్రధాన బాధ్యతలుగా ఉన్నాయి. అదనంగా గ్రామీణ పాఠశాలలు, సాంకేతిక విద్య, వయోజన విద్య,, పాఠశాల విద్యానంతర శిక్షణ ( మన దేశంలో అమలు జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లాంటివి) వాటికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చడం విద్యా శాఖ బాధ్యతగా ఉంది.
ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పాఠశాలలు, బోధనాంశాల రూపకల్పన వంటి విషయాలు రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. అయితే వివిధ రూపాల్లో వీటికి అందించే నిధులను నియంత్రించాలని కోత కోయాలని ఆర్థికమితవాదులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న బడ్జెట్ కేవలం 14 శాతం మాత్రమే. ఇపుడు దీన్ని కూడా నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.