
వాస్తవానికి అనుగుణంగా జీవితాన్ని మల్చుకోవడానికి పెద్దోళ్లు ఎన్నో సామెతలు చెప్పేవారు. అటువంటి కొన్ని సామెతలు ఈ మధ్య గుర్తుకొచ్చాయి. మనం చదువుకున్న దాంట్లోనుండైనా, నేర్చుకున్నదాంట్లోనుండైనా, జీవితానుభవం నుండైనా ఏదోఒకటి గుర్తుకు రావడానికి ఓ తక్షణ కారణం ఉంటుంది. జ్ఞాపకాల డబ్బా తెరిచేందుకు తాళం ఉంటుంది. ఆ మధ్య భారత ఆర్థిక మంత్రి ఇచ్చిన ప్రకటన చిన్నప్పుడు విన్న సామెతలను గుర్తు చేస్తోంది.చాలా సామెతలు గుర్తు చేసుకున్నాను కానీ ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికెక్కుతాడా ? అన్న సామెత తాజా సందర్భానికి నప్పుతుందనుకుంటున్నాను.
వైబ్రంట్ గుజరాత్ సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆ సదస్సులో పాల్గొన్న పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. దీనికి గాను ప్రజలూ, ప్రభుత్వం అందరూ కలిసి దేశమంతా వలసవాద మనస్తత్వంతో నిండి ఉందనీ, అందువలన 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మల్చాలంటే ముందు దేశాన్ని వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి చేయాలని ఆర్థిక మంత్రి పిలుపునిచ్చారు. అంతకు ముందు కూడా 2019 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ 2024 నాటికి దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయనున్నామని దానికోసమే జిఎస్టి అమలు మొదలు నూతన కార్మిక చట్టాల ఆమోదం వరకూ పలు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. 2023 ఆగస్టు 8న పార్లమెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ ఛడ్డా ‘దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి’ అంటూ వేసిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కూడా అంశాలను ప్రస్తావించారు. కానీ 2025 వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అందుకోవాలంటే 2028 వరకూ ఆగాలని చెప్పారు. అయితే 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయి నుంచి ఏకంగా 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరటానికి కొన్ని మధ్యంతర దశలను కూడా ప్రభుత్వం ఆలోచించినట్లుగా మీడియాలో వస్తున్న వివరాలను బట్టి అర్థమవుతుంది. అటువంటి మధ్యంతర దశ 2035. ఆ సంవత్సరం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని, ఆ తర్వాత కేవలం తొమ్మిదేళ్ల కాలంలో మరో 20 లక్షల కోట్ల డాలర్ల విలువను జోడిస్తుందన్న అంచనాలో ప్రభుత్వం, ప్రభుత్వ వత్తాసుతో పని చేస్తున్న ఆర్థికవేత్తలు ఉన్నారు.
దీనికంటే ముందు 2019లో భారతదేశాన్ని 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మల్చేందుకు ప్రధాని మాస్టర్ ప్లాన్ అంటూ ఓ 32 పేజీల పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఆ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ఏయే చర్యలు చేపడుతున్నారో కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు.అభివృద్ధికి యువతే పునాది, పేదరికం పట్ల మోజెందుకు? ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ పునాదులు, ఎగుమతి కోసం వ్యవసాయోత్పత్తులు, ఆహార సరఫరా నుంచి ఇంధన సరఫరాకు, నూతన ఆర్థిక వ్యవస్థకు పునాదిగా సాంకేతిక పరిజ్ఞానం, జలవనరుల సంరక్షణ ద్వారా మెరుగైన రేపటి కోసం వంటి నినాదాలతో నిండిపోయింది.
నిజానికి ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి కావల్సిన ప్రణాళికలు, పెట్టుబడులు, మానవ వనరులు, దాంతో వచ్చే ఉపాధి అవకాశాలు, ప్రస్తుత ఆర్థికవ్యవస్థలో ఉన్న వ్యవస్థాగత సమస్యలు, సంస్థాగత సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు వంటివాటి గురించి చర్చ కనిపించదు. దీనికి ఉదాహరణగా మరో సందర్భాన్ని కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. యుపిఎ-1 హయాంలో కొల్కతా నుంచి ముంబయి వరకూ గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికసంఘం ఓ విస్తృతమైన అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ అధ్యయనాన్ని ఓ వెయ్యి పేజీల గ్రంథంగా ప్రచురించారు. వందల పేజీల్లో వివిధ రకాలైన సాపేక్ష అంచనాలతో నిండి ఉన్నాయి. ఐదులక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దటానికి అటువంటి అధ్యయనాలు, అంచనాలు రూపొందించిన దాఖలాలేమీ కనిపించవు. నీతి ఆయోగ్ రూపొందించే నివేదికలన్నీ డిగ్రీ విద్యార్ధులు రాసే ప్రాజెక్టు నివేదికల స్థాయిని మించి ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో 2047 నాటికి దేశాన్ని 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయటానికి కావల్సిన రోడ్ మ్యాప్ కానీ, విధి విధానాలు కానీ ప్రకటించకుండానే లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
ఇక్కడే కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన అంకెల గారడీ కనిపిస్తోంది. ఫిబ్రవరి 2025లో కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు అంచనాలను జారీ చేసింది. ఈ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 9.2 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించిందని నిర్ధారించారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు, కేంద్ర ప్రభుత్వ నిర్ధారణలకు మధ్య పొంతన లేకపోవటంతో ఈ నిర్ధారణలు భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల గురించి పలు ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి.
ఆర్థికాభివృద్ధిరేటు వాస్తవికతకూ 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారతం అనే నినాదానికి మధ్య పొంత ఉంది కాబట్టే ప్రభుత్వం జారీ చేసిన అంకెలను మరింత లోతుగా తరచి చూడాల్సి వస్తోంది.
ప్రభుత్వం గత సంవత్సరం మేలో జారి చేసిన వివరాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 160 ట్రిలియన్ రూపాయలకు స్థూల జాతీయోత్పత్తి చేరిందని అంచనా. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ఇది 173.81 ట్రిలియన్ రూపాయలకు చేరింది. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేసిన సవరించిన తొలి అంచనాల్లో ఈ విలువ 176.51 ట్రిలియన్ రూపాయలకు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు దాదాపు జిడిపిలో ఒక శాతం మేర తగ్గిపోయాయని ఇదే ప్రభుత్వ గణాంక శాఖ ప్రకటించింది. ఎగుమతులు తగ్గటం అంటే ఉత్పత్తి తగ్గటం, ఉత్పత్తి తగ్గటం అంటే వస్పూత్తిరంగం ఉత్పత్తి సామర్ధ్యం పూర్తిగా వినియోగంలోకి రాకపోవటం. మరి అటువంటప్పుడు సవరించిన అంచనాల్లో స్థూల జాతీయోత్పత్తి 8.2 శాతం నుంచి 9.2 శాతానికి ఎలా పెరిగిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. రాజు గారి వస్త్రం కథే. రాజుగారు బట్టలు వేసుకున్నారా లేదా అన్నది ఓ పిల్లవాడు చెప్పేంతవరకూ దేశం చప్పట్లు కొడుతూనే ఉంటుంది.
ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవడానికి అమ్మకాలు, కొనుగోళ్లు, వాటిపై పన్నురూపంలో వచ్చే ఆదాయాలతో పాటు అమ్ముడుపోకుండా పేరుకుపోతున్న సరుకుల విలువ కూడా కీలకమైన అంశం. ఉరువు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాథమిక అంచనాల ప్రకారం 1.92 లక్షల కోట్ల రూపాయల విలువైన సరుకులు పేరుకు పోయాయి. జనం దగ్గర కొనుగోలు శక్తి పడిపోవడంతో అమ్ముడు పోవడం లేదు. కానీ సవరించిన అంచనాల ప్రకారం ఈ నిల్వలు ఏకాఎకిన 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఇంత స్థాయిలో నిల్వలు పేరుకుని, ఎగుమతులు పడిపోతున్న తరుణంలో ట్రంప్ విధించే ఆంక్షలు దేశ ఆర్ధిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపనున్నాయి.
మొదట్లో చెప్పుకున్నట్లు దేశం 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ప్రస్తుతం మన జాతీయ సంపద విలువ ఎంతో చూడాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలోని ప్రస్తుత సంపద విలువ 3.79 లక్షల కోట్ల డాలర్లుతో సమానం. భారతీయ కరెన్సీలో 331 లక్షల కోట్ల రూపాయలు. 2019లో పెట్టుకున్న లక్ష్యం 2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయామన్న వాస్తవాన్ని ఈ లెక్కలు రుజువు చేస్తున్నాయి. అంటే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు జోడించిన సంపద కేవలం లక్ష కోట్ల డాలర్లే. ఈ వేగంతో ఆర్థిక వ్యవస్థ పరిగెడితే 2040 నాటికి మహా అయితే పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలుగుతుంది. అంటే మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా పెట్టుకున్న లక్ష్యంలో మూడోవంతు మాత్రమే సాధిస్తాము. ఐదేళ్లలో కేవలం ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల విలువను మాత్రమే జోడిస్తే మిగిలిన 20 ఏళ్లల్లో కూడా నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల డాలర్ల విలువను మాత్రమే జోడించగలము. అటువంటి పరిస్థితుల్లో 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగటం ఎలా సాధ్యమనే ప్రశ్నకు అర్థవంతమైన సమాధానమివ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు
కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.