
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ప్రతి భారతీయ పౌరుడి చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధంగా భావించాలి. పారదర్శకంగా ప్రభుత్వం పనిచేసేలా ఈ చట్టం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పనులు ఎంత వరకూ జరుగుతున్నాయని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఏ పని ఎంత వరకు వచ్చిందనే తదితర విషయాలను తెలుసుకునే హక్కు ఈ చట్టంతో ప్రజలకు దక్కింది. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే ఈ చట్టం ద్వారా ప్రశ్నించొచ్చు.
అయితే, ఈ చట్టం ఉన్నా కానీ కావాల్సిన సమాచారం అందే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు. ప్రభుత్వం సమాచారం ఇవ్వకుంటే ప్రజలు ఆశ్రయించాల్సిన సమాచార కమిషన్లు ఇప్పుడు నిర్వీర్యం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార కమిషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సమాచార హక్కు చట్టం అసలు ఉద్దేశ్యాన్నే అపహాస్యం చేస్తున్నాయి. ఈ మాటలన్నీ మనం చెప్పడమే కాదు న్యాయస్థానాలు కూడా ఇదేం తీరని మొత్తుకుంటున్నాయి.
సమాచార హక్కు చట్టం ఆమోదం పొంది రెండు దశాబ్దాలు అవుతోంది. 2005లో ఈ చట్టానికి రూపునిచ్చిన ప్రభుత్వాలు అప్పటి నుంచే కొన్ని సవరణలకు ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. చట్టం ప్రభావాన్ని తగ్గించడానికి సవరణలు చేయడం, సమాచారాన్ని ఆలస్యం చేయడం లేదా తిరస్కరించడం ద్వారా చట్టాన్ని కొద్ది కొద్దిగా నీరుగారుస్తున్నాయి.
అసలు సమస్య ఏంటి?
సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు అయ్యేందుకు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లను ఏర్పాటు చేసింది. నిర్థేశించిన కమిషన్లలో ఖాళీలు ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్న ఏకంగా కమిషనర్ల నియామకమే జరగక పోవడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. సమాచార కమిషనర్ల నియామకాలను ప్రభుత్వాలు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర, కొన్ని రాష్ట్ర సమాచార కమిషన్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండడంతో సుప్రీంకోర్టు ప్రభత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.
కమిషన్లు సమాచార హక్కు చట్టం అమలులో కీలకంగా వ్యవహరిస్తాయి. అలాంటి కమిషన్లకే కమిషనర్లు కరువైతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వ అధికారులు తాము అడిగిన సమాచారం ఇవ్వని పక్షంలో ప్రజలు సమాచార కమిషన్‌లో అప్పీల్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఆప్పీళ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దానికి కారణం సమాచార కమిషన్లలో సిబ్బంది కొరత, కొన్ని చోట్ల కమిషనర్‌తో పాటు అసలు సిబ్బందే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కేంద్ర సమాచార కమిషన్ CICలోనే ఎనిమిది సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ గుర్తించింది. అంతేకాకుండా 23,000 అప్పీళ్లు దాని ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి సభ్యుల కొరత కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్లు దాదాపుగా పనిచేయడం లేదు. చట్టం ప్రకారం అవసరమైన విధులను నిర్వర్తించడానికి వ్యక్తులు లేకపోతే, ఒక సంస్థ ఎలా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించింది. CICలోని ఎనిమిది మంది సమాచార కమిషనర్ల నియామకాలను రెండు వారాల్లోగా పూర్తి చేయడానికి ఏమి చేస్తారో చెప్పాలని సంబంధిత ప్రభుత్వ శాఖను ఆదేశించినా ఫలితం కనిపించలేదు.
సెర్చ్ కమిటీ ,పోస్టుల కోసం దరఖాస్తుదారుల జాబితా గురించిన వివరాలు ఇవ్వాలని కోర్ట్ కోరింది. అదేవిధంగా, నియామక ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్రాలు కూడా ఎటువంటి ఖచ్చితమైన గడువు లేకుండానే ఈ ప్రక్రియను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. 2019లో కోర్టుఖాళీలను భర్తీ చేయమని చెప్పినా ప్రభుత్వాలు చేతులెత్తేసి, తప్పించుకునే కారణాలను వెతుకుతూనే ఉన్నాయి. 2024 నవంబర్లోనూ ఈ విషయంపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌తో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వాలు 2019 కోర్టు తీర్పును పాటించలేదు, ఆ తీర్పు ప్రకారం ఖాళీలను ముందస్తుగా ప్రకటించాలి. దీంతో సకాలంలో ఖాళీలను భర్తీ చేయడానికి చురుకైన ప్రయత్నాలు చేయాలని మరోమారు సూచించింది. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం కేంద్రంలో ఇంకా ప్రతి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతంలోను 10 మంది సమాచార కమిషనర్లను నియమించడానికి వీలుంది. దాని ప్రకారం ఇప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిషనర్లతో పాటు సిబ్బంది నియామకాల పరిస్థితి స్పష్టంగా తెలియజేయాలని కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోర్టు ఆదేశించింది. ఖాళీలను భర్తీ చేయడానికి గడువులను నివేదించాలని కూడా పేర్కొంది.
”మీరు నియామక ప్రక్రియను ప్రారంభించినట్లయితే, మాకు స్పష్టమైన గడువులను ఇవ్వండి. లేకపోతే, వెంటనే ప్రక్రియను ప్రారంభించండి.” అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర సమాచార కమిషన్‌లో నియామకాల పురోగతిపై స్టేటస్ నివేదికను దాఖలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ల తరుఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార కమిషన్లను అనవసరంగా మార్చాయని ఆరోపించారు. ఈ మార్పుతో ఆర్టీఐ చట్టం ద్వారా సాధించాలనుకున్న పారదర్శకత, జవాబుదారీతనం అనే ఉన్నత లక్ష్యాన్ని ఎలా నీరుగారుస్తున్నాయో వివరించారు.
ఖాళీలను స్తంభింపజేయడంతో ప్రభుత్వాలు ఆర్టీఐని వాస్తవంగా నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఖాళీలను భర్తీ చేయడానికి కోర్టులు “కొరడా దెబ్బ కొట్టాల్సిన” అవసరాన్ని ఫిబ్రవరి 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎత్తి చూపిందన్నారు. అటు కేంద్ర సమాచార కమిషన్‌లో చీఫ్‌తో సహా ముగ్గురు కమిషనర్ల మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం సమాచార నిరాకరణకు వ్యతిరేకంగా ప్రజలు దాఖలు చేసిన 22,000 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని భూషణ్ కోర్టుకు తెలిపారు. 2024 నవంబర్‌లో సుప్రీం డివిజన్ బెంచ్ ఆదేశాల తరువాత కూడా సమాచార కమిషనర్ల నియామకంలో చలనం కన్పించడం లేదు. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వ అలసత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రాలలో సమాచార కమిషన్ల పరిస్థితి ఏంటి?
జార్ఖండ్, తెలంగాణ, త్రిపుర ఈ మూడు రాష్ట్రాలలో సమాచార కమిషన్‌కు ఒక్క సమాచార కమిషనర్ కూడా లేకపోవడంతో అవి పనిచేయడంలేదు. మిగిలిన రాష్ట్రాలలో కూడా సమాచార కమిషనర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. తెలంగాణ అంశంలో హైకోర్టులో పలుమార్లు విచారణ కొనసాగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం 2023లో విచారణ జరిపింది. చీఫ్ కమిషనర్‌తో పాటు మిగిలిన సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని, సమాచార కమిషనర్ల ఎంపిక కోసం గడువు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ సర్కార్ కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ ధర్మాసనం వాయిదా వేసింది. ఆ తరువాత ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా పరిస్థితి అలాగే ఉంది.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మరోమారు సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్ట్ తలుపు తట్టింది. కోర్టు ఉత్తర్వులతో రేవంత్ ప్రభుత్వం కూడా 2024 జూన్‌లో ప్రధాన కమిషనర్‌తో పాటు 10 మంది కమిషనర్ల నియామకం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 700 ధరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిలో అర్హులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఆ పేర్లు గవర్నర్‌కు పంపాలి. కానీ ఆ ప్రక్రియ కూడా జాప్యం అవుతోంది. ఇప్పటికే 17 వేల అప్పీళ్ల వరకు తెలంగాణ సమచార కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. మరి కమిషనర్ల నియామకం ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు అప్పీళ్లకు మోక్షం దక్కుతుందో చూడాలి. రాజకీయ కారణాలతోనూ సమాచార కమిషనర్ల నియామకం సాధ్యం కావడంలేదు. పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది.
ఏపీలోనూ ఖాళీనే..
ఆంధ్రప్రదేశ్‌లో సమాచార కమిషన్ పూర్తిగా ఖాళీగా లేకున్నా, కమిషన్ పనితీరు విమర్శల పాలవుతోంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ల నియామకం జరగదు. గడచిన ఏడాది చీఫ్ కమిషనర్‌తో పాటు ముగ్గురిని నియమించింది. ఇంకో ఆరు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న నలుగురు కూడా ఎక్కువ కేసులను పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిది వేల వరకు పెండింగ్ కేసులు విచారణకు నోచుకోవడంలేదని చెబుతున్నారు. నెలకు విచారించే కేసుల సంఖ్య కూడా అతి తక్కువగా ఉంటోంది. కమిషన్‌లో నియామకాలు పూర్తి స్థాయిలో జరగక పోవడమే దీనికి కారణమంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేత కూడా లేకపోవడంతో ఇప్పట్లో సమాచార కమిషనర్ల నియామకం కూడా కష్టమే అంటున్నారు.
సవరణలతో నష్టం ఎంత?
ప్రభుత్వ పారదర్శక పాలనను తెలియపరచడానికి అన్నాహజారే వంటి సామాజికవేత్తల పోరాట ఫలితంగా 2005లో ఆర్టీఐ మనుగడలోకి వచ్చింది. కానీ చట్టం ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చట్టం అమలైన ఏడాదికే కేంద్రం దీనిలో మార్పులకు సంకల్పించింది. ప్రభుత్వ అధికారుల ఫైల్ నోటును చట్టం పరిధి నుంచి మినహాయిస్తు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యను అప్పట్లో అన్నాహజారే తీవ్రంగా వ్యతిరేకించి, నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీంతో ప్రభుత్వం తమ ప్రతిపాదనను విరమించుకుంది. ఆ తరువాత కోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు ఆర్టీఐ నుంచి తప్పించుకున్నాయి.
సమాచార హక్కు చట్టం ద్వారా తగిన సమాచారం పొందడం ప్రజల హక్కుగా మారింది. అయితే పొందిన సమాచారాన్ని కొందరు, కొన్ని సంస్దలు దుర్వినియోగం చేస్తున్నాయనే భావన కూడా ప్రభుత్వాలలో వచ్చింది. దీంతో సమాచార హక్కు చట్టం అనుబంధ సంస్థలపై పట్టు కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే సమాచార కమిషన్ కమిషనర్ల నియామకం ప్రక్రియపై ప్రభావం పడుతోంది.
2019లో సమాచార హక్కు చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ, సమాచార కమిషనర్ల స్వయం ప్రతిపత్తి మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. సమాచార కమిషనర్ల పదవి కాలాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మార్చింది. అంతేకాకుండా పదవి కాల నిర్ణయాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. దీంతో పాటు జీతభత్యాలు మార్పులు చేసింది. ఐదేళ్ల పదవీకాలాన్ని తొలగించి దానిని ఓపెన్- ఎండ్‌గా మార్చినప్పుడు సీఐసీ పదవికి దాని స్వయం ప్రతిపత్తి పోయింది. ప్రభుత్వం నుంచి సమాచారం రానప్పుడు ప్రజలు సమాచార కమిషన్‌లో ఫిర్యాదు చేస్తారు. కాబట్టి, దీనిని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారనే అనుమానం అందరిలో పెరిగిపోతోంది.
సమాచార హక్కు చట్టం దుర్వినియోగం అవుతోందా?
ఆర్టీఐ చట్టం ప్రభుత్వ పారదర్శకతను బయటపెట్టడానికి ఎంత ఉపయోగంగా ఉందో, అంతే స్థాయిలో దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచాలని సూచించింది.
కొంతమంది లెటర్ హెడ్లను ‘ఆర్టీఐ కన్సల్టెంట్’అని పెట్టుకునే వారు ఉన్నారు. వారు తమను తాము ‘ఆర్టీఐ యాక్టివిస్ట్‌లు’ అని పిలుచుకుంటారు. అది ఒక వృత్తినా? ఆర్టీఐ అభ్యర్థనల వెనుక ఏం జరుగుతోందని ఆలోచించాల్సివస్తోందని కోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ చట్టం దుర్వినియోగాన్ని ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనాలనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది.
సమాచార హక్కు సాటిలేని హక్కు కాదని, లేవనెత్తిన అంశాలతో సంబంధం లేని వారు దానిని దుర్వినియోగం, నేరపూరిత బెదిరింపు చేయడానికి వినియోగిస్తున్నారని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఒక సమస్యతో సంబంధం లేని వ్యక్తులు ఆర్టీఐ దాఖలు చేస్తారు. కొందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొన్ని సంఘటనలలో ప్రభుత్వ పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఏ పని చేయాలన్నా ఆలోచిస్తున్నారు. మొత్తానికి సమాచార హక్కు చట్టం దుర్వినియోగం కాకుండా దానిని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే చట్టాన్ని నీరుగార్చాలని చూడటం కూడా మంచిది కాదు.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.