
కొన్నిరోజుల క్రితం నేను రూ.1044 పెట్టి అమెజాన్‌లో ఒక వస్తువు కొన్నాను. ఆ బిల్లులో అసలు ధర రూ.883, జీఎస్టీ టాక్స్ రూ.161 అని ఉంది. అంటే నా కష్టార్జితం 15% మించి టాక్స్ రూపంలో ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాను. జీఎస్టీ కాబట్టి అది నేరుగా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్తుంది. నా డబ్బు రూ.161 నుంచి నేను బతుకుతున్న రాష్ట్రానికి వాళ్ళు కేవలం రూ.50 ఇచ్చి రూ.111 నొక్కేస్తున్నారు. అది అధిక జనాభా, పేదరికం పేరుతో ఏ బీహార్‌కో, యూపీకో పోతుంది. మన రాష్ట్రంలో పేదలు లేరాని నాకు సందేహం.
ప్రజల అవసరార్థం వారికి సదుపాయాలు కల్పించే నిమిత్తం ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తాయి. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఇక్కడి ప్రభుత్వం అందించే అభివృద్ది, సౌకర్యాలు(అరకొర అయినప్పటికీ) అనుభవిస్తూ ఇక్కడ నా అవసరాలు తీర్చే నా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వస్తువు ద్వారా రూ. 50 నేను చెల్లించేది. కానీ నాకు ఏ సంబంధమూ లేని, అసలు జీవితంలో ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లే అవసరమే లేని ఉత్తరాది రాష్ట్రాలకు రూ.111 నేను ఇస్తున్నాను. ఎంత అన్యాయం!!
మనం నిత్యం ఎన్నో వస్తువులు కొంటాం. అయితే, జీఎస్టీ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను నిలువునా దోచేస్తున్నారు. ఉత్తరాది ప్రజల్ని పోషించే దౌర్భాగ్యపు స్థితి నుంచి బయటపడి మనం కట్టే పన్నుల సొమ్ము మనమే ఉపయోగించుకుంటే అది మన రాష్ట్రంలోని పేదల సంక్షేమానికీ, అభివృద్ధికీ దోహదపడటమే కాదు, పన్నుల భారం తగ్గి తద్వారా వస్తువుల తక్కువ ధరలు తగ్గి మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
పెనం నుంచి పొయ్యిలోకి..
వివక్షతో, జీఎస్టీ పేరుతో బీజేపీ దక్షిణ భారత దేశాన్ని ఇప్పటికే పెనం మీద వేసి కిందా మీదా వేయించుతుంది. అయినా నోరు మూసుకుని భరిస్తున్నారని కాబోలు ఇప్పుడు ఆ పెనాన్ని కూడా లాగి డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్విభజన) పేరుతో డైరెక్ట్‌గా పొయ్యిలోకి తోసే ప్రయత్నం చేస్తోంది. దక్షిణ రాష్ట్రాలు అన్నీ ఏకమై ఒకే మాట మీద ఈ దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయకపోతే దక్షిణాది ప్రజలకు భవిష్యత్తే ఉండదు. ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రశ్నించే అవకాశమే లేక ఆ నియంతృత్వానికి లొంగిపోయి బానిసలుగా బతకడం తప్ప గత్యంతరం ఉండదు.
ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలు ఇంతటి విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి సమయంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్టాలు ఏకమై బీజేపీ దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తున్నాయి. కానీ బాధ్యత లేకుండా ఏపీ ప్రభుత్వం మాత్రం బీజేపీ అరాచకానికి వంత పాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని హారతి పళ్లెంలో పెట్టి మరీ బీజేపీ చేతికి అందించి భజన చేస్తుంది.
ఒకే తాటిపై నిలబడ్డ కాంగ్రెస్ సీఎంలు..
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తమది జాతీయ పార్టీ కాబట్టి డీలిమిటేషన్, నూతన విద్యావిధానాలను వ్యతిరేకిస్తే ఉత్తరాది ఓట్లకు గండిపడే అవకాశముందనే భయం కేంద్రంలోని ఆ పార్టీకి ఉండొచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణాది ప్రజల భవిష్యత్తే ముఖ్యమని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టిగానే నిలబడ్డారు. ‘మాకు హిందీ అవసరం లేదు. మాకు మా తెలుగే ముఖ్యం’అని జాతీయ మీడియాకు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ను మెచ్చుకోకుండా ఉండలేము.
హిందీ కుట్రలకు ఏపీలో రెడ్ కార్పెట్..
కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురూ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ డీలిమిటేషన్, హిందీ కుట్రలకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తన, తన కొడుకు, తన మీడియా, తన బంధువర్గాల అవసరాల కోసం ఏపీలోని కోట్లాది ప్రజల ఆత్మగౌరవాన్నీ, భవిష్యత్తునూ, తెలుగు భాష, సంస్కృతులను బీజేపీ కాళ్ళ ముందు పడేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారు? ఇక పీకేని విమర్శించాలంటే ఇప్పుడున్న తెలుగు పదాలు సరిపోవు, కొత్తవి కనిపెట్టాలి. ద్రావిడ ప్రజలకు ఈ ముగ్గురూ చేస్తున్న ద్రోహానికి, వీళ్ళను తిట్టడానికి ప్రజలకు మూడు భాషలు కూడా సరిపోవని కాబోలు పది భాషలు తెస్తారట.
హిందీ వద్దంటేనే, బీజేపీని ప్రశ్నిస్తేనే దేశ ద్రోహులు అయిపోతున్నారే. మరి ద్రావిడుల ఆత్మగౌరవం కోసం, ఉనికి కోసం చేసే పోరాటంలో దక్షిణాది ఐక్యతకే భంగం కలిగిస్తూ, ఛిన్నాభిన్నం చేస్తూ దక్షిణాది ప్రజలందరికీ సామూహిక వెన్నుపోటు పొడుస్తున్న ఈ ముగ్గురిని ఏమనాలి? ఒకవేళ దక్షిణ దేశ ద్రోహులు అంటే అది చాలా చిన్న మాటే అవుతుంది.
జగన్ మౌనం ఎందుకు?
ఇక ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ విషయానికి వస్తే, గతంలో అన్నిటికంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కారణంగా ఫెడరల్ వ్యవస్థ ధ్వంసంతో రాష్ట్రం మట్టి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అయినా నోరు మెదపకుండా ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నారు? ఇంతటి క్లిష్ట పరిస్థితిలో పార్టీలకు అతీతంగా దక్షిణాది నాయకులంతా ఏకమై అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంటే ఈయన మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూ రాజకీయ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే దానిని ప్రజలు ఎందుకు క్షమించాలి? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అడుగులు వేయాలా వద్దాని ఆలోచిస్తూ కూర్చునే నాయకులని ప్రజలు ఎందుకు గౌరవించాలి?
గత అయిదేళ్లలో ఏపీలో విద్యావైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిని జగన్ సాధించారు. సామాన్య ప్రజల కోసం పని చేసి, ప్రజల్లో గౌరవాన్ని పొందారు. అటువంటి వైఎస్ జగన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చిన అఖిల పక్షసమావేశానికి మద్దతు తెలపకపోతే, పై ముగ్గురిలాగే దక్షిణదేశ ద్రోహుల జాబితాలో చేరక తప్పదు.
అంతేకాకుండా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఏపీని అడ్డం పెట్టుకుని బీజేపీ తన లక్ష్యం వైపు అడుగులు వేసే అవకాశాన్ని జగన్ మరింత సులభతరం చేసినట్టవుతుంది. అదే జరిగితే దక్షిణ భారతీయులు ఎవ్వరూ వైసీపీ అధినేత జగన్‌ను క్షమించరు.
అలాకాకుండా స్టాలిన్‌కు మద్దతుగా నిలబడి, పోరాటంలో భాగమైతే, బీజేపీతో కలిసి నీచ రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర అధికార పార్టీ నాయకుల దుర్మార్గాన్ని ప్రజల అండతో సునాయాసంగా ఎదురుకోవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనమే కాదు దక్షిణదేశ ప్రయోజనానికి వైఎస్ జగన్ పాటుపడినవారవుతారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.