
న్యూహావెన్: అమెరికా అధ్యక్షుడికి నైపుణ్యం ఏదైనా ఉందంటే, అది వాగ్ధాటిలోనేని చెప్పాలి. తన గెలుపు కోసం ఓటర్లలో భయాన్ని, దురభిమానాన్ని రగుల్కొల్పుతాడు. తనకు, తన కుటుంబానికి, తన పక్షం వహించే కుబేరులకు ఎవరైనా తీవ్రంగా నష్టం కలిగించేట్టయితే, దాని నుంచి దృష్టి మరల్చడమే కాదు, వాస్తవానికి వారికి తీవ్రమైన కీడు తలపెడతాడు. తన గెలుపు కోసం ఏ మీట నొక్కాలో అతనికి బాగా తెలుసు.
ట్రంప్ ధోరణికి ఆయన విధించే సుంకాలు ఒక ఉదహరణగా చెప్పవచ్చు. వాస్తవ ధరల సమాంతర సిద్ధాంతాలు ఏం చెపుతాయంటే, స్వేచ్ఛా వాణిజ్య ధోరణుల్లో కార్మికులకు చెల్లించే వేతనాల వంటి విషయాలు ఉత్పత్తి కారకాల వ్యయాలుగా అన్ని దేశాల్లో గుర్తిస్తారు. సహజంగా పట్టించుకోని లెక్కలేనన్ని వాస్తవిక ప్రపంచ తేడాలు అమెరికా స్థాయితో పోల్చుకుంటే వియత్నాం, చైనాలో వేతనాలను ఎప్పుడైనా అడ్డుకుంటాయి. ఎదుగూబొదుగూ లేని ఆదాయాలతో అమెరికా కార్మికులు తీవ్ర నిరాశ చెంది ఉండడంతోపాటు, ఏ1 వచ్చి చేసిన ఈ పద్ధతుల వల్ల మరింత భయపడుతున్నారు. కాబట్టి, స్వేచ్ఛావాణిజ్యం వల్ల తమ వేతనాలు పడిపోతున్నాయని, తమ ఉద్యోగాలకు ఇక ఏ మాత్రం భద్రత ఉండదని భావిస్తున్నారు.
సుంకాల మనిషి ప్రవేశించాడు. అమెరికా వాణిజ్య భాగస్వాములపై సుంకాలు విధించడం వల్ల, అమెరికాను ఉపయోగించుకునే అవకాశాలను నిలువరిస్తున్నానని, దీంతో అమెరికా కార్మికులను పరిరక్షిస్తున్నానని ట్రంప్ చెపుతున్నాడు. విదేశాలకు చేసే ఎగుమతుల ద్వారా కాకుండా, అమెరికాకు దిగుమతి చేసుకునే వస్తువులపైన ఆ బిల్లు భారం పడుతోంది. వినియోగదారులతో పాటు, అది దిగుమతి చేసుకునే వారు తమ ఆదాయాలను తగ్గించుకునే విధంగా ఆ భారం పడుతోంది. ఫలితంగా అమెరికా ప్రభుత్వానికి సుంకాల నుంచి అదనంగా కొంత ఆదాయం రావచ్చు. కానీ, ధరలు తగ్గిస్తానని ట్రంప్ ప్రచారం చేసినప్పటికీ, అధిక ధరల వల్ల అమెరికా వ్యాపారులు, వినియోగదారులు చాలా ఇబ్బంది పడతారు.
చైనా నుంచి వచ్చే దిగుమతుల మీద గత నెలలో ట్రంప్ పది శాతం సుంకం విధించాడు. దీనిక ప్రతీకారంగా చైనా కూడా ఎదురు సుంకాలు విధించింది. ట్రంప్ మళ్ళీ దీనికి ప్రతీకార చర్యగా, చైనా దిగుమతులపైన మరో పది శాతం సుంకం పెంచడమే కాదు, కెనడా, మెక్సికో దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన కూడా 25 శాతం సుంకం విధించడంతో ప్రతీకార చర్యలు పెరిగిపోయాయి. సుంకాలు కాస్తా వాణిజ్య యుద్ధాలుగా మారి, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ మధ్య స్టీల్, అల్యుమినియం మీద అమెరికా 25 శాతం సుంకం విధించింది. దీంతో చాలా అన్యాయంగా సుంకాలు విధిస్తున్న ‘‘అమెరికాకు నట్లు బిగించాలి’’ అని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.
ఈ సుంకాల క్రీడలో అమెరికా వాణిజ్య భాగస్వాములను కాస్త విదిలించాలని ట్రంప్ భావిస్తున్నట్టు కనపడుతోంది. సరిహద్దుల వెంబడి సాగే‘ఫెంటానిల్ ’(అనస్తీషియాలో అరుదుగా ఉపయోగించే మందు) ప్రవాహాన్ని నిరోధించడానికి, అమెరికాతో ఉన్న వాణిజ్య మిగుళ్ళను తగ్గించుకోవడానికి, తన కోర్కెలను సమ్మతింపచేయడానికి చేస్తున్నట్టుగా ఉంది. వారి నుంచి కొన్ని మినహాయింపులు పొందడానికి కూడా ట్రంప్ కుస్తీపడుతున్నాడు. కానీ, చరిత్ర స్పష్టంగా లేదు. యుద్ధంలో ఎవరూ గెలుపొందలేరు. తొంభై ఏళ్ళ క్రితం అమెరికా తెచ్చిన స్మూత్- హవానే సుంకాల చట్టం ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారి తీసి, ప్రపంచాన్ని అది చాలా నిస్పృహలోకి నెట్టేసింది.
వలసల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానం అతని భయకంపిత విధ్వంస రాజకీయాలకు మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ధరల సమానత్వం చేసే దృక్పథం కూడా దీనికి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. వలసలు అనేవి దేశాల మధ్యవేతనాల్లో సమానత్వాన్ని తీసుకొస్తుంది. పూర్తి సమానత్వాన్ని సాధించడానికి కార్మికులు దేశాల సరిహద్దులను అపరమితంగా దాటితే అది మరింత అతిగా బహిరంగమవుతుంది. “వలసల వల్ల తమ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, తమ భౌతిక రక్షణకు కూడా ప్రమాదం” అని అత్యధిక అమెరికా ఓటర్లను ట్రంప్ నమ్మించగలిగాడు. ఆయన చెప్పిన వలసల సామూహిక బహిష్కారాన్ని చాలా మంది స్వాగతించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి, ఆసియా నుంచి వచ్చిన వలసదారులను మధ్య అమెరికాకు పంపాడు. తల్లిదండ్రులతో కాకుండా, విడిగా అమెరికాలో ప్రవేశించిన వలసదారులైన పిల్లలే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టాడు.
దీంట్లో విచిత్రం ఏంటంటే అసలు అమెరికా అంతా ‘వలస వచ్చిన జాతే.’ వలసవచ్చిన వారి నుంచి కొందరిని యోగ్యమైన నిజమైన అమెరికన్లుగా ట్రంప్ గుర్తించాడు. అసలైన స్థానిక అమెరికన్లను కూడా ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నిస్తూ నిర్బంధిస్తున్నారు.
అమెరికా గుర్తింపు కోసం, వారి శ్రేయస్సు కోసం వలసలనేవి ఆ దేశానికి తప్పనిసరి. వలస దారులు 2022లో 1.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సంపదను సృష్టించడమే కాకుండా, 579 మిలియన్ డాలర్లను పన్నుల రూపంలో చెల్లించారు. వారుచెల్లించిన పన్నులు మొత్తం 2023లో 651.9 మిలియన్ డాలర్లకు చేరింది. స్థానికులు పని చేయడానికి ఇష్టపడని వ్యవసాయం, ఆహార తయారీ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఎవరినైతే చెడ్డవారుగా ట్రంప్ చిత్రించాడో, అలాంటి వలసదారులు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో సంపదను సమకూర్చారు.
ఒక అంచనా ప్రకారం, లెక్కలలోకి రాని 1.3 మిలియన్ వలసదారులను బహిష్కరించినట్టయితే, 2028నాటికి అమెరికా స్థూలజాతీయోత్పత్తి 1.2 శాతానికి, ఉద్యోగావకాశాలు 1.1 శాతానికి పడిపోతాయి. లెక్కలోకి రాని వలస దారులు 2022లో 76 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించారు.
అమెరికన్లను ట్రంప్ భయ రాజకీయాలకు లొంగిపోకుండా చేసినట్టయితే, అతని ప్రత్యర్థులైన డెమొక్రటిక్ పార్టీ నాయకులు తిరిగి అధికారం చేపట్టగలుగుతారు. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే చాలదు, వ్యూహాలను సరిగ్గా రూపొందించుకోవాలి. అంటే వాస్తవాలను ఓటర్లకు, ముఖ్యంగా గత ఎన్నికల్లో ట్రంప్ వైపు వెల్లువలా వెళ్ళిన శ్రామిక వర్గానికి చేరవేయగలగాలి. వాళ్ళ చట్టబద్దమైన భయాలను తొలగించడం కంటే, నూతన విధానాలకు రూపకల్పన చేయాలి. అలా చేయక పోతే, ట్రంప్, అతని అనుయాయులు కలిసి ప్రజల్ని నిరాశలోకి, ఆందోళనలోకి నెట్టివేస్తారు. ఫలితంగా అమెరికాలో ప్రజాస్వామ్యం ధ్వంసమై, ఏకస్వామ్యం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ స్థిరత్వానికి, శాంతికి భగ్నం కలుగుతుంది.
కొయిచి హమదా
(వ్యాస రచయిత ఎమిరిటస్ ప్రొఫెసర్, యాలియూనివర్సిటీ. జపాన్ మాజీ ప్రధాని అబి షింజోకి ప్రత్యేక సలహాదారులు.)
అనువాదం: రాఘవ
ప్రాజెక్ట్ సిండికేట్ తో వైర్ ప్రత్యేక ఏర్పాటు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.