
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? మంత్రులు సభా వేదికగా ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేరుతున్నాయి? సాధారణంగా అందరికీ వచ్చే అనుమానమే ఇది. కానీ, దీనిపై ఖచ్ఛితమైన లెక్క ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజూజీ అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సంజయ్ సింగ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నతో ఆసక్తికరంగా మంత్రులు ఇచ్చిన హామీల లెక్కలు బైటికొచ్చాయి. ప్రశ్నోత్తరాల, ఇతర చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు ఆటోమేటిక్గా నమోదు చేసుకొని, వాటిని ఫాలో చేసే పద్దతిని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018 నుంచి తీసుకొచ్చింది. అయితే, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్ మార్చి 17న సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు సభలో ఇచ్చిన హామీలలో 75 శాతం పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాచారమే నిదర్శనమని చెప్పారు. 2024లో సభలో ఇచ్చిన 160 హామీలలో 39 మాత్రమే నెరవేర్చబడ్డాయని, 119 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి స్పందన..
2018లో ఆన్లైన్ హామీల పర్యవేక్షణ వ్యవస్థ ఓఏఎంఎస్ ప్రారంభించిన తర్వాత, 99% అభ్యర్థనలు పరిష్కరించబడ్డాయని మంత్రి కిరణ్ రిజూజీ తెలిపారు. చాలా తక్కువ సంఖ్యలో హామీలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. మూడు నెలలలోపు అన్ని హామీలను నెరవేర్చకపోతే, అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మచ్చ అవుతుందని ఆయన అన్నారు.
“పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు అడిగితే, ప్రభుత్వం స్పందిస్తే, ఆ హామీని నెరవేర్చడం చాలా ముఖ్యం. అవి నెరవేరకపోతే, అది పార్లమెంట్ ప్రజాస్వామ్యంపై మచ్చ అవుతుంది” అని మంత్రి ఘాటుగానే ప్రతిస్పందించారు. మూడు నెలల్లోపు హామీపై ప్రతిస్పందించాలని, పార్లమెంటు సభ్యుల లేఖలకు ఒక నెలలోపు సమాధానం ఇవ్వాలని తాము అందరు మంత్రులకు లేఖలు పంపినట్టుగా మంత్రి వెల్లడించారు. తాము వాటిని తేలికగా తీసుకోలేమని అన్నారు.
ఆప్ ఆరోపణలు..
99% హామీలు నెరవేర్చబడ్డాయని మంత్రి చెప్పిన సమాధానంలో నిజం లేదని, ఎందుకంటే వారి వెబ్సైట్లో 1,324 హామీలు పెండింగ్లో ఉన్నాయని చూపిస్తోందని ఆప్ సభ్యులు సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలపై ఆసక్తికరంగా చర్చ సాగింది. సభ్యులు ఏ వెబ్సైట్ చూశారని మంత్రి ప్రశ్నించారు. 1947 నుంచి లెక్కలు చెబుతున్నారంటు చమత్కరించారు.
అయితే, రాజ్యసభలో 547 హామీలు పెండింగ్లో ఉండగా, లోక్సభలో 764 హామీలు పెండింగ్లో ఉన్నాయని మంత్రి లెక్కలు చెప్పారు. డిజిటల్ వేదికగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లతో సంయుక్తంగా అమలు చేసిన ఓఏఎంఎస్ ప్రకారం చూసుకోవచ్చనారు. పార్లమెంట్లో మంత్రులు చేసిన హామీలను క్రమపద్ధతిలో ట్రాక్ చేయడం, పర్యవేక్షించడం , నెరవేర్చడం లక్ష్యంగా ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్ ఓఏఎంఎస్ అని అన్నారు. ఈ వ్యవస్థ వచ్చాక జవాబుదారీతనం, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచిందని మరో మంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు.
ఆన్లైన్ ఎసూరెన్స్ మానిటరింగ్ సిస్టం ఏంచేస్తుంది?
పార్లమెంట్ ఉభయసభలలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, పారదర్శకత కోసం 2018లో ఆన్లైన్ హామీల పర్యవేక్షణ వ్యవస్థ ఓఏఎంఎస్ను తీసుకు వచ్చారు. పార్లమెంట్ ఉభయసభలు లోక్సభ, రాజ్యసభలలో ప్రశ్నోత్తరాల సమయం తరువాత జరిగిన చర్చలలోనూ మంత్రులు శాఖల వారీగా ఇచ్చిన హామీలను ఈ సిస్టం ఆటోమేటిక్గా రికార్డు చేస్తుంది. మూడు నెలలలోపు వాటిపై ఆ మంత్రిత్వ శాఖ స్పందించాలి. ఆ పరిష్కారం పూర్తి అయ్యిందా లేదా, లేకపోతే ఎందుకు అన్న విషయాలను ఓఏఎంఎస్లో నమోదుచేస్తారు.
అంతేకాకుండా మంత్రులు ఇచ్చిన హామీలను తగిన సమయంలో గుర్తు చేస్తుంది కూడా. తాజాగా వెబ్సైట్ సూచిస్తున్న లెక్కలు చూస్తే మొత్తం మీద 33,722 హామీలు ఇచ్చినట్లు చూపిస్తోంది. అందులో 28,227 హామీలు అమలుకు నోచుకున్నాయని, 2623 హామీలు అసంబద్దమైనవిగా గుర్తించి తొలగించారని, ప్రస్తుతం 1,263 హామీలు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు చూపిస్తోంది.
అలాగే, లోక్సభలో ఇచ్చిన హామీలు, రాజ్యసభలో ఇచ్చిన హామీల లెక్కలను విడివిడిగా కూడా వెబ్సైట్ సూచిస్తోంది. లోక్సభలో 2024లో 252 హామీలు, 2025లో ఇప్పటి వరకూ 20 హామీలు ఇచ్చారు. లోక్సభలో 2019లో అత్యధికంగా 1061హామీలు ఇచ్చినట్లు అధికారిక వెబ్సైట్ సూచిస్తోంది. అదే రాజ్యసభలో 2024లో 160 హామీలు, 2025లో ఇప్పటి వరకూ 17 హామీలు ఇచ్చారు. రాజ్యసభలో మాత్రం అత్యధికంగా 2018లో 415 హామీలు ఇచ్చారు.
పార్లమెంట్ పరంగా అమలవుతున్న ఓఏఎంఎస్ సిస్టం రాష్ట్రాల అసెంబ్లీల పరిధిలో అమలు కావడంలేదు. అయితే సభలో సభ్యులు అడిగిన, లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా లెక్కలతో చూపిస్తున్న కేంద్రం ఎన్నికల హామీలను కూడా ఎప్పటికప్పుడు ఎన్ని అమలయ్యాయో లెక్కలతో సహా ప్రజల ముందుకు తెస్తే బాగుంటుంది.
రాష్ట్ర అసెంబ్లీలలోను ఇలాంటివి రావాలి. ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తున్నామని అధికార పార్టీలు చెప్తున్నాయి. అమలు కావడం లేదని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజంగా మారింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఇదే సీన్ తరచుగా కనిపిస్తోంది. తాజాగా బడ్జెట్ సమావేశాలు హీట్ పుట్టించాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.