
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికాకు చెందిన ఒక కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్ మాన్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ముఖాముఖిలో వివిధ అంశాలపై మాట్లాడారు. భారత దేశంలో నేటి పరిస్థితులు, అమెరికా, చైనా, పాకిస్థాన్ లతో సంబంధాలు వంటివి మాట్లాడారు. ఆయన ప్రస్తావించిన కొన్ని ప్రధానమైన అంశాలు నేటి భారతదేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే తాను విమర్శని హృదయపూర్వకంగా స్వీకరిస్తారని, అసలు విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మవంటిదని, ఆ విమర్శ మరింత పదునుగా ఉండాలని తాను కోరుకుంటానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.
అలాగే గుజరాత్ లో 2002 లో జరిగి, ప్రపంచ వ్యాపితంగా చర్చ నీయాంశమైన గోద్రా తదనంతర ఘటనలలో తాను, తన అనుచరులు అమాయకులమని కోర్టే కితాబు ఇచ్చిందని పేర్కొంటూ దీనిపై అనవసర రాద్దాంతం జరిగిందని ప్రకటించారు. అదే సందర్భంలో గుజరాత్ లో మత ఘర్షణలు జరగడం సాధారణమే, అని 2002 కు ముందు కూడా అనేక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అలా తమ ప్రభుత్వం దగ్గరుండి చేయించిన రాజ్య హింసను, మిగిలిన మత ఘర్షణలతో పోలుస్తూ తమ మారణ హోమాన్ని చిన్నది చేసి చూపడానికి ప్రయత్నించారు.
మిగిలిన విషయాలు పక్కన ఉంచితే, ఈ రెండు అంశాలలో, అంటే విమర్శను స్వీకరించడం, గుజరాత్ ప్రభుత్వ మత మారణ కాండను, దేశంలో నెలకొన్న నేటి పరిస్థితులకు అన్వయించి, వాటిలోని వాస్తవాస్తవాలను కొద్దిగా పరిశీలిస్తే నేడు దేశంలో పాలన ఏ రకంగా ఉందో అర్ధమవుతుంది.
ప్రజాస్వామ్యం పరిహాసం…
ప్రజాస్వామ్యానికి విమర్శ ఆత్మ వంటిదనడంలో ఎలాంటి వివాదం అవసరం లేదు. ఆ విషయం లో భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ హాస్యాస్పద విషయం ఏమిటంటే ఆయన తాను విమర్శను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని తెలిపడం. ఇది మాత్రం నూటికి నూరున్నర శాతం అవాస్తవం. పాత విషయాలను పక్కన పెడితే 2014లో ఆయన ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఈ 11 ఏళ్ల కాలంలో ఆయన సద్విమర్శలను సైతం స్వీకరించిన ఒక్క సందర్భం కూడా లేదు. విమర్శను స్వీకరించడం మాట అటుంచి, అటువంటి విమర్శలు చేసిన వారిపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేయడం, ఏదో సాకు తో వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించడమే నేడు దేశంలో ప్రధాన నేరంగా మారింది. ప్రశ్న లేకుండా విమర్శ లేదు.
నేడు వారు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు రెండే రెండు. సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టడం ఒకటి కాగా, ప్రశ్నించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం రెండోది.
తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ తనను ఇంతలా తీర్చిదిద్ధిందని ఆయన అదే ఇంటర్వ్యూలో చెప్పారు. ఫాసిస్టు భావాలు కలిగిన ఈ సంస్థ తీర్చిదిద్దిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉంటారని, విమర్శను స్వీకరిస్తారని నమ్మడం అమాయకత్వమే. హిందూ రాజ్య స్థాపనే తన లక్ష్యమని ప్రకటించడమే కాక, ఇతర మతస్థులు దేశంలో నివశించాలంటే ఎలాంటి హక్కులూ లేని రెండవ తరగతి పౌరులుగానే ఉండాలని ఆర్ఎస్ఎస్ సిద్దాంతం. దాని అనుబంధ సంఘాలైన బిజెపి, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలన్నీ మత విద్వేష వైఖరిని, ముఖ్యంగా ముస్లింలను దేశ శత్రువులుగా చూపే ప్రయత్నం దేశంలో చేస్తూనే ఉన్నాయి.
గత పదేళ్ళ కాలంలో కేవలం కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాని, సూచనలు చేసినందుకు గాని, విధానాలను తప్పుపట్టినందుకు గాని, ప్రధాన మోదీ పనితీరును విమర్శించినందుకు గాని అనేకమంది రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు, హక్కుల కార్యకర్తలు, మేధావులు వంటి వివిధ తరగతుల వారు అనేక రకాల వేధింపులకు గురయ్యారు.
తాజాగా….
మహాత్మా గాంధీ ముని మనుమడైన తుషారు గాంధీ కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఆర్ఎస్ఎస్ ను విషపూరితమైన ఒక ప్రమాదకరమైన సంస్థగా పేర్కొన్నారు. దీనితో ఏకీభవించేవారు ఉండొచ్చు, విభేదించేవారు కూడా ఉండవచ్చు. రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం కలిగించింది. తుషార్ గాంధీ అన్న మాటలపై చర్చించవచ్చు కానీ, దీనికి భిన్నంగా మోదీ గారి అనుచర గణం ఆయనను అడ్డుకుని, క్షమాపణలు చెప్పి తీరవాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన ఒత్తిడికి తలొగ్గకుండా, నేను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని నిర్విద్ధంగా వారి డిమాండ్ ను తోసిపిచ్చారు.
భీమా కోరగామ్ కేసులో అర్బన్ నక్సల్స్ అనే ముద్ర వేసి సుధా భారద్వాజ్, స్టాన్ స్వామి, వరవర రావు, సాయి బాబా వంటి వారిని అక్రమంగా అరెస్టు చేశారు. వీరందరూ మేధావులే గాక, వయసులోనూ పెద్దవారే. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్టాన్ స్వామి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, చేతులతో గ్లాస్ కూడా పట్టుకునే పరిస్థితి లేదని, అందువల్ల నీళ్లు తాగడానికి స్ట్రా ఒకటి ఇప్పించమని కోరినా, దాన్ని కూడా జైలు అధికారులు దీర్ఘకాలం తిరస్కరించారు. చివరకు 84 ఏళ్ళ వయస్సులో ఆయన 2021లో జైలులోనే ప్రాణాలు కోల్పోయారు. వరవరరావు, మరి కొంత మంది అలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా వారినీ వదలలేదు. అంగవైకల్యంతో ఉన్న ప్రొఫసర్ సాయిబాబా జైలులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వీరి విజ్ఞప్తులను ఖాతరు చేయకుండా పదే పదే వీరి బెయిల్ పిటీషన్లు సైతం తిరస్కరిస్తూ వచ్చింది. ఇలా కనీస మానవ హక్కులను సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది. చివరకు కోర్టు ఈ కేసులలో వారిపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం నిరూపించలేకపోయిందని పేర్కొంటూ, వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చింది. కానీ జైలు జీవితంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, సాయిబాబా విడుదలైన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. ఇలా అనేక మంది మేధావుల జ్ఞానం దేశానికి ఉపయోగ పడకుండా ప్రభుత్వం చేసింది. వికలాంగులను, వయసు మీద పడిన వృద్ధులను కూడా ఈ ప్రభుత్వం వదలక పోవడం చూస్తే, చిన్న విమర్శను కూడా ఈ ప్రభుత్వం స్వీకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది.
వీటితో పాటుగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారని ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్, గోవింద్ బన్సారే, కల్బుర్గి, నరేంద్ర దభోల్కర్ వంటివారిని మతోన్మాద గూండాలు హత్య చేశారు. ఈ హంతకులను శిక్షించవలసింది పోయి, ప్రభుత్వం తిరిగి వారికే రక్షణ కల్పించింది. వాస్తవం ఇది కాగా, ప్రజాస్వామ్యం గురించి మోదీ చాలా పెద్ద మాటలే ఇంటర్వ్యూలో చెప్పారు. మాటలకు చేతలకు ఎంత తేడాయో!
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారు..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు
, ” దొంగలందరూ ఇంటిపేరు మోదీ అని ఎందుకు పెట్టుకుంటారు?” అనే వ్యాఖ్యపై సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. దీనిపై ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. కోర్టు సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. అయితే అప్పటి వరకు వేచి ఉండకుండానే ఆయనను పార్లమెంటు నుండి హడావడిగా అనర్హుడిగా ప్రకటించారు. ఇతర పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉండగా, సూరత్ కోర్టు కేసును వేగంగా విచారించటం ప్రతిపక్షాలను నోరు మూయించే ప్రయత్నంగా విమర్శకులు అభివర్ణించారు. సుప్రీం స్టే తరువాత మాత్రమే ఆయన పార్లమెంటు సభ్యత్వం పునరుద్దబడింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) మరియు సంజయ్ సింగ్‌తో సహా అనేక మంది ఆప్ నాయకులను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనేకసార్లు సమన్లు జారీ చేసింది. తుదకు ఆయననూ అరస్టు చేసారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ను కూడా ఇలాగే జైల్లో పెట్టారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు లాలూ యాదవ్ కుటుంబం అవినీతి కేసులపై పదేపదే CBI మరియు ED దాడులను ఎదుర్కొంది. చివరకు వీరందరిపై మోపిన అభియోగాలు నిరూపించబడలేదని కోర్టులు ఈ కేసులు కొట్టేయయడంతో విడుదల చేసారు. బిజెపిని వ్యతిరేకించినప్పుడే కేసులు తీవ్రమవుతాయని ప్రతిపక్ష నాయకుల ఆరోపణ నూరు శాతం సరైనదే.
జర్నలిస్టులు & మీడియాపై వేధింపులు..
2002 గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రను పరిశీలిస్తూ BBC “ఇండియా: ది మోదీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది. ప్రభుత్వం భారతదేశంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించి, తరువాత BBC ఇండియా కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది.
మోదీ ప్రభుత్వాన్ని తరచుగా విమర్శించే ప్రముఖ వార్తా ఛానల్ NDTVని నానా ఇబ్బందులూ పెట్టి, చివరకు మోదీకి సన్నిహితుడైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు, NDTV వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మరియు రాధిక రాయ్ CBI కేసులు మరియు ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొన్నారు.
మోదీ మరియు BJPపై విమర్శనాత్మక నివేదికలకు పేరుగాంచిన జర్నలిస్ట్ రాణా అయూబ్‌పై మనీ లాండరింగ్ అభియోగం మోపబడింది. ఆమె ఆన్లైన్లో పదేపదే వేధింపులకు గురయ్యారు.
హాత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కవర్ చేస్తున్నప్పుడు అరెస్టయిన జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ UAPA (ఉగ్రవాద నిరోధక చట్టం) కింద రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది.
రైతుల ఉద్యమానికి సంఘీభావంగా నిలిచారని, న్యూస్ క్లిక్ వ్యవస్థాపకులు ప్రబీర్ పురకాయస్థను చైనా ఎజెంట్ అనే ముద్ర వేసి, మనీ లాండరింగ్ ఆరోపణలతో తప్పుడు కేసులో ఇరికించి జైల్లో నిర్బంధించారు.
గుజరాత్ అల్లర్ల బాధితుల కోసం పోరాడిన మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్, 2002 అల్లర్ల కేసులో మోదీపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తర్వాత అరెస్టు చేశారు. ఆధారాలను సృష్టించారని ఆమెపై ఆరోపణలు చేశారు. అయితే ఆమె తాను మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగించిన న్యాయ పోరాటాలకు ప్రభుత్వ ప్రతీకారంగా పేర్కొన్నారు.
కార్యకర్తలు & నిరసనకారులను నిశ్శబ్దం చేశారు…
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఇంటర్నెట్ షట్డౌన్లు, రాజద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయం పట్ల ఏ మాత్రం గౌరవం లేదని దీని ద్వారానే తేటతెల్లమవుతోంది. ఒక సంవత్సరం పాటు జరిగిన పోరాటం తర్వాత మాత్రమే ప్రభుత్వం చివరికి చట్టాలను మొక్కుబడిగా వెనకు తీసుకుంది.
దిషా రవి అనే పర్యావరణ కార్యకర్తను రైతు నిరసనలకు సంబంధించిన “టూల్‌కిట్”ను పంచుతున్నందుకు గాను అరెస్టు చేసారు.
CAA వ్యతిరేక నిరసనకారులు (2019-2020)…
పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు మరియు కార్యకర్తలు అరెస్టులు మరియు దేశద్రోహ కేసులను ఎదుర్కొన్నారు.
ఉమర్ ఖలీద్ (జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీ పరిశోధన విద్యార్థి, సామాజిక కార్యకర్త) ఢిల్లీ అల్లర్లలో పాత్ర ఉందనే ఆరోపణలపై UAPA కింద జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
అనేక దుకాణాలకు కూల్చేశారు. ఇళ్ళు తగలబెట్టారు. అనేక మందిపై కేసులు బనాయించారు.
బాలీవుడ్ & సాంస్కృతిక ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారు….
షారూఖ్ ఖాన్ గతంలో భారతదేశంలో అసహనాన్ని విమర్శించినందున ఆర్యన్ ఖాన్ (షారూఖ్ ఖాన్ కుమారుడు) పై ఉన్న మాదకద్రవ్యాల కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందని చాలా మంది విశ్వసించారు. ఆర్యన్ తరువాత అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందాడు, కానీ ఈ కేసు బాలీవుడ్ లో చెందిన ప్రభుత్వ విమర్శకులకు హెచ్చరికగా భావించబడింది.
2021లో ఆర్ఎస్ఎస్ సమూహాల ఒత్తిడితో స్టాండ్-అప్ కమేడియన్ మునావర్ ఫరూఖీ తాను చెప్పని జోక్‌కు జైలు పాలయ్యాడు. అనురాగ్ కశ్యప్ వంటి చిత్రనిర్మాతలు మరియు స్వరా భాస్కర్ వంటి నటులు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దాడులు మరియు బెదిరింపులను ఎదుర్కొన్నారు.
మాట – చేత…..
విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ప్రభుత్వం ఖండించినప్పటికీ, చట్టపరమైన చర్యలు, పన్ను దాడులు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, అరెస్టులు మరియు బెదిరింపుల సరళి అసమ్మతిపై ఒక ప్రణాళికా బద్ధ అణిచివేతనే సూచిస్తోంది.
గోద్రా తదనంతర ఘటనలు:
ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన గుజరాత్లో విస్తృతమైన మత అల్లర్లకు దారితీసింది. గోద్రా తర్వాత
తక్షణ పర్యవసానంగా రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్ దహనం తర్వాత, గుజరాత్ అంతటా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.
సామూహిక హత్యలు:
అధికారిక గణాంకాల ప్రకారమే వెయ్యి మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలే. వేలాది మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
లైంగిక హింస & దహనం:
మానవ హక్కుల సంస్థల నివేదికలు సామూహిక అత్యాచారాలు మరియు ఇళ్ళు మరియు వ్యాపారాల ధ్వంసంతో సహా క్రూరమైన చర్యలను వివరించాయి. గర్భిణీ స్త్రీలను సైతం ఈ
మూకలు వదలలేదు. పసికందులనూ పీక నులిమి చంపేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందన:
అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం అల్లర్లను నిలువరించడంలో విఫలమైంది. పెద్దఎత్తున విమర్శలను ఎదుర్కొంది. ఈ నరమేధానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే మోదీ వాటిని తిరస్కరించారు.
చట్టపరమైన & న్యాయపరమైన చర్యలు:
కేసులను తిరిగి దర్యాప్తు చేయడానికి భారత సుప్రీంకోర్టు 2008లో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసింది.
దోషులు:
గుజరాత్ అల్లర్ల సందర్భంగా జరిగిన వివిధ కేసులలో బహుళ విచారణలు కొంత మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. వాటిలో BJP MLA మాయా కొడ్నాని (తరువాత నిర్దోషిగా విడుదలయ్యారు) మరియు బజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగీకి జీవిత ఖైదు విధించబడింది.
మోదీ మరియు ఇతరులపై విచారణకు తగిన ఆధారాలు లేవని SIT నివేదికను సుప్రీంకోర్టు సమర్థించింది.
రాజకీయ & సామాజిక ప్రభావం…
ఆరోపణలు ఉన్నప్పటికీ, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు మరియు తరువాత 2014లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు.
ధ్రువీకరణ & ప్రపంచ దేశాల స్పందన :
అల్లర్ల ఫలితంగా అమెరికా మరియు UK మోదీపై ప్రయాణ నిషేధం విధించాయి (తరువాత ఎత్తివేయబడింది). అనేక దేశాలు ఈ మారణకాండను ఖండించాయి.
కొనసాగుతున్న చర్చలు:
ఈ సంఘటన రాజకీయంగా వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. న్యాయం, రాష్ట్ర జవాబుదారీతనం మరియు మత సామరస్యంపై చర్చలు కొనసాగుతున్నాయి. మతతత్వ వాదులు, రాజ్యాంగ యంత్రంపై సాధించిన లోతైన పట్టుకు గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ మారణకాండ, పోలీసు వ్యవస్థ కుమ్మక్కు, నిర్దోషులుగా దేశ ఉన్నత న్యాయస్థానం అంతిమ తీర్పు, ఆ తీర్పు ఇచ్చిన న్యాయాధిపతులకు పదవులు – ఇలాంటివన్నీ నేటి దేశ పరిస్థితికి దర్పణంగా నిలుస్తున్నాయి.
మాటలు ఘనంగా ఉండి, చేతలలో కనపడని వారికి మనస్తత్వవేత్తలు రూపొందించినదీ పదం. సంభాషణలలో తమ స్వంత అనుభవాలు మరియు అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులను, తరచుగా ఇతరులను అంతరాయం కలిగించే, విస్మరించే వ్యక్తులను సూచిస్తుంది. ‘దెయ్యాలు వేదాలు వల్లించడం’ అనేది కూడా ఈ కోవలోనికే వస్తుంది.
– ఎ. అజ శర్మ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.