
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో, రాష్ట్రాలలో మాతృ భాషలు చారిత్రాత్మక అవసరంగా వచ్చాయి. అవగాహన పెంచి, ఐక్యతకు, సమాజ అభివృద్ధికి దోహదపడే మాతృభాషలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధానాలు రకరకాల రూపాలలో నేడు వచ్చాయి.
ప్రపంచమంతటా ఎన్నో ప్రామాణికమైన పరిశోధనలతో ఒక విషయం స్పష్టమైంది. పసిప్రాయంతో మొదట 5, 6 సంవత్సరాలు పాఠశాల విద్యల్లో విద్యార్థికి తల్లిదండ్రులతోను, చుట్టూ సమాజంతో ఏ భాషతో సంబంధం ఉంటుందో అదే భాషలో విద్యాబోధన జరిగినపుడే విషయాలను గ్రహించగలరని, మేధస్సుకు పదును పెట్టగలరని, సృజనాత్మకశక్తిని పెంచుకోగలరని, మౌలికమైన అంశాలు బాగా గుర్తుంటాయని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అందుకే మాతృభాషలకు ప్రాముఖ్యం ఉంది.
దాదాపు 68 సంవత్సరాల క్రితం 1952లో నేటి బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఉన్నరోజుల్లో తమపై ఉర్దూ భాష రుద్దిన పాలకులకు వ్యతిరేకంగా ఆదేశంలోనే బెంగాలీలు నిర్వహించిన భాషా ఉద్యమం చారిత్రాత్మకమైనది. మాతృభాషలకు, ప్రాంతీయ భాషలకు అనుకూలంగా నిర్వహించిన నాటి ప్రదర్శనపై తూర్పు పాకిస్తాన్ పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన జరిగిన తరువాత యునెస్కో జోక్యం చేసుకుని ప్రపంచ మాతృభాషలకు రక్షణ కల్పించాలని ప్రకటించింది. చాలా దేశాలలో మాతృభాషలతో పాటు స్థానిక భాషలు అధికంగా ఉన్నాయి. ఆ భాషలకు అధికారిక లిపిలు కూడా సమకూర్చుకున్నాయి. చరిత్రలో ఒక మంచి అనుభవం ఇజ్రాయల్ దేశం చెప్పింది. క్రీ.శ. 72లో ప్రపంచమంతా చెదిరి పోయిన ఇజ్రాయిలీలు సుమారు 1876 సంవత్సరం తర్వాత ఇజ్రాయిల్ దేశం స్థాపించుకున్నారు. వారి మాతృభాష హిబ్రూలోనే విద్యాబోధన జరుగుతుంది. మాతృ భాషలతో పాటు స్థానిక భాషలు మాట్లాడే ప్రాంతాలు తెగలు ఉన్నాయి .
మాతృభాషలకు, స్థానిక భాషలకు పెను సవాళ్లు
ఐక్ష్యరాజ్య సమితి వేగంగా అంతరిస్తున్న 200 భాషలను గుర్తించింది, అందులో తెలుగు, మరిన్ని స్థానిక భాషలు ఉండటం బాధాకరం. తెలుగు ఆధునిక రూపం తీసుకుని గట్టిగా వందేళ్లు కూడా కాలేదు. 1986 రాజీవ్ గాంధీ నూతన విద్యావిధానం, ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలు ఎక్కువ కావడం, 1991 తరువాత నూతన ఆర్థిక విధానాల ప్రభావం మాతృభాషలపై పడింది.
ఆ విధానాలలో భాగంగా కార్పరేట్ విద్యాసంస్థలకు అనుగుణంగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యాబోధన ఆంగ్లంలో జరగాలా? మాతృభాషలు, స్థానిక భాషలలో జరగాలా? అనే చర్చ తీవ్రంగా జరిగింది. ప్రజలు మాతృభాష బోధనను కోరుకున్నా, పక్కదారి పట్టించే విధంగా పాలకులు ఆంగ్లాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మాతృభాషలు, స్థానిక భాషలు సంక్షోభంలో పడ్డాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని పాశ్చాత్య భాషను మన దేశానికి దిగుమతి చేసి మరిన్ని సమస్యలకు కారణం అయింది. ప్రస్తుత పరిస్థితులలో నూతన విద్యావిధానం అమలుకు పూనుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఆంగ్ల మాధ్యమం, సిబిఎస్ఇ సిలబస్ లను ప్రవేశ పెట్టింది. గిరిజన తెగలు మాట్లాడుకునే భాషలను నిర్లక్ష్యం చేస్తుంది. ఆంధ్రరాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో ఈ సమస్య తీవ్రమైంది.
మాతృభాషలోనే చదువుకోవడానికి ఐదు ప్రధాన కారణాలు
- ఒక జాతి, ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి మాతృభాషలు చాలా కీలకం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లాంటి వివిధ కులాలు, జాతులు, ఆర్ధిక తారతమ్యాలు, ఎక్కువ మంది నిరక్షరాస్యులు, పేదలు, వివిధ వెనుకబడిన ప్రాంతాలు ఉన్నత దశకు చేరాలంటే మాతృ భాషలో విద్యాబోధన మరింత అవసరం.
- మాతృభాషలో విద్యాబోధన సులభం, సహజం, వనరులు ఎక్కువ, ఖర్చు తక్కువ, స్వేచ్ఛగా భావాలను, అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఉమ్మడి అభిప్రాయాలకు విలువనిస్తుంది.
- ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. భాష గుత్తాధిపత్యాన్ని నిలువరించవచ్చు.
- జాతుల స్వేచ్ఛను, ఆ ప్రాంతపు ఐక్యతను కాపాడవచ్చు.
- సామాజిక ఐక్యత పెంపొందించబడుతుంది.
భాషా వినియోగం, వికాసం గురించి రాజ్యాంగంలో 344 నుంచి 347 వరకు గల అధికరణలు మాతృభాషల రక్షణ, వినియోగం, సామాజిక అవసరం గురించి తెలియచేశాయి. కాని ఈరోజు రాజ్యాంగంలో అధికరణలకు భిన్నంగా ఆంగ్ల మాధ్యమ బోధన తీసుకొచ్చారు. దాని స్వభావంలోనే సామాజిక విభజన ఉంది. ఇది జాతీయ సమైక్యత స్ఫూర్తికి విరుద్ధం. ఈ క్రమంలో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో స్థానిక మాతృభాషలను నిర్లక్ష్యం చేయడం వలన ఆ ప్రాంత విద్యార్థులు చదువులకు మారం అవుతున్నారు.
గిరిజన ప్రాంతాలలో మాతృ భాషలో బోధన అత్యంత కీలకం
అక్షరాస్యతలో బాగా వెనుకబడినవి గిరిజన ప్రాంతాలే. ఆదివాసుల జీవన విధానం ఉచ్చస్థాయికి రావాలంటే విద్య చాలా కీలకం అటువంటి విద్య అందివ్వడంలో పాలకుల వైఫల్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. గిరిజన పిల్లల చదువుల్లో మనమే లాస్ట్. ఇప్పటికైనా మేల్కొనకపోతే అక్షరాస్యత శాతం పడిపోతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు, సదుపాయాలు కల్పించబడ్డాయి. ఐదవ షెడ్యూల్ ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నరుకు ప్రత్యేక భాధ్యత నిచ్చింది. 275(1) ప్రకారం షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక నోడల్ ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉంది. రాజ్యాంగంలో పొందు పరచబడిన గిరిజనుల హక్కులను కాపాడటం వంటి అంశాలు నిర్లక్ష్యం కాబడుతున్నాయి. ఇటువంటి ప్రాంతాలలో మాతృభాష(స్థానిక భాష)లో విద్యాబోధనకు ప్రాధాన్యతనిస్తే గిరిజన పిల్లలు విద్యకు మరింత చేరువ అవుతారు. చదువు కోసం తపన పడుతున్న గిరిజన ప్రాంతాలలో స్థానిక భాషలు, లిపి, మాతృ భాషలను మరింత విస్తృత పరచాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో మాతృభాషలో విద్యాబోధన కాకుండా ఆంగ్ల భాషకు పరిమితం చేయడంపై గిరిజన ప్రాంతాలలో ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
విద్యారంగంలో సంస్కరణలే మాతృ భాషల నిర్వీర్యం
పెద్ద మార్కెట్ కోసం కార్పోరేట్ సంస్థలకు లాభాలను, చేకూర్చే క్రమంలో విద్యారంగంలో వచ్చిన సంస్కరణలు మాతృభాషలను మింగేస్తున్నాయి. ఆన్లైన్ విద్య, డిజిటల్ విద్యను పూర్తిగా ప్రోత్సహించే క్రమంలో ఆంగ్ల విద్యను చొప్పించారు. దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారులకు, కార్పోరేట్ సంస్థలకు అనుగుణంగా విద్యారంగంలో మార్పులు వచ్చాయి. అంతర్జాతీయంగా ఒక అంచనా ప్రకారం ఏటా 13 ట్రిలియన్ డాలర్ల విద్యా వ్యాపారం జరుగుతుంది. సాంప్రదాయ విద్యా వ్యవస్థను దెబ్బతీయడం కోసం ఆంగ్ల విద్యా బోధన ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో మాతృభాషలు కనుమరుగయే ప్రమాదం ఏర్పడబోతుంది.
2017 మార్చి 31న శాసన మండలిలో బోధనా మాధ్యమంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆంగ్లం నేర్చుకోవడం ముఖ్యం అయితే ఆంగ్లం నేర్పాలి, ఆంగ్ల మాధ్యమాన్ని ఎందుకు ప్రవేశపెట్టాలి? 1980 నుంచీ మాతృ భాషలపై దాడి ప్రారంభం అయింది. ప్రపంచ దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ఇప్పటికీ మాతృభాషలోనే బోధన జరుగుతున్నపుడు మంచి ఫలితాలను కూడా చూస్తున్నపుడు ఆంధ్రప్రదేశ్లో ఆంగ్లంలో బోధన అంశాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
మాతృభాషలో బోధిస్తే గణితం, సామాజిక ప్రకృతి శాస్త్రాలు విద్యార్థికి బాగా అర్థం అవుతాయనే అంశం బలమైనది, శాస్త్రీయమైనది. ఇది ప్రపంచవ్యాప్త సత్యం. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మాతృ భాష బోధనపై వారి వైఖరిని ప్రకటించారు. కోట్లు ఇచ్చినా మా రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP) అమలు చేయము, మాతృభాష బోధనా విధానాన్ని మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. విద్యారంగంలో వాస్తవ అభివృద్ధి కోసం వారి వైఖరిని ప్రకటించడం హర్షనీయం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతరాజ్యాంగం నిర్దేశించిన ఆర్టికల్స్ ను, కొఠారి కమిషన్ సిఫారసులను, విద్య హక్కు చట్టాలను పూర్తిగా విస్మరిస్తున్నట్లే. మాతృభాషా మాధ్యమం కోసం గొప్ప ఉద్యమం జరగాలి. కనుకనే మాతృభాష, సంస్కృతి, లిపి, విద్య వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరమైన భాషా హక్కులకు భంగం కలగకుండా, భంగం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
కోరెడ్ల విజయగౌరి, UTF రాష్ట్ర కార్యవర్గ సభ్యలు
ఫోన్ నెంబర్: 8985383255
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.