
యావత్ ప్రపంచం కోరుకునట్లే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భార రహిత స్థితి నుంచి విజయవంతంగా భూగురుత్వాకర్షణకు చేరువయ్యారు. కేవలం 8 రోజుల రోదసి యాత్రకని బయలుదేరి, సాంకేతిక సమస్యలతో అనూహ్య పరిణామాల మధ్య అక్కడే 288 రోజులు ఉండిపోయారు. ఈ ఘట్టం చరిత్రలో ఓ సాహస యాత్రకు స్పూర్తిగా నిలిచి అంతరిక్ష జీవ మనుగడకు దారులు తెరిచింది. అంతేకాకుండా అంతరిక్ష యాత్రలో భాగంగా ఓ అడుగును ముందుకు వేసేలా చేసింది.
18 గంటల అంతరిక్ష ప్రయాణం తర్వాత బుధవారం ఉదయం 3 గంటల 27 నిమిషాలకు డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా సముద్ర తీరంలో సాప్ట్ ల్యాండింగ్ అయ్యింది. దీంతో గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సాక్షిగా ఎన్నో విధి విసిరిన ట్విస్ట్‌లతో కొనసాగినా ఓ నిజ జీవిత కథ సుఖాంతం అయ్యింది. క్యాప్స్యుల్ నుంచి బయటికి వస్తూ నవ్వుతూ అభివాదం చేసిన సునీత మూడో అంతరిక్ష యాత్ర ప్రయాణం కొన్ని దశాబ్దాల పాటు భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. రాబోయే కాలంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు నేటి యువత ఆసక్తిగా అడుగులు వేయడానికి ఈ ఉదయం నాంది పలికింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండి గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. దీంతో అందులోని వ్యోమగాములు రోజుకు 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తారు. భారరహిత స్థితిలో ఉంటూ అక్కడ ప్రయోగాలు, పరిశోధనలు చేయడమంటే ప్రతీ సెకన్ అదో అతిపెద్ద సాహసమనే చెప్పవచ్చు. ఈ యాత్రతో కలిపి సునీత అంతరిక్షంలో 62 గంటల 6 నిముషాలు స్పేస్ వాక్ చేసి నవచరిత్రను లిఖించారు.
అంతరిక్షపు కాంతి కాలుష్యం, భూమిపై జరిగే ప్రకృతి విపత్తులు, భూ వాతావరణం వంటివి ఐఎన్ఎస్ నుంచి అధ్యయనం చేయవచ్చు. అక్కడ వ్యోమగాములు ప్రస్తుతం అంతరిక్ష వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్, డీఎన్ఏ సీక్వెన్సింగ్, కృత్రిమ రక్తం, ప్రోటీన్ క్రిస్టల్ వంటి ఎన్నో వినూత్న విభిన్న అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు. త్రీడీ ముద్రిత మానవ కణజాలం, కొత్త పదార్థాల తయారీ వంటి వాటికి జీవం నింపుతున్నారు. సునీత, విల్మోమ్లు కూడా ఈ యాత్రలో అంతరిక్ష ప్రయోగాల్లో తమవంతుగా పాలుపంచుకున్నారు. స్పేస్ వాక్ చేస్తూ ఐఎస్ఎస్ మరమ్మతులు కూడా చేశారు. ఎంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తూనే జీవనయానాన్ని అంతరిక్ష వేదికగా కొనసాగించారు.
ఏదిఏమైనా, అంతరిక్ష యాత్రలంటే మనం రాసేంత, మాట్లాడేంత సులభమేమీ కాదు. చిన్న సాంకేతిక లోపం తలేత్తితే ఒక్క సెకన్లోనే తలరాతలు మారిపోతాయి. ప్రాణాలు అంతరిక్షంలోనే కలిసిపోతాయి. కల్పనా చావ్లా లాంటి ధృవతారల జీవితం మనకంతా తెలిసిందే. అయినా అక్కడే ఆగకుండా, నిరాశ నిస్పృహలు చెందకుండా మానవ పురోగతి కోసం అంతరిక్ష ప్రయాణాలను శాస్త్రవేత్తలు కొనసాగిస్తూనే ఉన్నారు. విశ్వరహాస్యాల అన్వేషణలో ఎన్నో సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో, అకుంఠిత దీక్షతో అధిగమిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అంతరిక్షం నుంచి వచ్చిన సునీత కూడా పూర్తిగా ఆరోగ్యపరంగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు జరిగి మామూలు స్థితిలోకి రావాలంటే కూడా ఇంకా ఆమె పోరాటం కొనసాగించాల్సిందే. ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ, ఎముకలు, కండరాలు, గుండె, మెదడు వంటి శరీర భాగాలు పూర్తిగా పూర్వస్థితికి చేరడానికి ఆమె నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. భారతదేశ మూలాలున్న సునీతా విలియమ్స్ ఇలాంటి ఎన్నో జీవిత సవాళ్ళను సాహసోపేతమైన అడుగులతోనే ఎదుర్కొన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు చదవడం వల్లనే గొప్ప సంకల్పంతో ఈవిధంగా ఎదిగానని ఆమె చెబుతూ ఉంటారు. ఆమె త్వరగా కోలుకోని, మనకు ఎప్పటికీ స్ఫూర్తి తారలా నిలవాలని మనమంతా ఆశిద్దాం.
ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయాల పేరిట అనాగరిక చర్యలు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, లింగ వివక్షత వంటి ఎన్నో సంఘటనల్లో మహిళలు బాధితులు అవుతున్నారు. అమ్మాయిలకు చదువు అవసరమా? అందరూ అమ్మాయిలే పుట్టారా? అంటూనే ఉన్నారు. సావిత్రి భాయి పూలే, రుద్రమ దేవీ, మేరీ క్యూరీ, కల్పనా చావ్లా, టెస్సీ థామస్, మలాలా, ఆంగ్ సాన్ సూకీ, ద్రౌపది ముర్ము, సునీతా విలియమ్స్ వంటి వారి జీవితాలు కొన్ని శతాబ్దాలకు ప్రేరణా పాఠాలు అవుతాయి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన “ఆమె” ఆలోచనలు నేడు అన్నిరంగాల్లో విశ్వాన్వేషణలో అంతరిక్ష హద్దులను దాటుకుంటూ రాకెట్ లా ముందుకూ వెళ్తూనే ఉన్నాయి.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.