
దేశమంటే మట్టికాదోయ్ ,దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ.. కాని ఇప్పుడు దీన్ని కొద్దిగా మార్చాల్సి వస్తోంది.. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే అప్పులోయ్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా అప్పులు చేస్తున్నాయి. దేశాన్ని అప్పుల ఊబి లోకి లాగుతున్నాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా బాగానే పోటీపడుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు చూస్తే మతిపోతోంది.
దేశంలో ఆయా రాష్ట్రాలు అప్పు ఊబిలో కూరుకుపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో భారీ అప్పులతో టాప్ -10 రాష్ట్రాలను చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లు కూడా టాప్ 10 జాబితా లోనే వున్నా ఏడెనిమిది స్థానాలకు రావడం కొంత మెరుగే.
దేశంలో అనేక రాష్ట్రాల్లో అప్పుల భారీ పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది.గత ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రాల అప్పులలో భారీ పెరుగుదల ఉందని ఆర్బీఐ చెబుతోంది. రాష్ట్రాల్లో అప్పుల భారం దాదాపు 74% పెరుగుదల ఉందని చెబుతోంది.
2019 సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు రూ.47.9 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది రూ.83.3 లక్షల కోట్లకు పెరిగింది. 2024లో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాలను గమనిస్తే , తమిళనాడు రూ. 8.3 లక్షల కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉంది.
ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ అప్పు రూ. 7.7 లక్షల కోట్లు. ఇక 7.2 లక్షల కోట్ల అప్పులతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రూ. 6.6 లక్షల కోట్ల అప్పులతో నాల్గవ స్థానంలో ఉంది. అలాగే 6 లక్షల కోట్లతో కర్ణాటక ఐదవ స్థానంలో ఉంది. భారతదేశంలో రాజస్థాన్ రూ. 5.6 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రూ. 4.9 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది.
అయితే ఆర్బీఐ లెక్కల ప్రకారం చూపించిన ఆంధ్రప్రదేశ్ అప్పు 4.9లక్షల కోట్లు కేంద్రం ,ఆర్బీఐ, దానిపరిధిలో నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా చేసిన అప్పు .మరో 5లక్షల కోట్లు అప్పూ వుందని ప్రభుత్వమే చెబుతోంది. అంటే మొత్తం అప్పులు సుమారు 10 లక్షల కోట్లు ఉందన్నమాట. కార్పొరేషన్ల పరంగా ఇతరత్రా ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ మే అప్పులు చేసింది.
గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల పరంగా ఏపీ బడ్జెట్ గణాంకాలను అనుసరించి ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. దానిప్రకారం ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతున్నా, అంతకుమించి వ్యయం కూడా పెరుగుతోంది. అయితే మూడు సంవత్సరాలుగా ఆర్థిక లోటును తగ్గించుకునే ప్రయత్నం జరుగుతోంది.2022-23 సంవత్సరంలో ఆదాయం అంచనా లక్షా 57 వేల 768 కోట్లు కాగా, వ్యయం 2లక్షల ఒక వేయి255 కోట్లు గా వుంది.
అంటే ఆర్థిక లోటు 43వేల487 కోట్లు గా వుంది.2023-24 లో ఆదాయం లక్షా 73వేల 767 కోట్లు కాగా, వ్యయం 2లక్షల12వేల449గా వుంది. రెవెన్యూ లోటు 38వేల 682 కోట్లు, అదేరీతిలో 2024-25 బడ్జెట్ అంచనాలలో ఆదాయం 2లక్షల ఒక వేయి 173 కోట్లు కాగా, వ్యయం 2లక్షల 35 వేల 917 గా వుంది. ఆర్థిక లోటు 34వేల 743 కోట్లుగా వుంది.
అయితే 2018-19లో వృద్ధిరేటు 11.14 శాతం ఉందని, వైసీపీ హయాంలో అది 10.32 శాతానికి తగ్గింది. రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం లేదా అంతకంటే పైస్థాయిలో ఉంటేనే వైసీపీ హయాంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లించగలుగుతాం. వైసీపీ హయాంలో కూడా వృద్ధిరేటు అంతకుముందు స్థాయిలోనే పెరిగి ఉంటే గత ఐదేళ్లలో జీస్స్డీపీ అదనంగా రూ.7 లక్షల కోట్లు పెరిగి ఉండేది. అధిక వడ్డీలకు అప్పులు చేసే అవసరం ఉండేది కాదు.ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ధిక శ్వేత పత్రాలు విడుదల చేస్తూ చెప్పిన మాటలు. 2022-23లో వైసీపీ ప్రభుత్వం రూ.67,000 కోట్ల అప్పులు తెచ్చింది.దీనిలో మూలధన వ్యయం రూ.7,244 కోట్లే. తెచ్చిన అప్పులకు తోడు ఆదాయం పెరగకపోవడంతో అప్పుల చెల్లింపు సామర్థ్యం సున్నాకు చేరుకుంది. తెచ్చిన అప్పుల సొమ్మును దుబారా చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గింది. అప్పులు 16.5 శాతం మేర, వడ్డీ 15 శాతం మేర పెరిగింది. ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూలధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల కారణంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది అంటూ చంద్రబాబు వివరించారు.
గత ఐదేళ్లలో ఖర్చులు 11.5 శాతం పెరిగాయని, నిర్వహణ పేరుతో దుబారా ఖర్చులే అధికంగా ఉన్నాయి.. జీఎస్ డీపీలో సొంత ఆదాయం 7.1 నుంచి 6.4 శాతానికి తగ్గిపోయింది. 2014-19 మధ్యలో అప్పుల చెల్లింపు సామర్థ్యం 22.7 శాతం ఉండగా, 2022-23లో సున్నాకు చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.. ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో మూలధన వ్యయం 2014-19 మధ్యలో 59.15 శాతం, 2019-24 మధ్య 22.54 శాతంగా ఉంది.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తక్షణ కర్తవ్యంగా మూలధన వ్యయం, రెవెన్యూ వనరులు పెంచుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ అమలు చేయాల్సివుంది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో 3 లక్షల 47 వేల 944.64 కోట్ల రూపాయల అప్పును తీర్చాలి. అంటే అసలు, వడ్డీని తీర్చేందుకు ఏడాదికి సుమారు 40 వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమర్పించిన లెక్కల ఆధారంగా కాగ్ ఈ లెక్కలను తేల్చింది. వివిధ కార్పొరేషన్ల అప్పులు, ఇతర పెండింగు చెల్లింపుల భారాలు కలిపితే రాబోయే ఐదేళ్లలో ఏడాదికి 93 వేల కోట్ల నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయలకు ఈ చెల్లింపుల భారం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఇక ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్రాల పరంగా 2021-22 నుండి 2023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఏకీకృత స్థూల ఆర్థిక లోటును GDPలో 3 శాతం లోపలే ఉంచుకున్నాయి. ఆదాయ లోటును GDPలో 0.2 శాతం వద్దనే కొనసాగించాయి. నిరంతరం అధిక రుణ స్థాయిలు, ఆకస్మిక బాధ్యతలు , పెరుగుతున్న సబ్సిడీ భారం వృద్ధిని పెంచే మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఇస్తూ మరింత ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2024-25లో, రాష్ట్రాలు GDPలో 3.2 శాతం GFD బడ్జెట్తో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించాయని వెల్లడించింది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.