
ఎపిసోడ్ 2: అత్యంత పవిత్రమైనది, అభివృద్ధికారకమైనది
అత్యంత పవిత్రమైనది, అభివృద్ధికారకమైంది ఏంటి అనే విషయాన్ని ఎవరినైనా అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. కొందరు దేవుడంటారు, ఇంకొందరు దైవీ శక్తి అంటారు. మరి కొందరు అందరి ఆకలి తీర్చేది ఆహారం కాబట్టి ఆహారం అంటారు. లేదా శ్రమశక్తి, ఐక్యత ఇలా ఎవరి సిద్ధాంతాలకు, భావజాలాలకు అనుగుణంగా వారి వారి సమాధానాలు వస్తాయి. అంతా సాపేక్షమని అనుకోవచ్చు. లేదా వారి వారి దృక్పథాలకు అనుగుణంగా వారి వారి సమాధానాలు ఉంటాయి. అయినంత మాత్రాన అవే సరైన సమాధానాలా? అవును/కాదు.
ఈ ప్రపంచంలో ప్రశ్న నిజానికి అత్యంత పవిత్రమైంది. ప్రశ్న నుంచి ఆలోచననా? లేక ఆలోచన వల్ల ప్రశ్నా అనేది, గుడ్డు ముందా పక్షి ముందా? లేక చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న లాంటిదేనని చెప్పాలి. ఇలాంటి మానవ ఆలోచనలు ఎక్కువై కాలానుగుణంగా పరిణామం చెంది ఎన్నో రహస్యాలను, మరెన్నో దిగ్విజయాలు కనుగొనటానికి కారణమయ్యాయి.
ప్రశ్నాలోచనమ్..
సరే! ఇంతకూ ప్రశ్న ముందా? ఆలోచన ముందా? దాని గురించి చర్చోపచర్చలు చేసే బదులు ప్రశ్నాలోచనమ్ అనుకుందాం. ప్రశ్న మానవ మనుగడకు, అభివృద్ధికి మూలమైంది. ఒక మనిషి పుట్టటానికి కారణం అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరూ ఎలా విడదీయలేని కారణాలుగా ఉంటారో, సమాజ- ప్రపంచ పురోగతికి ప్రశ్న, ఆలోచన అన్నవి కూడా విడదీయలేని కారణాలుగా ఉంటాయి. అలాంటి ప్రశ్నే ఆధునిక సైన్సు అభివృద్ధికి దారి తీసింది.
ఏంటా ప్రశ్న?
ఈ భూమి నిజంగా విశ్వానికి కేంద్రమా? టాలెమీ చెప్పింది సరైనదేనా? క్లాడియస్ టాలెమీ(Claudius Ptolemy), రెండవ శతాబ్దంలో జీవించిన గ్రీక్- రోమన్ ఖగోళ, గణిత శాస్త్రవేత్త. ఆయన ఖగోళ శాస్త్రంలో భూకేంద్ర సిద్ధాంతాన్ని(Geocentric Model)ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం కేంద్రంలో భూమి స్థిరంగా ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు భూమి చుట్టూ పరిభ్రమిస్తాయని టాలెమీ విశ్వసించాడు. విశ్వసించాడు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువులు భూమి చుట్టూ సంపూర్ణ వృత్తాకార కక్ష్యలలో(Circular Objects)తిరుగుతాయని టాలెమీ చెప్పాడు.
గ్రీకు తత్త్వశాస్త్రంలో వృత్తం ఒక “పరిపూర్ణ” ఆకారంగా పరిగణించబడేది. వృత్తం ప్రాధాన్యతను తలతన్యత(Surface Tension)గురించి ప్రస్తావించేటప్పుడు వివరంగా తెలుసుకుందాం. గ్రహాల కదలికలు ఎప్పుడు సమానంగా లేవని, కొన్నిసార్లు వెనక్కి తిరిగినట్టు(Retro-grade Motion)కనిపిస్తాయని గమనించిన తరువాత, టాలెమీ(తనకు తాను ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు, సమాధానం కోసం అన్వేషించాడు) ఈ వైరుధ్యాన్ని వివరించడానికి “ఎపిసైకిల్స్” అనే భావనను ప్రతిపాదించాడు. దీని ప్రకారం, గ్రహాలు పెద్ద వృత్తం(defer-ent)లో భూమి చుట్టూ తిరుగుతూ, అదే సమయంలో చిన్న వృత్తాలలో(epicycles)కూడా పరిభ్రమిస్తాయి. గ్రహాల కదలికలను మరింత కచ్చితత్వంతో వివరించడానికి, టాలెమీ”డిఫరెంట్”(పెద్ద కక్ష్య), “equant”(ఒక ఊహాజనిత కేంద్ర బిందువు) అనే భావనలను ఉపయోగించాడు. ఇవి గ్రహాల కదలికలను గణిత శాస్త్రపరంగా లెక్కించడానికి సహాయపడ్డాయి. ఆ రోజులకు అవి శాస్త్ర పరిశోధనలలో ఎన్నదగిన విజయాలుగా భావించవచ్చు. అయినా, ఆలోచనలు- ప్రశ్నలు ఆగిపోకూడదు కదా! ఈ సిద్ధాంతాన్ని ఆయన తన ప్రసిద్ధ గ్రంథం”అల్మాజెస్ట్”(Almagest)లో వివరించాడు.
సిద్ధాంత సంక్లిష్టత..
ఈ గ్రంథం దాదాపు 1,400 సంవత్సరాల పాటు ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా నిలిచింది. టాలెమీ సిద్ధాంతం ఆనాటి విఙ్ఞానంతో ఖగోళ గమనాలను గణితశాస్త్రపరంగా వివరించడంలో విజయవంతమైంది. ఇది ఐరోపా, తరువాత కాలంలో అరబ్ ప్రపంచంలో శాస్త్రీయ అధ్యయనాలకు ఆధారం అయింది. కానీ, ప్రశ్న అన్నది ఇక్కడితో ఆగిపోలేదు. పైగా టాలెమీ సిద్ధాంతం చాలా సంక్లిష్టంగా ఉండేది. “ఏదైనా విఙ్ఞాన శాస్త్ర విశేషాన్ని అత్యంత సులువుగా వివరించలేకపోతే మీకు ఆ విషయం అర్థం కానట్టే” అని రిచర్డ్ ఫైన్మన్(Richard Feynman)అంటారు.
సంక్లిష్టంగా ఉండడంతో టాలెమీ సిద్ధాంతం కూడా గ్రహాల కదలికలను పూర్తిగా వివరించలేకపోయింది. ఇక్కడే మన తొలి కథానాయకులు వస్తారు. నికోలాస్ కోపర్నికస్, జొహానెస్ కెప్లర్, గలిలేవ్ గలిలియ్ తమ తమ కాలాల్లో పరిశోధనలు చేశారు. ఈ శాస్త్రవేత్తలు విఙ్ఞానశాస్త్రం మరింత వేగంగా అభివృద్ధి చెందటానికి కారణమయ్యారు.
Throughout the centuries there were men who took first steps down new roads armed with nothing but their own vision. Their goals differed, but they all had this in common: that the step was first, the road new, the vision unborrowed, and the response they received— hatred. The great creators —the thinkers, the artists, the scientists,the inventors —stood alone against the men of their time. Every great new thought was opposed. Every great new invention was denounced. The first motor was considered foolish. The airplane was considered impossible. The power loom was considered vicious. Anesthesia was considered sinful. But the men of unborrowed vision went ahead. They fought, they suffered and they paid. But they won. ఈ వ్యాక్యాలను ఐన్ ర్యాండ్ ద ఫౌంటెన్హెడ్లో రాశారు. పైన చెప్పిన శాస్త్రవేత్తలంతా కచ్చితంగా అలాంటి వారే. తమ తమ కాలాలకు, అప్పటి నమ్మకాలకు, ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగానో, వాటికి ఎదురీదో సత్యశోధన చేసినవారే. ఆయా కాలాల్లో ఉన్న మతాధికారుల చేతో, ఇతర అధికారుల చేతో శిక్షింపబడిన వారే. కానీ, వారి వారి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం ఏ మాత్రం ఆపలేదు. సత్యశోధనను విరమించలేదు. జీవితాలను పణంగా పెట్టి విజ్ఞానశాస్త్ర పరిధులను విస్తరింపజేశారు.
సత్యాన్వేషణ కోసం జీవితాలు అంకితం..
‘మానవ శోధనాచరిత్రలో, అజ్ఞానం అనే పొగమంచు తరచుగా ప్రజల మనసును మసకబార్చినపుడు, జ్ఞానం అనే వెలుతురు మూఢనమ్మకాలు, పసలేని ఊహాగానాల గాలికి కొట్టుమిట్టాడినప్పుడు, కొందరు బుద్ధిజీవులు ఆ వెలుతురుకు చేతులు అడ్డుపెట్టి కాపాడే ప్రయత్నం చేశారు.’ ఆ సజ్జనులు, వారి మనస్సులు సత్యాన్వేషణ మీద కేంద్రీకృతమై, తమ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు తమ జీవితాలను అంకితం చేశారు.
ఇది మూఢత్వం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ అదే జీవితం అనుకునే వారి కథ కాదు. అఙ్ఞానపు చీకట్లను తమ మేధోకాంతితో సవాలు చేసిన అనేకమంది మహోన్నత వ్యక్తుల చరిత్ర. వారు చేసిన పరిశోధనలు, వాటి ప్రభావాలు, వారు ఏర్పరచిన సిద్ధాంతాలు, వాటి వెనుక ఉన్న కృషి, ఆ సిద్ధాంతాల వివరాలు. ప్రశ్ననే ఆయుధంగా చేసుకుని మానవ పురోగతికి కారకులైన ధన్యజీవుల కృషి. వారి కోరిక ఒక్కటే, మానవులంతా అఙ్ఞానపు చెరల నుంచి తప్పించుకుని సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే. ఇక మనం కోపర్నికస్తో మొదలు పెట్టి ఆధునిక విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి క్రమాన్ని, అనేకానేక సైన్స్ విషయాల గురించి తెలుసుకుందాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.