
బ్రిటన్ పార్లమెంట్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సేవలను గుర్తించి, లైఫ్ టైమ్ అచ్ఛీవ్ మెంట్ అవార్డు అంజేసింది. ఇది పతాకశీర్షికను ఎక్కిన వార్త. అయితే చిరంజీవికి బ్రిటన్ పార్లమెంట్ అవార్డు వార్తల వెనుక అసలు వాస్తవం గమనిస్తే….
మన మెగాస్టార్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని బ్రిటన్ పార్లమెంట్ భవనంలోనే పలువురు ఆదేశ ఎంపీల సమక్షంలో నే అందుకున్నారు. ఈ నెల 19 న జరిగిన కార్యక్రమం బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందా? బ్రిటన్ ప్రభుత్వం తరుపునే చిరంజీవి ఆ అవార్డు అందుకున్నారా… ఇది ఇప్పుడు సాగుతున్న చర్చ. బ్రిటన్ ప్రభుత్వం ఎక్కడో భారత దేశంలో తెలుగు రాష్ట్రం లో వున్న వ్యక్తిని ఎందుకు గౌరవించింది. ఇంతకుముందు బ్రిటన్ ప్రభుత్వం ఎవరైనా ప్రముఖులకు ఇలాంటి పురస్కారాలను అందించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే… మెగాస్టార్ చిరంజీవిని బ్రిటన్ లో సత్కరించి లైఫ్ టైం అచ్ఛీవ్ మెంట్ అవార్డు ను అందించారు గాని, అది బ్రిటన్ ప్రభుత్వం తరుపున అధికారికంగా ఇచ్చిన అవార్డు కాదు. అవార్డు ప్రధాన కార్యక్రమం మాత్రం బ్రిటన్ పార్లమెంట్ భవనంలో జరిగింది.బ్రిటన్ అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా చిరంజీవిని గౌరవంగా సత్కరించారు.అవార్డు అందజేసింది, కార్యక్రమం నిర్వహించింది మాత్రం బ్రిడ్జ్ ఇండియా సంస్థ. ఆ సంస్థ తరపున ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను చిరంజీవికి ప్రదానం చేశారు.
అయితే గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ అవార్డు తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవికి వచ్చినట్లు , ప్రధాన పత్రికలు, మీడియా మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా పలువురు ప్రముఖులు కూడా చిరంజీవికి బ్రిటన్ పార్లమెంట్ అవార్డు దక్కడం అరుదైన ఘనతగా ట్వీట్ చేసి అభినందించారు. అయితే బ్రిటన్ పార్లమెంట్ భవనంలో కార్యక్రమం నిర్వహించి బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవిని సన్మానించడంతోనే బ్రిటన్ ప్రభుత్వమే అవార్డు అందించిందన్న ప్రచారం జరిగింది.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకేలోని ప్రముఖ సంస్థ, వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన వ్యక్తులను ఆ సంస్థ కొన్ని సంవత్సరాలుగా గౌరవిస్తూ వస్తోంది.
బ్రిటన్ పార్లమెంట్ నేరుగా అవార్డులు గతంలో ఇచ్చిందా?
బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా విశిష్ట వ్యక్తులను గౌరవించి, అవార్డులు అందజేయడం చేయకున్నా, బ్రిటన్ పార్లమెంట్ భవనంలో పలు కమిటీల ఆధ్వర్యంలో పార్లమెంట్ భవనంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.2022లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) డైరెక్టర్ తనుజా నేసారి కూడా ఆయుర్వేద రత్న అవార్డును బ్రిటన్ పార్లమెంట్ లోనే అందుకున్నారు. AIIA డైరెక్టర్ తనుజా కు UK పార్లమెంట్ ఆయుర్వేద రత్న అవార్డును ప్రదానం చేసింది అంటూ ప్రధాన మీడియా లో వార్తలు వచ్చాయి. , భారతదేశం తో పాటు విదేశాలలో ఆయుర్వేద వృద్ధిని మరింతగా పెంచడంలో ఆమె చేసిన కృషిని బ్రిటన్ గుర్తించింది. గ్రేట్ బ్రిటన్‌లో ఆయుర్వేదం , యోగా రాయబారి అమర్జీత్ ఎస్ భమ్రా, UK పార్లమెంట్ ఎంపీ వీరేంద్ర శర్మ , UK పార్లమెంట్ ఎంపీ ITSappg చైర్మన్ బాబ్ బ్లాక్మాన్ వంటి ప్రముఖులతో కూడిన ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ (ITSappg) ఆధ్వర్యంలో ఆమెను సత్కరించి అవార్డు అందించారు.
ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిడ్జ్ ఇండియా సంస్థ బ్రిటన్ పార్లమెంటులో ఘన సన్మానం జరిపి లైఫ్ టైం అచ్ఛీవ్ మెంట్ అవార్డు అందించింది.. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా మెగాస్టార్ కు ఈ అవార్డు వరించింది.ఈ వేడుకకు పలువురు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
చిరంజీవి కి అవార్డులు కొత్తకాదు
మెగాస్టార్ చిరంజీవి భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గత ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను అందుకున్నారు. పలు చిత్రాల్లో ఆయన విభిన్నంగా వేసిన స్టప్ లకు గాను ఆ అవార్డు లభించింది. ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును కూడా మెగాస్టార్ అందుకున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదిక బ్రిటన్ పార్లమెంట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జీవితకాల సాఫల్యం పురస్కారాన్ని అందుకోవడంతో చిరంజీవి ఖ్యాతి మరింత పెరిగింది.
బాలకృష్ణ ఎం సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.