
“రజాకార్ సినిమా” తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించిన సినిమా అని, మత ఘర్షణలను ఉసిగొలిపేలా ఉందని ప్రముఖ సామాజిక రచయితలు, చరిత్రకారులు తమ వ్యాసాల్లో ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. అలాంటి సినిమాకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, చారిత్రక సినిమా విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డును ప్రకటించి ప్రదానం చేసింది. దీనిని బట్టి వక్రీకరించబడిన చరిత్ర వాస్తవమేనని ప్రభుత్వమే నిర్ధారించినట్లు కాదా? పైగా గద్దర్ లాంటి విప్లవకారుడి పేరుతో ఈ అవార్డును ఇవ్వడం, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? దేశంలోనే తమది లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విషయంలో ఇలా వ్యవహరించడం చారిత్రక తప్పిదమే అవుతుంది.
“పుష్ప- 2” సినిమాలో స్మగ్లర్ పాత్ర పోషించి, అశ్లీల అంశాలలో లీనమై, పోలీసు అధికారులను కించ పరిచిన పాత్రధారికి గద్దరు అవార్డును ఇవ్వడంతో యువతకు ప్రభుత్వం ఏ సంకేతం ఇద్దామని అనుకుంటుంది? అసలు యువతకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తుంది? ఈ చర్య అక్రమాలను, దుర్మార్గాన్ని, అవినీతిని, ప్రేరేపిస్తున్నట్లు కదా? బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థను కించపరిచినట్లు కాదా? ప్రభుత్వాలు ఇలాంటివాటి కోసం అవార్డులు ప్రకటిస్తే నేర ప్రవృత్తిని ప్రోత్సహించినట్లే కదా? ఇది అవార్డుల నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.
బెస్ట్ క్రిటిక్ ఎంట్రీ రాలేదని, ఆ విభాగానికి అవార్డు లేదని ప్రకటించి, హఠాత్తుగా ఒక రోజు ముందు బెస్ట్ క్రిటిక్ ‘పొన్నం రవిచంద్ర’ అని డిక్లేర్ చేయడం సబబా? ఇది చూస్తుంటే ఏవిధంగా, ఏ అండర్ స్టాండింగ్‌తో అవార్డులను పంచేసుకున్నారో అర్థమవుతూనే ఉన్నది. ఉర్దూ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటిస్తామన్న ప్రభుత్వం, ఉర్దూ భాష తెలిసిన వారితో జ్యూరీ కూడా ఒకటి పెట్టాలి కదా? 10 సంవత్సరాల అవార్డులలో ఉర్దూ సినిమాల వారికి అవార్డులు ఎందుకు ప్రకటించలేదు?
2024 సంవత్సరంలో తీసిన సినిమాలకు దరఖాస్తులను ఆహ్వానించి, 2014 నుంచి 2023 వరకు ఎంపిక చేసే సినిమాలకు దరఖాస్తులు ఎందుకు సేకరించలేదు? ఒకవేళ సెన్సార్ అయిన దాదాపు 2000 సినిమాలను ఒక్క నెలలోనే ఎలా చూశారు? సినిమాలను చూడకుండా ఎంపికచేయడం, చట్ట విరుద్ధం కాదా? ఇష్టం వచ్చినోళ్లకు ఇష్టమొచ్చినట్లు ఇచ్చుకున్నట్లే కదా? ఇది ఎంత అన్యాయం.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాలు సినిమాల్లో పనిచేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వకుండా వట్టి నిర్మాతలకే ఎందుకు ఇచ్చారు? అవార్డుల లక్ష్యం కళాకారులను ప్రోత్సహించడానికే కదా? వారిని విస్మరించి, పెట్టుబడిదారులకు మాత్రమే ప్రజా సొమ్మును ఎందుకు ధారపోసినట్లు? టీఎఫ్‌డీసీ చైర్మన్ నిర్మాత కాబట్టేనా? ఇందులో ఏం మతలబు ఉన్నదో తెలియాలి? పదేండ్లు వివిధ శాఖల్లో పనిచేసిన సినీ కళాకారులకు సమాధానం చెప్పాలి.
టీఎఫ్‌డీసీ చైర్మన్‌కు సంబంధించిన నాలుగు సినిమాలు ఎంపిక చేసుకోవడం ఏంటి? సినిమాల్లో పనిచేసిన వాల్లే జ్యూరీలో ఉండడం, వారి సినిమాలకు వారే అవార్డులు ఇచ్చుకోవడం ఎంత అన్యాయం. ఇది నిబంధనలకు విరుద్ధం.
అవార్డులకు అర్హత కలిగిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. జ్యూరీ కమిటీలు వాటిని ఎందుకు చూడలేదు? అన్నిగనం సినిమాలు 15- 20 రోజుల్లో చూడడం ఎలా సాధ్యమౌతుంది? అవకతవకలు జరిగినట్లే కదా? మీరు ఎంపిక చేసిన విధానం, ఎంపికైన సినిమాలే ఈ వ్యవహారానికి సాక్ష్యాలు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల, ప్రభుత్వ ఖజానాతో ఒక జిగేల్ మనిపించే కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ దానికి తగిన ఫలితం కన్నా ప్రజల్లో వ్యతిరేకతనే కొని తెచ్చుకుంటున్నారు. అవసరమా ఇదంతా? తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణా సినిమా పాలసీ తయారు చేసుకొని, మంచి కళాత్మక సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించాక, బహుమానాలు ఇచ్చుకునే పని పెట్టుకుంటే బాగుంటది. తెలంగాణా కళాకారుల పారలల్ సినిమాలే లేవు, గద్దర్ స్ఫూర్తికి నిదర్శనమయ్యే సినిమాలే లేవు.
మీదికెల్లి ఎవరి పేరు మీద అయితే అవార్డులున్నాయో ఆయనకు, తీసుకునే వాళ్లకు ఏమన్నా సంబంధం ఉందా అసలు?
సయ్యద్ రఫీ
(ఫిల్మ్ డైరెక్టర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.