
పూణేలోని ఇంద్రాయణి నది మీద నిర్మించబడిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన మరమత్తు పనులు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి. వంతెన మరమ్మత్తు చేయాలని, పర్యాటకుల రాకపోకల మీద అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు రెండు సంవత్సరాల క్రితం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్తో పాటు గ్రామ పంచాయతీకి డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: జూన్ 15 ఆదివారం నాడు పూణే సమీపంలోని ఒక వంతెన కూలడంతో నలుగురు మృతి చెందారు. 50 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు.
ఎన్డీటీవీ కథనం ప్రకారం, దాదాపు 15 గంటల వరకు కొనసాగిన రక్షణా చర్యలు సోమవారం ఉదయం ముగిసాయని అధికారులు తెలిపారు. మొత్తం 55 మందిని కాపాడడం జరిగిందని, నలుగురు మృతులలో ముగ్గురిని గుర్తించామని అధికారులు చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఈ ఘటన మీద స్పందించారు. వంతెన కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారని, 32 మంది గాయపడ్డారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే పూణే నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ఉత్తర- పశ్చిమ కుందమాలాలో ఇంద్రాయణి నది మీద ఈ వంతెన నిర్మించబడి ఉంది.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనే ఘటన స్థలం వద్దకు చేరుకున్నారని, ఆరుగురిని రక్షించారని ఫడ్నవీస్ అన్నారు.
25 నుంచి 50 మంది పర్యాటకులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు అనుమానం ఉందని ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే తెలియజేశారు.
ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందిస్తూ, ప్రాథమిక సమాచారం మేరకు ఈ వంతెన పరిస్థితి శిథిలావస్థలో ఉందని పేర్కొన్నారు.

38 మందిని కాపాడడం జరిగిందని, అందులో 30 మంది ఆసుపత్రిలో ఉన్నారని పూణే జిల్లా మెజిస్ట్రేట్ జితేంద్ర డూడీ ద్వారా వార్తా సంస్థ పీటీఐ పేర్కొన్నది. ది హిందూ ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం దాదాపు మూడు గంటల పరిధిలో జరిగింది.
వంతెన కూలే సమయంలో పర్యాటకులు, బైక్ నడిపేవారు దానిని ఉపయోగిస్తున్నారని ఒక అధికారి చెప్పినదానిని ది హిందూ పేర్కొన్నది. అంతేకాకుండా గత కొన్ని రోజులలో దీని దరిదాపు ప్రాంతాలలో భారీ వర్షం కురిసిందని పేర్కొన్నది.
మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్-గ్రేషియాను, క్షతగాత్రులకు చికిత్సా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఫడ్నవీస్ ప్రకటించారు.
“ఈ విషాదకర ఘటన మీద లోతైన విచారణ చేయడానికి ప్రభుత్వ అధికారులకు నిర్దేశించబడింది. నిహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టు విచారణలో తెలిస్తే, బాధ్యులకు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నాను”అని పవార్ అన్నారు.
దీర్ఘకాలంగా ఆగిపోయిన వంతెన మరమ్మత్తులు..
ఎన్డీటీవీ ప్రకారం, వంతెన 470 ఫీట్ల పొడవుతో ఉంది. రాతితో నిర్మితమైన దీని మొదటి భాగం దాదాపు 70 నుంచి 80 ఫీట్ల ఏటవాలుగా ఉంది. మళ్లీ దీనిని 100 ఫీట్ల పొడవున్న రెండు లోహాల భాగాలు, 200 ఫీట్ల పొడవు సిమెంట్ భాగాలతో కలపడం జరిగింది. వంతెన వెడల్పు కేవలం నాలుగు ఫీట్లు మాత్రమే ఉంది.
అధికారుల ప్రకారం, వంతెన చాలా ఇరుకైనది. ఒకసారి కేవలం ఒక బైక్, ఇద్దరు వ్యక్తులు మాత్రమే దీనిని దాటగలరు. అయినప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ప్రజలు ఎక్కువమొత్తంలో వంతెన మీద ఉండడమే కాకుండా దాదాపు 7 నుంచి 8 బైక్‌లు కూడా ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలలో వంతెన మరమ్మత్తు పనులను అధికారులు చేయించలేదు. రెండు సంవత్సరాల క్రితం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీకి స్థానికులు లేఖ రాశారు. ఆ లేఖలో వంతెన మరమ్మత్తులు చేయాలని, పర్యాటకుల రాకపోకలను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో రక్షణాపరంగా కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. పదేపదే స్థానిక గ్రామ ప్రజల డిమాండ్ తర్వాత ప్రతీ శనివారం వంతెన వద్ద ఒక పోలీసు అధికారిని ప్రభత్వం నియమించి పర్యవేక్షించేలా చేసింది.
మరమ్మత్తు కోసం డబ్బులు..
గత సంవత్సరం బీజేపీ శాసనసభ్యుడు, మంత్రి రవీంద్ర చౌహాన్ కూలిన వంతెన మరమ్మత్తు పనుల కోసం రూ 80,000 విరాళాలను సేకరించారు. అయినప్పటికీ మరమ్మత్తు పనుల కోసం ఈ నిధులను ఉపయోగించలేదు.
2017లో మాజీ శాసనసభ్యుడు దిగంబర్ద భేగాడే ప్రభుత్వానికి లేఖ రాసి, నది మీద ఒక కొత్త వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.