
“రజాకార్” సినిమాకు ఉత్తమ చారిత్రాత్మక చిత్రం అవార్డును రాష్ట్రప్రభుత్వం నియమించిన జ్యూరీ ప్రకటించింది. ఈ సినిమాను నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న, రాసిన అనేకమంది అనుభవాలను తీసుకుని వాస్తవ ఘటనల ఆధారంగా తీశామని సినీ బృందం ముందుమాటలో పేర్కొన్నది. ఏ వ్యక్తులను, ఏ ఘటనలను ఆధారంగా తీసుకున్నారో ఖచ్చితంగా మాత్రం చెప్పలేదు. పిడికెడు పప్పు తట్టెడు ఊక కలిపి ఊకనే చరిత్ర అనుకోమన్నారు.
చారిత్రకమైన సినిమాలు తీసేవారికి చరిత్రపై అవగాహన కనీస మాత్రంగా అయినా ఉండి తీరాలి. స్క్రిప్ట్ రచయితలకు కొంచెమైనా చరిత్రపట్ల నిజాయితీ, నిబద్ధత ఉండాలి. మంచయినా చెడయినా చరిత్ర మారదు. నాటి ఘటనల ఆధారంగా కల్పనలు చేయటం, పాత్రలు ఆయా స్వభావాలతో రూపొందించడానికి ఆనాటి కాల పరిస్థితులు, ప్రభావాలు, ప్రాధాన్యతలు అర్ధమై ఉండాలి. ఈ లక్షణాలు “ఉమర్ ముక్తార్” వంటి గాథల్లో మనకు కనబడతాయి. వాస్తవానికి కథనానికి చిక్కదనం తీసుకురావడం కోసం ఆ చిత్రకర్తలు పడిన తపన సినిమాలో కనిపిస్తుంది.
ఒక ఎజెండా కోసం సినిమాలు తీయదల్చిన వారు ఆయా ఘటనల్లో వారికి పనికి వచ్చే వాటిని ఏరి వాటికి సందర్భంతో సంబంధం లేకుండా మలుస్తారు. కాబట్టి ఆ చిత్రం చారిత్రక కాల్పనిక గాథ కూడా కాకుండా చౌకబారు హింసాత్మక ప్రదర్శనగా మిగిలిపోతుంది. కాబట్టి రజాకారు సినిమా చరిత్ర కాదు. అది చరిత్రపై ఆధారపడిన కల్పితగాథ కూడా కాదు. ఎందుకంటే ఏ కథ, కళారూపం అయినా ఎవరి మధ్య ఏ ప్రయోజనాల మధ్య వైషమ్యం వల్ల ఆ కథనం సాగుతున్నది అనేది స్పష్టంగా తెలుసుకునే ముందుకు సాగాలి. “రజాకార్” సినిమా చూపిన వైషమ్యం రెండు మతాల మధ్య ఘర్షణ. కానీ తెలంగాణ ప్రజా సాయుధ పోరాటం భూమికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగింది. కనీసం తెలంగాణ సాయుధ పోరాటం గురించి సాగిన వందల వేల పరిశోధనల్లో ఒకవంతు రచనలు, పరిశోధనలు అయినా చిత్ర కర్తలు పరిశీలిస్తే ఇది రెండు మతాల మధ్య ఆధిపత్యం కోసం సాగిన పోరాటం కాదు అనే కనీస పరిజ్ఞానం కలిగి ఉండేది.
తెలంగాణ సాయుధ పోరాటం ఏ ఆధారాలు మిగల్చకుండా సహస్రాబ్దాల క్రితం ముగిసి పోయిన వీరగాథ, పుక్కిటిపురాణం కాదు. ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్లు, నాయకత్వం వహించిన వాళ్లు నిన్నా మొన్నటి దాకా మన మధ్య ఉన్నారు. ఇంకా కొద్ది మంది అటువంటి చారిత్రక వ్యక్తులు బతికే ఉన్నారు. వేలకొద్ది పేజీల చరిత్ర రచన సాక్ష్యంగా ఉన్నది. అమరుల స్థూపాలు అడుగడుగునా ఉన్నాయి. పాటలరూపంలో ఈ పోరు ఇంకా జనం నోట అమరత్వం పొందుతూనే ఉంది.
అబద్దం ఆడినా అతికినట్టు ఉండాలి…
అయినా గాని పొంతన లేని అబద్ధాలతో ఈ సినిమా తయారైంది. ఈ సినిమాలో చూపిన కథనానికి ఒక నిర్ణీతకాలం ఉంది. దేశానికి స్వతంత్య్రం వచ్చాక నిజాంతో కుదుర్చుకున్న యధాతథ ఒడంబడిక ప్రకారం బ్రిటిష్ రాణిలాగే నిజాం రాష్ట్రాన్ని ఒక రాజ్యంగా గుర్తించారు. దానికి పోలీసు, మిలట్రీ, రెవెన్యూ వ్యవస్థలు ఉండేవి. రజాకార్లు(స్వయం సేవకులు) 1946 నుంచి 1948 వరకూ నిజాంకు ఒక ముస్లిం పాలకుడు షరియా ప్రకారం పరిపాలించాలనే కోరికపై అతని చుట్టు ప్రైవేటు సైన్యం ఏర్పడింది. ఈ సైన్యంలో “అనల్ మాలిక్” అంటే ప్రతివాడూ నవాబే అనే భ్రమలో చేరిన వారు, పనిపాటాలేని లుంపెన్ యువత. నిజంగానే మతఛాందసులు అంతా ఉన్నారు. వీరు గ్రామాలకు వెళ్లి అక్కడి జమిందారు/జాగీర్దారు/ దేశ్‌ముఖ్/ముక్తేదారు పిలుపు మేరకు మిలట్రీ బలగాలతో కలిసిదాడులకు దిగేవారు. ప్రధానంగా ఆంధ్రమహాసభ/కమ్యూనిస్టు కార్యకర్తలు(వీరిని సంగం వాళ్లుగా ప్రజలు పిల్చేవారు) ఎవరైతే భూములు పంచుకున్నారో, వెట్టిచాకిరి రద్దు చేశారో, పన్నులు నిరాకరించారో, ప్రజల భూముల కబ్జాను ప్రతిఘటించారో వారిని, ఆయా ప్రతిఘటన గ్రామాలను లక్ష్యంగా ఈ దాడులు జరిగేవి. హింస, సజీవదహనాలు, అత్యాచారాలు, కాల్పులు, అరెస్టులు అన్ని జరిగేవి.
ఈ సినిమాలో మతమార్పిడి కోసం రజాకార్లు తబ్లిగీ ఫర్మానాతో వెళ్లినట్టు చూపుతారు. నిజాం జారీ చేసిన ఫర్మానాలన్నీ భద్రంగానే ఉన్నాయి. వాటిల్లో ఇది ఎక్కడా లేదు. అట్లాగే వేల పేజీల పోరాట సాహిత్యంలో ఈ పని కోసం రజాకార్లు వచ్చినట్టు కూడా ఎక్కడా ఎవ్వరూ రాయలేదు. నిజాం కాలంలో మతమార్పిడీలు జరిగే ఉంటాయి. కానీ పోరాటకాలంలో పిలకలు, జంధ్యాలు కత్తిరించడం జరగలేదు. జంధ్యం ధరించే కులాల్లో కొంతమంది పోరాటంలో ఉండగా ఎక్కువ కుటుంబాలు కోస్తాంధ్రకు తరలిపోయారు. తెలంగాణ పల్లెల్లో అమ్మదేవతలకున్న ప్రాధాన్యత వల్ల పాతకాలంనాటి గుళ్లకు(పానగళ్లుతో సహా) జనం పోయేదే తక్కువ. అసలు పని పాటలు చేసుకునే జనం ఇంతింతబొట్లు పెట్టుకుని తిరిగేది కూడా కాదు. కుంకుమ పెట్టుకున్న చెమటకు కారిపోయేది. దాన్నంత పట్టించుకునేవారు కాదని మల్లు స్వరాజ్యం చెప్పేవారు. మరి మొత్తం సినిమా చరిత్ర పేరిట ఒక పెద్ద అబద్ధపు ప్రచారానికి దిగింది.
ఎట్లాగంటే సినిమా జరిగిన కాలం చూపించిన ఘటనలకు సంబంధం లేదు. వీరనారి ఐలమ్మ ఘటన 1945- 46 సంవత్సరాల కాలంది. అది కూడా ఆమె వ్యక్తిగత పాత్ర ఉన్న అప్పటికీ గ్రామాల్లో కమ్యూనిస్టుల సహకారంతో ఏర్పడిన వాలంటీరు దళాలు “గుత్పల సంగం” అంతా కలిసి విసునూరు గూండాలను తరిమికొట్టారు. దాడి చేసిన గూండాలకు నాయకత్వం వహించింది “ఓనమాల వెంకడు” గడ్డం సాయిబు కాదు. సందు దొరికిన చోటంతా వీళ్లను క్రూరులుగా చూపడం చరిత్రతో సంబంధం లేకుడా దేనికోసం? పైగా నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చే ప్రయత్నం చేస్తే దాన్ని హిందూ పెద్దలు అడ్డుకున్న క్రమంలో జరిగిన పోరాటం అని మరో చోట చూపించారు. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పురావస్తు బాండాగారంలో సైతం దీని ప్రస్తావన కానీ ఊసు కానీ లేవు. వర్తమాన రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను ఎలా వికృతీకరించవచ్చో అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణగా రజాకార్ సినిమా మిగిలిపోతుంది.
బైరన్ పల్లిలో గుత్పల సంగం బలంగా ఉండేది కనుక అది లక్ష్యం అయ్యింది. దానిపై విడతలు విడతలుగా దాడులు జరిగాయి. కాని పిలక పూజారులు లేరు. ఆ కాలంలో 1944- 46 మధ్యకాలంలో జనం నిస్సహాయంగా లేరు. అప్పటికే వాళ్లు తీవ్రస్థాయిలో పోలీసు మిలట్రీతో తలపడుతున్నారు. పోలీసు రజాకార్లు బంగ్లాల్లో ఉంటున్నారు. రెడ్డి, బ్రాహ్మణ, వెలమ దొరలు పెట్టింది తిని తాగి దాడులకు తెగబడుతున్నారు. కాబట్టి జనం దొరల బంగ్లాలు నేల మట్టం చేయడం ఈ కాలంలోనే ప్రారంభమైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మొత్తం ఘటనల కాలంగాని చిత్రీకరణగాని రెండూ అబద్ధమే అని స్పష్టమవుతుంది.
80 ఏళ్లయి పోయింది ఏదైనా చూపించవచ్చు సినిమాటిగ్గా అనుకొని చేసిన ప్రయత్నం కాదిది. వాస్తవ ఘటనలు జరిగిన ఊరిపేర్లు, వీరుల పేర్లు వాడేసుకుని అంటే దిగుడుబావి నీరంత అబద్దంలో ఒక చెంచా నిజం కలిపి చలామణీ చేయటం అన్నమాట. 1945 నాటికి తెలంగాణ ప్రజలు నైజాంపై పోరడడానికి ఆయుధాలను ఒక్క విజయవాడలో రెండు రోజుల్లో 20 వేలు వసూలు చేసి పంపారు. అంటే నిజాం మిలట్రీ రజాకార్లపై జనం పూర్తి స్థాయిలో తిరగబడి ఉన్నారు. మరి దయనీయంగా భారత మిలట్రీ కోసం ఎదురుచూపు లెక్కడ?
ఆడపిల్ల పన్ను, చావు పన్ను నాటి నిజాం వేయలేదు. మళ్లీ బొంకు. ఉర్దూ అధికారభాషే కానీ కన్నడ, మరాఠీ, తెలుగు స్కూళ్లు పట్టణాల్లో ఉండేవి. నిజాం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఉర్దూ కనుకనే ఆంధ్రమహాసభ డిమాండ్లలో తెలుగు ఉండేది. భాషాసాంస్కృతిక సమస్యలుండేవి. కానీ ఉర్దూ మాట్లాడమని ఉపాధ్యాయుడి వేలు నరకడం, పసిబిడ్డలని చంపడం ఎక్కడా నమోదు కాలేదు. పైగా తెలుగు నేర్పడానికి ఆంధ్రా ప్రాంతం నుండి ఉపాధ్యాయులను స్వయంగా నిజాం ఆహ్వానించి వారికి వసతులు ఏర్పాటు చేసిన విషయాలూ ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో కథలు కథలుగా వినిపిస్తాయి. అటువంటిది కేవలం ముస్లిం అయినంత మాత్రాన ఇంత కర్కషత్వానికి ప్రతీకగా చూపడం అంటే ముస్లింలపై, ఉర్దూభాషపై ద్వేషం కలిగించడం కాదా? చిన్నప్పుడు కథల్లో రాక్షసులు అంటే ఆ పదం వినగానే ఒక మనిషి ఆకారం కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. అదే విధంగా దేశంలో ముస్లింలు అంటే ఒక దారుణ చిత్రాన్ని వీక్షకుల మనోఫలకంపై కనపడేలా చేసే సుదీర్ఘ ప్రయత్నాలు, బహుముఖ వ్యూహాల్లో ఇటీవల చలన చిత్ర రంగం కూడా పావుగారింది.
ఇది చరిత్ర కాదు పచ్చి మోసం..
రెడ్డి, బ్రాహ్మణ, వెలమ దొరలే మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించింది. బాలింతల పాలు పిండించి, గట్ల మీద పోయించింది జన్నారెడ్డి ప్రతాపరెడ్డి గూండాలే, ఇదంతా వెట్టికాలంలో జరిగింది. ఈ సినిమా చూపించిన కాలం అంటే ఒడంబడిక జరిగిన నవంబరు 1947 నుంచి 1948 సెప్టెంబరు మధ్య దసరా పండుగే రాలేదు. రాసేవారికి కొంచెం పరిశోధన ఉండాలి. అట్లాగే షోయబుల్లా ఖాన్ పత్రిక “రహస్య ముద్రణాలయం” బోర్డు, ఇంతకంటే కామెడీ ఏముంది? రహస్యంగా ముద్రించే పత్రిక దానికి బోర్డుపెట్టుకుంటుందా? రహస్య ముద్రణ అంటే అర్థం తెలుసా ఈ రచయిత, దర్శకులకు? కాస్తంత ఇంగిత జ్ఞానం కూడా వాడలేదు.
ప్రధాని నెహ్రూను, నిజాంను ఏంటో కమేడియన్ల మాదిరిగా చూపడం చేతగాని బలహీనులుగా చూపడం- వారిని అవమానించడం తప్ప వేరేకాదు. నిజాం క్రూరుడు, జోకరు కాదు. పటేల్‌ను ఎత్తడానికి నెహ్రూ పాత్రను దిగజార్చారు.
ఇక గ్రామాల్లో జనం వందేమాతరమని ఆ కాలంలో ఎక్కడా ఎన్నడూ నినదించలేదు. 1938లో ఉస్మానియాలో 300 మంది విద్యార్థులు ఈ నినాదం ఇచ్చి బహిష్కృతులయ్యారు. పట్టణాల్లోని కాంగ్రెస్ తట్టాబుట్టా సర్దుకుని సరిహద్దు రాష్ట్రాల్లో సత్యాగ్రహాలకు దిగింది. ఊళ్లలో ఎర్రజెండాలే ఉన్నాయి తప్పా త్రివర్ణ జెండాలు లేవు. అదొక చిత్రం. ఎప్పుడు పుట్టారో కూడా తెలియని వారంతా చారిత్రక సినిమాలు తీసేయటం హతవిధీ అనాల్నా?
ఇట్లా ఏరుతూ పోతే ఈ రెండు గంటలపైగా చరిత్ర పేరిట సాగిన బూటకపు చౌకబారు సినిమాలో తప్పులు, అసత్య ఘటనలు, వక్రీకరణల గురించి రాస్తే మళ్లీ ఒక గ్రంథం అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కళాత్మత విలువలు- సినిమాలో దృశ్యీకరణ పాటలు వగైరా చూస్తే అది కూడా అధమ స్థాయిలో ఉన్నాయి. గొప్ప సుసంపన్నమైన సాంస్కృతిక రూపాలు పాటలందించిన చరిత్ర అది. కానీ ఈ సినిమాలో అదిమృగ్యం.
సినిమా అంతా చూసినాక దీనికి ఉత్తమ చారిత్రాత్మక సినిమా ఎందుకిచ్చారనేది అర్ధంకాదు. దీనిలో ఉత్తమ కళా విలువలూ లేవు, చరిత్ర అసలే లేదు. మరెందుకు ఇచ్చినట్టు? అంటే జ్యూరీలో హిందూ మతోన్మాద ఎజెండా శక్తుల ఆధిపత్యం ఉందని ఖచ్చితంగా అర్ధమవుతుంది. మరి కాంగ్రెసు సర్కారు ఈ నిర్ణయాన్ని ఎట్లా ఆమోదించింది? గత దశాబ్దకాలంగా వారి నాయకుడు నెహ్రూని భాజాపేయులు తిట్టిన వాటిని వారు ప్రమోట్ చేస్తున్నారా? ఈ అవార్డులు జ్యూరీ నిర్ణయం అంటారా? అయితే కాంగ్రెస్ సర్కారు వారు ఎంపిక చేసిన జ్యూరీయే తప్పుడు ఎంపిక అని చెప్పాలి. ఈ ప్రమాదాన్ని మీరు గుర్తించారా? మీ రాజకీయ భావాలకు మీరే ఎసరు తెచ్చుకున్నారని హెచ్చరించాల్సి ఉంటుంది.
అస్సలు చారిత్రక జ్ఞానం వీసమెత్తు లేకుండా చారిత్రక సినిమాను ఎంపిక చేసిన జ్యూరీ దుస్సాహసానికి అభినందిద్దాం. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న ప్రభుత్వాన్ని అభినందిద్దాం. చరిత్ర ప్రక్షాళన పేరుతో మతసాలెగూడు అల్లికలో చిక్కుకుంటున్న పౌరుల గురించి దుఃఖపడదాం. సినిమా జ్యూరీకి చరిత్ర తెలియాలని ఆశించిన మన అజ్ఞానానికి సంతోషిద్దాం. చారిత్రక అజ్ఞానం, అబద్ధాలు వెండితెరపై వెలుగుతాయని ఆశిద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.